శ్రీలంక అధ్యక్ష పదవికి 35 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో పోటీ ఆసక్తిగా మారింది. గత కొన్నాళ్లుగా కల్లోల, సంక్షోభ పరిస్థితులు నెలకొన్న శ్రీలంకలో ఈ ఎన్నికల ద్వారా శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని రాజకీయ పరిశీలకులు, ప్రజలు భావించారు. కానీ శనివారం ఉదయం మైనారిటీ వర్గానికి చెందిన ముస్లింలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్న వంద బస్సులపై కొలంబోకు 240 కిలోమీటర్ల దూరంలోని తంతిరిమలే వద్ద ఓ గుర్తు తెలియని సాయుధుడు కాల్పులు జరపగా, మరో చోట ఓ గుంపు రాళ్లు రువ్వింది. ఈ సంఘటనల్లో ఎవరు గాయపడలేదని అధికారిక వర్గాలు తెలిపాయి.
గతేడాది దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, దేశ ప్రధానిని తొలగించి మహింద రాజపక్సను ప్రధానిగా నియమించడంతో మూడు నెలల పాటు దేశంలో రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏప్రిల్ నెలలో లంకలోని చర్చ్‌లు లక్ష్యంగా జరిగిన బాంబు దాడుల్లో ఇద్దరు ఆస్ట్రేలియన్లు సహా 250 మంది మరణించారు. ఈ ఘోరాన్ని ఆపలేకపోయినందుకు దేశాధ్యక్షుడు సిరిసేనను పార్లమెంట్ నివేదిగా నిందితుడిగా పేర్కొంది. ఆ తర్వాత ముస్లింలను విచక్షణారహితంగా అరెస్ట్‌లు చేసి నిర్బంధించడాన్ని కూడా నిందించింది. పైగా ఆయన గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేక పోయారు. అందుకని ఆయనగానీ, మహింద రాజపక్సగానీ పోటీ చేయడం లేదు.
మహింద రాజపక్స సోదరుడు గోటబయ రాజపక్స ప్రతిపక్ష పార్టీ ‘శ్రీలంక పోడుజన పెరమున’ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. గతంలో రక్షణ మంత్రిగా పనిచేసిన గోటబయ రాజపక్స 2009లో ఎల్‌టీటీఈని నిర్మూలించి 26 ఏళ్ల అంతర్యుద్ధానికి తెరదించినందకు ‘జాతీయ హీరో’గా నీరాజనాలు అందుకున్నారు. అయితే ఆయనకు తమిళులు, ముస్లింలలో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఆయనకు ప్రధాన ప్రత్యర్థి మాజీ దేశాధ్యక్షుడు రణసింగే ప్రేమదాస కుమారుడు రజిత్ ప్రేమదాస. ఆయన పాలకపక్ష ‘యునైటెడ్ నేషనల్ పార్టీ’ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరి మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ రాజపక్స గెలిచే అవకాశాలే కొంచెం ఎక్కువ ఉన్నాయని ఎన్నికల పరిశీలకు అంచనా వేశారు.
1.6 కోట్ల మంది ఓటర్లున్న నేటి ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు పోటీ చేయడం ఓ విశేషం. వారిలో నలుగురు ముస్లిం అభ్యర్థులు, ఇద్దరు బౌద్ధ సన్యాసులు ఉండగా, ఒక్క మహిళ పోటీలో ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధించాలన్న 50 శాతానికి మించి ఓట్లు రావాల్సి ఉంటుంది. పోలింగ్ ముగిశాక ఈ రోజే ఓట్ల లెక్కంపు మొదలవుతుంది. అర్ధరాత్రికి మొదటి ఫలితం, సోమవారం మధ్యహ్నానికి తుది ఫలితాలు వెలువడుతాయి.
Comments
Please login to add a commentAdd a comment