‘చోగమ్’కు మన్మోహన్ గైర్హాజరు
న్యూఢిల్లీ/కొలంబో: కొలంబోలో ఏర్పాటైన కామన్ వెల్త్ ప్రభుత్వాధినేతల (చోగమ్) సమావేశాలకు వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తూ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సకు లేఖ రాశారు. కొలంబోలోని భారత దౌత్య కార్యాలయం ఈ లేఖను రాజపక్సకు అందజేసింది. ఈ సమావేశాలకు తాను వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నా, తన తరఫున విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రాతినిధ్యం వహిస్తారని ప్రధాని మన్మోహన్ తన లేఖలో పేర్కొన్నారు. ‘చోగమ్’ విషయమై దౌత్యపరమైన ప్రక్రియ పూర్తయిందని విదేశాంగ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు. రాజపక్సకు ప్రధాని మన్మోహన్ రాసిన లేఖలోని అంశాలను అధికారికంగా వెల్లడించకపోయినా, గైర్హాజరుపై ప్రధాని ఇందులో కారణాలను వివరించలేదని తెలుస్తోంది.
మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డ శ్రీలంకలో ఏర్పాటవుతున్న ‘చోగమ్’ సమావేశాలకు ప్రధాని వెళ్లరాదంటూ తమిళనాడు రాజకీయ పార్టీలతో పాటు కాంగ్రెస్‌లోని ఒక వర్గం నుంచి డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో, చివరకు ఈ సమావేశాలకు హాజరు కారాదని ప్రధాని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో తలెత్తుతున్న నిరసనల నేపథ్యంలోనే ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఖుర్షీద్ చెప్పారు. కొలంబోలో ఈనెల 15-16 తేదీల్లో జరగనున్న ఈ సమావేశాలకు విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ హాజరు కానున్నారు. ప్రధాని మన్మోహన్ ఈ సమావేశాలకు హాజరు కారాదని నిర్ణయించుకోవడంపై తమిళనాడు ప్రజలు సంతృప్తి చెందగలరని కేంద్ర మంత్రి నారాయణస్వామి అన్నారు. ఇదిలా ఉండగా, 54 దేశాల ‘చోగమ్’ దేశాధినేతల సమావేశాల కోసం శ్రీలంక ఆదివారం నుంచి ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స కొత్తగా నిర్మించిన సమావేశ మందిరంలో యువజన వేదికను ప్రారంభించారు. కామన్‌వెల్త్ సభ్యదేశాలు కాని చైనా, అమెరికా, జపాన్, బ్రెజిల్ ప్రతినిధులు కూడా కామన్‌వెల్త్ బిజినెస్ ఫోరంలో పాల్గొననున్నారు.