దగాపడ్డ లంక తమిళులు | Manmohan singh considers Commonwealth summit boycott | Sakshi
Sakshi News home page

దగాపడ్డ లంక తమిళులు

Published Sat, Nov 2 2013 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM

దగాపడ్డ లంక తమిళులు

దగాపడ్డ లంక తమిళులు

అర్థరహితమైన చర్చలను రేకెత్తించి అనర్థదాయకమైన విధానాలను కప్పిపుచ్చుకోవచ్చు. శ్రీలంకలో ఈ నెల 15-17 తేదీలలో జరగనున్న కామన్‌వెల్త్ దేశాధినేతల (చోమ్) సమావేశానికి ప్రధాని మన్మోహన్‌సింగ్ హాజరు కావాలా? వద్దా? అంటూ సాగుతున్న అర్థరహితమైన చర్చే అందుకు నిదర్శనం. లంక అధ్యక్షుడు మహీందా రాజపక్స చైనా బుట్టలో పడకుండా చూడాలంటే మన్మోహన్ చోమ్ సమావేశాలకు హాజరు కాకతప్పదని కొందరి వాదన. 2014 ఎన్నికల వైతరణిని దాటాలంటే తమిళనాడు ప్రజల సెంటిమెంట్‌ను నిర్లక్ష్యం చేయరాదనేది మరో వాదన. ఇది ఎన్నికల సీజన్ వాదన కాగా, మొదటిది ‘చైనా ఫోబియా’ (భయం జబ్బు) నుంచి పుట్టుకొచ్చిన వాదన.

 

యూపీఏ ప్రభుత్వానికిగానీ, తమిళ ఛాంపియన్‌లైన డీఎంకే, అన్నా డీఎంకేలకుగానీ లంక తమిళుల సంక్షేమంపై కంటే అధికార సోపానాలను ఎక్కడంపైనే శ్రద్ధ. రెండు వందల ఏళ్ల బ్రిటన్ వలసవాద ఊడిగానికి సంకేతమైన చోమ్ ఒక నిరర్థక సంస్థ. రెండేళ్లకోసారి పెట్టే ఆ తద్దినానికి వెడితే ఒరిగేదీ లేదు. వెళ్లకపోతే పోయేదీ లేదు. రాజపక్సే కాదు దాదాపు లంక అధ్యక్షులందరూ భారత్‌ను బుట్టలో పెట్టగలవారే తప్ప మరెవరి బుట్టలోనూ పడే బాపతు కాదు.  నేటి మన లంక విధానం రాజపక్స బుట్టలోనే ఉంది.  కాబట్టే ఉగ్రవాదంపై యుద్ధం పేరిట ఒకప్పుడు మనం పెంచి పోషించిన వేర్పాటువాద తమిళ టైగర్లపై నిర్మూలనా యుద్ధాన్ని పరోక్షంగా సమర్థించాల్సి వచ్చింది. నేడు లంక తమిళులపై సాగుతున్న అమానుష జాతి అణచివేతను, హక్కుల ఉల్లంఘనను చూసీ చూడనట్టు నటించాల్సి వస్తోంది.

మన్మోహన్నాటకం
తమిళ టైగర్లపై యుద్ధంలో (2009) లంక సైన్యం తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది మార్చిలో అభిశంసన తీర్మానం ఆమోదించింది. ఆ సమావేశాలకు ముందు కూడా నేటిలాగే రచ్చ జరిగింది. అది కూడా ఎన్నికల కాలమే... మొసలి కన్నీళ్లు కార్చిన కాలమే. అయినా  ఆనాడు మన్మోహన్ ‘ద్రవిడ పార్టీలకు,’ ‘తమిళ దురహంకారానికి’ లొంగిపోడానికి సిద్ధంగా లేనని పదేపదే ప్రకటనలు గుప్పించారు. చివరికి అభిశంసనకు అనుకూలంగా ఓటు వేశారు. నేడు ఆయన ఎలాంటి ప్రకటనలు చేయకుండా గుంభనంగా ఉన్నారు. ‘ద్రవిడ పార్టీలకు లొంగిపోతారో లేదో’ వేచి చూడాలి. ప్రధాని చోమ్ సమావేశాలకు వెళ్లడంపై ఇక్కడ చర్చ సాగుతుండగా లంక సైన్యం తమిళ టైగర్ల సమాధులను నేలమట్టం చేసే పనిలో మునిగి ఉంది.

నవంబర్ 27 తమిళ టైగర్ల ‘గ్రేట్ హీరోస్ డే.’ మరణించిన తమిళ పోరాటకారుల సంస్మరణ దినం ఒకప్పుడు ఘనంగా వారం రోజుల పాటూ జరిగేది. నేడు  పులులూ లేరు, పెద్ద పులి ప్రభాకరనూ లేడు. ఈలం కల యుద్ధ జ్వాలల్లో, యుద్ధానంతర నరమేధ ంలో కరిగిపోయింది. టైగర్లు రాజపక్సను పీడ కలలై వేధిస్తున్నట్టున్నారు. టైగర్ల స్మశాన వాటికలపై పడ్డారు. అక్టోబర్ 19 నుంచి ఇంకా మిగిలి ఉన్న స్మశానాలను నేలమట్టం చేసి, టైగర్ల సమాధులపై సైనిక కట్టడాలను నిర్మించే పని చేయిస్తున్నారు. బిడ్డల సమాధులపై పడి విలపిస్తూ జీవచ్ఛవాల్లా బతికే తమిళ తల్లులకు ఇక ఆపాటి భాగ్యం కూడా ఉండదు. ఒకప్పుడు టైగర్లు మన ప్రభుత్వానికి తమిళుల విముక్తి ప్రదాతలు. 1991లో రాజీవ్‌గాంధీ హత్యకు గురైనప్పటి నుంచి వారు ఉగ్రవాదులు.  లంక తమిళులకు మాత్రం వారు ముద్దు బిడ్డలే. బిడ్డలు ఎన్నుకున్న దారి తప్పయినా, ఒప్పయినా నెత్తురు ధారపోసింది తమ కన్నీరు తుడవడానికేగా? ఇది గుర్తించగలిగితే రాజపక్స ప్రభుత్వంలాగే యూపీఏ సర్కారు కూడా తమిళులను అందరినీ ఉగ్రవాదులుగా పరిగణించి వారిపై జరుగుతున్న జాతి అణచివేతకు, అత్యాచారాలకు, హక్కుల హరణకు అడ్డు చెప్పకుండా ఉండదు.
 
 ‘ప్రజాస్వామ్య విజయం’
 సెప్టెంబర్ 21న జరిగిన ప్రొవిన్షియల్ కౌన్సిల్ ఎన్నికలు ప్రజాస్వామ్య విజయమని ప్రపంచ మీడియా కోడై కూసింది. ఈ ఎన్నికలతో లంక తమిళుల ‘చిరకాల స్వప్నం’ సాకారం కానున్నదని జోస్యాలు చెప్పారు. ఊహించినట్టే గెలిచిన తమిళ్ నేషనల్ ఎలయన్స్ (టీఎన్‌ఏ) ముఖ్యమంత్రి సీవీ విఘ్నేశ్వరన్ ఆ ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టు కౌన్సిల్ ‘లంకలో భాగంగా ఫెడరల్ స్వభావం గలిగిన స్వయం నిర్ణయాధికార హక్కుకు హామీ’ని కల్పించేది కాదు. ఆయన ప్రభుత్వానికి ఉన్న అధికారాలన్నీ లాంఛనప్రాయమైనవే. అధ్యక్షుడు నియమించే గవర్నర్ చేతిలోనే సకల అధికారాలు ఉంటాయి. ప్రాంతీయ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నయినా తోసిరాజనే అధికారమే కాదు, నిర్ణయాలను తీసుకునే అధికారాలు సైతం గవర్నర్‌కే ఉంటాయి. ‘ఈ అధికారంతో తమిళులకు ఏమీ చేయలేమని మాత్రమే విఘ్నేశ్వరన్ రుజువు చేయగలరు’ అని టీఎన్‌ఏ ప్రముఖ నేత ఒకరు అన్నారు. లంక అంతర్యుద్ధం చివర్లో లొంగిపోవడానికి వ స్తున్న టైగర్లను పాశవికంగా కాల్చిచంపిన  సైన్యపు ైపైశాచికత్వాన్ని, పదిహేనేళ్ల మైనర్ ప్రభాకరన్ కుమారుడు బాలచంద్రన్‌ను కాల్చి చంపిన తీరును ప్రపంచమంతా తప్పు పట్టినా మన ప్రభుత్వం నీళ్లు నములుతూ కూచుంది. ఆ యుద్ధంలో లంక ప్రభుత్వానికి సహాయం అందించామన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఐరాస అభిశంసన తీర్మానం రాజపక్స యుద్ధ నేరాలను దాటవేసి హక్కుల కాలరాచివేతపై చేసిన తీర్మానమే. అయినా దానికి అయిష్టంగానే మన్మోహన్ అంగీరించారు.
 
 పిల్లిమొగ్గల విదేశాంగ నీతి

 1960లలో మన లంక విధానాన్ని చైనాతో వైరమే శాసిం చింది. తమిళ యునెటైడ్ లిబరేషన్ ఫ్రంట్ వంటి సంస్థలను, అమృతలింగం వంటి ఉదారవాద తమిళ నేతలను లంక జాత్యహంకార, తమిళ అణచివేత విధానాలను ప్రతిఘటించకుండా నిరోధిస్తూవచ్చింది. నేపాల్‌లో నేపా లీ కాంగ్రెస్, కొయిరాలాల ప్రతిష్టను దిగజార్చినట్టే... లంకలో తుల్ఫ్ వంటి పార్లమెంటరీ పార్టీల ప్రతిష్ట దిగజారిపోవడానికి కారణమైంది. తమిళ పార్లమెంటరీ పార్టీలపై విశ్వాసం కోల్పోయిన తమిళులు మిలిటైన్సీ వైపు మొగ్గా రు. వివిధ ఈలం సంస్థలు పుట్టుకొచ్చాయి. ఆ సంస్థలన్నిటికీ ఇందిరాగాంధీ ప్రభుత్వం అనుమతితో తమిళనాడులో ఆశ్రయం లభించింది. ఎల్‌టీటీఈ అప్రజాస్వామిక, ఆధిపత్యవాద సంస్థగా వృద్ధి చెందుతున్నా విచక్షణారహితంగా దాన్ని సమర్థించారు. 1987లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆనాటి లంక అధ్యక్షుడు జేఆర్ జయవర్థనేతో కలిసి లంక తమిళులకు, ఎల్‌టీటీఈకి ప్రాతినిధ్యంలేని చర్చల్లో... టైగర్లుసహా మిలిటెంటు సంస్థలన్నీ ఆయుధాలు అప్పగించి స్వయం ప్రతిపత్తిగల ప్రాంతీయ అధికారానికి అంగీకరించేట్టుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారమే ప్రాంతీయ కౌన్సిళ్ల కోసం లంక 13వ రాజ్యాంగ సవరణకు అంగీకరించింది. టైగర్లపై బలవంతంగా రుద్దిన ఆ ఒప్పందాన్ని అమలుచేయడానికి లక్ష మంది సైన్యంతో మనం యుద్ధంలో కూరుకుపోవాల్సి వచ్చింది.

1200 మంది భారత సైనికులను కోల్పోయిన ఆ  సైనిక దుస్సాహసం గురించి ఎవరూ పెదవి మెదపరు. నాటి ఒప్పందం ప్రకారం కౌన్సిళ్లకు అధికారాల బదలాయింపు జరగనే లేదు. పైగా ఉన్న అధికారాలను కూడా ఊడబెరికారు. రాజీవ్‌గాంధీ హత్యపట్ల ఆగ్రహాన్ని కనబరచడం సబబే అయినా, టైగర్లను నిర్మూలించచడం తప్ప శాంతికి ప్రత్యామ్నాయాలను అన్వేషించకపోవడం మన్మోహన్ దౌత్య నీతి వైఫల్యమే. ఆ వైఫల్యం కారణంగానే నేటికీ వందలాది మంది తమిళ మహిళలపై సైన్యం అత్యాచారాలు సాగిస్తున్నా, వందలాదిగా యువతీ యువకులను మాయం చేస్తున్నా మనకు పట్టడం లేదు. ప్రభాకరన్ పదిహేనేళ్ల చిన్న కుమారుడు బాలచంద్రన్‌ను దుర్మార్గంగా హతమార్చిన దృశ్యాలను కళ్లకు కట్టిన బ్రిటన్‌కు చెందిన ఛానల్ 4 నేడు తిరిగి లంక సైన్యపు మరో ఘాతుకాన్ని ప్రపంచానికి చూపింది. శోభ (ఇసాయ్‌ప్రియ) అనే ఎల్‌టీటీఈ పాత్రికేయురాలిని లంక సైన్యం నిర్బంధించి, చిత్ర హింసల పాలు చేసి చంపేసిన ఘాతుకాన్ని, ఆమె నగ్న మృత దే హం వీడియోను అది బయటపెట్టింది. ఆమెపై లంక సైనికులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని కూడా చెబుతున్నారు. ప్రభాకరన్ కుమార్తె ద్వారక (23) శోభేనని అనుమానాలు బలంగా ఉన్నాయి. ఆ విషయాన్ని తమిళ వర్గాలు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. మనకు అప్రియమైనవైనా వాస్తవాలు ఎప్పటికీ దాగిపోవు.    
 
 విశ్లేషణ :  పిళ్లా వెంకటేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement