
మైనార్టీ రిజర్వేషన్లు ఏమయ్యాయి?
కేసీఆర్ హామీని నిలబెట్టుకోవాలి: ఏఐసీసీ నేత సల్మాన్ ఖుర్షీద్
లేకుంటే టీపీసీసీ పోరాటం
హైదరాబాద్: మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామనే హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకోవాలని ఏఐసీసీ నేత, కేంద్ర మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. టీపీసీసీ మైనారిటీ సెల్ గాంధీభవన్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం హామీని నిలబెట్టుకోకుంటే మైనారిటీల పక్షాన ప్రతిపక్ష పార్టీగా పోరాడాల్సిన బాధ్యత టీపీసీసీపై ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జనాభా ప్రకారం 12 శాతం రిజర్వేషన్లు సాధ్యమేనని చెప్పారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమలు చేయాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించినా... న్యాయ వివాదాల వల్ల సాధ్యం కాలేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోగానే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీనిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్... 14 నెలలు పూర్తయినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారన్నారు.
వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకుంటామని, వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలను ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని అడిగారు. ‘‘మాయ మాటలు చెప్పి, రంగుల ప్రపంచం చూపించి కేసీఆర్ మోసం చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో స్వచ్ఛ హైదరాబాద్‌ను చేపడుతూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలో కుటుంబ సభ్యులను చేర్పించుకోవడానికి మోదీతో స్నేహం కోసం ప్రయత్నిస్తున్నారు’’ అని దుయ్యబట్టారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పూర్తి కాగానే, కేంద్రంలో టీఆర్‌ఎస్ చేరిపోతుందన్నారు. ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా మాట్లాడుతూ.. ఎంఐఎంతో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలను మరిపించడానికి ఇనాములు, బట్టలు ఇస్తూ ముస్లింలను కేసీఆర్ మోసం చేస్తున్నారని మండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ విమర్శించారు. ఈ సమావేశంలో టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ వి.హనుమంతరావు, టీపీసీసీ మైనారిటీసెల్ అధ్యక్షుడు ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ్ ఇఫ్తార్ విందు
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి శనివారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. నాంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ విందు కార్యక్రమంలో పార్టీ నేతలు సల్మాన్ ఖుర్షీద్, ఎస్.జైపాల్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, కోదండరెడ్డి, దానం నాగేందర్, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు ఎంపీ సందీప్ దీక్షిత్, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, అజీజ్ పాషా, ఎమ్మెల్సీ ఫారుఖ్, ఎంబీటీ ప్రతినిధి అమ్జదుల్లా ఖాన్, పలువురు ఎమ్మెల్యేలు, మత పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హజరు కావడానికి వచ్చిన మాజీ మంత్రి శశిధర్‌రెడ్డి... వేదికపై ఉన్న నాయకులను చూసి ప్రాంగణం నుంచి వెను తిరిగారు. ఇది గమనించిన షబ్బీర్ అలీ.. శశిధర్‌ను వేదికపైకి రావాలని పిలిచినా పట్టించుకోకుండా వెళ్లిపోయారు.