ముస్లింల స్థితి, రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రజెంటేషన్
12 శాతం రిజర్వేషన్ హామీపై చర్యలేవీ: ఉత్తమ్
ఓట్ల కోసం వాడుకుని గాలికి వదిలేశారని విమర్శ
కేసీఆర్‌వన్నీ ఉత్త మాటలే.. చేతల్లేవు: జానారెడ్డి
టీఆర్‌ఎస్ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళతాం: షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు... 24 నెలలవుతున్నా ఆ హామీని అమలుచేయడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ముస్లింలను ఓట్ల కోసం వాడుకుని, అధికారంలోకి వచ్చాక నిండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ముస్లింల స్థితిగతులు, రిజర్వేషన్లు తదితర అంశాలపై రూపొందించిన సీడీలను ఉత్తమ్, కె.జానారెడ్డి తదితరులు మంగళవారం ఇందిరాభవన్‌లో ఆవిష్కరించారు.
అనంతరం ఈ అంశంపై షబ్బీర్ అలీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల లబ్ధిపొందినవారి సక్సెస్ స్టోరీలను ప్రదర్శించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌పై 2014 ఏప్రిల్ 19న షాద్‌నగర్‌లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని.. 24 నెలలు కావస్తున్నా దీనిపై కనీసం ప్రతిపాదనలను కూడా రూపొందించలేదని మండిపడ్డారు. కేసీఆర్ ముస్లింలను ఓట్లకోసం వాడుకుని, అధికారంలోకి వచ్చాక మోసం చేస్తున్నారని ఆరోపించారు. ముస్లింలకు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడుతామన్నారు.
కాంగ్రెస్ నుంచి కేసీఆర్ నేర్చుకోవాలి..: జానా
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. దానిని అమలుచేసి చూపించిందని సీఎల్పీ నేత కె.జానారెడ్డి పేర్కొన్నారు. దానివల్ల లక్షలాది మంది ముస్లింలకు మెడికల్, ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్యావకాశాలు, ఉన్నతోద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, స్వయం ఉపాధి రుణాలు అందాయని చెప్పారు. కాంగ్రెస్ ఏ హామీ ఇచ్చినా అమలుచేసి చూపిస్తుందని... ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాలను చూసి సీఎం కేసీఆర్ నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌వి మాటలు తప్ప చేతలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
టీఆర్‌ఎస్ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం: షబ్బీర్
సీఎం కేసీఆర్ ముస్లింలను ఓటుబ్యాంకుగా చూస్తున్నారని షబ్బీర్ అలీ విమర్శించారు. ముస్లింల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు, ఇప్పటిదాకా చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. తాము ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను సీడీల ద్వారా ప్రజల్లో ప్రచారం చేస్తామని.. కేసీఆర్ చేసిన మోసాన్ని ఎండగడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జె.గీతారెడ్డి, డీకే అరుణ, భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ ఆకుల లలిత, బలరాంనాయక్, సబితా ఇంద్రారెడ్డి, వివేక్ తదితరులు పాల్గొన్నారు.