వెంటాడుతున్న హక్కుల ఉల్లంఘనలు!
శ్రీలంకలో నేటి నుంచి ‘చోగమ్’
కొలంబొ: తమిళుల విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో పాటు కెనడా, మారిషస్‌ల ప్రధానుల గైర్హాజరు నేపథ్యంలో కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సదస్సు (చోగమ్) శుక్రవారం నాడిక్కడ ప్రారంభం కానుంది. ఎల్టీటీఈపై యుద్ధం సందర్భంగా స్థానిక తమిళులపై కొనసాగిన అకృత్యాలపై అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడం, యుద్ధ నేరాలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలనే డిమాండ్ల నేపథ్యంలో.. 53 సభ్య దేశాలతో కూడిన చోగమ్ నిర్వహణకు లభించిన అవకాశాన్ని శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్స చేజార్చుకోలేదు.
ఎల్టీటీఈని తుడిచిపెట్టిన తర్వాత గత నాలుగేళ్లలో నెలకొన్న శాంతియుత వాతావరణాన్ని ప్రపంచానికి చాటేందుకు మూడురోజుల పాటు సాగే చోగమ్ సదస్సు మంచి అవకాశంగా ఆయన భావించారు. అందుకనే భారత ప్రధాని గైరుహాజరును సైతం పెద్దగా పట్టించుకోవడం లేదన్నట్టుగా చెప్పేందుకు యత్నించారు. భారత్‌కు ప్రాతి నిధ్యం వహిస్తున్న విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ రాకతో తాను సంతృప్తి చెందుతున్నట్టు రాజపక్స చెప్పారు. తమిళనాడు నుంచి వచ్చిన బలమైన ఒత్తిళ్ల నేపథ్యంలో చోగమ్‌కు హాజరుకారాదని మన్మోహన్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.