Commonwealth
-
న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూలస్తంభం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి కొత్త కార్యక్రమాలతో సాంకేతికతలో హైదరాబాద్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని కామన్వెల్త్ మీడియేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సాఫ్ట్వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, బయో-టెక్నాలజీ పరిశ్రమలకు పవర్ హబ్‌గా హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు.న్యాయవ్యవస్థ మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. కానీ, భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండడం న్యాయ వ్యవస్థకు సవాల్‌గా మారిందన్నారు. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి వేగంగా, సమర్థవంతంగా కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలు అవసరమన్నారు. మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా వీలైనంత త్వరగా సమస్యలు, వివాదాలను పరిష్కరించుకోవాలి. దీనివల్ల వివాదంలో చిక్కుకున్న ఇరువర్గాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అందుకు కృషి చేస్తోన్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ నిర్వాహకులను రేవంత్‌రెడ్డి అభినందించారు. మీడియేషన్, ఆర్బిట్రేషన్‌ను సమన్వయం చేస్తే సమస్యలు, వివాదాలను వీలైనంత వేగంగా పరిష్కరించొచ్చన్నారు.ఐఏఎంసీ తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు.. దేశం మొత్తానికి ఈ సెంటర్ ఉపయోగపడుతుంది. ఐఏఎంసీని గ్లోబల్ ఇన్వెస్టర్స్‌కు, బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే పరిమితం చేయొద్దన్న రేవంత్.. కామన్ మ్యాన్‌కు, చిన్న సంస్థలకు కూడా ఐఏఎంసీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. లండన్, సింగపూర్ తర్వాత ఆర్బిట్రేషన్ మ్యాప్‌లో హైదరాబాద్ ఉండటం గర్వకారణం. ఆర్బిట్రేషన్ సేవలను పేదలకు అందుబాటులోకి తీసుకురావడంపై మరో సదస్సు నిర్వహించాలని కోరుతున్నానని రేవంత్‌రెడ్డి అన్నారు. -
Sanjana Thakur: కామన్వెల్త్ బహుమతి గెలిచిన అమ్మ కథ
ఆధునిక జీవితం అమ్మను ఎక్కడకు చేర్చింది?వృద్ధాశ్రమానికి.ఒకమ్మాయికి వృద్ధాశ్రమంలో నుంచి ఒక తల్లిని ఇంటికి తెచ్చుకోవాలని అనిపిస్తుంది. కాని వృద్ధాశ్రమంలో చూస్తే అందరు తల్లులూ అద్భుతంగా అనిపిస్తారు. ఇంత మంచి తల్లులను ఎందుకు పెట్టారోనని సంజనా ఠాకూర్ రాసిన కథ కామన్వెల్త్ ప్రైజ్ 2024 గెలుచుకుంది. సంజనా ఠాకూర్ పరిచయం.‘స్కూల్ టీచర్లకు నన్ను తిట్టాలని ఉండేది. కాని తిట్టలేకపోయేవారు. సంజనా బాగా చదువుతుంది... హోమ్ వర్క్ చేస్తుంది... కాని క్లాస్ జరుగుతుంటే టేబుల్ కింద కూచుని కథల పుస్తకం చదువుతోంది అని కంప్లయింట్ చేసేవారు. నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే అంత పిచ్చి. మా అమ్మ రోజూ నాకు కథలు చదివి వినిపించేది. నేను మా ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్లినా పార్టీలకు వెళ్లినా పుస్తకం పట్టుకుని మూలన కూచునేదాన్ని. చిన్నప్పుడే రాయడం మొదలెట్టాను. ఇప్పుడు ఈ గుర్తింపు రావడం సంతోషంగా ఉంది’ అంటుంది 26 సంవత్సరాల సంజనా ఠాకూర్. ముంబైకి చెందిన సంజన ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ లో ఎం.ఎఫ్.ఏ. ఫిక్షన్ చదువుతోంది. ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్’ పోటీల్లో పాల్గొని 2024 సంవత్సరానికి విజేత అయింది.ఐదు లక్షల బహుమతికామన్వెల్త్ దేశాలలోని యువ రచయితలను ఉత్సాహపరచడానికి కామన్వెల్త్ ఫౌండేషన్ ఏటా కథల పోటీ నిర్వహిస్తుంది. 18 ఏళ్లు పైబడిన వారు దీనికి అర్హులు. నేరుగా ఇంగ్లిష్‌లో కాని లేదా ఇంగ్లిష్‌లో అనువాదమైన స్థానికభాష కథగాని పంపవచ్చు. 2500 పదాల నుంచి 5000 పదాల వరకూ కథ ఉండాలి. ఇందులో మళ్లీ ఐదు రీజియన్లకు (ఆఫ్రికా, ఆసియా, కెనడా–యూరప్, పసిఫిక్) ఐదుగురు రీజనల్ విన్నర్స్‌ను ప్రకటిస్తారు. వీరి నుంచి ఓవరాల్ విన్నర్‌ను ఎంపిక చేస్తారు. 2024కు ఆసియా రీజనల్ విన్నర్‌గా నిలిచిన సంజనా ఠాకూర్ ఓవరాల్ విన్నర్‌గా కూడా ఎంపికైంది. నగదు బహుమతిగా 5000 పౌండ్లు గెలుచుకుంది.కథ పేరు ఐశ్వర్యారాయ్‘అమెరికాలో నేనొక బొమ్మల షాపులో తిరుగుతున్నప్పుడు కేవలం అమ్మ బొమ్మలు అమ్మే ఒక షాప్ ఉంటే ఎలా ఉంటుందా అనే ఆలోచన వచ్చింది. అక్కడినుంచి పిల్లలు అమ్మల్ని దత్తత తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన కొనసాగింది. ఇండియాలో పట్టణ సంస్కృతి ఇప్పుడు ఇళ్లల్లో అమ్మకు చోటు లేకుండా చేస్తోంది. ఆమె వృద్ధాశ్రమంలో ఉండాల్సి వస్తోంది. నా కథలో అన్వి అనే అమ్మాయి ఒక వృద్ధాశ్రమానికి వెళ్లి ఒక అమ్మను దత్తత తీసుకోవాలనుకుంటుంది. కాని ఒక్కో అమ్మ ఒక్కో లక్షణంలో గొప్పగా కనిపిస్తుంది. అమ్మలందరూ తమ అనుబంధం రీత్యా ఐశ్వర్యారాయ్ కంటే తక్కువ సౌందర్యవతులు కాదు. ఏ అమ్మ సౌందర్యమైనా బంధం రీత్యా ఐశ్వర్యారాయ్ అంత అందమైనదే. అందుకే ఆ పేరుతోనే కథ రాశాను. వ్యంగ్యం, చెణుకులు ఉండటంతో నా కథను జడ్జిలు మెచ్చుకొని ఉండొచ్చు’ అని తెలిపింది సంజనా.త్వరలో పుస్తకం‘త్వరలో 15 కథలతో నేను పుస్తకం తెస్తాను. ఇప్పటికే రాశాను. అందులో అన్ని కథల్లోనూ తల్లులూ కూతుళ్లు కనిపిస్తారు. వారి భిన్న భావోద్వేగాలు చర్చకు వస్తాయి. ప్రస్తుతం నా థీసిస్‌లో భాగంగా ఈ కథలను సబ్మిట్ చేయగానే పుస్తకం పని మొదలెడతాను. ప్రపంచ సాహిత్యంలో చాలా మంచి రచనలు వస్తున్నాయి. మన దేశం నుంచి అరుంధతి రాయ్ శైలి నాకు బాగా నచ్చుతుంది’ అందామె.సాహిత్యాన్ని ఒక చదువుగా... రచనను ఒక ఉపాధిగా చేసుకోదలిచింది సంజన. -
వేలాదిగా ఏటీఎంలు, బ్రాంచ్‌లు మూసేస్తున్న ప్రముఖ బ్యాంక్.. ఏం జరుగుతోంది?
ఆస్ట్రేలియాకు చెందిన అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన కామన్వెల్త్ బ్యాంక్ వేలాదిగా ఏటీఎంలు, బ్రాంచ్‌లు మూసేస్తోంది. రికార్డ్ స్థాయిలో లాభాలు ఉన్నప్పటికీ వేలాదిగా ఏటీఎంలు, బ్రాంచ్‌లను ఎందుకు మూసేస్తోందా అన్నది అంతుబట్టడం లేదు. కామన్వెల్త్ బ్యాంక్ గత ఐదేళ్లలో 354 శాఖలను మూసివేసింది. తాజాగా మూడు ప్రధాన నగరాల్లోని అత్యంత జనాభా ఉన్న ప్రాంతాల్లో వచ్చే నెలలో మరో మూడు బ్రాంచ్‌లను మూసివేయాలని యోచిస్తోందని డైలీ మెయిల్ కథనం పేర్కొంది. రికార్డ్ లాభాన్ని ఆర్జించినప్పటికీ ఆస్ట్రేలియా అతిపెద్ద హౌసింగ్ బ్యాక్ అయిన కామన్వెల్త్ బ్యాంక్‌కి 2018 జూన్ నాటికి 1,082 బ్రాంచ్‌లు ఉండగా అప్పటి నుంచి ఇప్పటి వరకూ వాటిలో మూడవ వంతు బ్రాంచ్‌లను మూసివేసింది. నగదు వినియోగంలో బాగా క్షీణించిన సమయంలో అయితే ఈ బ్యాంక్ ఏకంగా 2,297 ఏటీఎంలను తొలగించింది. దీంతో ఆ బ్యాంక్ ఏటీఎంల సంఖ్య 54 శాతం పడిపోయింది. కామన్వెల్త్ బ్యాంక్ ఇప్పుడు సెంట్రల్ అడిలైడ్‌లోని తన రండిల్ మాల్ శాఖను , గోల్డ్ కోస్ట్‌లోని కూలన్గట్ట, సిడ్నీలోని కూగీలో అవుట్లెట్లను మార్చి 1న మూసివేయాలని యోచిస్తోంది. ఇటీవలి సమీక్ష తర్వాత, మా రండిల్ మాల్ అడిలైడ్, కూలంగాట్ట, కూగీ బ్రాంచ్‌లను శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించినట్లు బ్యాంక్ ప్రతినిధి ఒకరు చెప్పినట్లు డైలీ మెయిల్ పేర్కొంది. కామన్వెల్త్ బ్యాంక్ అనుబంధ సంస్థ బ్యాంక్వెస్ట్ కూడా రాబోయే వారాల్లో పెర్త్, పశ్చిమ ఆస్ట్రేలియాలోని ప్రాంతీయ శాఖలను మూసివేస్తోంది. ఆస్ట్రేలియన్ మల్టీ నేషనల్ బ్యాంక్ అయిన కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా ( CBA) ఆస్ట్రేలియాతోపాటు న్యూజిలాండ్ , ఆసియా , యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ అంతటా వ్యాపారాలను నిర్వహిస్తోంది. రిటైల్, బిజినెస్, ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్, ఫండ్ మేనేజ్మెంట్ , సూపర్‌యాన్యుయేషన్ , ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ అండ్ బ్రోకింగ్ సేవలతోపాటు వివిధ రకాల ఆర్థిక సేవలను అందిస్తోంది. 1911లో ఆస్ట్రేలియా ప్రభుత్వం దీన్ని స్థాపించగా 1996లో పూర్తిగా ప్రైవేటీకరించారు. ఇది ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ మహిళల జట్టుకు జర్సీ స్పాన్సర్‌గా కొనసాగుతోంది. -
PM Narendra Modi: దేశాల సమన్వయంతోనే న్యాయ వితరణ
న్యూఢిల్లీ: నేరగాళ్లు ఖండాంతరాల్లో నేరసామ్రాజ్యాన్ని విస్తరించేందుకు సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్న వేళ దేశాలు సత్వర న్యాయ వితరణ కోసం మరింతగా సహకరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శనివారం ఢిల్లీలో కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ‘కామన్వెల్త్ దేశాల అటార్నీలు, సొలిసిటర్ జనరళ్ల సమావేశం’లో ఆయన ప్రసంగించారు. ‘‘ఒక దేశ న్యాయస్థానాన్ని మరో దేశం గౌరవించిన నాడే ఈ సహకారం సాధ్యం. అప్పుడే సత్వర న్యాయం జరుగుతుంది. క్రిప్టోకరెన్సీ, సైబర్ దాడుల విజృంభిస్తున్న ఈ తరుణంలో ఒక దేశ న్యాయస్థానం ఇచ్చే తీర్పులు, ఉత్తర్వులు మరో దేశంలోనూ అమలుకు సాధ్యమయ్యేలా సంస్కరణలు తేవాలి. అప్పుడే బాధితులకు తక్షణ న్యాయం అందుతుంది. ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నౌకాయానంలో ఇది సాధ్యమైంది. ఇకపై ఈ ఉమ్మడి విధానాన్ని కేసుల దర్యాప్తు, న్యాయవ్యవస్థలకూ విస్తరింపజేయాలి’’ అని అభిలషించారు. ఒక దేశంలో జరిగిన ఆర్థిక నేరాలు ఇంకొక దేశంలో అలాంటి కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. లా స్కూళ్లలో మహిళల అడ్మిషన్లు పెరగాలని, అప్పుడే న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం ఎక్కువ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. న్యాయవ్యవస్థకు టెక్నాలజీ బలం: సీజేఐ న్యాయ వితరణలో న్యాయ స్థానాలకు సాంకేతికత అనేది శక్తివంతమైన పరికరంగా ఎదిగిందని సర్వో న్నత న్యాయస్థానం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. అటార్నీల సదస్సులో సీజేఐ పాల్గొని ప్రసంగించారు. ‘‘ సత్వర న్యాయం అందించేందుకు న్యాయవ్యవస్థ సాంకేతికతను శక్తివంతమైన ఉపకరణంగా వాడుతూ సద్వినియోగం చేస్తోంది. సాంకేతికతలను ఎల్లప్పుడూ సమాన త్వం, సమ్మిళితత్వాన్ని దృష్టిలో ఉంచుకునే అభివృద్ధిచేయాలి. న్యాయం అందించేందుకు కామన్వెల్త్ దేశాలు ఉమ్మ డిగా కట్టుబడి ఉండాలి. న్యాయ వితరణ లో రాజకీయాలకు ఏమాత్ర జోక్యం లేకుండా చూడాల్సిన బాధ్యత న్యాయా ధికారులైన అటార్నీలు, సొలిసిటర్ జనరళ్లదే. అప్పుడే న్యాయవ్యవస్థ నైతిక త నిలబడుతుంది. సత్వర న్యాయం అందించడంలో న్యాయవ్యవస్థకు టెక్నాలజీ బలం తోడైంది. ప్రభుత్వాధికారులకు అనవసరంగా సమన్లు జారీ చేసే సంస్కృతి పోవాలి’’ అని సీజేఐ అన్నారు. -
నీటి కేటాయింపులు.. ఆ ఆరు ప్రాజెక్టులకే పరిమితం
సాక్షి, అమరావతి: రెండు రాష్ట్రాల్లో నీటి కేటాయింపుల్లేని ఆరు ప్రాజెక్టులకు కేటాయింపులు చేయడంపైనే కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 పరిమితమైందని న్యాయ, సాగునీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసే అధికారం తమకు లేదంటూ ‘పాలమూరు–రంగారెడ్డి’ పథకంపై చేసిన విచారణలో ట్రిబ్యునల్ తేల్చిచెప్పడమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. విభజన చట్టం 11వ షెడ్యూలులో ఏపీలోని హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ.. తెలంగాణలోని నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులకే పరిమితం కానుంది. ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులకు రెండు రాష్ట్రాలు కట్టుబడాలని విభజన చట్టంలో సెక్షన్–89లో కేంద్రం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో కేడబ్ల్యూడీటీ–1 ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీల జోలికి కేడబ్ల్యూడీటీ–2 వెళ్లే అవకాశంలేదు. ఉమ్మడి రాష్ట్రానికి మిగులు జలాలు 194 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 కేటాయిస్తూ 2013లో తుది నివేదిక ఇచ్చింది. ఇందులో తెలుగుగంగకు 25 టీఎంసీలు కేటాయించింది. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను సెక్షన్–89 ద్వారా కేంద్రం ఆ ట్రిబ్యునల్‌కే కట్టబెట్టింది. దాంతో 2016 నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై కేడబ్ల్యూడీటీ–2 విచారణ జరుపుతోంది. ఏపీకి 125.5.. తెలంగాణకు 47 టీఎంసీలు విభజన చట్టం 11వ షెడ్యూలులో కేంద్రం ఆమోదించిన తెలుగుగంగకు తుది తీర్పులోనే 25 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 కేటాయించింది. శ్రీశైలం నుంచి 29 టీఎంసీల కృష్ణా వరద జలాలకు 30 టీఎంసీల పెన్నా జలాలు జతచేసి తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టారు. అంటే.. తెలుగుగంగకు మరో 4 టీఎంసీలు అవసరం. శ్రీశైలం నుంచి 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా, 38 టీఎంసీలు తరలించేలా గాలేరు–నగరి, 43.5 టీఎంసీలు తరలించేలా వెలిగొండను ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి 125.5 టీఎంసీలు అవసరం. మరోవైపు.. ఉమ్మడి రాష్ట్రంలో జూరాల నుంచి 22 టీఎంసీలు తరలించేలా నెట్టెంపాడు, శ్రీశైలం నుంచి 25 టీఎంసీలు తరలించేలా కల్వకుర్తి ఎత్తిపోతలను చేపట్టారు. ఈ రెండు ప్రాజెక్టులకు తెలంగాణకు 47 టీఎంసీలు అవసరం. రెండు రాష్ట్రాల అవసరాలను పరిగణలోకి తీసుకుంటే 172.5 టీఎంసీలు అవసరం. కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన మిగులు జలాలు 169 టీఎంసీలను.. ఆ ఆరు ప్రాజెక్టులకు ఆ ట్రిబ్యునల్ ఇప్పుడు సర్దుబాటు చేయనుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రాజెక్టులకు కొత్త ట్రిబ్యునలే.. ఇక విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టినా.. ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను కృష్ణా బోర్డు, కేంద్ర జలసంఘంతో మదింపు చేయించుకుని, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలి. అపెక్స్ కౌన్సిల్లో ఏకాభిప్రాయానికి రాని ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల కోసం అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 ప్రకారం కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాల్సి ఉంటుందని విభజన చట్టంలో కేంద్రం స్పష్టంచేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్ ‘కృష్ణా’పై చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస, నెట్టెంపాడు, కల్వకుర్తి (సామర్థ్యం పెంపు), మిషన్ భగీరథలకు నీటి కేటాయింపులపై విచారణ చేయాలంటే కొత్త ట్రిబ్యునల్‌ను వేయాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. -
ఉన్నతి హుడాకు చోటు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్లలో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్లను ‘బాయ్’ ప్రకటించింది. ఏప్రిల్ 15నుంచి 20 వరకు ఆరు రోజుల పాటు జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో షట్లర్ల ప్రదర్శనను బట్టి ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. ట్రయల్స్‌కు ముందే నేరుగా అర్హత సాధించిన ప్లేయర్లతో పాటు ట్రయల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనపర్చిన ఆటగాళ్లతో కూడిన జాబితాను సెలక్టర్లు వెల్లడించారు. ఈ ఏడాది జరిగే కామన్వెల్త్, ఆసియా క్రీడలతో పాటు థామస్, ఉబెర్ కప్‌లలో వీరు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. మహిళల సింగిల్స్‌లో టీనేజ్ సంచలనం ఉన్నతి హుడాకు తొలి సారి చోటు లభించింది. హరియాణాలోని రోహ్టక్కు చెందిన 14 ఏళ్ల ఉన్నతి సెలక్షన్ ట్రయల్స్‌లో మూడో స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల జట్టులో స్థానం దక్కించుకున్న అతి పిన్న వయస్కురాలిగా ఉన్నతి నిలిచింది. ట్రయల్స్ ద్వారా పారదర్శకంగా ఆటగాళ్ల ఎంపిక జరిగిందని, ప్రతిభ గలవారే అవకాశం దక్కించుకున్నారని ‘బాయ్’ ప్రధాన కార్యదర్శి సంజయ్ మిశ్రా అన్నారు. మూడు మెగా ఈవెంట్ల కోసం కాకుండా ఓవరాల్‌గా 40 మందిని సీనియర్ కోచింగ్ క్యాంప్ కోసం కూడా ఎంపిక చేశారు. ఎంపికైన ఆటగాళ్ల జాబితా: కామన్వెల్త్ క్రీడలు: పురుషుల విభాగం – లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సుమీత్ రెడ్డి మహిళల విభాగం – పీవీ సింధు, ఆకర్షి కశ్యప్, ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి, అశ్విని పొన్నప్ప ఆసియా క్రీడలు, థామస్–ఉబెర్ కప్ పురుషుల విభాగం – లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్, చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, ధ్రువ్ కపిల, ఎంఆర్ అర్జున్, విష్ణువర్ధన్ గౌడ్, జి.కృష్ణప్రసాద్ మహిళల విభాగం – పీవీ సింధు, ఆకర్షి కశ్యప్, అస్మిత చాలిహా, ఉన్నతి హుడా, ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి, ఎన్.సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, శ్రుతి మిశ్రా -
నాలుగు రోజుల పాటు సోషల్ మీడియాను బహిష్కరించిన ‘ఫిఫా’
లండన్: తమ ఆటగాళ్లపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ద్వేషపూరిత కామెంట్లపై ఆగ్రహించిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా), యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ (యూఈఎఫ్ఏ), కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్), అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్)లు నాలుగు రోజుల పాటు తమ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను మూసి వేస్తున్నట్లు ప్రకటించాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సోమవారం అర్ధరాత్రి 11.59 నిమిషాల వరకు ఈ బహిష్కరణ కొనసాగుతుంది. ఈ విధంగానైనా ఆటగాళ్లపై ఆకతాయిలు చేసే అసభ్యకర కామెంట్లు ఆగుతాయని యూఈఎఫ్ఏ అధ్యక్షుడు అలెగ్జాండర్ ఎఫెరిన్ ఆకాంక్షించాడు. ఇకపై ఆటగాళ్లపై చేసే ద్వేషపూరిత వ్యాఖ్యలపై ఉపేక్షించేది లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు, ప్రీమియర్‌షిప్ రగ్బీ, లాన్ టెన్నిస్ సంఘం నాలుగు రోజుల బహిష్కరణకు మద్దతు తెలిపాయి. -
టాప్–6లో నిలిచే జట్లు, ఇంగ్లండ్ నేరుగా అర్హత
దుబాయ్: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా సందడి చేయనున్న మహిళల క్రికెట్‌కు సంబంధించిన క్వాలిఫయింగ్ ప్రక్రియ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) విడుదల చేశాయి. దీని ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ వరకు ఐసీసీ మహిళల టి20 టీమ్ ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న జట్లతో పాటు.... ఆతిథ్య దేశమైన ఇంగ్లండ్ నేరుగా ఈ పోటీలకు అర్హత సాధించనుంది. ప్రస్తుతం భారత మహిళల జట్టు మూడో ర్యాంక్‌లో ఉంది. చివరిదైన ఎనిమిదో బెర్త్‌ను ‘కామన్వెల్త్ గేమ్స్ క్వాలిఫయర్ టోర్నీ’లో విజేత జట్టుతో భర్తీ చేస్తారు. 2022లో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. ఓవరాల్‌గా కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ పోటీలు భాగస్వామ్యం కావడం ఇది రెండో సారి మాత్రమే. 1998 కౌలాలంపూర్ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్‌కు ఈ అవకాశం దక్కింది. అజయ్ జడేజా సారథ్యంలో ఈ క్రీడల్లో పాల్గొన్న భారత జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. -
లైఫ్‘లైన్’ లేదాయె!
సాక్షి, సిటీబ్యూరో: రోగులు, క్షతగాత్రులను అత్యవసరంగా తరలించే అంబులెన్స్‌ల కోసం రహదారులపై ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. ఢిల్లీలో కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ‘కామన్వెల్త్ లైన్’ను పరిశీలించిన నగర పోలీసు అధికారులు ఆ తరహాలో ఏర్పాటు చేయాలని భావించారు. అయితే సిటీలోని రోడ్ల స్థితిగతులు, పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రత్యేక లైన్ అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైద్య రంగానికి కేంద్రంగా మారిన నగరంలో అనేక కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ పెద్దాస్పత్రులైన ఉస్మానియా, గాంధీ, మెటర్నిటీ దవాఖానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిటీతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన రోగులను వైద్యం కోసం అంబులెన్స్‌లో సిటీకి తీసుకొస్తుంటారు. ఆయా వాహనాలు నగర శివార్ల వరకు వేగంగా వచ్చినా, సిటీలోకి రాగానే ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నాయి. ఫలితంగా ఒక్కోసారి రోగుల పరిస్థితి చేయిదాటిపోతోంది. సాధారణ రోజుల్లో కంటే ట్రాఫిక్ జామ్ అధికంగా ఉండడం, వర్షం కురవడం తదితర సమయాల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉంటున్నాయి. ‘గ్రీన్ చానల్’ స్ఫూర్తిగా.. ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల కృషి ఫలితంగా ప్రజల్లో అవయవ దానంపై ఇటీవల అవగాహన పెరిగింది. దీంతో ఇతర నగరాలతో పాటు రాష్ట్రాల్లోనూ బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరినవారి అవయవాలను ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు తరలించచడం జరుగుతోంది. ఆయా సందర్భాల్లో వైద్యులతో పాటు ట్రాఫిక్ పోలీసులు సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అవయవాలను తీసుకెళ్లే అంబులెన్స్‌లు విమానాశ్రయం నుంచి ఆస్పత్రికి చేరుకునే వరకు సమన్వయంతో పని చేస్తున్నారు. ఈ అంబులెన్స్‌ల కోసం ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తూ ‘గ్రీన్ చానల్’ ఇస్తున్నారు. ఫలితంగా అవయవదానానికి సంబంధించిన లక్ష్యం నెరవేరుతోంది. ఈ ‘గ్రీన్ చానల్’ విధానాన్ని నగర ట్రాఫిక్ పోలీసులు స్ఫూర్తిగా తీసుకున్నారు. అవయవదానం సందర్భంలోనే కాకుండా ఇతర సమయాల్లోనూ అంబులెన్స్‌లో ప్రయాణించే రోగుల పరిస్థితి విషమంగా ఉండే ఆస్కారం ఉందని, కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ జామ్ కారణంగా ‘గోల్డెన్ అవర్’ దాటిపోవడంతో పరిస్థితులు చేజారిపోతున్నాయని భావించిన అధికారులు నగరంలో అంబులెన్స్‌లకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రధాన రహదారులకు కుడివైపున కనీసం నాలుగడుగుల దారిని అంబులెన్స్‌ల కోసం కేటాయించాలని భావించారు. ఇందుకు ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ సమయంలో అమలు చేసిన విధానాన్ని అధ్యయనం చేశారు. ఈ ప్రత్యేక రూట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అత్యంత రద్దీ సమయాల్లో, ప్రధాన ఆస్పత్రులున్న 15 మార్గాల్లో అమలు చేయాలని యోచించారు. అయితే సిటీలోని రహదారుల పరిస్థితి, వాటి వెడల్పు అన్ని చోట్ల ఒకేలా లేకపోవడం, బాటిల్ నెక్స్ తదితరాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు అమలులో ఇబ్బందులను గుర్తించారు. ఏంటీ ‘కామన్వెల్త్ లైన్’? 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ జరిగిన సమయంలో ఆటగాళ్లకు అక్కడి ప్రధాన హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి క్రీడాకారులు మైదానాలకు చేరుకోవడంలో ఎలాంటి ఆలస్యానికి తావులేకుండా అక్కడి పోలీసు విభాగం చర్యలు తీసుకుంది. ప్రధాన రహదారులకు కుడివైపుగా ఓ లైన్ ఏర్పాటు చేసి, ఆ భాగానికి ‘కామన్వెల్త్ లైన్’గా మార్కింగ్ ఇచ్చింది. ఇందులో సాధారణ వాహనాలు ప్రయాణిస్తే రూ.2వేలు జరిమానా విధించింది. దీంతో ఆ ‘లైన్’ విజయవంతమై క్రీడాకారులకు ఇబ్బందులు తప్పాయి. సమస్యలను అధిగమిస్తాం ‘కామన్వెల్త్ లైన్’ విధానం తరహాలో సిటీలో అంబులెన్స్‌ల కోసం ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలంటే ఆర్టీఏ విభాగం నుంచి అనుమతి పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రాథమికంగా 15 ప్రాంతాల్లో అధ్యయనం చేయాలని భావించాం. ఇప్పటికే వాహనచోదకులు అంబులెన్స్‌లకు దారి ఇస్తున్న నేపథ్యంలో వారిలో మరికొంత అవగాహన కల్పిస్తే ఈ విధానం విజయవంతమయ్యే అవకాశం ఉంది. అయితే సిటీలోని రోడ్లపై ప్రయోగాత్మక అమలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా సమస్యలను అధిగమించేందుకు మార్గాలు అన్వేషిస్తున్నాం. ఈ కసరత్తు ఓ కొలిక్కి వచ్చిన వెంటనే అంబులెన్స్‌లకు ప్రత్యేక లైన్ విధానం అమలులోకి తీసుకొస్తాం.– సిటీ ట్రాఫిక్ పోలీసులు గ్రేటర్లో అంబులెన్స్‌లు ఇలా (లెక్కలు సుమారు)ప్రభుత్వ, ప్రైవేటు అంబులెన్సులు 4,500 ప్రతిరోజు జిల్లాల నుంచి నగరానికి వచ్చి వెళ్లేవి 200, 108 అంబులెన్సులు 42 ఒక్కో 108 వాహనం రోజుకు సగటునఅటెండ్ అవుతున్న కేసులు 67 ఆస్పత్రికి తరలించే సమయంలోమార్గమధ్యలోనే జరుగుతున్న ప్రసవాలు 12 -
‘కామన్వెల్త్’ పదవికి జస్టిస్ సిక్రి నో
న్యూఢిల్లీ: లండన్ కేంద్రంగా పనిచేస్తున్న కామన్వెల్త్ సెక్రటేరియట్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్(సీశాట్) అధ్యక్షుడు/సభ్యుడిగా సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఏకే సిక్రి పేరును కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఆ పదవి చేపట్టేందుకు ఆయన తిరస్కరించారు. ఇటీవల సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను తొలగించిన హైపవర్డ్ కమిటీలో జస్టిస్ సిక్రి కూడా సభ్యుడే అన్న సంగతి తెలిసిందే. వర్మపై వేటుకు సిక్రి మద్దతుపలకడం, ఆ తరువాత వచ్చిన విమర్శలతో ఆయన కలతచెందినట్లు తెలుస్తోంది. ఈ పదవిని వద్దనుకుంటున్నానని, తన పేరును ఇకపై పరిగణించొద్దని కోరుతూ ఆయన కేంద్రానికి లేఖ పంపారు. సీశాట్ పదవికి జస్టిస్ సిక్రి పేరును కేంద్రం గత నెలలోనే నామినేట్ చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ సీశాట్‌కు వర్తమానం పంపింది. మార్చి 6న రిటైర్ అయిన తరువాత ఆయన ఈ పదవి చేపట్టాల్సి ఉంది. తొలుత ఈ ఆఫర్‌కు అంగీకరించిన జస్టిస్ సిక్రి..సీబీఐ పరిణామాల నేపథ్యంలో మనసు మార్చుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ‘కామన్వెల్త్ పదవిని ఆఫర్ చేస్తూ ప్రభుత్వం గత నెలలోనే జస్టిస్ సిక్రిని సంప్రదించింది. దీనికి ఆయన అంగీకరించారు. ఎలాంటి జీతభత్యాలు లేని ఈ పదవిలో భాగంగా ఏడాదికి రెండు, మూడు విచారణలకు హాజరుకావాల్సి ఉంది’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జస్టిస్ సిక్రిని సీశాట్ పదవికి నామినేట్ చేయడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ డిమాండ్ చేశారు. భయంతోనే ప్రధాని మోదీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. న్యాయ ప్రక్రియలో ఇతరులు వేలుపెడితే, అరాచకం రాజ్యమేలుతుందని ట్వీట్ చేశారు. కామన్వెల్త్ కూటమిలోని 53 దేశాల మధ్య తలెత్తే వివాదాల్ని పరిష్కరించే అత్యున్నత మధ్యవర్తి సంస్థే సీశాట్. 1965లో ఈ సంస్థ ప్రారంభమైంది. -
కామన్వెల్త్ చీఫ్‌గా చార్లెస్
లండన్: కామన్వెల్త్ చీఫ్‌గా ప్రిన్స్ చార్లెస్(69) నియామకానికి 53 కూటమి దేశాల అధినేతలు ఆమోద ముద్ర వేశారు. కామన్వెల్త్ దేశాధినేతల (చోగమ్) సదస్సులో భాగంగా శుక్రవారం విండ్సర్ కోటలో రహస్యంగా జరిగిన భేటీలో చార్లెస్‌ను కామన్వెల్త్ చీఫ్‌గా నియమించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. చోగమ్ ముగింపు సందర్భంగా అధికారిక ప్రకటనలో ఈ విషయం చెప్పారు. చార్లెస్ తన తల్లి క్వీన్ ఎలిజబెత్ నుంచి కామన్వెల్త్ బాధ్యతల్ని అధికారికంగా చేపట్టనున్నారు. ప్రిన్స్ చార్లెస్ చీఫ్ కావాలన్నది తన ఆకాంక్షని, దీన్ని సభ్యులందరూ ఆమోదించాలని ప్రారంభ ఉపన్యాసంలో గురువారం ఎలిజబె™Œ కోరింది. ఎలాంటి ముందస్తు అజెండా లేకుండా విండ్సర్ కోటలో నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీసహా 52 దేశాల అధినేతలు పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోస భేటీకి హాజరుకాలేదు. తదుపరి కామన్వెల్త్ చీఫ్‌పై ఏకాభిప్రాయంతో పాటు, కూటమి భవిష్యత్ కార్యాచరణపై భేటీలో చర్చించారు. ప్రిన్స్ చార్లెస్ ఎంపికపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని భారత్ ముందుగానే ప్రకటించింది. కాగా భారత్ మద్దతు కూడగట్టేందుకు ప్రిన్స్ చార్లెస్ గట్టిగానే కృషి చేశారు. గతేడాది భారత్ పర్యటన సందర్భంగా ప్రధానిని కలిసి లండన్ సదస్సుకు రావాలని వ్యక్తిగతంగా కోరారు. మోదీ బ్రిటన్ పర్యటన సందర్భంగా లండన్‌లోని పార్లమెంట్ స్క్వేర్ వద్ద భారతదేశ జాతీయ జెండాను అపవిత్రం చేసిన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. ‘మేం చర్యలు ఆశిస్తున్నాం. ఈ ఘటనకు పాల్పడిన వారితో పాటు, రెచ్చగొట్టిన వారిపై చర్యలు చేపట్టాలి’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. కామన్వెల్త్ ఫండ్‌కు సాయం రెండింతలు ప్రజాస్వామ్యం బలోపేతం, చట్టబద్ధ పాలన, అంతర్జాతీయ వాణిజ్య విధానాలు, వాతావరణం, కామన్వెల్త్ దేశాలు ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలపై చోగమ్ సదస్సులో చర్చించారు. అభివృద్ధి లక్ష్యాలు, వాతావరణ అంశాల్లో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారని విదేశీ వ్యవహారాల కార్యదర్శి(పశ్చిమ) ఘనశ్యామ్ తెలిపారు. కామన్వెల్త్లో భాగంగా ఉన్న చిన్న దేశాలు, ద్వీపాల్లో సామర్థ్యం పెంచాలని, సాంకేతిక సహకారం కోసం కామన్వెల్త్ ఫండ్‌కు సాయాన్ని రెండింతలు చేస్తామని మోదీ ప్రకటించారన్నారు. భారత్‌కు తిరుగుపయనం: బ్రిటన్ పర్యటన ముగించుకున్న మోదీ శుక్రవారం రాత్రి జర్మనీ చేరుకున్నారు. రాజధాని బెర్లిన్‌లో కొద్ది గంటలు గడిపిన ఆయన జర్మనీ చాన్సలర్ మెర్కెల్‌తో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం ఐదురోజుల విదేశీ పర్యటన ముగించి భారత్‌కు బయల్దేరారు. -
ద్వైపాక్షిక చర్చల్లో బిజీ బిజీ
లండన్: కామన్వెల్త్ దేశాధినేతల (చోగమ్)సదస్సులో భాగంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ బిజీ బిజీగా గడిపారు. వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. అయితే చోగమ్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీతో మోదీ భేటీ కారని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ‘ఈ సదస్సు కారణంగా వివిధ దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు అవకాశం దొరికింది’ అని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ అనస్తాసియేడ్స్లతో మోదీ సమావేశమయ్యారు. అనంతరం జమైకా, జాంబియా, ఉగాండా, సీషెల్స్, ఫిజీ, సెయింట్ లూసియా, సోలొమాన్ ఐలాండ్స్, కిరిబాతి, అంటింగ్వా–బార్బుడా తదితర దేశాధినేతలతో ప్రధాని చర్చలు జరిపారు. మారిషస్ ప్రధాని జుగ్నౌత్తో ద్వైపాక్షిక సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, సముద్రతీర సహకారం తదితర అంశాలపై చర్చలు జరిగాయి. అనంతరం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతోనూ మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మనమంతా ఒక్కటే: థెరిసా మే బ్రిటన్ ప్రధాని థెరిసా మే చోగమ్ తొలి సెషన్ (గురువారం నాటి కార్యక్రమాలు) ప్రారంభోపన్యాసం చేశారు. ‘కూటమిలోని దేశాలన్నింటికీ సమానమైన హోదా ఉండటం, ప్రతి ఒక్కరి వాణిని గౌరవించటమే కామన్వెల్త్ బలం. అందుకే అందరికీ మాట్లాడే అవకాశం దక్కుతుంది. నేటి ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటోంది. వీటి పరిష్కారం కోసం మనమంతా ఆలోచన చేయాలి. కామన్వెల్త్ కూటమిగా మన దేశాల్లోని 240 కోట్ల మంది ప్రజలకు.. మేలు చేసేలా పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాలి’ అని ఆమె పేర్కొన్నారు. -
కామన్వెల్త్ చీఫ్‌గా ప్రిన్స్ చార్లెస్!
లండన్: కామన్వెల్త్ చీఫ్‌గా తన కొడుకు ప్రిన్స్ చార్లెస్ పేరును క్వీన్ ఎలిజబెత్ ప్రతిపాదించారు. లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశాల(చోగమ్)ను ఆమె గురువారం ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు భారత ప్రధాని మోదీతో పాటు వివిధ దేశాల అధినేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా 91 ఏళ్ల రాణి ప్రారంభోపన్యాసం చేస్తూ.. ప్రిన్స్ చార్లెస్ తన వారసుడిగా కామన్వెల్త్కు చీఫ్ కావాల న్నది తన ఆకాంక్ష అని.. దీన్ని సభ్యులం దరూ ఆమోదించాలని కోరారు. కామన్వెల్త్ చీఫ్ పదవి వారసత్వంగా సంక్రమించేది కాదు.. రాణి మరణించిన తర్వాత ఆటో మేటిగ్గా ప్రిన్స్ చార్లెస్‌ను ఆ పదవి వరించదు. 53 కామన్వెల్త్ సభ్య దేశాల అధినేతలు శుక్రవారం సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలో రాజవం శీకుల ప్రభావం నుంచి కామన్వెల్త్ను దూరంగా ఉంచేందుకు ఇదో అవకాశమని.. చీఫ్‌గా వేరేవారిని పెడితే బాగుంటుందని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. కామన్వెల్త్ అధినేతగా ప్రిన్స్ చార్లెస్‌ను ఎన్నుకోవాలన్న విషయమై సభ్యులందరిలో ఏకాభిప్రాయం లేదని తెలుస్తోంది. -
భారత్ చేతిలో కామన్వెల్త్!
లండన్: అంతర్జాతీయంగా మన దేశానికి పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని కామన్వెల్త్ కూటమిలోనూ భారత్ కీలకపాత్ర పోషించాలని బ్రిటన్ సహా పలు కామన్వెల్త్ దేశాలు వెల్లడించాయి. దీంతో, ఇప్పటికే పలు ప్రపంచ వేదికలపై క్రియాశీలక పాత్ర పోషిస్తున్న భారత్.. కామన్వెల్త్ సమావేశాల అనంతరం మరో కీలకమైన అడుగు ముందుకేయనుంది. ఈనెల 16 నుంచి 20 వరకు లండన్‌లో జరగనున్న కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశాల్లో (చోగమ్) పాల్గొనేందుకు ప్రధాని మోదీ మంగళవారం బ్రిటన్ వెళ్లనున్నారు. ‘వివిధ అంతర్జాతీయ సంస్థల ఏర్పాటు, కార్యక్రమాల్లో భారత్ పాత్ర క్రియాశీలకంగా మారింది. అందుకే కామన్వెల్త్లోని అతిపెద్ద దేశంగా భారత్.. ఈ గ్రూపును కూడా ముందుండి నడిపించాలని బ్రిటన్ కోరుకుంటోంది’ అని యూకేలో భారత డిప్యూటీ హై కమిషనర్ దినేశ్ పట్నాయక్ పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో ఈ ద్వైవార్షిక కామన్వెల్త్ ప్రభుత్వాల సదస్సుకు భారత ప్రధాని హాజరవటం ఇదే తొలిసారి. సోమవారమే ఈ సదస్సు ప్రారంభం కానున్నప్పటికీ.. మోదీ మంగళవారం రాత్రి లండన్ చేరుకుంటారు. బ్రిటీష్ రాణి ఎలిజబెత్–2 (కామన్వెల్త్ హెడ్) ప్రత్యేకంగా వ్యక్తిగత ఆహ్వాన లేఖ పంపినందుకే మోదీ ఈ సదస్సులో పాల్గొనేందుకు లండన్ వెళ్తున్నారని విదేశాంగ శాఖ సీనియర్ అధికారులు వెల్లడించారు. నేటి నుంచి మోదీ విదేశీ పర్యటన ప్రధాని మోదీ రెండుదేశాల (స్వీడన్, యూకే) విదేశీ పర్యటన సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఐదురోజుల పాటు జరిగే ఈ పర్యటనలో భాగంగా తొలిరోజు స్వీడన్లో మోదీ పర్యటిస్తారు. ఆ దేశ ప్రధాని స్టెఫాన్ లోఫెన్తో పలు అంశాలపై విస్తృత చర్చలు జరపనున్నారు. అనంతరం భారత్–నార్డిక్ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ప్రపంచానికి ‘భారత్ కీ బాత్’ లండన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ‘భారత్ కీ బాత్, సబ్కే సాథ్’ పేరుతో భారత సంతతి ప్రజలు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రపంచాన్నుద్దేశించి ప్రసంగించనున్నారు. బుధవారం సాయంత్రం (బ్రిటీష్ కాలమానం ప్రకారం) సెంట్రల్ లండన్‌లోని సెంట్రల్ హాల్ వెస్ట్‌మినిస్టర్ వేదిక నుంచి మోదీ ప్రసంగం ప్రారంభం కానుంది. ప్రపంచం నలుమూలల నుంచి సోషల్ మీడియా, లైవ్ వీడియో లింక్‌ల ద్వారా వచ్చే ప్రశ్నలకు మోదీ సమాధానాలిస్తారు. అలాగే థేమ్స్ నది ఒడ్డున ఉన్న బసవేశ్వర (12 శతాబ్దపు సంఘసంస్కర్త) విగ్రహానికి ప్రధాని పుష్పాంజలి ఘటించనున్నారు. -
క్రీడాగ్రామంలో మన జెండా ఎగిరె...
గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన భారత అథ్లెట్లు సోమవారం క్రీడాగ్రామంలో జెండా వందనం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అథ్లెట్లందరూ త్రివర్ణ పతకానికి గౌరవ వందనం చేశారు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన భారత స్టార్ మహిళా బాక్సర్ మేరీకోమ్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సహా అందరూ ఆహ్లాదంగా గడిపారు. జాతి గర్వించే నినాదాలు చేశారు. క్రీడా గ్రామంలో భారత బృందం బస చేసిన భవనం సమీపంలో సిరంజీలు బయట పడిన ఘటనపై స్పందించేందుకు భారత చెఫ్ డి మిషన్ విక్రమ్ సిసోడియా నిరాకరించారు. భారత బాక్సర్లపైనే డేగ కన్ను! ప్రతిష్టాత్మక గేమ్స్‌కు ముందు కలకలం రేపిన సిరంజీల ఘటనతో నిర్వాహకులు, దర్యాప్తు కమిటీ భారత బాక్సర్లపై కన్నేసినట్లుంది. అయితే ఉప్పందించిన పాపానికి తమపై అనుమానం వ్యక్తం చేయడం పట్ల భారత వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ‘సీజీఎఫ్ నియమించిన మెడికల్ కమిషన్ ముందు హాజరు కావాలని కామన్వెల్త్ గేమ్స్ అసోసియేషన్ భారత బాక్సర్లకు సమన్లు జారీ చేసింది’ అని సీజీఎఫ్ సీఈఓ గ్రీవెన్బర్గ్ తెలిపారు. అయితే ఈ సిరంజీలను మరీ అంత తీవ్రంగా పరిగణించాల్సిన పని లేదని... మల్టీ విటమిన్స్ ఇంజెక్షన్లకు కూడా వినియోగించవచ్చని భారత వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి భారత బాక్సర్లకు డోప్ పరీక్షలు నిర్వహించారు. 2 లక్షల 25 వేల కండోమ్స్ అథ్లెట్లు... ఆడండి, గెలవండి. చల్లని ఐస్‌క్రీమ్‌లు తినండి... వెచ్చని కోర్కెలు తీర్చుకోండనే విధంగా కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య ఏర్పాట్లు చేసింది. నిష్ణాతులైన 300 మంది చెఫ్‌ల ఆధ్వర్యంలోని పాకశాస్త్ర బృందం 24 గంటలపాటు తినుబండారాలను ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేయిస్తోంది. క్రీడాగ్రామంలో బస చేసిన 6,600 మంది అథ్లెట్ల కోసం రుచికరమైన ఫ్లేవర్లలో ఐస్ క్రీమ్‌లు చేయిస్తున్న నిర్వాహకులు 2 లక్షల 25 వేల కండోమ్లనూ అందుబాటులో ఉంచారు. సురక్షిత శృంగారం కోసం సగటు లెక్కలేసుకొని మరీ వీటిని ఉంచడం గమనార్హం. ఆరువేల పైచిలుకున్న అథ్లెట్లకు 11 రోజుల పాటు 34 కండోమ్‌ల చొప్పున... 2.25 లక్షల కండోమ్‌లను సిద్ధంగా ఉంచింది. ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన వింటర్ ఒలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో 1.10 లక్షల కండోమ్స్‌ను ఉచితంగా పంచారు. అదే రియో ఒలింపిక్స్ సమయంలో ‘జికా’ వైరస్ కలకలం రేగడంతో ఏకంగా 4.50 లక్షల కండోమ్స్‌ను ఉచితంగా ఇచ్చారు. -
‘కామన్వెల్త్’కు రజని
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టును బుధవారం ప్రకటించారు. స్టార్ స్ట్రయికర్ రాణి రాంపాల్ నేతృత్వంలో 18 మంది సభ్యుల జట్టును ఎంపిక చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, గోల్ కీపర్ ఇతిమరపు రజనికి చోటు దక్కింది. ఈ జట్టుకు ప్రధాన గోల్ కీపర్ సవిత వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. వచ్చే నెల 4 నుంచి ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో ఈ ప్రతిష్టాత్మక క్రీడలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా జరిగే హాకీ ఈవెంట్లో భారత్... మలేసియా, వేల్స్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలతో కలిసి పూల్ ‘ఎ’లో ఉంది. ఏప్రిల్ 5న జరిగే తమ తొలి మ్యాచ్‌లో వేల్స్‌తో భారత్ తలపడుతుంది. -
‘కామన్వెల్త్’లో పాల్గొనే భారత అథ్లెట్లకు బీమా
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లకు రూ. 50 లక్షల చొప్పున జీవిత బీమా చేశారు. ఎడిల్వీజ్ టోక్యో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ బీమా సదుపాయాన్ని కల్పించినట్లు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తెలిపింది. సోమవారం ఐఓఏ భారత జట్టుకు స్పాన్సర్షిప్ చేస్తున్న సంస్థల వివరాలు వెల్లడించింది. ఎడిల్వీజ్ బీమా, ఆర్థిక సేవల కంపెనీ కామన్వెల్త్ గేమ్స్‌తో పాటు, ఆసియా గేమ్స్, టోక్యో ఒలింపిక్స్ (2020)లకూ భారత జట్టు ప్రధాన స్పాన్సర్‌గా కొనసాగుతోంది. గతంలో రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్లకు ఎడిల్వీజ్ సంస్థ రూ. కోటి బీమా చేసింది. ప్రముఖ వస్త్ర ఉత్పత్తుల సంస్థ రేమండ్స్ దుస్తులను స్పాన్సర్ చేయనుంది. ప్రతిష్టాత్మక క్రీడల్లో పాల్గొనే భారత జట్టుకు స్పాన్సర్షిప్ సేవలందించడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు రేమండ్స్ చైర్మన్ గౌతమ్ హరి సింఘానియా తెలిపారు. కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చి క్రీడాకారులకు చేయూతనివ్వాలని కోరారు. -
కామన్వెల్త్, ఆసియా క్రీడలు
కామన్వెల్త్ క్రీడల్లో కామన్వెల్త్ దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారు. ఈ క్రీడలు తొలిసారిగా 1930లో కెనడాలోని హామిల్టన్ నగరంలో జరిగాయి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఈ క్రీడలను నిర్వహిస్తారు. ప్రపంచ యుద్ధాల కారణంగా 1942, 1946 సంవత్సరాల్లో వీటిని నిర్వహించలేదు. 1930–50 కాలంలో బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్‌గా, 1954–66 మధ్య బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్‌గా, 1970–74 కాలంలో బ్రిటిష్ కామన్వెల్త్ గేమ్స్‌గా ఈ క్రీడలను పిలిచారు. 1978 నుంచి కామన్వెల్త్ గేమ్స్‌గా పిలుస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, వేల్స్ దేశాలు (ఆరు) ఇప్పటి వరకు జరిగిన అన్ని కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్నాయి. ఈ క్రీడలను ఆస్ట్రేలియా, కెనడాలు అత్యధికంగా చెరో నాలుగుసార్లు నిర్వహించాయి. భారతదేశం 2010 లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. 20వ కామన్వెల్త్ క్రీడలు 20వ కామన్వెల్త్ క్రీడలు 2014, జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జరిగాయి. ఈ క్రీడల్లో 71 దేశాలకు చెందిన 4,947 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 17 క్రీడల్లో 261 ఈవెంట్లు జరిగాయి. ఇంగ్లండ్ అత్యధికంగా 58 స్వర్ణ, 59 రజత, 57 కాంస్య పతకాలను సాధించింది. ఈ క్రీడల్లో మొత్తం 174 పతకాలను కైవసం చేసుకుని ఇంగ్లండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, కెనడా, స్కాట్లాండ్లు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. భారత్‌కు 15 స్వర్ణ, 30 రజత, 19 కాంస్య పతకాలు కలిపి మొత్తం 64 పతకాలు లభించాయి. ఆరంభ వేడుకల్లో భారత్ తరపున షూటర్ విజయ్ కుమార్ జాతీయ పతాకాన్ని చేబూని భారత క్రీడా బృందానికి ముందు నడిచాడు. ముగింపు వేడుకల్లో సీమా పూనియా (డిస్కస్ త్రో) జాతీయ పతాకధారిగా నిలిచింది. భారత స్వర్ణపతక విజేతలు సంజిత కుముక్చామ్ మహిళల వెయిట్ లిఫ్టింగ్ సుఖేన్ డే పురుషుల వెయిట్ లిఫ్టింగ్ అభినవ్ బింద్రా షూటింగ్ అపూర్వి చందేల మహిళల షూటింగ్ రాహి సర్నోబత్ మహిళల షూటింగ్ సతీష్ శివలింగం వెయిట్ లిఫ్టింగ్ జీతూ రాయ్ షూటింగ్ అమిత్ కుమార్ రెజ్లింగ్ వినేష్ ఫోగత్ మహిళల రెజ్లింగ్ సుశీల్ కుమార్ రెజ్లింగ్ బబిత కుమారి మహిళల రెజ్లింగ్ యోగేశ్వర్ దత్ రెజ్లింగ్ వికాస్ గౌడ డిస్కస్ త్రో దీపికా పల్లికల్ జ్యోత్స్న చిన్నప్ప స్క్వాష్ (మహిళల డబుల్స్) పారుపల్లి కశ్యప్ బ్యాడ్మింటన్ కామన్వెల్త్ క్రీడలు– వేదికలు ఇప్పటివరకు 20 కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. కొన్నింటి వివరాలు. సంవత్సరం నగరం దేశం 1930 హామిల్టన్ కెనడా 1934 లండన్ ఇంగ్లండ్ 1938 సిడ్నీ ఆస్ట్రేలియా 1950 అక్లాండ్ న్యూజిలాండ్ 1954 వాంకోవర్ కెనడా 1998 కౌలాలంపూర్ మలేసియా 2002 మాంచెస్టర్ ఇంగ్లండ్ 2006 మెల్బోర్న్ ఆస్ట్రేలియా 2010 న్యూఢిల్లీ ఇండియా 2014 గ్లాస్గో స్కాట్లాండ్ ఆసియా క్రీడలు ఆసియా క్రీడలు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతాయి. ఒలంపిక్స్ తర్వాత ప్రపంచంలో అతి పెద్ద క్రీడా సంబరంగా వీటిని పేర్కొంటారు. ఈ క్రీడలు తొలిసారి 1951లో (న్యూఢిల్లీ) జరిగాయి. భారత్, ఇండోనేసియా, జపాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, సింగపూర్, థాయిలాండ్ (ఏడు) దేశాలు ఇప్పటి వరకు జరిగిన అన్ని ఆసియా క్రీడల్లో పాల్గొన్నాయి. 17వ ఆసియా క్రీడలు 17వ ఆసియా క్రీడలు 2014లో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగాయి. వీటికి దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరం ఆతిథ్యం ఇచ్చింది. ఈ క్రీడల్లో 45 దేశాలకు చెందిన 9,501 క్రీడాకారులు పాల్గొన్నారు. 36 క్రీడల్లో 439 క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. చైనా 151 స్వర్ణపతకాలను సాధించి అగ్రస్థానంలో నిలిచింది. వీటితో పాటు 108 రజత, 83 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 342 పతకాలను చైనా సొంతం చేసుకుంది. దక్షిణ కొరియా, జపాన్, కజకిస్థాన్, ఇరాన్, థాయిలాండ్, ఉత్తర కొరియా దేశాలు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. భారత్ 57 పతకాలు సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ క్రీడల్లో 11 స్వర్ణ, 10 రజత, 36 కాంస్య పతకాలను భారత క్రీడాకారులు సాధించారు. జపాన్ స్విమ్మర్ హగినో కొసుకే నాలుగు స్వర్ణాలతో సహా మొత్తం ఏడు పతకాలు సాధించి ‘శాంసంగ్ అత్యంత విలువైన క్రీడాకారుడు’ అవార్డును గెలుచుకున్నాడు. -
హైదరాబాద్ చేరుకున్న కామన్వెల్త్ విజేతలు
హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన తెలుగుతేజాలు హైదరాబాద్ తిరిగొచ్చారు. మంగళవారం సాయంత్రం బ్యాడ్మింటన్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, పీవీ సింధు శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో కశ్యప్ పసిడి పతకం, సింధు కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. కశ్యప్, సింధుతో పాటు గురుసాయి దత్ ఇతర క్రీడాకారులు నగరానికి వచ్చారు. -
శిక్షించే కూటమిగా మార్చొద్దు: మహీంద రాజపక్స
కామన్వెల్త్ కూటమికి రాజపక్స సూచన నాలుగేళ్లుగా లంకలో ఒక్క ఉగ్రవాద చర్యా లేదు కొలంబో: కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల కూటమి (చోగమ్)ని.. దండించే కూటమిగానో, తీర్పు చెప్పే కూటమిగానో మార్చవద్దని శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స సూచించారు. మూడు రోజుల చోగమ్ శిఖరాగ్ర సదస్సు శ్రీలంక రాజధాని కొలంబోలో శుక్రవారం ప్రారంభమైంది. ఎల్టీటీఈపై పోరులో భాగంగా శ్రీలంకలో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో శ్రీలంకలో జరుగుతున్న సదస్సును పలు సభ్యదేశాలు బహిష్కరించిన విషయం తెలిసిందే. తమిళనాడు పార్టీలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో భారత ప్రధానమంత్రి మన్మో హన్‌సింగ్ కూడా చోగమ్ సదస్సుకు దూరంగా ఉండగా.. భారత్ తరఫున విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాజపక్స ప్రారంభోపన్యాసం చేస్తూ.. లంక తమిళులపై మానవ హక్కుల ఉల్లంఘన వివాదాలను, దానిపై పలు దేశాల వైఖరిని పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘కామన్వెల్త్ అనేదానికి సమకాలీనత ఉండాలంటే.. ఈ కూటమి సభ్యులు ప్రజల అవసరాలకు స్పందించాలి కానీ.. కూటమిని శిక్షించేది గానో, తీర్పు చెప్పేది గానో మార్చకూడదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘మానవ హక్కుల పట్ల మాకు ఎంతో గౌరవం ఉంది. జీవించే హక్కును మేం పునరుద్ధరించాం. గత నాలుగేళ్లలో శ్రీలంకలో ఎక్కడా ఒక్క ఉగ్రవాద ఘటన కూడా చోటుచేసుకోలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. సహకారం మరింత పెరగాలి: ప్రిన్స్ చార్లెస్ కామన్వెల్త్ అధినేత 87 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్-2 తరఫున హాజరైన ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్, రాజపక్సతో కలిసి చోగమ్ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని నెహ్రూ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ఆర్థిక, సామాజిక, పర్యావరణ సవాళ్లను పరిష్కరించేందుకు కామన్వెల్త్ దేశాలు పరస్పర సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ‘‘సమకాలీన ప్రపంచ సమస్యలను ‘నయంచేయగల స్పర్శ’ను తీసుకువచ్చే సామర్థ్యం కామన్వెల్త్కు ఉంద’ని నాటి భారత ప్రధాని నెహ్రూ (కాకతాళీయంగా ఆయన జన్మదినం, నా జన్మదినం ఒకటే కావటం నాకు ఎంతో గర్వకారణం) ప్రకటించారు. 60 ఏళ్లకు పైగా గడిచిపోయిన తర్వాత.. మన ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను మనం మళ్లీ గుర్తుచేసుకోవాల్సిన అవసరం రాకూడదు’’ అని పేర్కొన్నారు. మొత్తం 53 సభ్యదేశాల చోగమ్ ప్రారంభ కార్యక్రమంలో కామన్వెల్త్ చైర్మన్, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్, బ్రిటిష్ ప్రధాని కామెరాన్ సహా 23 దేశాల అధినేతలు, పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. జాఫ్నాలో కామెరాన్ జాఫ్నా: శ్రీలంకలో ‘ఎల్టీటీఈపై యుద్ధం’తో అతలాకుతలమైన ఉత్తర ప్రాంతంలో బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ శుక్రవారం పర్యటించారు. 1948లో శ్రీలంకకు ఇంగ్లండ్ నుంచి స్వాతంత్య్రం లభించిన నాటి నుంచీ ఈ ప్రాంతంలో కాలు పెట్టిన తొలి విదేశాధినేత ఆయనే కావడం విశేషం! శ్రీలంక ప్రభుత్వం యథేచ్ఛగా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కామెరాన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
చోగమ్‌కు సల్మాన్
సాక్షి, చెన్నై: శ్రీలంకలో జరగనున్న కామన్వెల్త్ (చోగమ్)ను భారత్ బహిష్కరించాల్సిందేనని పట్టుబడుతూ రాష్ట్ర అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఆగ్రహ జ్వాల రాజుకున్నా, తమకేం పట్టదన్నట్టుగా, తమిళుల మనోభావాల్ని తుంగలో తొక్కుతూ శ్రీలంకకు ప్రతినిధుల బృందాన్ని పంపించేందుకే కేంద్రం మొగ్గు చూపింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నేతృత్వంలో నలుగురు అధికారుల బృందం బుధవారం ప్రత్యేక విమానంలో శ్రీలంక రాజ ధాని కొలంబోకు బయలుదేరి వెళ్లింది. తమిళుల మనోభావాలకు విలువ ఇవ్వకుండా శ్రీలంకకు ఈ బృందం వెళ్లడంతో రాష్ట్రంలో ఆగ్రహావేశాలు రగిలాయి. పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం రైల్‌రోకోలకు వీసీకే పిలుపునిచ్చింది. అలాగే శ్రీలంక తమిళుల సంక్షేమంపై చోగమ్‌లో తీసుకునే నిర్ణయం మేరకు తదుపరి తమ కార్యాచరణను ప్రకటించేందుకు ఈ నెల 17న టెసో సమావేశం కానుంది. పిటిషన్ తిరస్కరణ కామన్వెల్త్కు భారత్ నుంచి ప్రతినిధులు వెళ్లనీయకుండా స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం తిరస్కరించింది. కామన్వెల్త్ను భారత్ బహిష్కరించాలని కోరుతూ మదురైకు చెందిన న్యాయవాదులు గత వారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎనిమిది కోట్ల తమిళ ప్రజల నుంచి ఎన్నికైన 234 మంది ఎమ్మెల్యేలు కామన్వెల్త్ మహానాడుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారని ఆ పిటిషన్లో గుర్తు చేశారు. ఈ తీర్మానానికి ఎలాంటి గౌరవం ఇవ్వకుండా, తమిళనాడులో బయలుదేరిన ఆగ్రహ జ్వాలలతో తమకేమీ సంబంధం లేదన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకుని కామన్వెల్త్కు భారత్ వెళ్లకుండా స్టేవిధించాలని కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు సెల్వం, రవి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. బుధవారం విచారణ ముగించిన ధర్మాసనం తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంటూ ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఎంపీల రాజీనామా కలకలం అసెంబ్లీ తీర్మానాలకు కనీస విలువ ఇవ్వని కేంద్రం తీరును నిరసిస్తూ అన్నాడీఎంకే ఎంపీలు రాజీనామా చేయబోతున్నట్టుగా సాగిన ప్రచారం రాష్ట్రంలో రాజకీయంగా కలకలం రేపింది. అన్నాడీఎంకేకు పార్లమెంట్లో తొమ్మిది, రాజ్యసభలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు. తమ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాల్ని కేంద్రం తుంగలో తొక్కడంతో రాష్ట్రంలోని ఇతర పార్టీల్ని ఇరకాటంలో పెట్టడంతో పాటు, ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ఒత్తిడి పెంచే విధంగా అన్నాడీఎంకే వ్యూహాన్ని రచించిందన్న ప్రచారం రాష్ట్రంలో హల్ చల్ చేసింది. ఆ పార్టీ ఎంపీలందరూ ఢిల్లీకి హుటాహుటిన పయనమయ్యారని, ప్రధాని మన్మోహన్ నివాసం వద్ద నిరసన తెలిపిన అనంతరం రాజీనామాలు సమర్పించబోతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ సంకేతాలతో స్థానిక మీడియా సైతం హడావుడి సృష్టించడంతో రాజకీయ కలకలం బయలుదేరింది. అన్నాడీఎంకే ఎంపీలు రాజీనామ చేసిన పక్షంలో రాష్ర్ట ప్రజల వద్ద మార్కులు కొట్టేయడం ఖాయమని, ఇక తామెలాంటి నిర్ణయం తీసుకోవాలోనన్న చర్చలో డీఎంకే, కాంగ్రెస్ ఎంపీలు పడ్డారు. చివరకు రాజీనామా తంతు ప్రచారంగా తేలడంతో రాజకీయ కలకలానికి తెరపడ్డట్టు అయింది. -
‘కామన్వెల్త్’కు దూరం!
సాక్షి, చెన్నై:శ్రీలంక వేదికగా కామన్వెల్త్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలను భారత్ బహిష్కరించాల్సిందేనని తమిళాభిమాన సంఘాలు, రాజకీయ పార్టీలు పట్టుబడుతూ వస్తున్నాయి. అయితే కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నేతృత్వంలోని అధికారుల బృం దం శ్రీలంకకు పయనమయ్యేందుకు సిద్ధమైంది. అదే సమయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ తన పర్యటనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు తమిళనాడులో రాజుకున్న జ్వాల, మరోవైపు కేంద్ర కేబినెట్లోని రాష్ట్రానికి చెందిన మంత్రుల వ్యతిరేకత మన్మోహన్‌ను సందిగ్ధంలో పడేశాయి. లోక్‌సభకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన లంక పర్యటనతో తమిళనాట కాంగ్రెస్‌కు ఎక్కడ గట్టి దెబ్బ తగులుతుందోనన్న భయం వెంటాడింది. తమిళుల మనోభావాల్ని గౌరవిస్తున్నట్లు, వారి కోసం తాము శ్రమిస్తున్నామని చాటుకునే రీతిలో చివరి క్షణంలో తన నిర్ణయాన్ని సహచరులతో మన్మోహన్ పంచుకున్నట్లు సమాచారం. లంకకు లేనట్టే ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం చత్తీస్గడ్ ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్లారు. అనంతరం శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు లేఖ రాసినట్లు సంకేతాలు వెలువడ్డాయి. కామన్వెల్త్ సమావేశాలకు తాను దూరంగా ఉండాల్సిన పరిస్థితుల్ని అందులో వివరించారు. తన ప్రతినిధిగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ హాజరవుతారని పేర్కొన్నట్లు తెలిసింది. లేఖలోని అంశాల్ని అధికార యంత్రాంగం అత్యంత గోప్యంగా ఉంచింది. ఆయన లంకకు వెళ్లనట్టేనన్న సంకేతాల్ని మాత్రం మీడియాకు పంపించడం గమనార్హం. లంక పర్యటన బహిష్కరణ నిర్ణయాన్ని మన్మోహన్ సింగ్ ముందుగానే తీసుకున్నారని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. అయితే తమిళుల మనోభావాలకు గౌరవాన్ని ఇస్తున్నామని చాటుకునేందుకే ఆలస్యంగా తన నిర్ణయాన్ని ప్రకటించి ఉండొచ్చని పేర్కొన్నారు. ఇది వరకు న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ దేశాల సమావేశాలకు మన్మోహన్ సింగ్ దూరంగా ఉన్న విషయూన్ని గుర్తు చేశారు. -
కామన్వెల్త్ను బహిష్కరించాలి
వేలూరు, న్యూస్‌లైన్: శ్రీలంకలో జరిగే కామన్వెల్త్ మహానాడులో భారత ప్రతినిధులు పాల్గొనరాదని అరుంధతి మక్కల్ పార్టీ వ్యవస్థాపకుడు వలసై రవిచంద్రన్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీలంకలోని మీడియా ప్రతినిధి ఇసై ప్రియపై లంక సిపాయిలు అతి దారుణంగా లైంగిక దాడి చేసి హత్య చేయడాన్ని చానల్ 4 టీవీ గత వారంలో విడుదల చేసిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలన్నారు. చానల్ 4 విడుదల చేసిన ఫొటోలు, వీడియోలు గ్రాఫిక్స్ అని శ్రీలంక ప్రభుత్వం పేర్కొనడం దారుణమన్నారు. ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, దీనిపై ఐక్యరాజ్య సమితి ప్రతినిధులతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇసైప్రియ పట్ల ప్రవర్తించిన తీరుపై తమిళ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. లంకలో జరిగే మహానాడులో దేశ ప్రతినిధులతో పాటు, ప్రధానమంత్రి కూడా పాల్గొనరాదని రాష్ట్ర వ్యాప్తంగా తమిళులు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. తమిళల మనోభావాలను కాలరాసి మహానాడులో దేశ ప్రతినిధులు పాల్గొంటే రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 2009లో లంకలోని తమిళులను అతి దారుణంగా హత్య చేశారని, విల్లువాయిల్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో సుమారు ఒకటిన్నర లక్షల మంది తమిళులు మృతి చెందారని పేర్కొన్నారు. వీటిపై అంతర్జాతీయ స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. రాజపక్సేను అంతర్జాతీయ ఖైదీగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
ప్రధాని నిర్ణయమేమిటో?
సాక్షి, చెన్నై:శ్రీలంక వేదికగా ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు కామన్వెల్త్ దేశాల సమావేశాలు జరగనున్నారుు. ఈ సమావేశాల్లో భారత్ పాల్గొనరాదంటూ తమిళనాట ఆందోళనలు మొదలయ్యూ యి. ప్రధాని మన్మోహన్ సింగ్ శ్రీలంక వెళ్లనున్నారన్న సమాచారంతో ఇటీవల ఆందోళనలు ఉద్ధృతమయ్యూయి. తమిళుల మనోభావాలకు అనుగుణంగా కేంద్రం వ్యవహరించాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు సైతం ఇదే వాణి వినిపిస్తున్నారు. నోరు విప్పని ప్రధాని కామన్వెల్త్ సమావేశాలకు సమయం దగ్గర పడుతున్నా ప్రధాని మన్మోహన్ సింగ్ నోరు విప్పడం లేదు. తమిళుల మనోభావాలకు అనుగుణంగా ప్రధాని నిర్ణయం తీసుకుంటారంటూ కొందరు, తమిళవాణిని శ్రీలంక వేదికగా గట్టిగా వినిపించేందుకు సిద్ధమవుతున్నారని మరికొందరు ఢిల్లీ నేతలు చెబుతున్నారు. శ్రీలంకతో సత్సంబంధాలు ముఖ్యమని కాంగ్రెస్ ఉన్నతస్థాయి, మంత్రివర్గ సమావేశాల్లో మన్మోహన్ పేర్కొన్నారు. అయితే స్వయంగా తాను హాజరయ్యే విషయమై ఎలాంటి ప్రకటనా చేయలేదు. సమావేశాల్లో పాల్గొనే విషయమై తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను పార్టీ ఉన్నతస్థాయి, మంత్రివర్గ సమావేశాల్లో మన్మోహన్ భుజానే వేశారు. దీంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఒత్తిడి పెంచిన మంత్రులు కామన్వెల్త్కు వ్యతిరేకంగా తమిళనాట సాగుతున్న ఆందోళనల తీవ్రతను కేంద్ర మంత్రులు గుర్తించా రు. తమిళుల మనోభావాలకు అనుగుణంగానే మన్మోహన్ నడుచుకుంటారని కేంద్ర మంత్రులు ఆంటోని, చిదంబరం, జీకే వాసన్, జయంతి న టరాజన్, నారాయణస్వామి, సుదర్శన నాచ్చియప్పన్ పదేపదే ప్రకటిస్తూ వస్తున్నారు. ఇదే విషయమై ప్రధానిపై ఒత్తిడి పెంచే పనిలో పడ్డారు. లంకకు సల్మాన్ బృందం విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నేతృత్వంలోని అధికారుల బృందం శ్రీలంకకు పయనమయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇతర దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, వ్యవహారాల మేరకు ఆ శాఖ వర్గాలు తప్పనిసరిగా సమావేశాలకు వెళ్లాల్సి ఉన్నందునే మంత్రి నేతృత్వంలో బృందం సిద్ధమవుతోందని ఓ కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. అరుుతే మన్మోహన్ దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. చివరి క్షణంలో ఏమైనా మార్పులు జరిగినా జరగొచ్చంటూ మెలిక పెట్టారు. చల్లారని ఆగ్రహం రాష్ట్రంలో నిరసన జ్వాలలు చల్లారడం లేదు. పలుచోట్ల శనివారం నిరసన తెలిపారు. హిందూ సత్యసేన నేతృత్వంలో బేసిన్ బ్రిడ్జి వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. రైల్‌రోకోకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి సంఘాలు, ఈలం తమిళాభిమాన సంఘాల నేతృత్వంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దీక్ష విరమణ చెన్నైలో ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న విద్యార్థులు ఎట్టకేలకు శనివారం దిగొచ్చారు. కామన్వెల్త్ సమావేశాలకు వ్యతిరేకంగా ఐదుగురు విద్యార్థులు నుంగబాక్కంలో ఆమరణ దీక్షకు కూర్చున్న విషయం తెలిసిందే. శ్రీలంకకు చెందిన తమిళ నేతలు ఆనందీ, శశిధరన్ ఫోన్ ద్వారా వీరిని పరామర్శించారు. దీక్ష విరమించాలని సూచించారు. దీక్ష విరమణకు విద్యార్థులు అంగీకరించారు. వీరికి నటుడు సత్యరాజ్ కొబ్బొరి బొండాలిచ్చి దీక్ష విరమింపజేశారు. -
జాలర్ల సమ్మెబాట
సాక్షి, చెన్నై : కామన్వెల్త్కు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో రాష్ట్ర జాలర్లను శ్రీలంక నావికాదళం బందీలుగా పట్టుకెళ్లడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. ఓ వైపు విద్యార్థులు, ప్రజా సంఘాల సభ్యులు, రాజకీయ పార్టీల నాయకులు ఆందోళనల బాట పట్టారు. జాలర్లు సైతం ఆందోళనకు సిద్ధమయ్యారు. పుదుకోట్టై, రామేశ్వరం జాలర్లను బందీలుగా శ్రీలంక సేనలు పట్టుకెళ్లడంతో అక్కడి జాలర్లలో ఆగ్రహావేశాలు బయలుదేరాయి. తమ వాళ్ల విడుదలకు చర్యలు తీసుకోవాలని, కామన్వెల్త్ను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ రామేశ్వరం, పుదుకోట్టై జాలర్లు బుధవారం నుంచి సమ్మెబాట పట్టారు. చేపల వేటను బహిష్కరించారు. పడవలన్నీ ఒడ్డుకే పరిమితమయ్యాయి. ఈ విషయంగా జాలర్ల సంఘం నేత రామదేవన్ మాట్లాడుతూ జాలర్లపై శ్రీలంక సేనల దాడులు రోజు రోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బందీలుగా పట్టుకెళ్లిన వారిని చిత్ర హింసలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు కేంద్రం సూచనతో విడుదల చేస్తున్నారు గానీ, తమ పడవల్ని మళ్లీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. పడవలు లేక బతుకు భారమై వందలాది కుటుంబాలు అష్టకష్టాలు పడుతున్నాయని వాపోయారు. దాడులకు అడ్డుకట్ట వేయడం, కామన్వెల్త్ను బహిష్కరించి శ్రీలంక భరతం పట్టడం లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించామన్నారు. తాము సమ్మెబాట పట్టామని, తమ వెంట అన్ని జిల్లాల్లోని జాలర్లు నడుస్తారన్న నమ్మకం ఉందన్నారు. పీఎంకే నేత రాందాసు మాట్లాడుతూ రామేశ్వరం, పుదుకోట్టై జాలర్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ జాలర్లను ఆదర్శంగా చేసుకుని సముద్ర తీర జిల్లాల్లోని జాలర్లందరూ ఏకం కావాలన్నారు. కేంద్రం నడ్డి విరిచి శ్రీలంక భరతం పట్టేలా చేసేందుకు ఇదే సరైన సమయమని జాలర్లకు పిలుపునిచ్చారు. విద్యార్థుల ఆమరణ దీక్ష కామన్వెల్త్ బహిష్కరణ నినాదంతో చెన్నైలో మూడు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఆమరణ దీక్షకు దిగారు. బుధవారం ఉదయం వళ్లువర్ కోట్టం వద్ద ఓ కళాశాలకు చెందిన సెంబియన్, ఇళవరసన్, రత్నవేల్ ఆమరణదీక్షకు కూర్చున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి సాయంత్రం వరకు ఓ కల్యాణ మండపంలో ఉంచి అనంతరం విడుదల చేశారు. బయటకు వచ్చిన ఆ ముగ్గురు అన్నాసాలైలోని తమ హాస్టల్లో దీక్షను కొనసాగిస్తున్నారు. అలాగే పెరంబూరు, కీల్పాకం ఆ పరిసరాల్లోని కళాశాలలకు చెందిన విద్యార్థులు ఓ ప్రైవేటు స్థలంలో దీక్షకు కూర్చున్నారు. ఈ దీక్ష గురించి విద్యార్థి సెంబియన్ మీడియాతో మాట్లాడుతూ ఈలం తమిళుల సంక్షేమాన్ని కోరుతూ మూడు కళాశాలకు చెందిన మిత్రులందరూ కలిసి ఆయా ప్రాంతాల్లో దీక్ష చేపట్టామన్నారు. కామన్వెల్త్ను బహిష్కరిస్తున్నట్టు ప్రధాని మన్మోహన్సింగ్ ప్రకటన చేసే వరకు తమ దీక్ష కొనసాగుతుందని, అన్ని కళాశాలల విద్యార్థుల్ని ఏకం చేసి ఆందోళనలు ఉద్ధృతం చేయనున్నామన్నారు. బీజేపీ ఢిల్లీ బాట దేశ ప్రయోజనాల దృష్ట్యా కామన్వెల్త్ మహానాడులో భారత్ పాల్గొనాలని బీజేపీ జాతీయ నేతలు పేర్కొంటున్నారు. అదేవిధంగా మహానాడు వేదికగా తమిళ వాణి విన్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కామన్వెల్త్ మహానాడును బహిష్కరించాల్సిందేనన్న నినాదంతో రాష్ట్రంలో ఉద్యమం రాజుకుంది. దీంతో రాష్ట్రంలోని బీజేపీ నేతలు మేల్కొన్నారు. తాము కామన్వెల్త్ మహానాడుకు అనుకూలంగా వ్యవహరిస్తే, లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడ ఇరకాటంలో పడుతామోనన్న బెంగ వారికి పట్టుకుంది. దీంతో తమ స్వరాన్ని మార్చాలంటూ జాతీయ నేతలకు సూచించేందుకు రాష్ట్ర నాయకులు సిద్ధమయ్యారు. ఢిల్లీ బాట పట్టేందుకు ఉరకలు తీస్తున్నారు. ఈ విషయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్‌రాధాకృష్ణన్ మాట్లాడుతూ కామన్వెల్త్ను బహిష్కరించాల్సిందేనని డిమాండ్ చేశారు. తన నేతృత్వంలో ఢిల్లీకి బృందం పయనం కానుందన్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో సంప్రదింపులు జరిపి కామన్వెల్త్కు వ్యతిరేకంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొనడం గమనార్హం. -
తమిళ విద్యార్థుల ఉద్యమబాట
సాక్షి, చెన్నై: ఈలం తమిళులకు మద్దతుగా రాష్ట్రంలో ఇప్పటి వరకు సాగిన ఉద్యమాల్లో విద్యార్థులు కీలకపాత్ర పోషించారు. శ్రీలంకకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో ఇటీవల ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ మద్దతు ఇవ్వాల్సిందేనన్న నినాదంతో విద్యార్థులు సాగించిన ఉద్యమం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి ఆందోళనలతో కళాశాలలకు సెలవులు ప్రకటించక తప్పలేదు. ప్రస్తుతం ఇసై ప్రియ హత్య దృశ్యాల వెలుగులోకి రావడంతో విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శ్రీలంకలో జరగనున్న కామన్వెల్త్ సమావేశాలను భారత్ బహిష్కరించాలనే డిమాండ్‌తో ఉద్యమ ఉద్ధృతానికి విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. తమిళ జాతి విద్యార్థి సమాఖ్య, తమిళనాడు విద్యార్థి సంఘాల నేతృత్వంలో భారీ ఆందోళనలకు విద్యార్థి లోకం సిద్ధమైంది. చైతన్యయాత్ర: ఉద్యమాన్ని తమ చేతిలోకి తీసుకుంటూ విద్యార్థులు సోమవారం చైతన్యయాత్రకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల మద్దతు కూడగట్టడం లక్ష్యంగా కన్యాకుమారి, తిరునల్వేలి, విరుదునగర్, మదురై, తిరుచ్చి, ధర్మపురి, సేలం, ఈరోడ్, నామక్కల్, చెన్నై, కాంచీపురం నుంచి విద్యార్థి సంఘాలు కాగడాల్ని చేత బట్టి యాత్రకు శ్రీకారం చుట్టాయి. ఈ యాత్రను కూడంకులంలో అణు విద్యుత్ వ్యతిరేక ఉద్యమనేత ఉదయకుమార్ ప్రారంభించారు. రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందితుడైన పేరరివాలన్ తల్లి అర్బుదమ్మాళ్ నేతృత్వంలో చెన్నై చేపాక్కంలో యాత్ర మొదలైంది. అనుమతి లేకుండా చేపట్టిన ఈ యాత్రల్ని ఆయా ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి నాయకుల్ని అరెస్టు చేశారు. దీంతో విద్యార్థులు ఆగ్రహం చెందారు. తాంబ రం, పల్లావరం, క్రోంపేట పరిసరాల్లోని కొన్ని కళాశాలలు, పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. రైల్‌రోకోలకు యత్నించారు. అలాగే రాష్ట్రంలోని పలుచోట్ల రాస్తారోకోలు, రైల్‌రోకోలు, ధర్నాలతో విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ నిరసనలను మంగళవారం నుంచి ఉద్ధృతం చేయడానికి నిర్ణయించారు. చెన్నైలోని రాజ్‌భవన్‌ను ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. రాజకీయ పక్షాల సన్నద్ధం విద్యార్థులు రంగంలోకి దిగడంతో రాజకీయ పార్టీలు సైతం ఆందోళనలకు సిద్ధమయ్యాయి. మంగళవారం వీసీకే నేతృత్వంలో నిరసనలకు ఆ పార్టీ నేత తిరుమావళవన్ పిలుపునిచ్చారు. శ్రీలంక తమిళుల పరిరక్షణ కమిటీ, పెరియార్ ద్రావిడ కళగం, నామ్ తమిళర్ కట్చి, సమత్తువ మక్కల్ కట్చి, తమిళగ మున్నేట్ర కాంగ్రెస్, ఎండీఎంకేలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. నామ్ తమిళర్ కట్చికి చెందిన పదిహేను మంది శివగంగైలో ఆదివారం నుంచి ఆమరణ దీక్షకు కూర్చున్నారు. కోర్టులో పిటిషన్ కామన్వెల్త్ సమావేశాల్లో భారత్ పాల్గొనడంపై స్టే విధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఆర్.కుమరన్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కామన్వెల్త్ సమావేశాలకు వ్యతిరేకంగా ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. దీనికి గౌరవం ఇవ్వకుండా, తమిళనాడులోని ఆగ్రహజ్వాలతో తమకేమీ సంబంధం లేదన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. తమిళనాడు ప్రజల మనోభావాల్ని తుంగలో తొక్కి శ్రీలంకకు వెళ్లేందుకు భారత్ సిద్ధమవుతోందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించి కామన్వెల్త్ సమావేశాల్లో భారత్ పాల్గొనకుండా స్టే విధించాలని కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జయచంద్రన్, వైద్యనాథన్‌తో కూడిన బెంచ్ పరిశీలించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అగర్వాల్ మంగళవారం మదురైకు వస్తున్న దృష్ట్యా విచారణను అదే రోజు నుంచి చేపట్టేందుకు బెంచ్ నిర్ణయించింది. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోనే విచారించేందుకు బెంచ్ నిర్ణయించినట్లు సమాచారం. శ్రీలంకకు భారత్ నుంచి యుద్ధనౌకల పంపిణీకి వ్యతిరేకంగా దాఖలైన మరో పిటిషన్ విచారణను వారుుదా వేశారు. ప్రధానిపై ఒత్తిడి కామన్వెల్త్ సమావేశాలకు వెళ్లకూడదంటూ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఒత్తిడి తీసుకురానున్నట్లు కేంద్ర సహాయ మంత్రి జయంతి నటరాజన్ పేర్కొన్నారు. ఆమె సోమవారం ఢిల్లీ వెళుతూ మీనంబాక్కం విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. తమిళుల మనోభావాల్ని అర్థం చేసుకోవాలని అన్ని పక్షాలూ కేంద్రాన్ని కోరుతున్నాయని గుర్తు చేశారు. తామూ ఇదే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. తమిళుల మనోభావాలకు వ్యతిరేకంగా ఆయన నిర్ణయం తీసుకోరన్న నమ్మకం ఉందన్నారు. వ్యక్తిగతంగా ప్రధానిని కలవనున్నట్లు, కామన్వెల్త్ సమావేశాలకు వెళ్లొద్దని కోరనున్నట్లు వెల్లడించారు. -
రగిలిన చిచ్చు
సాక్షి, చెన్నై: కామన్వెల్త్ సమావేశాలను భారత్ బహిష్కరించాల్సిందేనన్న నినాదంలో రాష్ట్రంలో కొంతకాలంగా ఆందోళనలు సాగుతున్నాయి. అయితే సమావేశాలకు భారత్ వెళ్లనుందన్న సంకేతాలు ఇటీవల వెలువడ్డాయి. అదే సమయంలో శ్రీలంకలో జరిగిన మారణ హోమం లో ఇసై ప్రియ దారుణహత్యకు గురైన వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈలం తమిళులపై శ్రీలంక అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నా కేంద్రం మాత్రం ఆ దేశానికి వత్తాసు పలికే విధంగా వ్యవహరిస్తుండడం తమిళులకు ఆగ్రహం కలిగిస్తోంది. ఆందోళనబాట: కేంద్రం తీరును ఎండగట్టేందుకు తమిళాభిమాన సంఘాలు, విద్యార్థి సంఘాలు సిద్ధమయ్యా యి. ఆగ్రహ చిచ్చు ఆదివారం మరింతగా రాజుకుంది. విల్లుపురం, కడలూరు, మదురై, చెన్నైలో ఆందోళనలు చోటు చేసుకున్నాయి. కడలూరులో తమిళాభిమాన సంఘాలు, విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు. రాజపక్సే, మన్మోహన్ సింగ్‌లకు వ్యతిరేకంగా నినాదాల్ని హోరెత్తించారు. విల్లుపురం బస్టాండ్ ఆవరణలో ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో విద్యార్థులను అరెస్టు చేశారు. మదురై, సమయనల్లూరులో వీసీకే నేతృత్వంలో నిరసనలు జరిగాయి. రైల్రోకకు యత్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని పల్లావరం, క్రోంపేటలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పల్లావరంలో బీచ్ - తాంబరం లోకల్ రైలును అడ్డుకున్నారు. కామన్వెల్త్ సమావేశాలను భారత్ బహిష్కరించాలని, యుద్ధ నేరం కింద శ్రీలంకను విచారించేందుకు ఐక్యరాజ్యసమితిలో తీర్మానం ప్రవేశపెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారుు. ఫిబ్రవరిలో జెనీవా వేదికగా జరగనున్న ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ఈ తీర్మానం తీసుకొచ్చేందుకు భారత్ చర్యలు చేపట్టాలన్న డిమాండ్‌తో ఆందోళనల్ని ఉద్ధృద చేయడానికి విద్యార్థి సంఘాలు ఏకమవుతున్నారుు. ఇసై ప్రియను బందీగా పట్టుకెళుతున్న సింహళీయ మానవ మృగాల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే పీఎంకే అధినేత రాందాసు, వీసీకే అధినేత తిరుమావళవన్ వేర్వేరు ప్రకటనల్లో తమ పార్టీల నేతృత్వంలో ఆందోళనలకు పిలుపునిచ్చారు. మంగళవారం చెన్నైలో వీసీకే భారీ నిరసనకు నిర్ణయించింది. కరుణతో చిదంబరం భేటీ ప్రధాని మన్మోహన్ సింగ్ శ్రీలంక పర్యటనను వ్యతిరేకిస్తున్న వారి జాబితాలో ఆర్థిక మంత్రి చిదంబరం సైతం చేరారు. ఇప్పటికే కేంద్రం మంత్రులు జీకేవాసన్, ఆంటోని, జయంతి నటరాజన్, నారాయణస్వామి వ్యతిరేకత తెలిపారు. ప్రస్తుతం చిదంబరం తోడు కావడంతో తమిళుల వాదనకు కేంద్రంలో బలం చేకూరేనా అన్న చర్చ బయలుదేరింది. గోపాలపురంలో కరుణానిధితో చిదంబరం శనివారం భేటీ అయ్యారు. అర్ధగంట సేపు వివిధ అంశాలపై చర్చించారు. శ్రీలంక తమిళుల సమస్య, కామన్వెల్త్ సమావేశాలు, ఇసై ప్రియ హత్య దృశ్యాలపై ఎక్కువ సమయం మాట్లాడుకున్నట్లు సమాచారం. అనంతరం వెలుపలకు వచ్చిన చిదంబరం మీడియాతో మాట్లాడారు. దీపావళిని పురస్కరించుకుని మర్యాద పూర్వకంగానే కరుణానిధిని కలుసుకున్నట్లు పేర్కొన్నారు. కామన్వెల్త్ సమావేశాల్లో పాల్గొనే విషయమై ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఒక వేళ తీసుకుంటే తమిళుల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించే రీతిలో తాను ఒత్తిడి తీసుకొచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. తమిళుల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రధాని నిర్ణయం తీసుకోరన్న నమ్మకం తనకు ఉందన్నారు. కోర్ కమిటీలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇసై ప్రియ హత్య ఘటనపై ఛానల్-4 ప్రసారం చేసిన దృశ్యాల్ని తాను చూశానని, ఆ దృశ్యాలన్నీ వాస్తవమేనని పేర్కొన్నారు. క్రూరంగా వ్యవహరించిన సింహళీయ సైన్యాన్ని గుర్తించి చర్యలు తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకొస్తానన్నారు. -
దగాపడ్డ లంక తమిళులు
అర్థరహితమైన చర్చలను రేకెత్తించి అనర్థదాయకమైన విధానాలను కప్పిపుచ్చుకోవచ్చు. శ్రీలంకలో ఈ నెల 15-17 తేదీలలో జరగనున్న కామన్వెల్త్ దేశాధినేతల (చోమ్) సమావేశానికి ప్రధాని మన్మోహన్సింగ్ హాజరు కావాలా? వద్దా? అంటూ సాగుతున్న అర్థరహితమైన చర్చే అందుకు నిదర్శనం. లంక అధ్యక్షుడు మహీందా రాజపక్స చైనా బుట్టలో పడకుండా చూడాలంటే మన్మోహన్ చోమ్ సమావేశాలకు హాజరు కాకతప్పదని కొందరి వాదన. 2014 ఎన్నికల వైతరణిని దాటాలంటే తమిళనాడు ప్రజల సెంటిమెంట్‌ను నిర్లక్ష్యం చేయరాదనేది మరో వాదన. ఇది ఎన్నికల సీజన్ వాదన కాగా, మొదటిది ‘చైనా ఫోబియా’ (భయం జబ్బు) నుంచి పుట్టుకొచ్చిన వాదన. యూపీఏ ప్రభుత్వానికిగానీ, తమిళ ఛాంపియన్లైన డీఎంకే, అన్నా డీఎంకేలకుగానీ లంక తమిళుల సంక్షేమంపై కంటే అధికార సోపానాలను ఎక్కడంపైనే శ్రద్ధ. రెండు వందల ఏళ్ల బ్రిటన్ వలసవాద ఊడిగానికి సంకేతమైన చోమ్ ఒక నిరర్థక సంస్థ. రెండేళ్లకోసారి పెట్టే ఆ తద్దినానికి వెడితే ఒరిగేదీ లేదు. వెళ్లకపోతే పోయేదీ లేదు. రాజపక్సే కాదు దాదాపు లంక అధ్యక్షులందరూ భారత్‌ను బుట్టలో పెట్టగలవారే తప్ప మరెవరి బుట్టలోనూ పడే బాపతు కాదు. నేటి మన లంక విధానం రాజపక్స బుట్టలోనే ఉంది. కాబట్టే ఉగ్రవాదంపై యుద్ధం పేరిట ఒకప్పుడు మనం పెంచి పోషించిన వేర్పాటువాద తమిళ టైగర్లపై నిర్మూలనా యుద్ధాన్ని పరోక్షంగా సమర్థించాల్సి వచ్చింది. నేడు లంక తమిళులపై సాగుతున్న అమానుష జాతి అణచివేతను, హక్కుల ఉల్లంఘనను చూసీ చూడనట్టు నటించాల్సి వస్తోంది. మన్మోహన్నాటకం తమిళ టైగర్లపై యుద్ధంలో (2009) లంక సైన్యం తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది మార్చిలో అభిశంసన తీర్మానం ఆమోదించింది. ఆ సమావేశాలకు ముందు కూడా నేటిలాగే రచ్చ జరిగింది. అది కూడా ఎన్నికల కాలమే... మొసలి కన్నీళ్లు కార్చిన కాలమే. అయినా ఆనాడు మన్మోహన్ ‘ద్రవిడ పార్టీలకు,’ ‘తమిళ దురహంకారానికి’ లొంగిపోడానికి సిద్ధంగా లేనని పదేపదే ప్రకటనలు గుప్పించారు. చివరికి అభిశంసనకు అనుకూలంగా ఓటు వేశారు. నేడు ఆయన ఎలాంటి ప్రకటనలు చేయకుండా గుంభనంగా ఉన్నారు. ‘ద్రవిడ పార్టీలకు లొంగిపోతారో లేదో’ వేచి చూడాలి. ప్రధాని చోమ్ సమావేశాలకు వెళ్లడంపై ఇక్కడ చర్చ సాగుతుండగా లంక సైన్యం తమిళ టైగర్ల సమాధులను నేలమట్టం చేసే పనిలో మునిగి ఉంది. నవంబర్ 27 తమిళ టైగర్ల ‘గ్రేట్ హీరోస్ డే.’ మరణించిన తమిళ పోరాటకారుల సంస్మరణ దినం ఒకప్పుడు ఘనంగా వారం రోజుల పాటూ జరిగేది. నేడు పులులూ లేరు, పెద్ద పులి ప్రభాకరనూ లేడు. ఈలం కల యుద్ధ జ్వాలల్లో, యుద్ధానంతర నరమేధ ంలో కరిగిపోయింది. టైగర్లు రాజపక్సను పీడ కలలై వేధిస్తున్నట్టున్నారు. టైగర్ల స్మశాన వాటికలపై పడ్డారు. అక్టోబర్ 19 నుంచి ఇంకా మిగిలి ఉన్న స్మశానాలను నేలమట్టం చేసి, టైగర్ల సమాధులపై సైనిక కట్టడాలను నిర్మించే పని చేయిస్తున్నారు. బిడ్డల సమాధులపై పడి విలపిస్తూ జీవచ్ఛవాల్లా బతికే తమిళ తల్లులకు ఇక ఆపాటి భాగ్యం కూడా ఉండదు. ఒకప్పుడు టైగర్లు మన ప్రభుత్వానికి తమిళుల విముక్తి ప్రదాతలు. 1991లో రాజీవ్‌గాంధీ హత్యకు గురైనప్పటి నుంచి వారు ఉగ్రవాదులు. లంక తమిళులకు మాత్రం వారు ముద్దు బిడ్డలే. బిడ్డలు ఎన్నుకున్న దారి తప్పయినా, ఒప్పయినా నెత్తురు ధారపోసింది తమ కన్నీరు తుడవడానికేగా? ఇది గుర్తించగలిగితే రాజపక్స ప్రభుత్వంలాగే యూపీఏ సర్కారు కూడా తమిళులను అందరినీ ఉగ్రవాదులుగా పరిగణించి వారిపై జరుగుతున్న జాతి అణచివేతకు, అత్యాచారాలకు, హక్కుల హరణకు అడ్డు చెప్పకుండా ఉండదు. ‘ప్రజాస్వామ్య విజయం’ సెప్టెంబర్ 21న జరిగిన ప్రొవిన్షియల్ కౌన్సిల్ ఎన్నికలు ప్రజాస్వామ్య విజయమని ప్రపంచ మీడియా కోడై కూసింది. ఈ ఎన్నికలతో లంక తమిళుల ‘చిరకాల స్వప్నం’ సాకారం కానున్నదని జోస్యాలు చెప్పారు. ఊహించినట్టే గెలిచిన తమిళ్ నేషనల్ ఎలయన్స్ (టీఎన్ఏ) ముఖ్యమంత్రి సీవీ విఘ్నేశ్వరన్ ఆ ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టు కౌన్సిల్ ‘లంకలో భాగంగా ఫెడరల్ స్వభావం గలిగిన స్వయం నిర్ణయాధికార హక్కుకు హామీ’ని కల్పించేది కాదు. ఆయన ప్రభుత్వానికి ఉన్న అధికారాలన్నీ లాంఛనప్రాయమైనవే. అధ్యక్షుడు నియమించే గవర్నర్ చేతిలోనే సకల అధికారాలు ఉంటాయి. ప్రాంతీయ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నయినా తోసిరాజనే అధికారమే కాదు, నిర్ణయాలను తీసుకునే అధికారాలు సైతం గవర్నర్‌కే ఉంటాయి. ‘ఈ అధికారంతో తమిళులకు ఏమీ చేయలేమని మాత్రమే విఘ్నేశ్వరన్ రుజువు చేయగలరు’ అని టీఎన్ఏ ప్రముఖ నేత ఒకరు అన్నారు. లంక అంతర్యుద్ధం చివర్లో లొంగిపోవడానికి వ స్తున్న టైగర్లను పాశవికంగా కాల్చిచంపిన సైన్యపు ైపైశాచికత్వాన్ని, పదిహేనేళ్ల మైనర్ ప్రభాకరన్ కుమారుడు బాలచంద్రన్‌ను కాల్చి చంపిన తీరును ప్రపంచమంతా తప్పు పట్టినా మన ప్రభుత్వం నీళ్లు నములుతూ కూచుంది. ఆ యుద్ధంలో లంక ప్రభుత్వానికి సహాయం అందించామన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఐరాస అభిశంసన తీర్మానం రాజపక్స యుద్ధ నేరాలను దాటవేసి హక్కుల కాలరాచివేతపై చేసిన తీర్మానమే. అయినా దానికి అయిష్టంగానే మన్మోహన్ అంగీరించారు. పిల్లిమొగ్గల విదేశాంగ నీతి 1960లలో మన లంక విధానాన్ని చైనాతో వైరమే శాసిం చింది. తమిళ యునెటైడ్ లిబరేషన్ ఫ్రంట్ వంటి సంస్థలను, అమృతలింగం వంటి ఉదారవాద తమిళ నేతలను లంక జాత్యహంకార, తమిళ అణచివేత విధానాలను ప్రతిఘటించకుండా నిరోధిస్తూవచ్చింది. నేపాల్‌లో నేపా లీ కాంగ్రెస్, కొయిరాలాల ప్రతిష్టను దిగజార్చినట్టే... లంకలో తుల్ఫ్ వంటి పార్లమెంటరీ పార్టీల ప్రతిష్ట దిగజారిపోవడానికి కారణమైంది. తమిళ పార్లమెంటరీ పార్టీలపై విశ్వాసం కోల్పోయిన తమిళులు మిలిటైన్సీ వైపు మొగ్గా రు. వివిధ ఈలం సంస్థలు పుట్టుకొచ్చాయి. ఆ సంస్థలన్నిటికీ ఇందిరాగాంధీ ప్రభుత్వం అనుమతితో తమిళనాడులో ఆశ్రయం లభించింది. ఎల్టీటీఈ అప్రజాస్వామిక, ఆధిపత్యవాద సంస్థగా వృద్ధి చెందుతున్నా విచక్షణారహితంగా దాన్ని సమర్థించారు. 1987లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆనాటి లంక అధ్యక్షుడు జేఆర్ జయవర్థనేతో కలిసి లంక తమిళులకు, ఎల్టీటీఈకి ప్రాతినిధ్యంలేని చర్చల్లో... టైగర్లుసహా మిలిటెంటు సంస్థలన్నీ ఆయుధాలు అప్పగించి స్వయం ప్రతిపత్తిగల ప్రాంతీయ అధికారానికి అంగీకరించేట్టుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారమే ప్రాంతీయ కౌన్సిళ్ల కోసం లంక 13వ రాజ్యాంగ సవరణకు అంగీకరించింది. టైగర్లపై బలవంతంగా రుద్దిన ఆ ఒప్పందాన్ని అమలుచేయడానికి లక్ష మంది సైన్యంతో మనం యుద్ధంలో కూరుకుపోవాల్సి వచ్చింది. 1200 మంది భారత సైనికులను కోల్పోయిన ఆ సైనిక దుస్సాహసం గురించి ఎవరూ పెదవి మెదపరు. నాటి ఒప్పందం ప్రకారం కౌన్సిళ్లకు అధికారాల బదలాయింపు జరగనే లేదు. పైగా ఉన్న అధికారాలను కూడా ఊడబెరికారు. రాజీవ్‌గాంధీ హత్యపట్ల ఆగ్రహాన్ని కనబరచడం సబబే అయినా, టైగర్లను నిర్మూలించచడం తప్ప శాంతికి ప్రత్యామ్నాయాలను అన్వేషించకపోవడం మన్మోహన్ దౌత్య నీతి వైఫల్యమే. ఆ వైఫల్యం కారణంగానే నేటికీ వందలాది మంది తమిళ మహిళలపై సైన్యం అత్యాచారాలు సాగిస్తున్నా, వందలాదిగా యువతీ యువకులను మాయం చేస్తున్నా మనకు పట్టడం లేదు. ప్రభాకరన్ పదిహేనేళ్ల చిన్న కుమారుడు బాలచంద్రన్‌ను దుర్మార్గంగా హతమార్చిన దృశ్యాలను కళ్లకు కట్టిన బ్రిటన్‌కు చెందిన ఛానల్ 4 నేడు తిరిగి లంక సైన్యపు మరో ఘాతుకాన్ని ప్రపంచానికి చూపింది. శోభ (ఇసాయ్ప్రియ) అనే ఎల్టీటీఈ పాత్రికేయురాలిని లంక సైన్యం నిర్బంధించి, చిత్ర హింసల పాలు చేసి చంపేసిన ఘాతుకాన్ని, ఆమె నగ్న మృత దే హం వీడియోను అది బయటపెట్టింది. ఆమెపై లంక సైనికులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని కూడా చెబుతున్నారు. ప్రభాకరన్ కుమార్తె ద్వారక (23) శోభేనని అనుమానాలు బలంగా ఉన్నాయి. ఆ విషయాన్ని తమిళ వర్గాలు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. మనకు అప్రియమైనవైనా వాస్తవాలు ఎప్పటికీ దాగిపోవు. విశ్లేషణ : పిళ్లా వెంకటేశ్వరరావు -
కామన్వెల్త్ సమావేశాలపైకన్నెర్ర
చెన్నై, సాక్షి ప్రతినిధి:శ్రీలంక పట్ల భారత ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిపై తమిళనాడులోని అన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండో రోజైన గురువారం కామన్వెల్త్ సమావేశాలే ప్రధానాంశంగా చర్చకు వచ్చింది. పార్టీలన్నీ శ్రీలంక తమిళుల ప్రయోజనాల విషయంలో ఏకతాటిపై నిలిచి కామన్వెల్త్ను బహిష్కరించాల్సిందేనని పట్టుబట్టాయి. ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీలో ..47..కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపీనాథ్ రెడ్డి ..48..అసెంబ్లీ ప్రాంగణంలో డీఎండీకే ఎమ్మెల్యేలు మాట్లాడారు. ప్రత్యేక ఈలం కోసం పోరాటం చేస్తున్న తమిళ ప్రజలను అణిచివేయాలనే ఏకైక లక్ష్యంతో 2009లో శ్రీలంక ప్రభుత్వం మారణహోమాన్ని సృష్టించిందని ఆరోపించారు. జెనీవా ఒప్పందాన్ని, అందులోని నిబంధనలను తుంగలో తొక్కిన శ్రీలంక ఉన్మాదానికి వేలాదిమంది తమిళులు ప్రాణాలు కోల్పోయారని, లక్షలాది మంది చెట్టుకొకరు, పుట్టకొకరుగా నిరాశ్రయులుగా మిగిలారని ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీలంక సైనికుల దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఈలం తమిళులు చికిత్స పొందుతుండగా ఆస్పత్రులపై సైతం బాంబుల వర్షం కురిపించారని దుయ్యబట్టారు. ఇది పూర్తిగా మానవహక్కుల ఉల్లంఘన కిందికు వస్తుందన్నారు. శ్రీలంక యద్ధ ఉన్మాదాన్ని ఐక్యరాజ్య సమతిలోని సభ్యదేశాల్లో అధిక శాతం తీవ్రంగా ఖండిచాయన్నారు. శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్సేను యుద్ధ ద్రోహిగా పరిగణించి ఐక్యరాజ్య సమితి ముందు దోషిగా నిలబెట్టాలని డిమాండ్ చేశారు. ఈలం తమిళులు శాంతియుతంగా జీవనం సాగించేలా చర్యలు తీసుకోవాలని, శ్రీలంక దేశంపై ఆర్థిక నిషేధం విధించాలని కోరారు. ఇవే డిమాండ్లపై భారత్ ఐక్యరాజ్య సమితిపై ఒత్తిడి తేవాలని కోరుతూ 2011లో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశానని, అదేవిధంగా అసెంబ్లీ తీర్మానం ద్వారా విన్నవించామని పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రధాన మంత్రి సాధారణంగా తీసుకోవడమే కాకుండా పరిశీలిస్తానని ముక్తసరిగా సమాధానం ఇవ్వడం బాధాకరమని తెలిపారు. తమిళనాడు ప్రజల మనోభావాలను ప్రధాని గౌరవించడం లేదని ఆరోపించారు. కొద్దిశాతం మాత్రమే తమిళ జనాభా కలిగిన కెనెడా దేశం సైతం కామన్వెల్త్ సమావేశాలపై ఒక నిర్ణయానికి వచ్చిందన్నారు. 8 కోట్ల తమిళ జనాభాను కలిగి ఉన్న భారత ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపక పోవడం దురదృష్టకరమని దుయ్యబట్టారు. శ్రీలంకలో నవంబర్ 15వ తేదీన నిర్వహిస్తున్న కామన్వెల్త్ మహానాడును భారత్ బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రవేశపెడుతున్న తీర్మానానికి మానవతా ధృక్ఫథంతో మద్దతుపలకాలని జయ కోరారు. డీఎంకే తరపున స్టాలిన్, కాంగ్రెస్ తరపున గోపీనాథ్ రెడ్డి, డీఎండీకే తరపున బన్రూటి రామచంద్రన్, సీపీఐ తరపున ఆర్ముగం, ఇతర పార్టీలకు చెందిన సభ్యులంతా శ్రీలంక వైఖరిని, కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ ప్రసంగించారు. ముఖ్యమంత్రి జయలలిత ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని సభలోని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ ఉదయం 10.47 గంటలకు సచివాలయానికి వచ్చి అసెంబ్లీ రిజిస్టరులో సంతకం చేశారు. ఐదు నిమిషాలు మాత్రమే అక్కడ గడిపి వెళ్లిపోయారు. -
బహిష్కరించాల్సిందే
= కామన్వెల్త్ సమావేశాలపై తమిళపార్టీల కన్నెర్ర = తమిళనాడు అసెంబ్లీలో ఉద్వేగ భరిత చర్చ = పార్టీలకు అతీతంగా ఏకగ్రీవ తీర్మానం చెన్నై, సాక్షి ప్రతినిధి : శ్రీలంక పట్ల భారత ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిపై తమిళనాడులోని అన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండో రోజైన గురువారం కామన్వెల్త్ సమావేశాలే ప్రధానాంశంగా చర్చకు వచ్చింది. పార్టీలన్నీ శ్రీలంక తమిళుల ప్రయోజనాల విషయంలో ఏకతాటిపై నిలిచి కామన్వెల్త్ను బహిష్కరించాల్సిందేనని పట్టుబట్టాయి. ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీలో మాట్లాడారు. ప్రత్యేక ఈలం కోసం పోరాటం చేస్తున్న తమిళ ప్రజలను అణిచివేయాలనే ఏకైక లక్ష్యంతో 2009లో శ్రీలంక ప్రభుత్వం మారణహోమాన్ని ృష్టించిందని ఆరోపించారు. జెనీవా ఒప్పందాన్ని, అందులోని నిబంధనలను తుంగలో తొక్కిన శ్రీలంక ఉన్మాదానికి వేలాదిమంది తమిళులు ప్రాణాలు కోల్పోయారని, లక్షలాది మంది చెట్టుకొకరు, పుట్టకొకరుగా నిరాశ్రయులుగా మిగిలారని ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీలంక సైనికుల దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఈలం తమిళులు చికిత్స పొందుతుండగా ఆస్పత్రులపై సైతం బాంబుల వర్షం కురిపించారని దుయ్యబట్టారు. ఇది పూర్తిగా మానవహక్కుల ఉల్లంఘన కిందికు వస్తుందన్నారు. శ్రీలంక యద్ధ ఉన్మాదాన్ని ఐక్యరాజ్య సమతిలోని సభ్యదేశాల్లో అధిక శాతం తీవ్రంగా ఖండిచాయన్నారు. శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్సేను యుద్ధ ద్రోహిగా పరిగణించి ఐక్యరాజ్య సమితి ముందు దోషిగా నిలబెట్టాలని డిమాండ్ చేశారు. ఈలం తమిళులు శాంతియుతంగా జీవనం సాగించేలా చర్యలు తీసుకోవాలని, శ్రీలంక దేశంపై ఆర్థిక నిషేధం విధించాలని కోరారు. ఇవే డిమాండ్లపై భారత్ ఐక్యరాజ్య సమితిపై ఒత్తిడి తేవాలని కోరుతూ 2011లో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశానని, అదేవిధంగా అసెంబ్లీ తీర్మానం ద్వారా విన్నవించామని పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రధాన మంత్రి సాధారణంగా తీసుకోవడమే కాకుండా పరిశీలిస్తానని ముక్తసరిగా సమాధానం ఇవ్వడం బాధాకరమని తెలిపారు. తమిళనాడు ప్రజల మనోభావాలను ప్రధాని గౌరవించడం లేదని ఆరోపించారు. కొద్దిశాతం మాత్రమే తమిళ జనాభా కలిగిన కెనెడా దేశం సైతం కామన్వెల్త్ సమావేశాలపై ఒక నిర్ణయానికి వచ్చిందన్నారు. 8 కోట్ల తమిళ జనాభాను కలిగి ఉన్న భారత ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపక పోవడం దురదృష్టకరమని దుయ్యబట్టారు. శ్రీలంకలో నవంబర్ 15వ తేదీన నిర్వహిస్తున్న కామన్వెల్త్ మహానాడును భారత్ బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రవేశపెడుతున్న తీర్మానానికి మానవతా ధృక్ఫథంతో మద్దతుపలకాలని జయ కోరారు. డీఎంకే తరపున స్టాలిన్, కాంగ్రెస్ తరపున గోపీనాథ్ రెడ్డి, డీఎండీకే తరపున బన్రూటి రామచంద్రన్, సీపీఐ తరపున ఆర్ముగం, ఇతర పార్టీలకు చెందిన సభ్యులంతా శ్రీలంక వైఖరిని, కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ ప్రసంగించారు. ముఖ్యమంత్రి జయలలిత ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని సభలోని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ ఉదయం 10.47 గంటలకు సచివాలయానికి వచ్చి అసెంబ్లీ రిజిస్టరులో సంతకం చేశారు. ఐదు నిమిషాలు మాత్రమే అక్కడ గడిపి వెళ్లిపోయారు. -
కామన్వెల్త్ ఉద్యమానికి తమిళ సంఘాల కసరత్తు
శ్రీలంకలో కామన్వెల్త్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరో ఉద్యమం జీవం పోసుకోనుంది. ఉద్యమం దిశగా ఈలం మద్దతు తమిళాభిమాన సంఘాలు తలమునకలయ్యాయి. సమావేశాలను భారత్ బహిష్కరించాల్సిందేనని రాజకీయ పక్షాలన్నీ గళం విప్పాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకుం టారోనన్న ఉత్కంఠ నెలకొంది. సాక్షి, చెన్నై: శ్రీలంకలో ఈలం తమిళుల్ని యుద్ధం పేరుతో మట్టు బెడుతున్న సమయంలో తమిళనాట ఆగ్రహం పెల్లుబికింది. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను అంతర్జాతీయ న్యాయస్థానం బోనులో నిలబెట్టడం లక్ష్యంగా మహోద్యమం సాగింది. ఐక్యరాజ్యసమితిలో అమెరికా తీర్మానం నెగ్గినా ఈలం తమిళులకు ఒరిగింది శూన్యమని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ తీరుపై తమిళనాడులోని ఈలం మద్దతు సంఘాలు, పార్టీలు గుర్రుగా ఉన్నాయి. ఈలం తమిళులకు సమాన అవకాశాలు కల్పించాలన్న నినాదంతో ఉద్యమిస్తున్నాయి. నవంబర్‌లో సమావేశాలు శ్రీలంకలో నవంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు కామన్వెల్త్ సమావేశాలు జరగనున్నాయి. కామన్వెల్త్ దేశాల్లో భారత్ సైతం ఉంది. ఇక్కడి నుంచి ప్రధాని మన్మోహన్ సింగ్ లేదా ఆయన దూత సమావేశాలకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఈ సమావేశాలను భారత్ బహిష్కరించాలన్న నినాదం రాష్ట్రంలో ఊపందుకుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, డీఎండీకే అధినేత విజయకాంత్, ఎండీఎంకే నేత వైగో, పీఎంకే నేత రాందాసు, వీసీకే నేత తిరుమావలన్, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, ఎస్ఎంకే నేత శరత్‌కుమార్ గళం విప్పారు. అలాగే ఈలం మద్దతు సంఘాలు, తమిళాభిమాన సంఘా లు నిరసన తెలిపాయి. సమావేశాలకు ఇంకా సమయం ఉన్న దృష్ట్యా కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడ లేదు. స్థానిక కాంగ్రెస్ నేతల మాత్రం దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. ప్రధానికి ఆహ్వానం శ్రీలంక విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సి.ఎల్.పెరిస్ సోమవారం ఢిల్లీకి వచ్చారు. కామన్వెల్త్ సమావేశాలకు రావాలంటూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో ప్రధానిపై ఒత్తిడి పెంచే దిశగా తమిళాభిమాన సంఘాలు, రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే నిరసనకు డీఎంకే పిలుపునిచ్చింది. మిగిలిన పక్షాలూ అదేబాటలో పయనించేందుకు సమాయత్తం అవుతున్నాయి. నల్లజెండాల ప్రదర్శన, రైల్‌రోకో, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఉభయసభల్లో ఫైట్ శ్రీలంక ఆహ్వానాన్ని తిరస్కరించాలంటూ ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, డీఎండీకే అధినేత విజయకాంత్‌లు ప్రధాని మన్మోహన్ సింగ్‌ను డిమాండ్ చేశారు. ఈలం తమిళుల సమస్య, జాలర్లపై దాడుల్ని ఎత్తి చూపుతూ సమావేశాల్ని బహిష్కరించాల్సిందేనని లేఖాస్త్రాలు సంధించారు. ఈ వివాదం ఉభయ సభలనూ సోమవారం తాకింది. కామన్వెల్త్ సమావేశాలకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే, డీఎంకే, సీపీఐ రాజ్యసభలో గళం విప్పాయి. అన్నాడీఎంకే సభ్యుడు మైత్రేయన్, డీఎంకే సభ్యురాలు కనిమొళి, సీపీఐ సభ్యుడు రాజా కేంద్రంపై విరుచుకుపడ్డారు. అలాగే లోక్‌సభలోనూ ఈ అంశం తెరపైకి వచ్చింది. మొత్తం మీద ప్రధాని మన్మోహన్ సింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.