Salman Khurshid
-
మాట జారిన ఖుర్షీద్!.. రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్ ఖర్గే అంటూ బీజేపీ సెటైర్లు..
దేశంలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇటీవలి కాలంలో జరిగిన ఎన్నికల్లో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ డిపాజిట్‌ను సైతం కోల్పోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు పార్టీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గాంధీ ఫ్యామిలీ దూరంగా ఉండి.. ఎన్నికలు నిర్వహించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ చీఫ్‌గా సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. అయితే, తాజాగా కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. కాగా, సల్మాన్ ఖుర్షీద్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ గాంధీ కుటుంబీకులే నేతృత్వం వహిస్తున్నారని స్పష్టం చేశారు. తమ పార్టీలో చాలా మంది నేతలున్నా కీలక నేతలు మాత్రం గాంధీ కుటుంబీకులేనని చెప్పారు. మల్లికార్జున ఖర్గే.. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడని, పార్టీని సంస్ధాగతంగా పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పుకొచ్చారు. ఇక, సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను రిమోట్ కంట్రోల్ అధ్యక్షుడిగా బీజేపీ పేర్కొంది. ఈ క్రమంలో బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటీయా స్పందిస్తూ.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరున్నా నిర్ణయాలు తీసుకునే అధికారం మాత్రం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు మాత్రమే ఉంటుంది. అందుకే ఖర్గేను.. రిమోట్ కంట్రోల్ ప్రెసిడెంట్ అని పిలవాలా?.. లేక రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్ అనాలా అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. -
రాహుల్ రాముడంతటి వాడు: ఖుర్షీద్
మొరాదాబాద్/న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ రామునితో పోలుస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ పొగడ్తలతో ముంచెత్తారు. కాంగ్రెస్ కార్యకర్తలను భరతునితో పోల్చారు. మొరాదాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘మేం చలికి గజగజ వణుకుతుంటే రాహుల్ కేవలం టీషర్టు ధరించి జోడో యాత్ర కొనసాగిస్తున్నారు. ఆయన నిజంగా సూపర్‌మ్యాన్. తదేక లక్ష్యం కోసం తపస్సు చేస్తున్న యోగి’’ అన్నారు. ‘‘రాముడి పాదుకలు చాలా దూరం వెళ్లాయి. వాటిని భరతుడు (కాంగ్రెస్ కార్యకర్తలు) ఉత్తరప్రదేశ్ అంతటికీ చేరవేస్తారు’ అన్నారు. మనోభావాలు దెబ్బతీశారు: బీజేపీ ఖుర్షీద్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ‘‘వేలకోట్ల నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో బెయిల్ మీద బయటికొచ్చిన రాహుల్‌ను రాముడితో పోల్చడం దారుణం. దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు కాంగ్రెస్ కుటుంబం క్షమాపణ చెప్పాల్సిందే. కాంగ్రెస్ నేతలు కుటుంబ ఆరాధనకు అంకితమై అది దైవభక్తి, దేశభక్తి కంటే మించినదనే భ్రమల్లో బతుకుతున్నారు’’ అని బీజేపీ అధికార ప్రతినిధులు గౌరవ్ భాటియా, షెహజాద్ పూనావాలా అన్నారు. -
విద్వేష ప్రసంగాలపై సీజేఐకి 76 మంది లాయర్ల లేఖ
న్యూఢిల్లీ: ఢిల్లీ, హరిద్వార్‌లలో ఇటీవల జరిగిన ధర్మసంసద్ల సందర్భంగా పలువురి విద్వేషపూరిత ప్రసంగాలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ ఎన్వీ రమణకు 75మంది న్యాయవాదులు లేఖ రాశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రసంగించిన వారు సమాజంలో విద్వేషాలను ప్రేరేపించడమే కాదు, ఒక మతానికి చెందిన వారందరినీ చంపేయాలని బహిరంగంగా పిలుపునిచ్చారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ప్రసంగాలు దేశ సమగ్రత, ఐక్యతలకు గొడ్డలిపెట్టుగా మారడమే కాదు, లక్షలాది ముస్లిం పౌరుల జీవితాలను ప్రమాదంలో పడవేశాయన్నారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో సీనియర్ లాయర్లు సల్మాన్ ఖుర్షీద్, దుష్యంత్ దవే, మీనాక్షి అరోరా ఉన్నారు. -
కాంగ్రెస్‌ను పెంచగలిగే పంచాక్షరి!
చైతన్యవంతమైన సమాజంలో మెజార్టీ వర్గం... సమస్యలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న మైనార్టీ వర్గాలకు రక్షణగా నిలవాలి. భారతీయ విలువలు కూడా ఇదే విషయాన్ని చెబుతాయి. కాబట్టి సెక్యులరిజం విషయంలో సాధికారత కలిగిన కాంగ్రెస్ ఆ విషయాన్ని మరోసారి ప్రపంచానికి గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది. బీజేపీ హిందుత్వ వాదనలోని డొల్లతనాన్ని మౌలిక ప్రశ్నలతో ఎండగట్టాలి. అదే ఆ పార్టీని తిరిగి దేశ ప్రజలకు చేరువ చేస్తుంది. మెజార్టీ హిందువుల మద్దతు లేకుండా కాంగ్రెస్ దేశాన్ని అత్యధిక కాలం పాలించగలిగేది కాదని గుర్తించాలి. భారత్‌లో ప్రస్తుతం ఉన్నది హిందూ–ముస్లిం సమస్య కాదు. మానవత్వానికి సంబంధించినది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) హిందుత్వ అన్న పదం వినపడిన వెంటనే ఇంతెత్తున లేస్తూంటాయి. మరీ ముఖ్యంగా వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ హిందుత్వ పోకడలను దునుమాడిననప్పుడల్లా బీజేపీ, ఆర్ఎస్ఎస్ల కోపతాపాలు మరింత భగ్గుమంటూంటాయి. ఈ పోకడలను బట్టి వాటిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ కొంచెం నిశితంగా పరిశీలిస్తే, స్థిమితంగా ఆలోచించగలిగితే అంత ఆశ్చర్యమేమీ కలగదు. ఎందుకంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ మతం పునాదులపైనే నిర్మింపబడ్డాయి కాబట్టి! నూటా నలభై కోట్ల భారత జనాభాలో 79 శాతం మంది ఉన్న హిందువులు వీరి టార్గెట్. ఇతరులు తమకు అణిగిమణిగి ఉండాలన్నదే వీటి రాజకీయ సిద్ధాంతం. లోపభూయిష్ఠమైన, పాత వాసనలున్న విధానం ఇది. కానీ బీజేపీకి ఓట్లూ, నిధుల రూపంలో కోట్లూ రాల్చిందీ ఈ విధానమే అన్నది గుర్తుపెట్టుకోవాలి. బలమైన ఆయుధాన్ని అందించిన సల్మాన్ ఖుర్షీద్ రాజకీయ లాభాలు మోసుకొచ్చిన విధానాన్ని మరింత బలపరుచుకోవాలని భావిస్తున్న తరుణంలో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ నేత సల్మాన్ ఖుర్షీద్ ‘సన్‌రైజ్ ఓవర్ అయోధ్య – నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్’ పేరుతో రాసిన పుస్తకం ద్వారా బలమైన ఆయుధాన్ని, అవకాశాన్ని అందించారు. ఈ పుస్తకాన్ని ప్రచురణకర్తలు మినహా ఇంకెవరైనా చదివారంటే నేను నమ్మను. కానీ ఇందులోని ఒక్క వాక్యం ‘‘హిందుత్వ అనేది ఐసిస్, బోకోహరాం వంటి వాటితో సరిపోలేది’’ అనేది మాత్రం పెద్ద దుమారమే లేపింది. ఐసిస్ తన వద్ద బందీలుగా ఉన్న వారిని చంపి వారి వీడియోలు తీసే నీచానికి పాల్పడే సంస్థ. అలాంటి సంస్థలతో హిందుత్వను పోల్చిన సల్మాన్ రాతలను నేనూ ఖండిస్తాను. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఖుర్షీద్‌కు ఉందనుకన్నా ఆ పోలిక మాత్రం అసంబద్ధం. ఇంకేముంది... బీజేపీ తన అస్త్రశస్త్రాలన్నింటినీ ఖుర్షీద్ పైకి ఎక్కుపెట్టింది. పుస్తకం అమ్ముకునేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ వివాదాన్ని సృష్టించారని నేనైతే అనుకోవడం లేదు. (ఓ ఛానల్లో సల్మాన్ దీనంగా మన్నించమని కోరిన దృశ్యాలను చూసిన తరువాత వ్యక్తిగతంగానూ నేను లాభాల కోసం చేశారని నమ్మడం లేదు) ఒకవేళ అదే నిజమైతే చాలా అనైతికమైన విషయం. ఒకపక్క ప్రియాంకా గాంధీ ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తరుణంలో ఇదేమంత మంచి పరిణామం కాదు. సల్మాన్ ఖుర్షీద్ ఉద్దేశాలు వేరైతే మాత్రం అతడి తప్పుడు అంచనా విస్మయపరుస్తుంది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ విభాగాన్ని మరింత ఇబ్బంది పెట్టినట్లు అయింది. సల్మాన్ రాతలపై ఇప్పటికే కొన్ని పోలీస్ కేసులు నమోదయ్యాయి. భారతీయ న్యాయ వ్యవస్థ ఆయన వ్యాఖ్యల్లోని తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. కాంగ్రెస్ లేవనెత్తగలిగిన అంశాలు... ఐదు! ఖుర్షీద్ పుస్తకం నేపథ్యంలో చెలరేగిన వివాదాన్ని బీజేపీ పతాక శీర్షికలకు చేర్చడమే కాకుండా కాంగ్రెస్‌ను హిందూ వ్యతిరేకిగా ముద్రవేసే ప్రయత్నం గట్టిగానే చేసింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ ఈ అంశంతోపాటు... ముస్లిం లీగ్ అధ్యక్షుడు మహమ్మద్ అలీ జిన్నాను నెహ్రూతో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పోల్చడాన్ని పదే పదే లేవనెత్తి రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్లను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ మరింత మెరుగైన పద్ధతులు అవలంబించాల్సిన అవసరం ఉంది. బీజేపీ హిందుత్వ వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టేందుకు మౌలిక ప్రశ్నలను ఎక్కుపెట్టాల్సిన అవసరముంది. సున్నిత అంశమైన హిందూత్వపై తనదైన కథనాలను ప్రచారంలోకి పెట్టిన విషయాలపై ప్రజల అంతఃచేతనను మేలుకొల్పాల్సి ఉంది. ఈ పని చేయాలంటే.. కాంగ్రెస్ ఐదు అంశాలను లేవనెత్తవచ్చు. 1. రెచ్చగొట్టే పోలికలు చేసేందుకు బదులు సల్మాన్ ఖుర్షీద్... ∙మోదీ అధికారం చేపట్టిన తరువాత దేశం మొత్తమ్మీద ప్రబలిన మతఛాందస వాదంపై తన విమర్శలు ఎక్కుపెట్టడం మేలు. మరీ ముఖ్యంగా 2015లో యూపీలోని దాద్రిలో ముహమ్మద్ అఖ్లాక్‌తో మొదలైన మూక హత్యల గురించి ప్రస్తావించాలి. 2. హిందూయిజానికి నాలుగు వేల ఏళ్ల చరిత్ర ఉంది. సర్వమానవ సౌభ్రాతృత్వం, అందరినీ సమాదరించే అద్భుత లక్షణం హిందూయిజం సొంతం. ‘‘హిందూయిజం అటు సహనానికి, ఇటు వసుధైక కుటుంబం అన్న భావనలకు ప్రతీక’’ అని స్వామి వివేకానంద లాంటివారు ఎప్పుడో విస్పష్టంగా చెప్పారు. దీనికీ ప్రస్తుతం రాజకీయ అవసరాల కోసం బీజేపీ ప్రచారంలోకి తెచ్చిన హిందూత్వకూ ఏమాత్రం పొంతన లేదు. హిందుత్వ పేరుతో బీజేపీ మైనార్టీలు తమ సొంత దేశంలోనే రెండో తరగతి పౌరులుగా భావించే స్థితికి చేర్చే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ హిందూత్వానికి ఊతమివ్వడం ద్వారా బీజేపీ సెక్యులరిజం అన్న రాజకీయ పద్ధతిని ఉల్లంఘిస్తోంది. సెక్యులరిజం భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమన్నది తెలిసిందే. 3. మెనార్టీల హక్కులను కాపాడి తప్పు చేశామన్న భావనను కాంగ్రెస్ వదులుకోవాలి. ఎల్కే అద్వానీ ‘సూడో సెక్యులర్లు’ అన్న పదాన్ని వాడినప్పుడే ఖండించకుండా కాంగ్రెస్ చాలా పెద్ద తప్పు చేసింది. ఆ విమర్శను ఇప్పటివరకూ ఎవరూ తగురీతిలో తిప్పికొట్టలేదు. మెజార్టీ హిందువుల మద్దతు లేకుండానే కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని అత్యధిక కాలం పాలించగలిగిందా? ఇప్పటివరకూ 17 సార్లు సాధారణ ఎన్నికలు జరిగితే పదిసార్లు కాంగ్రెస్ ఎలా గెలవగలిగింది? కాబట్టే మైనార్టీ రాజకీయం చేస్తోందన్న బీజేపీ ఆరోపణలను వదిలించుకునేందుకు గట్టి ప్రయత్నం జరగాలి. సామాజిక మాధ్యమాలు, ఫేక్‌న్యూస్‌లు, ప్రధాన స్రవంతిలోని ఒక వర్గం మీడియా అధికార పార్టీ పెద్దలను సంతోషంగా ఉంచేందుకు హిందూ – ముస్లిం విభేదాలు కొనసాగేందుకు ప్రయత్నిస్తాయన్న విషయాన్ని కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదు. 4. ఆర్ఎస్ఎస్, బీజేపీలను హిందు ధర్మ సంరక్షకులుగా ఎవరు నియమించారని కాంగ్రెస్ ఒక్కసారి కూడా ప్రశ్నించకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. భారతీయులు ఎవరు దేశభక్తులో, ఎవరో సెక్యులరో నిర్ణయించే అధికారం, సర్టిఫికెట్లు పంచే బాధ్యత బీజేపీకి ఎవరిచ్చారో కూడా కాంగ్రెస్ ప్రశ్నించాలి. 5. బీజేపీ హిందుత్వ జాతీయభావానికి ప్రతిగా కాంగ్రెస్ ‘భారత జాతీయ భావం’ అన్న అంశంపై పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలి. స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పాత్రను చెప్పడమే కాకుండా... బీజేపీ పాత్రను ప్రశ్నించే తెగువ చూపించాలి. సల్మాన్ ఖుర్షీద్ తన పుస్తకాన్ని అమ్ముకోగలిగాడో లేదో నాకు తెలియదు కానీ... కాంగ్రెస్ తన రాజకీయ సిద్ధాంతాలను మరోసారి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పుకోవాల్సిన అవసరమైతే ఇప్పుడు వచ్చింది. నిర్లక్ష్యానికి, నిష్క్రియాపరత్వానికి కాలం చెల్లిందని ఆ పార్టీ గుర్తించాలి. చైతన్యవంతమైన సమాజంలో మెజార్టీ వర్గం... సమస్యలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న మైనార్టీ వర్గాలకు రక్షణగా నిలవాలి. భారతీయ విలువలు కూడా ఇదే విషయాన్ని చెబుతాయి. సెక్యులరిజం విషయంలో సాధికారత కలిగిన కాంగ్రెస్ ఇంకోసారి ఆ విషయాన్ని ప్రపంచానికి గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం నెహ్రూకు మించిన స్ఫూర్తి ఇంకోటి ఉండదేమో! ముస్లింలపై భారీ ఎత్తున దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసిన ఒకానొక సందర్భంలో నెహ్రూ... ‘‘ఒక్క ముస్లిం వ్యక్తి వెంట్రుకకు హాని చేసినా నేను ఓ యుద్ధ ట్యాంక్పంపి... నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాను’’ అని వ్యాఖ్యానించినట్లు చెబుతారు. ఆ తరువాత కూడా నెహ్రూకు హిందువులు ఓట్లేయడం మానేయలేదు. భారత్‌లో ప్రస్తుతం ఉన్నది హిందూ–ముస్లిం సమస్య కాదు. మానవత్వానికి సంబంధించినది! – సంజయ్ ఝా, కాంగ్రెస్‌పార్టీ మాజీ అధికార ప్రతినిధి -
అసలైన హిందూయిజాన్ని కాపాడాలి!
‘‘రుషులు, సన్యాసులు ప్రబోధించిన సంప్రదాయ హిందూయిజాన్ని, హిందుత్వకు చెందిన బలిష్ఠమైన వెర్షన్ పక్కకు నెట్టేసింది. ఇది ఐసీస్, బోకో హరామ్ వంటి జిహాదిస్ట్ ఇస్లాం గ్రూపులను పోలిన ప్రామాణిక రాజకీయ రూపమే తప్ప మరొకటి కాదు’’ అని నా తాజా పుస్తకంలో రాసిన వాక్యం నా ఇంటిపైకి హిందుత్వ శక్తుల దాడి వరకు తీసుకొచ్చింది. చాలాకాలంగా హిందుత్వ శక్తులకు మనల్ని పక్కకు నెట్టేసే స్వాతంత్య్రం ఇస్తూ వచ్చాం. సత్యంపై వారికే గుత్తాధిపత్యం ఉందనే భావన కలిగించాం. ఇప్పటికైనా మనం స్పష్టమైన వైఖరిని తీసుకోవాలి. మానవత్వాన్ని తోసిపుచ్చి, రెండు ముఖ్యమైన మతాల మధ్య శాశ్వత విభజనను కోరుకుంటున్న శక్తుల నుంచి మనం అసలైన హిందూయిజాన్ని కాపాడుకోవాలి. నా తాజా పుస్తకం ‘సన్‌రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్’ 300 పేజీలతో రూపొందింది. అయోధ్యపై తీర్పులో న్యాయపరమైన ఔచిత్యంపై నా సహ న్యాయవాదులు చాలామంది సందేహం వ్యక్తపరుస్తున్నప్పటికీ, నా ఈ పుస్తకంలో ఆ తీర్పును బలపర్చడానికే ప్రయత్నించాను. హిందూయిజం తాత్వికతను గుర్తించడమే కాకుండా ప్రశంసిస్తూ వచ్చాను. సనాతన ధర్మానికి సంబంధించిన మానవీయ కోణాలను ఎత్తి చూపాను. హిందువులు, ముస్లింల మధ్య మత సామరస్యాన్ని ప్రోత్సహించడం, విచారకరమైన గతాన్ని మూసివేసి పరస్పర భాగస్వామ్యంతో కూడిన భవిష్యత్తుకు ఒక మంచి అవకాశంగా అయోధ్య తీర్పును ఎత్తిపట్టడమే నా తాజా పుస్తకం లక్ష్యం. విచారకరంగా, నా ఈ ప్రయత్నాన్ని జాతీయ మీడియా కానీ, అధికార పార్టీ సభ్యులు కానీ గమనించకపోగా, నా పుస్తకంలోని 6వ అధ్యాయంలో హిందూయిజానికి, హిందుత్వకు మధ్య వ్యత్యాసం గురించి పేర్కొన్న ఒక వాక్యంపై విరుచుకుపడ్డారు. అదేమిటంటే ‘రుషులు, సన్యాసులు ప్రబోధించిన సాంప్రదాయ హిందూయిజాన్ని హిందుత్వకు చెందిన బలిష్టమైన వెర్షన్ పక్కకు నెట్టేసింది. ఇది ఐసీస్, బోకో హరామ్ వంటి జిహాదిస్ట్ ఇస్లాం గ్రూపులను పోలిన రాజకీయ రూపమే.’ హిందుత్వ స్వభావాన్ని ప్రశ్నించడం, అంతకు మించి దాన్ని బోకో హరామ్, ఐసిస్‌తో పోల్చి వర్ణించడం వల్ల నా పుస్తకంపై ఇంత ఆగ్రహం ప్రదర్శించినట్లు కనిపిస్తోంది. అయితే ఈ సంస్థల మధ్య ఉన్న సామాన్య లక్షణాలను చెప్పడానికే ఆ వాక్యాన్ని వాడాను తప్ప ఇవన్నీ సమానమని నేను పేర్కొనలేదు. మతాన్ని వక్రీకరిస్తూ, మానవత్వాన్ని గాయపర్చే ఒక అపక్రమ రూపానికి ఇవి సాధారణ నమూనాలు అని మాత్రమే చెప్పానని నేను ఇచ్చిన వివరణను ఎవరూ పట్టించుకోలేదు. నాపై ట్రోల్స్ దాడి చేస్తున్న సమయంలోనే కల్కిథామ్ వద్ద ఉన్న కల్కి మహోత్సవ్ చివరి రోజు కార్యక్రమానికి నేను ప్రత్యేక అతిథిగా వెళ్లే అదృష్టానికి నోచుకున్నాను. ఆ పీఠాధిపతి శ్రీ ఆచార్య ప్రమోద్ కృష్ణన్ ఎప్పటిలాగా నాపై కరుణ చూపారు. అలాగే ఆ రోజు కాశీపీఠం జగద్గురు శంకరాచార్య నరేంద్రానంద్ గిరీజీ సరస్వతి మహారాజ్ ఆశీర్వాదాలు కూడా అదనంగా అందుకున్నాను. మతం కానీ, కులం కానీ మనలను విడదీయలేని మానవజాతి ఐక్యత గురించి ఆయన ఆరోజు సుదీర్ఘంగా వివరించారు. ఒక గొప్ప మతాన్ని రాజకీయంగా దుర్వినియోగపరుస్తుండటాన్ని నేను ఆమోదించడం లేదు. అందుకే కాబోలు.. శంకరాచార్య పట్ల నా ఆరాధనా భావం, సనాతన ధర్మపై నా ప్రశంస, అయోధ్య తీర్పును నేను ఎత్తిపడుతూ అందరూ సమన్వయంతో సర్దుబాటు కావాలనీ, రాముడు... ఇమామ్ ఇ హింద్ పాత్ర పోషించాలనీ నేను చెప్పిన మాటలన్నీ వృథా అయిపోయాయి. ఆసక్తికరంగా, నా సీనియర్ సహచరుడు గులామ్ నబి అజాద్ బహుశా అనుద్దేశంగానే కావచ్చు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశారు. నా పుస్తకాన్ని ఆవిష్కరించిన కొద్ది గంటలలోపో అజాద్ స్వీయ సంతకంతో కూడిన ప్రకటన మీడియాకు పంపించారు. అది నన్ను కలవరపెట్టింది. వెంటనే కాంగ్రెస్ పార్టీలోనే నా పుస్తకంపై తీవ్రమైన చర్చ మొదలైందంటూ అజాద్ ప్రకటన ఆధారంగా మీడియా ప్రకటించేసింది. కానీ ఇక్కడ రెండు అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి. అజాద్ కూడా హిందుత్వను ఒక రాజకీయ భావజాలంగా తిరస్కరించారు. కానీ తాను ఎందుకు తిరస్కరిస్తోందీ ఆయన చెప్పలేదు.హిందూయిజం ఒక మిశ్రమ సంస్కృతిని కలిగి ఉందనీ, కానీ హిందుత్వను బోకో హరామ్, ఐసిస్‌లతో పోల్చడం సత్యదూరమని, అతిశయోక్తితో కూడుకున్నదని అజాద్ వివరించారు. కానీ అతిశయించి చెప్పాలంటే ఏవైనా పోలికలు ఉండాలి. ఏదైనా వాస్తవం ఉనికిలో ఉన్నప్పుడే అతిశయోక్తి పుడుతుంది. కానీ ఇదే అజాద్ కొన్నేళ్ల క్రితం హిందుత్వను ఐసిస్‌తో పోల్చుతూ మాట్లాడిన వీడియోను నేను ఇప్పుడు మళ్లీ ప్రదర్శించాలనుకోలేదు. ఈ విషయమై నాతో మాట్లాడినవారిలో చాలామంది, హిందుత్వను పాటించేవారిలో అనారోగ్యకరమైన ప్రవర్తనకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క ఉదాహరణను చూపించవలసిందిగా కోరారు. నావద్ద చాలా ఉదాహరణలు ఉన్నాయి కానీ మతాల మధ్య సమన్వయాన్ని సాధించాలనుకుంటున్న నా లక్ష్యాన్ని అది పూర్వపక్షం చేస్తుంది. పైగా నా ఇంటిపై జరిగిన దాడిని వారు ఆమోదించడం లేదు కూడా. నా పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా పి. చిదంబరం దీన్ని అద్భుతంగా తన మాటల్లో చెప్పారు. ‘జెస్సికాను ఎవరూ చంపనట్లే, బాబ్రీ మసీదును కూడా ఎవరూ కూల్చలేదు.’ బీజేపీ, భజరంగ్ దళ్, విశ్వ హిందూపరిషత్కి చెందిన అనేకమంది ప్రముఖులతో నేను చేసిన సంభాషణలను ఈ సందర్భంగా ఇక్కడ జోడించతగినవే. అవేమిటంటే, ‘‘పెహ్లూ ఖాన్, అఖ్లాక్ ఖాన్‌లను మన దేశంలో ఎవరూ కాళ్లూ చేతులూ విరగ్గొట్టలేదు. 2002లో నరోదా పటియా వద్ద మహిళలను, పిల్లలను ఎవరూ చంపలేదు. ఉన్నావో, హత్రాస్ వద్ద అమ్మాయిలపై ఎవరూ అత్యాచారం చేయలేదు. ముజఫర్‌నగర్‌లో ఎవరూ ఇళ్లను తగలబెట్టలేదు. ఇస్రత్ జహాన్ని ఎవరూ చంపేయలేదు. లకింపూర్ ఖేరీలో ఎవరూ రైతులను ట్రాక్టర్లతో తొక్కించి చంపలేదు. అలాగే, మహాత్మా గాంధీని కూడా ఎవరూ చంపలేదు.’’ నేను చర్చకు ఎప్పుడూ సుముఖమే. కానీ బయటకు సుమోటో ప్రకటనలను జారీ చేయడం రూపంలో కాకుండా ఆ చర్చలు పార్టీలో అంతర్గతంగా ఎందుకు జరపకూడదు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పష్టమైన అభిప్రాయం కలిగి ఉండటం గమనార్హం. మన ఆలోచనల్లో సైద్ధాంతిక స్పష్టత ఉండటంపై ఆయన ఆలస్యంగా అయినా దృష్టిపెట్టారు. హిందూయిజం, హిందుత్వ అనేవి పూర్తిగా భిన్నమైన విషయాలని, వీటిలో హిందుత్వ... అమాయకులను వధించే కార్యక్రమంలో ఉంటోందని రాహుల్ పేర్కొన్నారు. ఇప్పుడు ఇంకా చర్చేమిటి? వాస్తవానికి, చాలాకాలంగా మనం హిందుత్వ శక్తులకు మనల్ని పక్కకు నెట్టేసే స్వాతంత్య్రం ఇస్తూ వచ్చాం. సత్యంపై వారికే గుత్తాధిపత్యం ఉన్నట్లుగా అభిప్రాయాన్ని మనకు మనమే కలిగిస్తూ వచ్చాం. ప్రకృతే గాయాలను మాన్పుతుందని, ప్రజా జీవితం సాధారణ స్థాయికి చేరుతుందని భావించేలా చేయడమే దీని వ్యూహం. మనం ఒక అంగుళం స్థానమిస్తే, ప్రత్యర్థి అనేక అడుగులు ఆక్రమించడానికి ప్రయత్నిస్తాడని తాజా ఉదంతం మనకు స్పష్టం చేస్తోంది. కాబట్టి ఇకనైనా మన శ్రేయస్సు కోసమే కాకుండా మన దేశ ఉనికిని కాపాడేందుకు కూడా ఒక పెద్ద గీత గీసుకోవాలి. ఇది హిందుత్వ శక్తుల ప్రవృత్తి, స్వభావాన్ని వ్యతిరేకించడానికి కాదు, ఒక అద్భుత మతమైన హిందూయిజాన్ని కాపాడేందుకు మనల్ని మనం ఇక తీర్చిదిద్దుకోవాలి. మానవత్వాన్ని తోసిపుచ్చి, రెండు ముఖ్యమైన మతాల మధ్య శాశ్వత విభజనను కోరుకుంటున్న శక్తుల ప్రమాదం నుంచి మనం అసలైన హిందూయిజాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు మనం స్పష్టమైన వైఖరిని తీసుకోవాలి. మితవాద శక్తులు మనల్ని బంధించి ఉంచిన శృంఖలాలను తెగ్గొట్టుకోవడం తప్ప మనం కోల్పోయేది ఏమిటి? స్వాతంత్య్రాన్ని కోల్పోవడం అనేది ఒక భౌతిక నిర్బంధం మాత్రమే కాదు. అది మన బుద్ధికి, వాక్కుకు శృంఖలాలు తగిలించడమే. హిందుత్వ ప్రచారకులు మొదట సత్యాన్ని తొక్కేస్తున్నారు, తర్వాత దాన్ని అణిచి ఉంచడానికి ప్రతి ఆయుధాన్నీ సానబెడుతున్నారు. గాంధీతత్వం మనల్ని హింసామార్గం వైపు పోకుండా అడ్డుకుంటోంది కానీ నిష్క్రియాత్మక ప్రతిఘటన పర్యవసానాలకు మనం బలవుతున్నాం. కానీ మనం సత్యం వైపు నిలబడదాం. నైని టాల్లోని నా ఇంటిని తగలబెట్టినప్పుడు, ఈ చర్యకు ఎవరు పాల్పడి ఉంటారు అని నన్ను ప్రశ్నించారు. బొకో హారమ్, ఐసిస్, హిందుత్వ శక్తులు. ఎవరు దీనికి పాల్పడ్డారో విజ్ఞులే నిర్ణయించుకోవాలి. వ్యాసకర్త సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ (‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై దాడి
డెహ్రాడూన్: కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై సోమవారం దుండగులు దాడి చేసి, నిప్పు అంటించారు. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్లో ఉన్న తన ఇంటిపై దాడి జరిగిందని, సంబంధిత ఫొటోలు, వీడియోలను ఆయన సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఇటీవల ఆయన ఆయోధ్యపై రచించిన పుస్తకంలో ‘హిందూత్వ’కు, తీవ్రవాద సంస్థలకు సారూప్యత ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇంటిపై దాడి చేసిన వ్యక్తుల చేతుల్లో బీజేపీ జెండాలు ఉన్నాయని ఖుర్షీద్ పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన ఇంటి కిటికీలు ధ్వంసం అయ్యాయని, ఓ డోర్‌కు దుండగులు నిప్పు పెట్టారని నైనిటాల్ ఎస్పీ జగదీశ్ చంద్ర వివరించారు. ఈ దాడితో సంబంధం ఉన్న 21 మంది దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడిలో ఖుర్షీద్ కుటుంబసభ్యులకు ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని పేర్కొన్నారు. ఇంటిపై జరిగిన దాడిని కాంగ్రెస్ సీనియర్ నేతలు శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ తదితరులు తీవ్రంగా ఖండించారు. -
ఖుర్షీద్ పుస్తకంపై రగడ
న్యూఢిల్లీ/భోపాల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ‘సన్‌రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్’ పేరిట రాసిన పుస్తకం వివాదాస్పదంగా మారింది. బుధవారం విడుదలైన ఈ పుస్తకంలో ఆయన ప్రస్తావించిన అంశాలు రాజకీయంగా సెగలు రాజేస్తున్నాయి. సనాతన ధర్మం, ప్రాచీన హిందూవాదంతో కూడిన హిందూత్వం పక్కకుపోయిందని, ప్రస్తుతం హిందూత్వం అనేది జిహాదీ ఇస్లామిక్ సంస్థలైన ఐసిస్, బోకో హరాంల మాదిరిగా మారిపోయిందని పుస్తకంలో ఖుర్షీద్ ఆక్షేపించారు. ఇప్పుడున్నది అతివాద హిందూత్వం అని పేర్కొన్నారు. ఖుర్షీద్పై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీకి చెందిన న్యాయవాది వివేక్ గార్గ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా మండిపడ్డారు. అయోధ్య తీర్పుపై ఖుర్షీద్ రాసిన పుస్తకం ప్రజల మతపరమైన మనోభావాలను గాయపర్చేలా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శించారు. సోనియా, రాహుల్ ఆదేశాలతోనే ఖుర్షీద్ పుస్తకం రాశారని గౌరవ్ ధ్వజమెత్తారు. పుస్తకంలో సల్మాన్ అభిప్రాయాలను కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ఖండించారు. హిందూత్వను ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో పోల్చడం సరైంది కాదని, అది వాస్తవ దూరమని పేర్కొన్నారు. అతిశయోక్తులు వద్దన్నారు. -
మీరు ఏ ఎన్నికల్లో గెలిచారు?!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు అవసరమని గళమెత్తుతున్న జి–23 (గ్రూప్ ఆఫ్ 23) నాయకులపై ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్(68) మండిపడ్డారు. త్యాగాలతోనే సంస్కరణ సాధ్యమవుతుంది తప్ప అకస్మాత్తుగా ప్రశ్నించడం ద్వారా కాదని అన్నారు. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న నాయకులు ఇప్పుడున్న స్థానాల్లోకి ఎలా వచ్చారో గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. జి–23లోని చాలామంది పెద్దలు పార్టీ పదవుల్లో నామినేట్ అయిన వాళ్లేనని పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా పదవుల్లో కొనసాగుతూ అదే విధానాన్ని(నామినేట్) ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల రణరంగంలో ముందంజలో నిలవాలంటే కాంగ్రెస్‌కు పెద్ద శస్త్రచికిత్స అవసరమని జి–23 నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ మా నాయకుడు పదేళ్లుగా పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలకు నేతలు చేసే ‘అద్భుత వ్యాఖ్యానాల’తో పరిష్కారం దొరకదని సల్మాన్ ఖుర్షీద్ చురక అంటించారు. పార్టీ నేతలంతా కలిసి కూర్చొని చర్చించుకోవాలని, సవాళ్లకు పరిష్కార మార్గాలు సూచించాలని హితవు పలికారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలా? వద్దా? అనేది రాహుల్ గాంధీయే నిర్ణయించుకోవాలని చెప్పారు. ఆయన పార్టీ అధినేత అయినా కాకపోయినా తమ నాయకుడిగా మాత్రం ఉంటారని వెల్లడించారు. సంస్కరణలు, శస్త్రచికిత్స అంటూ కపిల్ సిబల్, వీరప్ప మొయిలీ లేవనెత్తిన అంశాలపై ఖుర్షీద్ ఘాటుగా స్పందించారు. ‘‘శస్త్రచికిత్స చేస్తానంటే నేను సంతోషిస్తా. కానీ, నా కాలేయం, మూత్రపిండాలు తీసుకుంటానంటే ఎలా? ఎలాంటి శస్త్రచికిత్స చేయాలనుకుంటున్నారో దయచేసి ఎవరైనా చెప్పండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పార్టీకి సర్జరీ చేయాల్సిందేనని, అయితే, దానివల్ల సాధించదేమిటో, కోల్పోయేదేమిటో స్పష్టత ఇవ్వాలన్నారు. సర్జరీ కంటే ముందు ఎక్స్‌రేలు, అల్ట్రాసౌండ్ పరీక్షలు అవసరమని తెలిపారు. సమస్య లోతుల్లోకి వెళ్లాలని, దానికి పరిష్కారాన్ని కనిపెట్టాలని అన్నారు. పదవులు వదులుకుంటేనే సంస్కరణలు సాధ్యం సర్జరీ, సంస్కరణలు, ప్రాథమిక మార్పు తీసుకురావడం అంటే ఏమిటో తనకు అర్థం కావడం లేదని సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. వాటి అర్థాలేమిటో తనకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ‘‘పార్టీలో మార్పులు చేర్పులు చేయాలని, వారికి (జి–23 నాయకులు) కీలక పదవులు దక్కాలని కోరుకుంటున్నారేమో తెలియదు. అదే నిజమైతే అది సంస్కరణగానీ, సర్జరీ గానీ కాబోదు. ‘నాకొక›పదవి కావాలి’ అని కోరుకోవడం మాత్రమే అవుతుంది’’ అని తేల్చిచెప్పారు. సంస్కరణ అం టూ మాట్లాడుతున్న నేతలు తొలుత ఇతర నాయకులతో మాట్లాడాలని సూచించారు. వారు తనతో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పార్టీ కోసం అందరం కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. ‘‘పార్టీలో సంస్థాగత ఎన్నికలకు ఎవరూ వ్యతిరేకం కాదు. ఎన్నికలు జరగాల్సిందే. అయితే, ఏ ఎన్నికల్లో గెలిచి వారు (జి–23 నేతలు) ఇప్పుడున్న స్థానాలను చేరుకున్నారో గుర్తుచేస్తే మాలాంటి వారు సులభంగా అర్థం చేసుకుంటారు. సంస్థాగత ఎన్నికల్లో గెలిచి వారంతా పదవులు చేపట్టారా?’’అని ఖుర్షీద్ ప్రశ్నించారు. దేశంలో ఏ రాజకీయ పార్టీలో అన్ని స్థాయిల్లో సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తున్నారో చెప్పాలన్నారు. సంస్కరణ అనేది అకస్మాత్తుగా సాధ్యం కాదని, పొందినదాన్ని వదులుకున్నప్పుడే అది సాకారమ వుతుందని తెలిపారు. పార్టీలో మార్పు రావాలని కోరుకున్నప్పుడు త్యాగాలకు కూడా సిద్ధపడాలని పేర్కొన్నారు. -
ఢిల్లీ అల్లర్లు: సల్మాన్ ఖుర్షీద్‌కు షాక్..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో చెలరేగిన అల్లర్ల కేసులో పోలీసులు ఇప్పటికే చార్జిషీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీకి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి అల్లర్లకు ప్రేరేపించారనే ఆరోపణలతో ఇప్పటికే పలువురి పేర్లను అభియోగ పత్రంలో చేర్చారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఎం నాయకురాలు బృందా కారత్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సమా ఆర్థికవేత్త జయతి ఘోష్, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అపూర్వానంద్, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్ తదితరుల పేర్లు ఇందులో ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పేరును చార్జిషీట్లో చేర్చిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. (చదవండి: ఢిల్లీ అల్లర్లు : అరెస్టుల ప్రక్రియ షూరూ) ఇందులో భాగంగా, సుమారు 17 వేల పేజీలతో సెప్టెంబరు 13న నమోదు చేసిన చార్జిషీట్లో.. ‘‘ఉమర్ ఖలీద్, సల్మాన్ ఖుర్షీద్, నదీం ఖాన్.. వంటి నాయకులు యాంటీ సీఏఏ- ఎన్సార్సీ ఉద్యమాల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ప్రజలను ప్రేరేపించారు’’ అని ఓ సాక్షి వాంగ్మూలం ఇచ్చినట్లుగా ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. హింస చెలరేగేలా కుట్రలు పన్నిన కోర్‌టీంలో సదరు సాక్షి కీలకంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. సీఆర్పీసీలోని సెక్షన్ 164 ప్రకారం మెజిస్ట్రేట్ ఎదుట ఈ మేరకు వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలిపారు. సదరు సాక్షితో పాటు మరో నిందితుడు కూడా సల్మాన్ పేరును ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రసంగంలో వ్యాఖ్యానించిన విషయాల గురించి మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. ఇక ఈ విషయంపై స్పందించిన సల్మాన్ ఖుర్షీద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీరు చెత్తను సేకరించాలనుకుంటే చాలా మలినాలు దొరుకుతాయి. ఎవరో ఒక వ్యక్తి ఇచ్చిన స్టేటమెంట్‌ను నిరూపించేందుకు ఈ చెత్తను జతచేస్తారు. నిజానికి ఆ రెచ్చగొట్టే ప్రసంగం ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. చెత్త సేకరించే వాళ్లు తమ పనిని సరిగ్గా చేయలేకపోతున్నారు అనిపిస్తోంది’’అంటూ విమర్శలు గుప్పించారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 23-26 మధ్య ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. -
‘ఇప్పటికిప్పుడు పార్టీ అధ్యక్ష ఎన్నిక అవసరం లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ వ్యవహారంపై పార్టీ చీఫ్ సోనియా గాంధీ ఓ నిర్ణయం తీసుకుంటారని సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. పార్టీ ప్రక్షాళనతో పాటు పూర్తికాల అధ్యక్షుడి ఎంపికపై సీనియర్లు సోనియా గాంధీకి లేఖ రాయడంపై ఖుర్షీద్ స్పందిస్తూ సోనియాకు వారంతా సన్నిహితులేనని లేఖ రాసే బదులు ఆమెతో సంప్రదింపులు జరిపి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. సీనియర్లు రాసిన లేఖపై సంతకం చేయాలని వారు నన్ను కలిసినా తాను సంతకం చేసి ఉండేవాడిని కాదని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీకి సోనియా, రాహుల్ వంటి నేతలున్నారని, నేతలను తక్షణమే ఎన్నుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. రాహుల్ గాంధీని తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాలని నేతలు కోరడం కంటే నిర్ణయాన్ని ఆయనకే వదిలివేయాలని సూచించారు. పార్టీ చీఫ్‌గా రాహుల్ ముందుకొస్తారా అని అడగ్గా సీనియర్ల లేఖపై రాహుల్ ఆలోచించి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారని ఖుర్షీద్ చెప్పారు. చదవండి : ఇదే ప్రభుత్వానికి నేనిచ్చే సలహా: సోనియా ఇక సోనియా గాంధీ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా కొనసాగుతారని ఇటీవల సుదీర్ఘంగా సాగిన సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయించారు.కాగా, కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని, అన్ని స్ధాయిల్లో చురుకుగా ఉండే పూర్తికాల అధ్యక్షులను నియమించాలని 23 మంది కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీకి రాసిన లేఖ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, మనీష్ తివారీ, ఆనంద్ శర్మ వంటి 23 మంది నేతలు సంతకాలు చేశారు. కాగా సోనియా అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఈ లేఖ రాయడం పట్ల సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్ సీనియర్ నేతలపై మండిపడ్డారు. బీజేపీతో కుమ్మక్కయ్యారని సీనియర్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన సీనియర్లు రాజీనామాకు సిద్ధపడగా వారిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. -
‘మోదీ సర్కార్‌కు కౌంట్‌డౌన్’
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వ ఐదేళ్ల ప్రజాకంటక పాలనకు తెరపడుతోందని సీనియర్ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ జోస్యం చెప్పారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీపై మోదీ చేసిన వ్యాఖ్యలను ఖుర్షీద్ తీవ్రంగా ఖండించారు. మోదీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని, ఐదేళ్ల అరాచకపాలన ముగియనుందని వ్యాఖ్యానించారు. మరో 16 రోజుల్లో మోదీ పాలనకు తెరపడుతుందని, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని నెంబర్‌వన్ అవినీతిపరుడిగా మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సహా పలువురు విపక్ష నేతలు తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఎన్నడో మరణించిన రాజీవ్ గాంధీని ప్రధాని మోదీ నిందించడం అమానవీయమని విపక్ష నేతలు ఆక్షేపించారు. -
‘కేంద్రంలో యూపీఏ 3 ఖాయం’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో కేంద్రంలో యూపీఏ -3 కొలువుతీరుతుందని ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఆశాభావం వ్యక్తం చేశారు. అందరి అంచనాలకు భిన్నంగా యూపీ ఫలితాలు ఆశ్చర్యకరంగా వెలువడనున్నాయని జోస్యం చెప్పారు. 2009లో యూపీలో కాంగ్రెస్ 21 స్ధానాలను గెలుచుకున్న సందర్భం మరోసారి ఎదురవనుందని, అప్పటికన్నా అధికంగా సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు. 2009లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 205 స్ధానాలను గెలుపొందగా అదే సంఖ్యలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు వస్తాయా అని ప్రశ్నించగా అందులో ఎలాంటి సందేహం లేదని సల్మాన్ ఖుర్షీద్ బదులిచ్చారు. పార్టీలో నూతన నాయకత్వం రాకతో కార్యకర్తలు, శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోందని, లోక్‌సభ ఎన్నికల అనంతరం తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్ధితిలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి ప్రియాంక ఆగమనం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని చెప్పారు. కాగా,ఫరక్కాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచిన సల్మాన్ ఖుర్షీద్ బీజేపీ సిటింగ్ ఎంపీ ముఖేష్ రాజ్పుట్, బీఎస్పీ అభ్యర్థి మనోజ్ అగర్వాల్‌ల నుంచి ముక్కోణ పోటీ ఎదుర్కొంటున్నారు. -
‘ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి’
సాక్షి, న్యూఢిల్లీ : శత్రు సేనలకు చిక్కినా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లిన భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ ఎపిసోడ్‌ను రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్న క్రమంలో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చాయి. అభినందన్ యూపీఏ హయాంలోనే పైలట్‌గా ఎదిగాడని సల్మాన్ ఖుర్షీద్ చేసిన ట్వీట్‌పై నెటిజన్ల నుంచి ఆయన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. అభినందన్ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని ఆయనకు చురకలు అంటించగా, మరికొందరు 1983లో వింగ్ కమాండర్ అభినందన్ జన్మించారని, ఇందుకు ఇందిరా గాంధీకి క్రెడిట్ ఇవ్వాలా అంటూ ఎద్దేవా చేశారు. ఖుర్షీద్‌కు నోబెల్ శాంతి బహుమతి వచ్చేలా చూడలంటూ కొందరు నెటిజన్లు వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. కాగా, అభినందన్ శత్రుదేశంలో చూపిన సంయమనం, ధైర్యసాహసాలపై దేశవ్యాప్తంగా ఆయనకు ప్రజలు నీరాజనాలు పట్టిన సంగతి తెలిసిందే. కాగా పాక్‌పై భారత్ మెరుపుదాడులతో పాటు అభినందన్ వ్యవహారాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం చేసిన బీజేపీ నేతలపైనా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. -
ఆలస్యంగా దక్కిన న్యాయం
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తమ పార్టీ చేతులు కూడా నెత్తుట తడిశాయని అంగీకరించినప్పుడు కాంగ్రెస్‌లో పెద్ద దుమారం లేచింది. ‘నేరాంగీకార ప్రకటన’గా భావించాల్సిన ఆ జవాబుకు కారణమైన ప్రశ్న బుధవారం తీర్పు వెలువడిన హాషింపురా నరమేథానికి సంబంధించిందే. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) విద్యార్థులతో సంభాషిస్తున్న సందర్భంలో ఒక విద్యార్థి ఆ దారుణ మారణకాండ వెలు గుచూడకుండా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కప్పెట్టే యత్నం చేయలేదా అని అడిగినప్పుడు ఆయన ఒప్పుకోక తప్పలేదు. ఈ ఉదంతంలో ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తాజా తీర్పు పర్యవసానంగా ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ(పీఏసీ)కి చెందిన 16 మంది మాజీ జవాన్లకు జీవితఖైదు పడింది. ఈ రోజు కోసమే మృతుల కుటుంబాలు 31 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయి. ఘటన జరిగిన సమయంలో కేంద్రంలోనూ, ఉత్తరప్రదేశ్‌లోనూ కాంగ్రెసే అధికారం చలాయిస్తోంది. అంతకు మూడేళ్లక్రితం దేశ రాజధాని నగరం న్యూఢిల్లీతోసహా పలు నగరాల్లో మూడురోజులపాటు కాంగ్రెస్ నాయకులు పంపిన హంతక ముఠాలు చెలరేగి అయిదువేలమంది సిక్కు పౌరులను ఊచకోత కోశాయి. ఎందరో మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. దాన్నుంచి దేశం ఇంకా తేరుకోక ముందే ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మత ఘర్షణలు చెలరేగి 350 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నగరంలో ప్రశాంతత నెలకొల్పడానికొచ్చిన పీఏసీ జవాన్లు ఆ పని విడిచిపెట్టి తామే హంతకులుగా మారారు. నగరంలోని హాషింపురా ప్రాంతంలోని ముస్లింల ఇళ్లు చుట్టుముట్టి ఆడవాళ్లనూ, వృద్ధులనూ వేరుచేసి 43 మంది యువకులను, మైనర్ బాలురను ట్రక్కుల్లో తీసు కుపోయి ఒకరి తర్వాత ఒకరిని కాల్చుకుంటూ పోయారు. బుల్లెట్ గాయాలతో నెత్తురోడు తున్నవారిని కాలువలోకి విసిరేశారు. వీరిలో అయిదుగురు చనిపోయినట్టు నటించి ప్రాణాలు కాపాడుకున్నారు. మన దేశంలో న్యాయం ఎలా నత్తనడకన సాగుతుందో చెప్పడానికున్న అనేక ఉదాహరణల్లో ఈ హాషింపురా నరమేథం ఒకటి. ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగిందో, ఎంత నిర్లక్ష్యానికి గురైందో, బాధిత కుటుంబాలు ఎంత క్షోభకు గురయ్యాయో గమనిస్తే ఎలాంటివారైనా దిగ్భ్రమచెందుతారు. సమాజాన్ని అల్లకల్లోలం చేసే ముఠాల బారినుంచి కాపాడటానికి అవసరమైన శిక్షణనిచ్చి యూనిఫాంనూ, ఆయుధాన్నీ ఇచ్చి పంపితే కొందరు సిబ్బంది తమ బాధ్యతల్ని గాలికొదిలి ఉద్దేశపూర్వకంగా ఊచకోతకు పాల్పడిన దురంతమది. ఆనాటి జిల్లా ఎస్పీ విభూతి నారాయణ్ రాయ్ ఈ ఉదంతం గురించి తెలుసుకుని చలించి, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఆయన్ను తీసుకుని రాత్రికి రాత్రే అక్కడికి వెళ్లారు. మృతదేహాల మధ్య కొన ఊపిరితో ఉన్న అయిదుగురిని గమనించి ఆసుపత్రికి పంపి కాపాడారు. ఆ సమయానికి మీరట్ నగరం మీదుగానే వెళ్తున్న అప్పటి ముఖ్యమంత్రి వీర్బహదూర్సింగ్ను ఆపి ఆయనకు దీన్ని గురించి వివరించారు. విభూతి నారా యణ్ ఎంతో శ్రద్ధపెట్టి దుండగులపై కేసులు పెట్టకపోయి ఉంటే ఇదసలు వెలుగుచూసేదే కాదు. కానీ విచారకరమేమంటే, ఆ తర్వాత దర్యాప్తు ప్రక్రియనంతటినీ వీర్‌బహదూర్ నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఫలితంగా నిందితులంతా సులభంగా తప్పించుకోగలిగారు. బాధిత కుటుం బాలన్నీ ఎంతో పట్టుదలగా పోరాడి ఉండకపోతే... ఈ ఉదంతంలో గాయపడిన పదిహేడేళ్ల బాలుడు జుల్ఫికర్ నాసిర్ బెదిరింపులను బేఖాతరు చేస్తూ గత 31 ఏళ్లుగా న్యాయస్థానాల చుట్టూ తిరిగి ఉండకపోతే బుధవారంనాటి తీర్పు వెలువడేది కాదు. అతడిచ్చిన తిరుగులేని సాక్ష్యాధారాల వల్లే దోషులకు ఇన్నాళ్లకైనా శిక్ష పడింది. నిందితులు 19 మందిలో ముగ్గురు చనిపోగా మిగిలిన వారికి ఇప్పుడు శిక్షలు పడ్డాయి. విభూతి నారాయణ్ చెబుతున్న ప్రకారం ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాలు లేకుండా వీరు ఇంతగా బరితెగించరు. ఈ నరమేథంపై రెండేళ్లక్రితం ఆయన వెలువరిం చిన పుస్తకం సంచలనం సృష్టించింది. నేరాల దర్యాప్తు, న్యాయస్థానాల్లో వాటి విచారణ ఏళ్ల తరబడి సాగటం వల్ల కలిగే నష్టం అంతా ఇంతా కాదు. దర్యాప్తులో బయటికొచ్చిన అనేక అంశాలకు సంబంధించిన ఫైళ్లు మాయం చేయడానికి నేరగాళ్లకు వీలవుతుంది. హాషింపురా దురంతంలో జరిగిన సీఐడీ దర్యాప్తులో కొందరు అధికారుల పేర్లున్నట్టు తమకు తెలుసునని, అవన్నీ కాలక్రమంలో మాయం చేశారని రిటైర్డ్ పోలీసు అధికారులు చెబుతున్న మాట. అప్పట్లోని కాంగ్రెస్ ప్రభుత్వమూ, అనంతరకాలంలో వచ్చిన బీజేపీ, బీఎస్పీ, ఎస్పీ తదితర పక్షాల నేతృత్వంలోని ప్రభుత్వాలు కూడా న్యాయస్థానాల పోరు పడలేక అయిష్టంగా కేసు నడిపించినా... అందులో నిందితులుగా ఉండాల్సిన ఉన్నతాధికారుల పేర్లు మాయం చేశాయి. నిందితుల జాబితాలో ఉన్నవారికి పదోన్నతులిస్తూ పోయాయి. వారి సర్వీసు రికార్డుల్లో ఈ కేసులో నిందితులుగా ఉన్నారన్న ప్రస్తావనే లేదు. న్యాయస్థానం పదే పదే మందలించాకగానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చేయలేదు. ఆ వచ్చినవారు సైతం ఒకటికి రెండుసార్లు న్యాయస్థానం మందలించాకగానీ ఈ కేసుపై సరైన శ్రద్ధపెట్టలేదు. పట్టపగలు హత్యా కాండ సాగించినవారిని శిక్షించడానికి కూడా మూడు దశాబ్దాలకుపైగా సమయం పట్టిందంటే మన దేశంలో నేర న్యాయ వ్యవస్థ ఏ స్థితిలో ఉందో అర్ధమవుతుంది. ఇప్పుడు వెలువడిన ఢిల్లీ హైకోర్టు తీర్పుతో హాషింపురా కేసు ముగిసినట్టు కాదు. ఇప్పుడు శిక్షపడినవారంతా సుప్రీంకోర్టుకు వెళ్తామం టున్నారు. కనుక ఇది మరి కొన్నేళ్లు నడుస్తుంది. అన్యాయానికి గురైనామని భావించేవారికి సకా లంలో న్యాయం అందించగలిగితే వారికి వ్యవస్థపై నమ్మకం కలుగుతుంది. అది దక్కనప్పుడు వారు అసహనానికీ, ఆగ్రహావేశాలకూ లోనవుతారు. ఇతరేతర మార్గాలు ఆశ్రయిస్తారు. పర్య వసానంగా సమాజం అల్లకల్లోలమవుతుంది. పాలకులు దీన్ని దృష్టిలో ఉంచుకుని మెలగాలి. -
‘ముస్లింల గురించి మాట్లాడకపోవడమే మంచిది’
సాక్షి, న్యూఢిల్లీ : ముస్లిం కమ్యూనిటీ గురించి తరచుగా మాట్లాడకపోవడమే మంచిదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ముస్లిం పెద్దలు సూచించారు. జాతీయ మీడియా కథనం ప్రకారం... ముస్లిం వర్గానికి చెందిన పలువురు మేధావులతో రాహుల్ గాంధీ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై రెండు గంటల పాటు చర్చలు జరిపారు. తరచుగా ఆలయాలను సందర్శించడం గురించి ప్రశ్నించగా.. తాను ఆలయాలతో పాటు, మసీదులు, చర్చిలు కూడా సందర్శిస్తున్నానని రాహుల్ సమాధానం ఇచ్చారు. అయితే మీడియా కేవలం ఆలయ సందర్శనలకు సంబంధించిన వార్తలను మాత్రమే ప్రముఖంగా ప్రచారం చేస్తోందని రాహుల్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అన్ని వర్గాలకు లబ్ది చేకూరేలా... ఈ సమావేశంలో చరిత్రకారుడు సయీద్ ఇర్ఫాన్ హబీబ్, విద్యావేత్త అబూసలే షరీఫ్, రచయిత ఫరా నఖ్వీ, మాజీ ఐఏఎస్ అధికారి ఎం ఎఫ్ ఫారూఖీతో పాటు ఏఐసీసీ మైనార్టీ చీఫ్ నదీమ్ జావేద్, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఇర్ఫాన్ హబీబ్ మాట్లాడుతూ... ‘ముస్లిం కమ్యూనిటి గురించి రాహుల్ గాంధీ తరచుగా మాట్లాడుతూ ఉండటం వల్ల ప్రత్యర్థులు ఆయనను ఒక వర్గానికి సానుభూతిపరునిగా చిత్రీకరించేందుకు అవకాశం ఇచ్చినట్లు అవుతోంది. మా గురించి మాట్లాడే కంటే పేదరికం, విద్య ఇలా ఇతర అంశాల గురించి మాట్లాడాల్సిందిగా సూచించాం. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై దృష్టి సారించి పార్టీని బలోపేతం చేయడం ద్వారా అన్ని వర్గాలకు లబ్ది చేకూరుతుందని రాహుల్‌కు చెప్పామని’ వ్యాఖ్యానించారు. -
లీడర్ ఎవరో తేల్చుకోవాలి..
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీఏకు వ్యతిరేకంగా ఏకమయ్యే విపక్షాలు ఎవరి నాయకత్వాన పోరాడుతాయో త్వరగా తేల్చుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ సూచించారు. ఎన్నికల అనంతరం నంబర్ గేమ్, రాయబేరాల చుట్టూ రాజకీయాలు తిరిగే అవకాశం ఉన్నందున ఎన్నికలకు ముందే విపక్ష పార్టీలు అవగాహనకు రావాలని ఆకాంక్షించారు. ఎన్నికలకు ముందే పొత్తులపై విపక్షాలు అవగాహనకు రావాలని అన్నారు. విపక్ష శిబిరంలో విభేదాలు సృష్టించేందుకు బీజేపీ కుయుక్తులకు పాల్పడే అవకాశం ఉన్నందున తగిన సమయంలో నాయకత్వంపై ఓ నిర్ణయానికి రావాలని విపక్షాలకు సూచించారు. ‘మనందరికీ (విపక్షాలు) మన నాయకుడే కీలకం.. విపక్షాలను ముందుకు నడిపే పార్టీగా కాంగ్రెస్ అన్ని పార్టీల కంటే ముందువరుసలో ఉంటుంద’ని అన్నారు. అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ నాయకత్వ అంశంపై విపక్షాలన్నీ త్వరలో ఓ నిర్ణయానికి రావాలని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో సంకీర్ణం అవసరమని అభిప్రాయపడ్డారు. సంకీర్ణంపై ఏకాభిప్రాయం ఉంటే..ఆ దిశగా సంకీర్ణ సర్కార్ దిశగా విపక్షాలు అడుగులు వేయాలని పిలుపు ఇచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఉద్వేగభరిత ప్రసంగాలను ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్నకు బదులిస్తూ తమకూ మంచి కథలు చెప్పే వక్త కావాలని వ్యాఖ్యానించారు. -
ప్రియాంక కాంగ్రెస్‌లో కీలకంగా ఉంటారు కానీ..
న్యూఢిల్లీ: ప్రియాంక వాద్రా పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారనీ ఇకపైనా ఆమె అదేవిధంగా ఉంటారని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. అయితే, ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తారనేందుకు ఇది సూచన మాత్రం కాదని తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక ముఖ్యభూమిక పోషిస్తారంటూ ముఖ్యనేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై మరో నేత అభిషేక్ సింఘ్వి వివరణ ఇచ్చారు. ‘ప్రస్తుతం ప్రియాంక పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భవిష్యత్తులోనూ ఆమె పాత్ర కొనసాగుతుంది. అయితే, దానర్థం ప్రియాంక క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారు, ఎన్నికల్లో పాల్గొంటారని మాత్రం కాదు’అని తెలిపారు. -
ఖుర్షీద్ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ సీఎం
శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఇటివల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. ఇటివల అలీగడ్ ముస్లిం యూనివర్సిటీలో సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ చేతులకు ముస్లింల రక్తపు మరకలు’ అని చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీల నేతలు గమనించాలని, ఇకనైన కనువిప్పు కలగాలని ఆయన కోరారు. ‘ఖుర్షీద్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా.. ఇలాంటి పరిస్థితిని తిరిగి రానివ్వకూడదు. గతంలో చేసిన తప్పుల్ని నేతలు మళ్లీ జరగకుండా చుసుకోవాలి. రాజకీయ నాయకత్వం, రాజకీయ పక్షపాతాన్ని పక్కనపెట్టి, కశ్మీర్‌కు జరిగిన అన్యాయాన్ని, కశ్మీర్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలి. ఇంత వరకూ చేసిన తప్పుల్ని ఒప్పుకుని ప్రజలను క్షమాపణలు కోరాలి ’ అని అన్నారు. దేశంలోని ముస్లింలు నిస్వార్థంతో పనిచేస్తున్నారు. వారికి శాంతి, సామరస్యం తప్ప మరొకటి తెలియదని ఫరూక్ అన్నారు. ముస్లింల గతమంతా అన్యాయం, అసమానత్వం, దురభిప్రాయం వంటి అంశాలతోనే ముడిపడి ఉంది. ప్రస్తుతం ముస్లింలు గౌరవంగా బతుకుతున్నారని అబ్దుల్లా పేర్కొన్నారు. -
కాంగ్రెస్ చేతులపై ముస్లింల రక్తపు మరకలు
అలీగఢ్: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సొంత పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ చేతులకు ముస్లింల నెత్తుటి మరకలున్నాయి.. ’అని వ్యాఖ్యానించి వివాదం సృష్టించారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో జరిగిన సమావేశంలో ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమిర్ అనే విద్యార్థి.. కాంగ్రెస్ పాలనలోనే మతపరమైన అల్లర్లు ఎక్కువగా జరిగాయి కదా అని ఖుర్షీద్‌ను ప్రశ్నించాడు. ఇందుకు సమాధానంగా ఆయన ‘ఇది రాజకీయ ప్రశ్న. నిజమే మా చేతులకు ముస్లింల నెత్తుటి మరకలు అంటుకున్నాయి. ఆ పార్టీకి చెందిన నాయకుడిగా నాకూ అందులో భాగం ఉన్నట్టు భావిస్తున్నా’ అన్నారు. ఈ క్రమంలో ఆమిర్ మరిన్ని ప్రశ్నలు సంధించాడు. ‘1948లో ఏఎంయూ చట్టానికి చేసిన సవరణల వల్ల ముస్లిం దళితలు ఎస్సీ, ఎస్టీ కోటా ద్వారా పొందే రిజర్వేషన్‌కు దూరం అయ్యారు. హసన్‌పురా, మల్యానా, మీరట్, ముజఫర్ నగర్, భాగల్పూర్, మొరాదాబాద్, అలీగఢ్‌లలో ముస్లిం వ్యతిరేక అల్లర్లు.. బాబ్రీ మసీదులో విగ్రహాలు పెట్టడం, మసీదు కూల్చివేత కూడా కాంగ్రెస్ పాలనలోనే జరిగాయి కదా. మరి ఆ నెత్తుటి మరకలను కాంగ్రెస్ ఎలా శుభ్రం చేసుకోగలదు’ అంటూ ఆమిర్ ప్రశ్నిం చాడు. అయితే తానొక వ్యక్తిగా మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశానని, గతం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలని ఖుర్షీద్ బదులిచ్చారు. చరిత్ర నుంచి తప్పొప్పులను గ్రహించి, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేయాలని అన్నారు. ఖుర్షీద్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడినట్టయింది. ఈ నేపథ్యంలో అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీకి ఆ వ్యాఖ్యలతో సంబంధం లేదని చెప్పింది. -
‘వారి నెత్తుటితో మా పార్టీ తడిసిపోయింది’
అలీఘర్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సొంత పార్టీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ముస్లింల నెత్తుటి మరకలతో తడిసిపోయిందంటూ’ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో భాగంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆమిర్ మింటో అనే విద్యార్థి.. ‘కాంగ్రెస్ పాలనలోనే మతపరమైన అల్లర్లు ఎక్కువగా జరిగాయి కదా’ అంటూ సల్మాన్ ఖుర్షీద్‌ను ప్రశ్నించాడు. ఇందుకు సమాధానంగా.. ‘కాంగ్రెస్ పార్టీకి ముస్లింల నెత్తుటి మరకలు అంటుకున్నాయి. ఆ పార్టీకి చెందిన నాయకుడిగా నాకు కూడా అందులో భాగం ఉన్నట్టుగా భావిస్తున్నా’ అంటూ సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. సల్మాన్ సమాధానం విన్న తర్వాత ఆమిర్ మింటో మరిన్ని ప్రశ్నలు సంధించాడు. ‘1948లో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎమ్యూ) చట్టానికి చేసిన సవరణల వల్ల ముస్లిం దళితలు ఎస్సీ, ఎస్టీ కోటా ద్వారా పొందే రిజర్వేషన్‌కు దూరం అయ్యారు. హషీమ్పురా, మల్యానా, మీరట్, ముజఫర్ నగర్, భగల్పూర్, మొరదాబాద్, అలీఘర్‌లలో ముస్లిం వ్యతిరేక అల్లర్లు.. బాబ్రీ మసీదు కూల్చివేత కూడా కాంగ్రెస్ పాలనలో జరిగింది కదా. మరి మీరన్నట్టు ఆ నెత్తుటి మరకలను కాంగ్రెస్ పార్టీ ఎలా శుభ్రం చేసుకోగలదు’ అంటూ ఆమిర్ మింటో ప్రశ్నించాడు. అయితే తానొక వ్యక్తిగా మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశానని, తాను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిని కాదని, తానే కాంగ్రెస్ పార్టీ అంటూ సమధానమిచ్చారు. సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడినట్లయింది. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ ‘కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే సమయం ఆసన్నమైందంటూ’ విమర్శించారు. -
‘బీజేపీకి కౌంట్‌డౌన్ మొదలైంది’
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ పతనం ఆరంభమైందని, ఆ పార్టీకి 2014లో అధికారంలోకి వచ్చినప్పటి ఆదరణ తుడిచిపెట్టుకుపోతోందని సీనియర్ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. దళితుల నిరసనలు, రైతుల ఆందోళన, పలు కుంభకోణాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో బీజేపీ తిరిగి 2019లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎంతమాత్రం లేవన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు బీజేపీకి అత్యంత సంక్లిష్టమైనవని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో సామాజిక అశాంతి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలు, దళితులపై బీజేపీ సాగిస్తున్న అణిచివేతకు వ్యతిరేకంగా ఆయా వర్గాలు నిరసనలతో ముందుకొస్తున్నాయన్నారు. దళితుల నిరసనలు దేశం దృష్టిని ఆకర్షించాయని చెప్పారు. బీజేపీ ప్రతిష్ట క్రమంగా మసకబారుతోందని, రాబోయే కర్ణాటక, రాజస్ధాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి కాంగ్రెస్ దీటైన పోటీ ఇవ్వనుందన్నారు. ఈ మూడు రాష్ట్రాలూ కాంగ్రెస్ హస్తగతమవుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించేందుకు విపక్షాలు ఏకతాటిపైకి రావడం కీలకమన్నారు. -
అబద్ధాల్లో మోదీ, కేసీఆర్ ఇద్దరూఇద్దరే
ఏఐసీసీ మైనారిటీ సెల్ చైర్మన్ సల్మాన్ ఖుర్షీద్ సాక్షి, హైదరాబాద్: అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడంలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ ఇద్దరేనని ఏఐసీసీ మైనారిటీ సెల్ చైర్మన్ సల్మాన్ ఖుర్షీద్ విమర్శించారు. పార్టీ నేతలతో కలసి సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. మోదీ మూడేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమన్నారు. రైతులపై దాడులు, గోరక్ష పేరుతో అమాయకులను పొట్టన పెట్టుకోవడం వంటి కిరాతక చర్యలకు హద్దులేకుండా పోయిందన్నారు. ముస్లిం మహిళలకు సంబంధించిన తలాఖ్ గురించి మాట్లాడుతున్న మోదీ, తన వ్యక్తిగత జీవితంలో భార్య గురించి ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. మోదీ పాలన కారణంగా విదేశీ పెట్టుబడులు రావడంలేదన్నారు. ఇతర పార్టీలకు చెందిన ప్రభుత్వాలను కూలదోయడం, ఏదో విధంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే మోదీ పనిగా పెట్టుకున్నారన్నారు. అవినీతి గురించి మాట్లాడుతున్న ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా తన అవినీతిని ఎందుకు చెప్పుకోవడంలేదని ప్రశ్నించారు. -
‘తలాక్’ మతపరమైనదా? కాదా?
ఇస్లాం ప్రాథమికాంశాల్లో దీని ప్రస్తావనపై చర్చిస్తాం : సుప్రీంకోర్టు ► బహుభార్యత్వాన్ని స్పృశించం ► నిఖా హలాలాపైనా విచారణ ► ట్రిపుల్ తలాక్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ► ఇస్లాం దేశాల్లో ట్రిపుల్ తలాక్ లేదు: పిటిషనర్లు ► భార్యాభర్తల రాజీతోనే తలాక్ అన్న సల్మాన్ ఖుర్షీద్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా పద్ధతుల రాజ్యాంగ బద్ధతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ ప్రారంభించింది. ఈ సంప్రదాయం ఇస్లాం ప్రాథమికాంశమా? కాదా? అనే అంశంపైనే మొదటగా చర్చ జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ‘ట్రిపుల్ తలాక్ సంస్కారబద్ధమైనదేనా? ముస్లింల ప్రాథమిక హక్కుగా దీన్ని అమలుచేయవచ్చా? అనే అంశాలపైనే ప్రాథమికంగా చర్చ జరగనుంది. ఒకవేళ ట్రిపుల్ తలాక్ ఇస్లాంలోని మూలసూత్రమే అని నిర్థారణ అయితే అప్పుడు దీని రాజ్యాంగ బద్ధతను కోర్టు ప్రశ్నించదు. కానీ రాజ్యాంగం ప్రకారం ముస్లింల ప్రాథమిక హక్కుగా ట్రిపుల్ తలాక్‌ను భావించొచ్చా అనే అంశంపైనా చర్చ జరుగుతుంది’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ముస్లింలలోని బహుభార్యత్వానికి ట్రిపుల్ తలాక్‌తో సంబంధం లేనందున ఈ అంశాన్ని చర్చించదలచుకోలేదని వెల్లడించింది. సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహర్ (సిక్కు) తోపాటుగా జస్టిస్ కురియన్ జోసెఫ్ (క్రిస్టియన్), జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ (పార్శీ), జస్టిస్ యుయు లలిత్ (హిందు), జస్టిస్ అబ్దుల్ నజీర్ (ముస్లిం) (ఒక్కో మతం నుంచి ఒక్కరు చొప్పున) ఈ రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఇస్లామిక్ సిద్ధాంతాలకు వ్యతిరేకం పిటిషనర్లలో ఒకరైన సైరా బానో తరఫున సీనియర్ న్యాయవాది అమిత్ సింగ్ చద్దా ట్రిపుల్ తలాక్‌పై వాదనలు ప్రారంభించారు. ఈ సంప్రదాయం ఇస్లాం ప్రాథమికాంశం కాదని.. దీన్ని తొలగించవచ్చని తెలిపారు. మన పొరుగు ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో అనుసరిస్తున్న విధానాలను ఆయన గుర్తుచేస్తూ.. ట్రిపుల్ తలాక్ ఇస్లామిక్ సిద్ధాంతాలకు వ్యతిరేకమన్నారు. ఈ అంశంలో కోర్టుకు సహాయకారిగా ఉన్న సీనియర్ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అసలు ట్రిపుల్ తలాక్ వివాదమే కాదని.. భార్య, భర్తల మధ్య రాజీతోనే విడాకులకు మంజూరవుతాయన్నారు. అయితే రాజీ తర్వాత జరిగే ట్రిపుల్ తలాక్లన్నీ వ్యవస్థ ప్రకారమే జరుగుతున్నాయా అన్న ధర్మాసనం ప్రశ్నకు ఖుర్షీద్ సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) తరపున వాదిస్తున్న కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ కూడా ఖుర్షీద్ వ్యాఖ్యలతో ఏకీభవించారు. ‘సమానత్వం కోసం ముస్లిం మహిళలకు పోరాటం’ అంశంపైనా చర్చించనున్నట్లు ఈ సందర్భంగా ధర్మాసనం తెలిపింది. తలాక్ సందర్భంగా ముస్లిం మహిళలు లింగవివక్షకు గురవుతున్నారా? అని కూడా కోర్టు ప్రశ్నించింది. నిఖా హలాలా (భార్యాభర్తల మధ్య తలాక్ అయిన తర్వాత మళ్లీ ఆమెనే భర్త పెళ్లి చేసుకోవాలనుకుంటే.. అంతకుముందు భార్యకు వేరే వ్యక్తితో వివాహం జరిపి తలాక్ తీసుకోవాలి. ఇది షియా సంప్రదాయంలో మాత్రమే అమలవుతోంది) పైనా విచారణ జరపనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. రెండుగా చీలిన ఇస్లాం సమాజం సుప్రీంకోర్టులో ట్రిపుల్ తలాక్‌పై చర్చతో ఇస్లాంలోని సంప్రదాయవాదులు, సంస్కరణలను కోరుకునేవారి మధ్య స్పష్టమైన అంతరం కనిపించింది. మత విశ్వాసాలకు సంబంధించిన అంశాన్ని మత సమావేశాల్లోనే చర్చించుకోవాలని ఓ వర్గం.. ముస్లిం మహిళలను న్యాయవ్యవస్థ ద్వారానే న్యాయం జరుగుతుందని మరోవర్గం తమ అభిప్రాయాలను తెలిపాయి. ‘ఇస్లాం ప్రవక్తలు గొప్పవారా? కొందరు ముల్లాల చేతుల్లోని ఇస్లాం గొప్పదా? అనే అంశం తేలిపోయే సమయం ఆసన్నమైంది. చాలా ముస్లిం దేశాలు ట్రిపుల్ తలాక్‌ను ఎప్పుడో పక్కనపెట్టేశాయి. షియా సంప్రదాయంలో ట్రిపుల్ తలాక్‌కు చోటు లేదు’ అని ఆలిండియా షియా పర్సనల్ లాబోర్డు వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ముస్లిం మహిళలకు మంచిరోజులు ప్రారంభమవుతాయని భావిస్తున్నట్లు ఆలిండియా ముస్లిం ఉమెన్ పర్సనల్ లా బోర్డు అధ్యక్షురాలు షియాస్తా అంబర్ తెలిపారు. అయితే కొందరు మతపెద్దలు మాత్రం ఈ అంశాన్ని తెరపైకి తేవటంలో రాజకీయ కుట్రకోణం దాగుందని విమర్శించారు. ముస్లిం సమాజం ఇలాంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు సుప్రీంకోర్టు మరింత సమయం ఇవ్వాలని ఆలిండియా ముస్లిం మజ్లిసే ముషావరాత్ అభిప్రాయపడింది. ట్రిపుల్ తలాక్ ‘ముస్లిం పర్సనల్ లా’లో భాగమని అయితే దీన్ని దుర్వినియోగం చేయటం పాపమని ఏఐఎంపీఎల్బీ తెలిపింది. కేవలం 0.1 శాతం మంది మాత్రమే దీన్ని దుర్వినియోగం చేస్తున్నారని వెల్లడించింది. అయితే ట్రిపుల్ తలాక్‌ను మత విశ్వాసం కన్నా సామాజిక రుగ్మతగా చూడాలని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. -
''భారత్ మాతాకీ జై' బలవంతంగా అనిపించొద్దు'
న్యూఢిల్లీ: 'భారత మాతా కి జై' అనే నినాద వివాదంలో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కూడా తలదూర్చారు. ఆ నినాదం ఇవ్వడమనేది వారి వ్యక్తిగత విషయం అని, ఏ ఒక్కరూ ఆ నినాదం చేయాలని బలవంతపెట్టకూడదని అన్నారు. 'మన జాతీయ జెండా ఎగురుతున్నప్పుడు దాన్ని చూస్తూ జాతీయ గీతం ఆలపిస్తుంటే.. వందేమాతరం పాడుతుంటే గర్వంగా అనిపిస్తుంటుంది. కానీ కొంతమంది అలా చేయబోమని అంటారు. అది వారి ఇష్టం' అని విశ్వవిద్యాలయాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనే అంశంపై ప్రసంగిస్తూ అన్నారు. తన మెడపై కత్తి పెట్టి బెదిరించినా సరే తాను మాత్రం భారత్ మాతాకి జై అనే మాటలు అనబోనని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాతే ఖుర్షీద్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
వారి వ్యాఖ్యలపై వెంకయ్య అభ్యంతరం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేతలు మణిశంకర్ అయ్యర్, సల్మాన్ ఖుర్షిద్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు స్పందించారు. వారిద్దరూ చేసిన వ్యాఖ్యలు రాజద్రోహం, జాతిని అవమానించేలా ఉన్నాయని అన్నారు. అయ్యర్, ఖుర్షిద్ పై కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ పట్ల ఎన్డీఏ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభిస్తోందని ఖుర్షిద్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ తో చర్చలు పునరుద్ధరిస్తే ప్రధాని నరేంద్ర మోదీని తప్పించాలని అయ్యర్ అన్నారు. వీరి వ్యాఖ్యలపై వెంకయ్య నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. పొరుగు దేశానికి అనుకూలంగా మాట్లాడుతూ ప్రజాస్వామికంగా ఎన్నికైన స్వదేశీ ప్రధానిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం జాతిని అవమానించడమేనని అన్నారు. అయ్యర్, ఖుర్షిద్ వ్యాఖ్యలను ఖండించి.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. -
'వాళ్లిద్దరూ ఐఎస్ఐఎస్ ప్రచారకర్తలు'
కాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్, సల్మాన్ ఖుర్షీద్ ఇద్దరూ ఐఎస్ఐఎస్ ప్రచారకర్తలంటూ బీజేపీ తీవ్రంగా మండిపడింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ విమర్శలను ఖండిస్తూ బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోందని, ప్రధానమంత్రి ఈ విషయంలో చెబుతున్న మాటలకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించిందని ఆమె అన్నారు. ప్యారిస్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో 130 మంది మరణించినా, కాంగ్రెస్ వాళ్లు మాత్రం ఐఎస్ఐఎస్, తాలిబన్లకు ప్రచారకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. భారత్- పాక్‌ల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన తొలగిపోవాలంటే ముందు మోదీని తొలగించి తమను అధికారంలోకి తీసుకురావాలని మణిశంకర్ అయ్యర్ ఓ పాకిస్థానీ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. దీనిపైనే బీజేపీ మండిపడింది. అలాగే విదేశాంగ శాఖ మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్ కూడా గత వారం పాకిస్థాన్‌లో ఉండి ప్రధానమంత్రిపై విమర్శలు చేయడంతో ఆయనపైనా మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రెండు దశాబ్దాలుగా బిహార్‌లో ఓటమి అనుభవం లేదని, అలాగే ఆయనకు తనను ఆరాధించే వాళ్లతో తప్ప ఇతరులతో మాట్లాడటం పెద్దగా రాదని ఖుర్షీద్ పాకిస్థాన్‌లోని జిన్నా ఇన్స్టిట్యూట్లో చేసిన ప్రసంగంలో అన్నారు. ఈ తరహా వ్యాఖ్యలపై బీజేపీ మండిపడి.. కాంగ్రెస్ నేతలను తాలిబన్లు, ఐఎస్ఐఎస్ ప్రచారకర్తలుగా అభివర్ణించింది. -
'వ్యక్తులుగా పాకిస్థాన్‌ను గెల్చుకోలేం'
న్యూఢిల్లీ: 120 కోట్ల మంది భారతీయులు ఒక్కటిగా నిర్ణయం తీసుకుంటే తప్ప దాయాది పాకిస్థాన్ విషయంలో విజయం సాధించలేమని, ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఈ విషయంలో వ్యక్తిగతంగా ఎవ్వరూ విజయం సాధించలేరని విదేశాంగ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సాల్మన్ ఖుర్షీద్ అన్నారు. 'ఇలాంటి సందర్భంలో అందరి భాగస్వామ్యం అవసరం. అలా కాని పక్షంలో అది సగంమంది ప్రజల అభిప్రాయంగా మాత్రమే పరిగణలో ఉంటుంది. మోదీ అనుసరిస్తున్న పోలీస్‌మెన్ ఫారిన్ పాలసీతో పాక్‌ను దారికి తెచ్చుకోం' అని ఆదివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుర్షీద్ అన్నారు. ఏడాది కాలంగా ప్రధాని మోదీ పలు విదేశీ పర్యటనలు చేశారని, వాటివల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం ఒనగురలేదని ఎద్దేవాచేశారు. -
మైనార్టీ రిజర్వేషన్లు ఏమయ్యాయి?
కేసీఆర్ హామీని నిలబెట్టుకోవాలి: ఏఐసీసీ నేత సల్మాన్ ఖుర్షీద్ లేకుంటే టీపీసీసీ పోరాటం హైదరాబాద్: మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామనే హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకోవాలని ఏఐసీసీ నేత, కేంద్ర మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. టీపీసీసీ మైనారిటీ సెల్ గాంధీభవన్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం హామీని నిలబెట్టుకోకుంటే మైనారిటీల పక్షాన ప్రతిపక్ష పార్టీగా పోరాడాల్సిన బాధ్యత టీపీసీసీపై ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జనాభా ప్రకారం 12 శాతం రిజర్వేషన్లు సాధ్యమేనని చెప్పారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమలు చేయాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించినా... న్యాయ వివాదాల వల్ల సాధ్యం కాలేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోగానే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీనిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్... 14 నెలలు పూర్తయినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకుంటామని, వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలను ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని అడిగారు. ‘‘మాయ మాటలు చెప్పి, రంగుల ప్రపంచం చూపించి కేసీఆర్ మోసం చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో స్వచ్ఛ హైదరాబాద్‌ను చేపడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలో కుటుంబ సభ్యులను చేర్పించుకోవడానికి మోదీతో స్నేహం కోసం ప్రయత్నిస్తున్నారు’’ అని దుయ్యబట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తి కాగానే, కేంద్రంలో టీఆర్ఎస్ చేరిపోతుందన్నారు. ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా మాట్లాడుతూ.. ఎంఐఎంతో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలను మరిపించడానికి ఇనాములు, బట్టలు ఇస్తూ ముస్లింలను కేసీఆర్ మోసం చేస్తున్నారని మండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ విమర్శించారు. ఈ సమావేశంలో టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ వి.హనుమంతరావు, టీపీసీసీ మైనారిటీసెల్ అధ్యక్షుడు ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ్ ఇఫ్తార్ విందు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి శనివారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. నాంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ విందు కార్యక్రమంలో పార్టీ నేతలు సల్మాన్ ఖుర్షీద్, ఎస్.జైపాల్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, కోదండరెడ్డి, దానం నాగేందర్, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు ఎంపీ సందీప్ దీక్షిత్, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, అజీజ్ పాషా, ఎమ్మెల్సీ ఫారుఖ్, ఎంబీటీ ప్రతినిధి అమ్జదుల్లా ఖాన్, పలువురు ఎమ్మెల్యేలు, మత పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హజరు కావడానికి వచ్చిన మాజీ మంత్రి శశిధర్‌రెడ్డి... వేదికపై ఉన్న నాయకులను చూసి ప్రాంగణం నుంచి వెను తిరిగారు. ఇది గమనించిన షబ్బీర్ అలీ.. శశిధర్‌ను వేదికపైకి రావాలని పిలిచినా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. -
'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది'
హైదరాబాద్: ముస్లింలను ఓటుబ్యాంకుగా కాంగ్రెస్ పార్టీ ఏనాడు చూడలేదని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ వ్యవహరించిందని చెప్పారు. పీసీసీ మైనార్టీ సమ్మేళంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని గుర్తుచేశారు. ముస్లింలకు రిజర్వేషన్ల అంశంలో దేశానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. -
రేపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో మైనారిటీ సమ్మేళనం
హాజరు కానున్న దిగ్విజయ్ సింగ్, సల్మాన్ ఖుర్షీద్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మైనారిటీ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. సికింద్రాబాద్‌లో నిర్వహించనున్న ఈ సమావేశానికి ఏఐసీసీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఏఐసీసీ మైనారీటీ సెల్ చైర్మన్ ఖుర్షీద్ అహ్మద్, రాష్ర్ట ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, కార్యదర్శి ఆర్.సి. కుంతియా పాల్గొననున్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మైనారిటీల పట్ల అనుసరిస్తున్న విధానాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఇదిలా ఉండగా, డిసెంబర్ 31వ తేదీ వరకు జరగనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కూడా పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆదివారం సమీక్షించనున్నారు. -
అవసరమైతే ‘మూడు’కు మద్దతు
కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఫరూఖాబాద్/కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలయ్యాక అవసరమైతే కాంగ్రెస్ మూడో కూటమి మద్దతు తీసుకుంటుందని లేదంటే ఆ కూటమికే మద్దతు ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తుందని కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఆ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ పరోక్షంగా చెప్పారు. శనివారం ఖుర్షీద్ ఫరూఖాబాద్‌లోని పీతౌరమ్లోను, సింఘ్వీ కోల్కతాలోను విలేకరులతో మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే అవకాశాలు అతి తక్కువగా ఉన్నాయని, కాంగ్రెస్ మూడో కూటమితో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వీరి మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఖుర్షీద్ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ బీజేపీకే పెద్ద సమస్యగా మారనున్నారని అన్నారు. సింఘ్వీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎప్పుడూ సొంత బలంతో పోరాడుతుందని, అయితే ఎన్నికల తర్వాత వచ్చే సంఖ్యాబలాన్ని బట్టే ప్రభుత్వ ఏర్పాటు ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. అవసరమైతే లౌకికవాద పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశముందని చెప్పారు. కాగా కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం మాత్రం మూడో కూటమికి మద్దతిచ్చే అంశాన్ని తోసిపుచ్చారు. ఎన్నికల తర్వాత యూపీఏ-3 ప్రభుత్వం కచ్చితంగా ఏర్పడుతుందని ఆయన ఉద్ఘాటించారు. ‘‘మేం గెలిచే ఉద్దేశంతో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతోనే ఎన్నికలకు వెళుతున్నాం’’ అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు : మమత సోనార్పూర్ (పశ్చిమబెంగాల్): కేంద్రంలో మూడో కూటమి అధికారంలోకి రాకూడదని కాంగ్రెస్, బీజేపీలు కోరుకుంటున్నాయని, అందుకే ఆ పార్టీలు రెండూ కుమ్మక్కు ఆటలు ఆడుతున్నాయని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శనివారం దక్షిణ 24 పరగణాల జిల్లాలో జరిగిన సభలో ఆరోపించారు. -
'నర్సరీ బాలుడిలా మోడీ ప్రవర్తిస్తున్నారు'
ఫరూకాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ మరోసారి మోడీపై మండిపడ్డారు. గుజరాత్ అల్లర్లను అరికట్టలేకపోయిన నపుంసకుడిగా అభివర్ణిస్తూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన మరోసారి మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాటి అల్లర్ల కేసులో దిగువ కోర్టు తనకు క్లీన్చిట్ ఇచ్చిందన్న మోడీని ఓ నర్సరీ బాలుడితో పోలుస్తూ ఎద్దేవా చేశారు. ‘మోడీకి క్లీన్చిట్ ఎవరిచ్చారో నాకైతే తెలియదు. మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేయలేదు. అది మాత్రం నిజమే. కానీ మోడీ తీరు నర్సరీలో మంచి మార్కులు తెచ్చుకున్న బాలుడు తానేదో డాక్టర్ అయిపోయి పీహెచ్డీ కూడా పొందానని భావిస్తున్నట్లు ఉంది. ఇది సాధ్యం కాదు కదా’ అని ఫరూకాబాద్‌లో మంగళవారం వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ అల్లర్ల ఘటనకు నైతిక బాధ్యత వహించకుండా మోడీ తప్పించుకోజాలరని శరద్ పవార్ బుధవారం ఓ ఆంగ్ల వార్తాచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. -
'ఎన్నికల కోడ్‌తో సామాన్యుడికీ ఇబ్బందే'
ఎన్నికల కోడ్‌తో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు సామన్య ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని సాక్షాత్తు కేంద్ర మంత్రే వ్యాఖ్యానించారు. ఆయనెవరో కాదు, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్. ఈ ఇబ్బందుల విషయాన్ని పార్టీలకు అతీతంగా అందరూ కలిసి చర్చించాలని కూడా ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో కోడ్ అంటూ నిబంధనలు విధించడం వల్ల ఏ ఒక్క పనీ జరగడంలేదని, ఎన్నికల సమయంలో మాత్రం పార్టీలు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నా, తర్వాత మర్చిపోతున్నాయని ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. కొత్త ప్రాజెక్టులు ఏవైనా ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తే, అది ఓటర్లను ఆకర్షించినట్లు అవుతుందని చెప్పడం వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయన్నారు. -
విదేశాల్లో పరువుతీశారు
ఖుర్షీద్పై మండిపడ్డ మోడీ సాక్షి, న్యూఢిల్లీ/ సంబల్పూర్ (ఒడిశా): విదేశాల్లో దేశ పరువు, ప్రతిష్టను ఇనుమడించాల్సిన విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ లండన్‌లో సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘంపై విమర్శలు చేసి పరువు తీశారని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని హెచ్చరించారు. ఢిల్లీలో శుక్రవారం న్యాయవాదుల సదస్సులో మోడీ మాట్లాడారు. ‘మన ఎన్నికల ప్రక్రియ, నిష్పక్షపాతంగా సాగే ఎన్నికల నిర్వహణ, ఆస్తులు తదితర వాటిని విదేశాల్లో గర్వంగా చెప్పుకోవాలి. కానీ మన విదేశాంగ మంత్రి విదేశాల్లో మన పరువు తీయడంలో నిమగ్నమయ్యారు. సుప్రీం, ఈసీలపై నేరుగా దాడికి దిగారు. రాజ్యాంగ సంస్థలపై మచ్చ పెడుతున్నారు’ అని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య సంస్థలను ధ్వంసం చేస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగంపై విశ్వాసం లేకపోవడం వల్లే కాగ్‌పై విమర్శలు, సీబీఐని దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. రాబోయే ఓటమికి ఇప్పటి నుంచే సాకులు.. రాబోయే ఓటమికి ఇప్పటినుంచే కాంగ్రెస్ నాయకులు సాకులు వెతుకుతున్నారని ఒడిశాలోని సంబల్పూర్ ఎన్నికల సభలో ప్రత్యర్థులపై మోడీ విమర్శలు సంధించారు. దానిలో భాగంగానే సల్మాన్ ఖుర్షీద్ ఈసీ, సుప్రీంలపై విమర్శలు చేశారని ఆరోపించారు. మూడో ఫ్రంట్‌కు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దూరంగా ఉండటంతో గతంలో భువనేశ్వర్ సభతో పోలిస్తే ఈ సభలో ఆయనపై చేసిన విమర్శల్లో వాడి తగ్గించారు. నవీన్ విధానాల వల్లే రాష్ట్రంలో అభివృద్ధి మందగించిందన్నారు. -
కేంద్ర మంత్రి ఖుర్షీద్ నోటి దురుసు!
రాజ్యాంగ సంస్థలపై దిగజారుడు వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ‘అనర్హత’ తీర్పు.. జడ్జి చేసిన చట్టమంటూ వ్యంగ్యాస్త్రం లండన్: రాజకీయ ప్రత్యర్థులపై వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఈసారి ఏకంగా రాజ్యాంగబద్ధ సంస్థలైన ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టుపైనే విరుచుకుపడ్డారు. వాటి పాత్రను అవహేళన చేసేలా దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలే చట్టసభల ప్రతినిధులపై అనర్హత వేటువేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ఓ జడ్జి చేసిన చట్టంగా ఆయన అభివర్ణించారు. అలాగే ఎన్నికల కమిషన్ రూపొందించిన మార్గదర్శకాలను స్థూలంగా చూస్తే ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు ఏమీ చేయకూడదని లేక ఏమీ మాట్లాడకూడదనేలా ఉన్నాయని విమర్శించారు. బుధవారం లండన్‌లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్‌లో జరిగిన ‘భారత్‌లో ప్రజాస్వామ్యం ఎదుర్కొనే సవాళ్ల’పై సద స్సులో ఖుర్షీద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు వ్యక్తులే నిర్ణయిస్తారా? ‘‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి పార్టీలకు గెలుపును కష్టతరం చేసింది. ఈసీ నుంచి తాజాగా అందిన సూచనలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. గెలిస్తే రోడ్లు నిర్మిస్తామని లేక మంచినీటి సౌకర్యం కల్పిస్తామని మేం మేనిఫెస్టోలో హామీ ఇవ్వకూడదట. ఒకవేళ ఇస్తే ఆ హామీ ప్రజాస్వామిక నిర్ణయాత్మక శక్తిని దెబ్బతీస్తుందట. ఈ నియమావళిబట్టి చూస్తే ఎన్నికల్లో గెలిచేందుకు మేం ఏమీ చేయకూడదని లేక ఏమీ మాట్లడకూడదన్నట్లుగా నాకు స్థూలంగా అర్థమవుతోంది. ఈ నియమావళి మేం ఎన్నికల్లో ఓడిపోయేందుకు వీలైనంత కృషి చేయాలన్నట్లుగా ఉంది. ఎన్నికల ప్రచారంలో మేం ఏం మాట్లాడాలో, ఎలాంటి పదాలు వాడాలో కూడా ఈసీలోని ముగ్గురు వ్యక్తులే నిర్ణయించేస్తున్నారు. ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఎన్నికల కమిషన్లు ఏ మేరకు జోక్యం చేసుకోవచ్చనేది అధ్యయనం చేయాల్సిన విషయమే’’ అని ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. జవాబుదారీతనంలేని బృందం భారత్‌లో కీలక నిర్ణయాలు ఏమాత్రం జవాబుదారీతనంలేని ఓ బృందానికి బదిలీ అవుతున్నాయని ఖుర్షీద్ పరోక్షంగా సుప్రీంకోర్టు పాత్రపై విమర్శలు చేశారు. ‘‘భారత్‌లో పార్లమెంటు లేక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలపై కోర్టులే అభిప్రాయం చెబుతున్నాయి. పార్లమెంటుకు ఎవరు వెళ్లచ్చో లేక ఎవరు వెళ్లకూడదో కూడా నిర్ణయించేస్తున్నాయి. ఇది జడ్జి చేసిన చట్టం. ప్రజలు ఎన్నుకోని లేక జవాబుదారీతనం లేని బృందం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం దేశ ప్రజాస్వామ్యానికే పెను సవాల్‌గా మారుతుంది’’ అని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అధ్యక్ష వ్యవస్థ తరహా ప్రచారం సాగిస్తూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారని ఖుర్షీద్ విమర్శించారు. ఖుర్షీద్పై విపక్షాలు సహా అన్ని వర్గాలు విమర్శలు గుప్పించాయి. ఓటమి భయం వల్ల ఆవహించిన నిరాశలో ఖుర్షీద్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారని బీజేపీ మండిపడింది. -
మోడీపై ఖుర్షీద్ వ్యాఖ్యలను ఆమోదించను:రాహుల్
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తాను ఆమోదించనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు, భాషను తాను అభినందించనని తెలిపారు. 2002 గుజరాత్ అల్లర్లను అదుపుచేయలేకపోయిన మోడీ ఒక నపుంసకుడంటూ ఖుర్షీద్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా.. రాహుల్ ఇదే నేర్పుతున్నారా? అంటూ ప్రశ్నించింది. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. దీంతో ఖుర్షీద్ వ్యాఖ్యలను ఖండించినట్లు రాహుల్ మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
మోడీ నపుంసకుడు: ఖుర్షీద్
కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ న్యూఢిల్లీ: నేతల ఆరోపణలు శ్రుతిమించి వ్యక్తిగత దూషణలుగా మారుతున్నాయి. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని నపుంసకుడిగా పేర్కొంటూ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించడంతో రాజకీయ దుమారం చెలరేగింది. 2002 నాటి గోధ్రా ఘటన అనంతరం అల్లర్ల సమయంలో మోడీ పాత్రనుద్దేశించి ఖుర్షీద్ మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని ఫరూకాబాద్ సభలో మాట్లాడుతూ.. ‘‘కొంతమంది వ్యక్తులు వచ్చి దాడులు చేస్తుంటే ఆపలేకపోయావు. నువ్వు బలమైన వ్యక్తివి కావు. నపుంసకుడివి’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం సిగ్గుచేటు, విచారకరమని, మరింతగా దిగజారిపోయారని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్, అరుణ్ జైట్లీలు కూడా ఖుర్షీద్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, తానన్న వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని ఖుర్షీద్ సమర్థించుకున్నారు. -
మోడీపై 'నపుంసక' వ్యాఖ్యలు.. బీజేపీ మండిపాటు
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. మోడీ 'నపుంసకుడు' అంటూ ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూకాబాద్ నియోజకవర్గంలో జరిగిన ఓ ర్యాలీలో సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ, ''మీరు జనాలను చంపించారని మేం ఆరోపించడం లేదు... మీరు నపుంసకుడని అంటున్నాం'' అని విమర్శించారు. మోడీ చాలా శక్తిమంతుడైన నాయకుడని, అయినా 2002 అల్లర్ల నుంచి ప్రజలను రక్షించలేకపోయారని అంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. దానిపై బీజేపీ ప్రతినిధి, రాజ్యసభలో ప్రతిపక్ష ఉపనేత రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. ''భారత విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా బాధ్యతారహితంగా, సిగ్గులేకుండా మాట్లాడటం దారుణం. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న సల్మాన్ ఖుర్షీద్ అసహాయతకు, నపుంసకత్వానికి మధ్య తేడా అర్థం చేసుకోలేకపోతే ఇంకేం చెప్పాలి? ఖుర్షీద్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే'' అని ఆయన అన్నారు. -
కేజ్రీవాల్ పారిపోయిన పెళ్లి కొడుకు: ఖుర్షీద్
ఫరూఖాబాద్(యూపీ): ఢిల్లీ సీఎం పదవి నుంచి తప్పుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌పై పలు పార్టీలు మండిపడుతున్నాయి. ఆయన పారిపోయిన పెళ్లికొడుకని కాంగ్రెస్ నేత, విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అభివర్ణించారు. ‘మేం ఆయనకు మద్దతిచ్చి, కట్నం కింద 8 మంది ఎమ్మెల్యేలను సమర్పించుకున్నాం. అయినా పెళ్లికొడుకు పారిపోతే ఎవరేం చేయగలరు?’ అని ఆయన ఆదివారమిక్కడ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్ బిల్లును అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయన్న ఆరోపణలను ఖర్షీద్ తోసిపుచ్చారు. కేజ్రీవాల్ బాధ్యతల నుంచి పారిపోయి, రాజీనామా చేసిన కొన్నిగంటల్లోనే లోక్‌సభ ఎన్నికల సన్నాహాల్లో బీజీ అయ్యారని ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్ విమర్శించారు. కేజ్రీవాల్ రాజీనామా విషయంలో తొందరపడ్డారని, పథకంలో భాగంగానే పదవి నుంచి తప్పుకుని ఉండొచ్చని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. -
‘పెద్దన్న’పై మరో ప్రతిచర్య
న్యూఢిల్లీ/వాషింగ్టన్: దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే అరెస్టు విషయంలో భారత్ మరో ప్రతిచర్యకు దిగనుంది. వీసా అక్రమాల ఆరోపణలతో దేవయానిని అరెస్టు చేసిన న్యూయార్క్ పోలీసులు... ఆ కేసును ఉపసంహరించుకోవడానికి, ఆమెకు క్షమాపణలు చెప్పేందుకు భారత్ ఈనెల 13 వరకు గడువు విధించింది. అప్పటికీ అమెరికా స్పందించకపోతే 16వ తేదీ నుంచి భారత్లోనున్న అమెరికా దౌత్య కార్యాలయాల పరిసరాల్లో నిర్వహిస్తున్న వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మన దేశంలోని నాలుగు అమెరికా దౌత్య కార్యాలయాల పరిసరాల్లో రెస్టారెంట్/బార్, వీడియో క్లబ్, బౌలింగ్ అల్లే, క్రీడా సముదాయం, ఈత కొలను, బ్యూటీ పార్లర్, జిమ్ తదితర వాణిజ్య కార్యకలాపాలను అమెరికా కమ్యూనిటీ సపోర్ట్ అసోసియేషన్ (ఏసీఎస్ఏ) నిర్వహిస్తోంది. వీటిలో దౌత్యేతర వ్యక్తులకు, వారి కుటుంబాల సహా ప్రైవేట్ అమెరికా పౌరులకు అందిస్తున్న వాణిజ్య సేవలకు సంబంధించి టాక్స్ రిటర్న్‌లను సంబంధిత భారత విభాగాలకు సమర్పించాలని ఇప్పటికే అమెరికాను ఆదేశించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇలా దౌత్యేతర వ్యక్తులకు వాణిజ్య సేవలు అందించడం దౌత్య సంబంధాలపై వియన్నా ఒడంబడిక-1961లోని అధికరణ 41(3)కు విరుద్ధమని ప్రస్తావిస్తున్నాయి. తన ఇంటిలో పనిమనిషి సంగీతా రిచర్డ్ వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలతో డిప్యూటీ కాన్సుల్ జనరల్ దేవయాని ఖోబ్రగడేని గత నెల 12న న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేయడం విదితమే. చర్యలు సమంజసమే: ఖుర్షీద్ దౌత్యవేత్త దేవయాని విషయంలో అమెరికా దౌత్య కార్యాలయాలపై ప్రతిచర్యలకు భారత్ ప్రభుత్వం దిగడాన్ని విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సమర్థించారు. భారత్ ఏమైనా చేయడానికి సిద్ధమని చెప్పడానికి అదొక హెచ్చరిక మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన ప్రవాిసీ భారతీయ దివస్ కార్యక్రమంలో మాట్లాడారు. -
వివాదానికి పరిష్కారం కనుగొంటాం: సల్మాన్ ఖుర్షీద్
న్యూఢిల్లీ: భారత్ - అమెరికాలు పరస్పర వ్యవహారాల్లో మొత్తం ద్వైపాక్షిక సంబంధాలను ఇరు దేశాలూ గమనంలో ఉంచుకోవాల్సి ఉంటుందని.. రెండు దేశాల మధ్య సంబంధాలను పరిరక్షించటం ముఖ్యమని భారత విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. భారత దౌత్యవేత్త దేవయాని అరెస్ట్ వివాదానికి ఒక పరిష్కారం కనుగొంటామని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘కేవలం ప్రభుత్వాలే కాకుండా, ప్రయివేటు రంగం, వ్యక్తుల బృందాలు, సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టిన సంబంధాలివి. పరస్పర వ్యవహారాల్లో రెండు పక్షాలూ ఈ భిన్నమైన కోణాలను గమనంలో ఉంచుకోవాలని నేను భావిస్తున్నా. న్యూయార్క్‌లో భారత దౌత్యవేత్త పట్ల అమెరికా బాధించే విధంగా, అవమానకరంగా వ్యవహరించినప్పటికీ.. మేము రెండు దేశాల మధ్య ఉన్న విలువైన సంబంధాలను గమనంలోనే ఉంచుకున్నాం. వారు కూడా గమనంలో ఉంచుకుంటారని నేను ఆశిస్తున్నా’’ అని ఖుర్షీద్ పేర్కొన్నారు. మరోవైపు.. భారతదేశంలో అమెరికా దౌత్యాధికారులకు తాము ఎలాంటి గౌరవమర్యాదలు అందిస్తున్నామో.. అమెరికా కూడా తన దేశంలోని భారత దౌత్యాధికారులతో అలాగే వ్యవహరించాలని భారత విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ సూచిం చారు. ఆమె శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. దేవయాని విషయంలో అమెరికా అధికారుల చర్యలను ఆమె తప్పుపట్టారు. ఒక సీనియర్ దౌత్యాధికారితో వ్యవహరించిన తీరు ఆమోదయోగ్యం కాదన్నారు. -
అమెరికాలో దౌత్యవేత్త అరెస్ట్ అవమానకరం: ఖుర్షీద్
ఫర్కుహాబాద్: అమెరికాలో భారత దౌత్యవేత్త పట్ల అమర్యాదగా ప్రవర్తించడాన్ని విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తప్పుబట్టారు. డిప్యూటీ కాన్సుల్ జనరల్ దేవయాని ఖోబ్రాగాదేను నడిబజార్లో అరెస్ట్‌చేసి, చేతికి సంకెళ్లు వేయడం అవమానకరమని ఆయన అన్నారు. తాము ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని ఖుర్షీద్ ఆదివారమిక్కడ విలేకరులతో పేర్కొన్నారు. దీనిపై అమెరికా స్పందన కోసం ఎదురుచూస్తున్నామని, దాన్నిబట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తన ఇంట్లో పనిచేస్తున్న మహిళ వీసా పత్రాల్లో తప్పుడు సమాచారమిచ్చారన్న ఆరోపణలపై 1999 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారిణి అయిన దేవయానిని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్‌చేసిన సంగతి తెలిసిందే. -
సోనియా భారతీయులందరికీ తల్లి: ఖుర్షీద్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీని భారతీయులందరికీ తల్లిగా వర్ణించారు విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్. ఓ వార్తా చానల్‌తో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 'రాహుల్ గాంధీకి మాత్రమే సోనియా అమ్మకాదు. ఆమె మా అందరికీ అమ్మే. మొత్తం భారతదేశానికి ఆమె అమ్మ లాంటివారు' అని ఖుర్షీద్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకుంటే సోనియా గాంధీయే ప్రధాని అభ్యర్థి కావాలని మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై ఖుర్షీద్ స్పందించారు. ఇటువంటి వ్యాఖ్యలు గతంలోనూ వచ్చాయని గుర్తు చేశారు. నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవడంతో రాహుల్ గాంధీ నాయకత్వంపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
వెంటాడుతున్న హక్కుల ఉల్లంఘనలు!
శ్రీలంకలో నేటి నుంచి ‘చోగమ్’ కొలంబొ: తమిళుల విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో పాటు కెనడా, మారిషస్‌ల ప్రధానుల గైర్హాజరు నేపథ్యంలో కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సదస్సు (చోగమ్) శుక్రవారం నాడిక్కడ ప్రారంభం కానుంది. ఎల్టీటీఈపై యుద్ధం సందర్భంగా స్థానిక తమిళులపై కొనసాగిన అకృత్యాలపై అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడం, యుద్ధ నేరాలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలనే డిమాండ్ల నేపథ్యంలో.. 53 సభ్య దేశాలతో కూడిన చోగమ్ నిర్వహణకు లభించిన అవకాశాన్ని శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్స చేజార్చుకోలేదు. ఎల్టీటీఈని తుడిచిపెట్టిన తర్వాత గత నాలుగేళ్లలో నెలకొన్న శాంతియుత వాతావరణాన్ని ప్రపంచానికి చాటేందుకు మూడురోజుల పాటు సాగే చోగమ్ సదస్సు మంచి అవకాశంగా ఆయన భావించారు. అందుకనే భారత ప్రధాని గైరుహాజరును సైతం పెద్దగా పట్టించుకోవడం లేదన్నట్టుగా చెప్పేందుకు యత్నించారు. భారత్‌కు ప్రాతి నిధ్యం వహిస్తున్న విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ రాకతో తాను సంతృప్తి చెందుతున్నట్టు రాజపక్స చెప్పారు. తమిళనాడు నుంచి వచ్చిన బలమైన ఒత్తిళ్ల నేపథ్యంలో చోగమ్‌కు హాజరుకారాదని మన్మోహన్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. -
చోగమ్‌కు సల్మాన్
సాక్షి, చెన్నై: శ్రీలంకలో జరగనున్న కామన్వెల్త్ (చోగమ్)ను భారత్ బహిష్కరించాల్సిందేనని పట్టుబడుతూ రాష్ట్ర అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఆగ్రహ జ్వాల రాజుకున్నా, తమకేం పట్టదన్నట్టుగా, తమిళుల మనోభావాల్ని తుంగలో తొక్కుతూ శ్రీలంకకు ప్రతినిధుల బృందాన్ని పంపించేందుకే కేంద్రం మొగ్గు చూపింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నేతృత్వంలో నలుగురు అధికారుల బృందం బుధవారం ప్రత్యేక విమానంలో శ్రీలంక రాజ ధాని కొలంబోకు బయలుదేరి వెళ్లింది. తమిళుల మనోభావాలకు విలువ ఇవ్వకుండా శ్రీలంకకు ఈ బృందం వెళ్లడంతో రాష్ట్రంలో ఆగ్రహావేశాలు రగిలాయి. పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం రైల్‌రోకోలకు వీసీకే పిలుపునిచ్చింది. అలాగే శ్రీలంక తమిళుల సంక్షేమంపై చోగమ్‌లో తీసుకునే నిర్ణయం మేరకు తదుపరి తమ కార్యాచరణను ప్రకటించేందుకు ఈ నెల 17న టెసో సమావేశం కానుంది. పిటిషన్ తిరస్కరణ కామన్వెల్త్కు భారత్ నుంచి ప్రతినిధులు వెళ్లనీయకుండా స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం తిరస్కరించింది. కామన్వెల్త్ను భారత్ బహిష్కరించాలని కోరుతూ మదురైకు చెందిన న్యాయవాదులు గత వారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎనిమిది కోట్ల తమిళ ప్రజల నుంచి ఎన్నికైన 234 మంది ఎమ్మెల్యేలు కామన్వెల్త్ మహానాడుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారని ఆ పిటిషన్లో గుర్తు చేశారు. ఈ తీర్మానానికి ఎలాంటి గౌరవం ఇవ్వకుండా, తమిళనాడులో బయలుదేరిన ఆగ్రహ జ్వాలలతో తమకేమీ సంబంధం లేదన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకుని కామన్వెల్త్కు భారత్ వెళ్లకుండా స్టేవిధించాలని కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు సెల్వం, రవి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. బుధవారం విచారణ ముగించిన ధర్మాసనం తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంటూ ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఎంపీల రాజీనామా కలకలం అసెంబ్లీ తీర్మానాలకు కనీస విలువ ఇవ్వని కేంద్రం తీరును నిరసిస్తూ అన్నాడీఎంకే ఎంపీలు రాజీనామా చేయబోతున్నట్టుగా సాగిన ప్రచారం రాష్ట్రంలో రాజకీయంగా కలకలం రేపింది. అన్నాడీఎంకేకు పార్లమెంట్లో తొమ్మిది, రాజ్యసభలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు. తమ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాల్ని కేంద్రం తుంగలో తొక్కడంతో రాష్ట్రంలోని ఇతర పార్టీల్ని ఇరకాటంలో పెట్టడంతో పాటు, ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ఒత్తిడి పెంచే విధంగా అన్నాడీఎంకే వ్యూహాన్ని రచించిందన్న ప్రచారం రాష్ట్రంలో హల్ చల్ చేసింది. ఆ పార్టీ ఎంపీలందరూ ఢిల్లీకి హుటాహుటిన పయనమయ్యారని, ప్రధాని మన్మోహన్ నివాసం వద్ద నిరసన తెలిపిన అనంతరం రాజీనామాలు సమర్పించబోతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ సంకేతాలతో స్థానిక మీడియా సైతం హడావుడి సృష్టించడంతో రాజకీయ కలకలం బయలుదేరింది. అన్నాడీఎంకే ఎంపీలు రాజీనామ చేసిన పక్షంలో రాష్ర్ట ప్రజల వద్ద మార్కులు కొట్టేయడం ఖాయమని, ఇక తామెలాంటి నిర్ణయం తీసుకోవాలోనన్న చర్చలో డీఎంకే, కాంగ్రెస్ ఎంపీలు పడ్డారు. చివరకు రాజీనామా తంతు ప్రచారంగా తేలడంతో రాజకీయ కలకలానికి తెరపడ్డట్టు అయింది. -
‘కామన్వెల్త్’కు దూరం!
సాక్షి, చెన్నై:శ్రీలంక వేదికగా కామన్వెల్త్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలను భారత్ బహిష్కరించాల్సిందేనని తమిళాభిమాన సంఘాలు, రాజకీయ పార్టీలు పట్టుబడుతూ వస్తున్నాయి. అయితే కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నేతృత్వంలోని అధికారుల బృం దం శ్రీలంకకు పయనమయ్యేందుకు సిద్ధమైంది. అదే సమయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ తన పర్యటనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు తమిళనాడులో రాజుకున్న జ్వాల, మరోవైపు కేంద్ర కేబినెట్లోని రాష్ట్రానికి చెందిన మంత్రుల వ్యతిరేకత మన్మోహన్‌ను సందిగ్ధంలో పడేశాయి. లోక్‌సభకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన లంక పర్యటనతో తమిళనాట కాంగ్రెస్‌కు ఎక్కడ గట్టి దెబ్బ తగులుతుందోనన్న భయం వెంటాడింది. తమిళుల మనోభావాల్ని గౌరవిస్తున్నట్లు, వారి కోసం తాము శ్రమిస్తున్నామని చాటుకునే రీతిలో చివరి క్షణంలో తన నిర్ణయాన్ని సహచరులతో మన్మోహన్ పంచుకున్నట్లు సమాచారం. లంకకు లేనట్టే ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం చత్తీస్గడ్ ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్లారు. అనంతరం శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు లేఖ రాసినట్లు సంకేతాలు వెలువడ్డాయి. కామన్వెల్త్ సమావేశాలకు తాను దూరంగా ఉండాల్సిన పరిస్థితుల్ని అందులో వివరించారు. తన ప్రతినిధిగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ హాజరవుతారని పేర్కొన్నట్లు తెలిసింది. లేఖలోని అంశాల్ని అధికార యంత్రాంగం అత్యంత గోప్యంగా ఉంచింది. ఆయన లంకకు వెళ్లనట్టేనన్న సంకేతాల్ని మాత్రం మీడియాకు పంపించడం గమనార్హం. లంక పర్యటన బహిష్కరణ నిర్ణయాన్ని మన్మోహన్ సింగ్ ముందుగానే తీసుకున్నారని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. అయితే తమిళుల మనోభావాలకు గౌరవాన్ని ఇస్తున్నామని చాటుకునేందుకే ఆలస్యంగా తన నిర్ణయాన్ని ప్రకటించి ఉండొచ్చని పేర్కొన్నారు. ఇది వరకు న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ దేశాల సమావేశాలకు మన్మోహన్ సింగ్ దూరంగా ఉన్న విషయూన్ని గుర్తు చేశారు. -
ప్రధాని నిర్ణయమేమిటో?
సాక్షి, చెన్నై:శ్రీలంక వేదికగా ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు కామన్వెల్త్ దేశాల సమావేశాలు జరగనున్నారుు. ఈ సమావేశాల్లో భారత్ పాల్గొనరాదంటూ తమిళనాట ఆందోళనలు మొదలయ్యూ యి. ప్రధాని మన్మోహన్ సింగ్ శ్రీలంక వెళ్లనున్నారన్న సమాచారంతో ఇటీవల ఆందోళనలు ఉద్ధృతమయ్యూయి. తమిళుల మనోభావాలకు అనుగుణంగా కేంద్రం వ్యవహరించాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు సైతం ఇదే వాణి వినిపిస్తున్నారు. నోరు విప్పని ప్రధాని కామన్వెల్త్ సమావేశాలకు సమయం దగ్గర పడుతున్నా ప్రధాని మన్మోహన్ సింగ్ నోరు విప్పడం లేదు. తమిళుల మనోభావాలకు అనుగుణంగా ప్రధాని నిర్ణయం తీసుకుంటారంటూ కొందరు, తమిళవాణిని శ్రీలంక వేదికగా గట్టిగా వినిపించేందుకు సిద్ధమవుతున్నారని మరికొందరు ఢిల్లీ నేతలు చెబుతున్నారు. శ్రీలంకతో సత్సంబంధాలు ముఖ్యమని కాంగ్రెస్ ఉన్నతస్థాయి, మంత్రివర్గ సమావేశాల్లో మన్మోహన్ పేర్కొన్నారు. అయితే స్వయంగా తాను హాజరయ్యే విషయమై ఎలాంటి ప్రకటనా చేయలేదు. సమావేశాల్లో పాల్గొనే విషయమై తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను పార్టీ ఉన్నతస్థాయి, మంత్రివర్గ సమావేశాల్లో మన్మోహన్ భుజానే వేశారు. దీంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఒత్తిడి పెంచిన మంత్రులు కామన్వెల్త్కు వ్యతిరేకంగా తమిళనాట సాగుతున్న ఆందోళనల తీవ్రతను కేంద్ర మంత్రులు గుర్తించా రు. తమిళుల మనోభావాలకు అనుగుణంగానే మన్మోహన్ నడుచుకుంటారని కేంద్ర మంత్రులు ఆంటోని, చిదంబరం, జీకే వాసన్, జయంతి న టరాజన్, నారాయణస్వామి, సుదర్శన నాచ్చియప్పన్ పదేపదే ప్రకటిస్తూ వస్తున్నారు. ఇదే విషయమై ప్రధానిపై ఒత్తిడి పెంచే పనిలో పడ్డారు. లంకకు సల్మాన్ బృందం విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నేతృత్వంలోని అధికారుల బృందం శ్రీలంకకు పయనమయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇతర దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, వ్యవహారాల మేరకు ఆ శాఖ వర్గాలు తప్పనిసరిగా సమావేశాలకు వెళ్లాల్సి ఉన్నందునే మంత్రి నేతృత్వంలో బృందం సిద్ధమవుతోందని ఓ కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. అరుుతే మన్మోహన్ దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. చివరి క్షణంలో ఏమైనా మార్పులు జరిగినా జరగొచ్చంటూ మెలిక పెట్టారు. చల్లారని ఆగ్రహం రాష్ట్రంలో నిరసన జ్వాలలు చల్లారడం లేదు. పలుచోట్ల శనివారం నిరసన తెలిపారు. హిందూ సత్యసేన నేతృత్వంలో బేసిన్ బ్రిడ్జి వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. రైల్‌రోకోకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి సంఘాలు, ఈలం తమిళాభిమాన సంఘాల నేతృత్వంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దీక్ష విరమణ చెన్నైలో ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న విద్యార్థులు ఎట్టకేలకు శనివారం దిగొచ్చారు. కామన్వెల్త్ సమావేశాలకు వ్యతిరేకంగా ఐదుగురు విద్యార్థులు నుంగబాక్కంలో ఆమరణ దీక్షకు కూర్చున్న విషయం తెలిసిందే. శ్రీలంకకు చెందిన తమిళ నేతలు ఆనందీ, శశిధరన్ ఫోన్ ద్వారా వీరిని పరామర్శించారు. దీక్ష విరమించాలని సూచించారు. దీక్ష విరమణకు విద్యార్థులు అంగీకరించారు. వీరికి నటుడు సత్యరాజ్ కొబ్బొరి బొండాలిచ్చి దీక్ష విరమింపజేశారు. -
ముజఫర్‌నగర్ మారణహోమం!
సంపాదకీయం: ఏదీ జరగనంతవరకూ అంతా సవ్యంగా ఉన్నట్టే కనబడుతున్న సమాజంలో ఎంతటి విద్వేషాగ్ని దాగివుండవచ్చునో తెలియాలంటే ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్నగర్ని చూడాలి. గత మూడురోజులుగా అది దహించుకుపోతున్న తీరును గమనించాలి. ఇంతవరకూ ఆ పట్టణాన్ని, దాని సమీప గ్రామాలనూ చుట్టుముట్టిన మతకలహాల్లో 38 మంది మరణించగా, మరో 50 మంది గాయపడ్డారు. ఏ పల్లెవాసిని అడిగినా ఎవరో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో, కత్తులతో, పెట్రోల్ బాంబులతో ప్రవేశించి విధ్వంసం సృష్టించారని చెబుతున్నారు. ఇదంతా అర్ధరాత్రో, అపరాత్రో కాదు... పట్టపగలే జరిగింది. అంతా అయిన తర్వాత ఇప్పుడు భద్రతా బలగాల పహారా, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు, కర్ఫ్యూలు అమల్లోకి వచ్చాయి. అంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగమూ ఆపత్కాలంలో ఏమైపోయిందన్నదే ఇప్పుడు ప్రశ్న. అమ్మానాన్నలను కోల్పోయి, ఆస్పత్రుల్లో నిలువెల్లా నెత్తుటి గాయాలతో తల్లడిల్లుతున్న పసిపాపలను చూసినా... ప్రాణాలమీది ఆశతో పల్లెలు వదిలిపోతున్న వారిని దారికాచి మట్టుపెట్టిన వైనాన్ని విన్నా మన మధ్యనే సంచరించేవారిలో ఎంతటి దుర్మార్గం గూడు కట్టుకుని ఉన్నదో అర్ధమవుతుంది. మొన్నటి వరకూ ముజఫర్‌నగర్ దేశంలోని అన్ని పట్టణాలవంటిదే. కుల,మత భేదాలేమీ లేకుండా ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో వలస పాలకులపై సాయుధమై, సమస్తమై తిరగబడిన ప్రాంతమది. 80వ దశకంలో మహేంద్రసింగ్ తికాయత్ నాయకత్వంలో రైతుల ఉద్యమం వెల్లువలా వచ్చినప్పుడు మత ప్రమేయం లేకుండా రైతులందరూ అందులో భాగస్వాములయ్యారు. అక్కడి రైతు ర్యాలీల్లో హిందువుల ప్రార్థనలు, ముస్లింల నమాజులు నిత్యం దర్శనమిచ్చేవి. ఆఖరికి 90వ దశకంలో దేశమంతటా, మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో మతకలహాలు పెచ్చరిల్లినప్పుడు సైతం ఉన్మాదుల ఆటలు అక్కడ సాగలేదు. ఏవో స్వల్ప ఘర్షణలు మినహా ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా ఉంది. అలాంటి ముజఫర్నగర్ని కాటేసిన మానవాకార మృగాలు ఎవరు? ఎవరి ప్రాపకంతో అక్కడి పల్లెలన్నీ భగ్గున మండుతున్నాయి? మొన్నటివరకూ ప్రశాంత జీవనం సాగినచోట మనుషుల్ని వేటాడిన తోడేళ్లు ఎక్కడివి? మత ఘర్షణలకు మూలం యూ ట్యూబులో ఉంచిన వీడియో అని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు యువకులను బహిరంగ ప్రదేశంలో కొట్టి చంపే దృశ్యాలు అందులో ఉన్నాయని వారు అంటున్నారు. ఆ ప్రాణాలు కోల్పోయిన యువకులిద్దరూ ఒక మతానికి చెందినవారన్న ప్రచారం ఊపందుకోవడంతో ఈ ఘర్షణలు మొదలయ్యాయని వారు వివరిస్తున్నారు. సర్ధానా నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ఈ వీడియోను ఫేస్బుక్లో ఉంచారని, ‘ముజఫర్‌నగర్‌లో ఏం జరుగుతున్నదో చూడండి’ అంటూ దానికొక వ్యాఖ్యానం కూడా జత చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఆ ఎమ్మెల్యేపైనా, మరో 200 మందిపైనా కేసులు పెట్టారు. వాస్తవానికి ఆ వీడియో 2010లో పాకిస్థాన్‌లోని సియోల్కోట్లో జరిగిన ఉదంతానికి సంబంధించింది. అందులోని బాధితులు కూడా అక్కడివారే. ఆ వీడియో ఘర్షణలకు ప్రేరణని చెప్పడం నమ్మశక్యంగాని విషయం. కానీ, పోలీసులు, రాజకీయ నాయకులు అదే నిజమని నమ్మమంటున్నారు. గత నెల 27న ఒక గ్రామంలో ఒక మతానికి చెందిన యువతిని మరో మతానికి చెందిన ఇద్దరు యువకులు వేధించడంతోనే ఈ గొడవంతా మొదలైందనేది మరో కథనం. వారం రోజుల్లో అది గ్రామగ్రామానికీ వ్యాపించి చివరకు ఇంత ఘోరం జరిగిందని అంటున్నారు. ఇలాంటి హంతకదాడులు చోటుచేసుకున్నప్పుడల్లా వినబడే కథనమే ఇది. ఎంతో సామరస్యంతో ఉండే పల్లెలు ఈ ఘటనతో రెండు వర్గాలుగా చీలిపోయాయని, ఒక వర్గం మరో వర్గంపై దండయాత్రకు వెళ్లిందని చెప్పడం హేతుబద్ధంగా అనిపించదు. ఇంటర్నెట్లో ఉంచిన దృశ్యమో, యువతిని వేధించిన ఘటనో ఇంత హేయమైన ఘటనలకు దారితీసిందని చెప్పడమంటే ప్రభుత్వ యంత్రాంగమూ, పోలీసులు తమ చేతగాని తనాన్ని అంగీకరించినట్టే. ఇప్పుడు యథాప్రకారం రాజకీయ నాయకుల పరస్పర విమర్శలు, ఆరోపణలు మొదలయ్యాయి. బాధ్యులు మీరంటే మీరని వీరంతా నిందించుకుంటున్నారు. శాంతిభద్రతలు కొరవడి, ప్రజాజీవనం అస్తవ్యస్థమైనప్పుడు అందుకు ప్రధాన బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. సందేహం లేదు. కానీ, ఇన్ని పార్టీలుండీ, వాటన్నిటికీ ఊరూరా శాఖలుండీ, కార్యకర్తలుండీ ఇలాంటి ఘోరం సంభవించిందంటే అందుకు ఈ పార్టీలన్నీ సిగ్గుపడాలి. గుప్పెడు మంది దుండగులు ఇలా ఊళ్లమీదపడి దాడులకు దిగినప్పుడు వీరికుండే సమస్త యంత్రాంగం ఏమైంది? ఒక్క పార్టీ కూడా తన శ్రేణులను కదల్చలేకపోయిందా? పోలీసులకు ఉప్పందించలేక పోయిందా? మైనారిటీలకు తామే రక్షకులమని చెప్పే పార్టీలు క్రియకొచ్చేసరికి ఇలా చేష్టలుడిగి ఉండిపోతున్నాయి. యూపీ ఎన్నికల సమయంలో మైనారిటీలకు అటు సమాజ్‌వాదీ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు గుప్పించాయి. కేంద్రంలోని యూపీఏ సర్కారైతే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజుముందు ఆదరాబాదరాగా ముస్లిం కోటాపై ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని నిలిపినందుకు ఎన్నికల కమిషన్‌పై కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ విరుచుకుపడ్డారు కూడా. తీరా ఎన్నికలై ఇంతకాలమైనా మళ్లీ దాని ఊసేలేదు. ఇటు అఖిలేష్ ప్రభుత్వం కూడా ప్రచారానికి ఉపయోగపడే కొన్ని పనులకు మాత్రమే పరిమితమైంది. మతాన్ని వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించిన వ్యవహారంగా కాక, అధికారం కోసం... విద్వేషాలను పెంచడం కోసం ఉపయోగించే శక్తులను ఏకాకులను చేయడానికి నిరంతరం ప్రయత్నించకపోతే... ఆ కర్తవ్య నిర్వహణలో ఏమరుపాటుగా ఉంటే ముజఫర్‌నగర్ వంటి ఘటనలు చోటుచేసుకోక తప్పదు. యూపీ ప్రభుత్వమైనా, అక్కడి ప్రధాన పార్టీలైనా ఈ సంగతిని దృష్టిలో ఉంచుకోవాలి.