అవసరమైతే ‘మూడు’కు మద్దతు
కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్
ఫరూఖాబాద్/కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలయ్యాక అవసరమైతే కాంగ్రెస్ మూడో కూటమి మద్దతు తీసుకుంటుందని లేదంటే ఆ కూటమికే మద్దతు ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తుందని కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఆ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ పరోక్షంగా చెప్పారు. శనివారం ఖుర్షీద్ ఫరూఖాబాద్‌లోని పీతౌరమ్‌లోను, సింఘ్వీ కోల్‌కతాలోను విలేకరులతో మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే అవకాశాలు అతి తక్కువగా ఉన్నాయని, కాంగ్రెస్ మూడో కూటమితో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వీరి మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఖుర్షీద్ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ బీజేపీకే పెద్ద సమస్యగా మారనున్నారని అన్నారు. సింఘ్వీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎప్పుడూ సొంత బలంతో పోరాడుతుందని, అయితే ఎన్నికల తర్వాత వచ్చే సంఖ్యాబలాన్ని బట్టే ప్రభుత్వ ఏర్పాటు ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. అవసరమైతే లౌకికవాద పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశముందని చెప్పారు. కాగా కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం మాత్రం మూడో కూటమికి మద్దతిచ్చే అంశాన్ని తోసిపుచ్చారు. ఎన్నికల తర్వాత యూపీఏ-3 ప్రభుత్వం కచ్చితంగా ఏర్పడుతుందని ఆయన ఉద్ఘాటించారు. ‘‘మేం గెలిచే ఉద్దేశంతో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతోనే ఎన్నికలకు వెళుతున్నాం’’ అని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు : మమత
సోనార్‌పూర్ (పశ్చిమబెంగాల్): కేంద్రంలో మూడో కూటమి అధికారంలోకి రాకూడదని కాంగ్రెస్, బీజేపీలు కోరుకుంటున్నాయని, అందుకే ఆ పార్టీలు రెండూ కుమ్మక్కు ఆటలు ఆడుతున్నాయని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శనివారం దక్షిణ 24 పరగణాల జిల్లాలో జరిగిన సభలో ఆరోపించారు.