ఆంతర్యమేమిటో?
*ఉత్తమ్, కోమటిరెడ్డి విరుద్ధ వ్యాఖ్యలతో రసకందాయంలో జిల్లా రాజకీయం
*ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై చెరోమాట
*ఢిల్లీ దృష్టికి సీఎల్పీ ఉపనేత వ్యాఖ్యలు
*ఇద్దరు నేతల వ్యాఖ్యలపై జిల్లాలో రసవత్తర చర్చ
*ఉగాది నాటికి డీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం
*జెడ్పీ ఫ్లోర్ లీడర్ నియామకంలోనూ తాజా మెలిక..!
టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్, అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఈ పరిణామం రసవత్తర రాజకీయానికి తెర లేపింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం ప్రజెంటేషన్‌పై పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేయడం, పెద్దాయన జానారెడ్డి సెలైంట్‌గా ఉండడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
నల్లగొండ: తెలంగాణ అసెంబ్లీలో సీఎం ప్రజెంటేషన్‌పై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం ప్రజెంటేషన్ తెల్లారే నల్లగొండలో విలేకరులతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే పదునైన వ్యాఖ్యలు చేశారు. అసలు రీడిజైనింగే పెద్ద కుంభకోణం అని వ్యాఖ్యానించిన ఆయన పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు టెండర్లను రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. అయితే, ఉత్తమ్ వ్యాఖ్యలు పత్రికల్లో వచ్చిన రోజే ఆయనకు కౌం టర్ అన్నట్టు సీఎల్పీ ఉపనేత ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయడం చర్చకు దారితీస్తోంది. సీఎం ప్రజెంటేషన్ ఆకట్టుకుందనడంతో పాటు ఉత్తమ్ అసెం బ్లీలో చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేయ డం, డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తే టీఆర్‌ఎస్ తరఫున వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తాననడం ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు నేతల మధ్య ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు తాజా పరిణామాలతో తారస్థాయికి చేరినట్టయింది.
ఉగాదికి పదవుల పందేరం
ఇదిలా ఉంటే, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గాన్ని ఉగాది నాటికి ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడో ప్రకటించాల్సి ఉన్నా నేతల మధ్య సమన్వయం లేకపోవడం, పేర్లు ఖరారు కాకపోవడంతో కావాల్సినంత ఆలస్యం జరి గింది. ఈ పరిస్థితుల్లో కచ్చితంగా ఉగాది నాటికి డీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించి స్థానిక నేతలకు పదవులిచ్చే ఆలోచన జిల్లా కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. పూర్తిస్థాయిలో కాకపోయినా 20-25 పేర్లతో జిల్లా కార్యవర్గాన్ని ఉగాదిలోపు ప్రకటించనున్నట్టు స మాచారం.
కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో జెడ్పీ ఫ్లోర్‌లీడర్, గుండాల జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి టీఆర్‌ఎస్‌లోనికి వెళ్లడంతో జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పదవి ఖాళీ అయింది. ఈ పదవిని నార్కట్‌పల్లి జెడ్పీటీసీ దూది మెట్ల సత్తయ్య యాదవ్‌కు ఇవ్వాలని పార్టీ పెద్దలు భావించినా, దామరచర్ల జెడ్పీటీసీ శంకర్‌నాయక్ కూడా రంగంలోనికి రావడంతో మళ్లీ మెలిక పడింది. దీనిపై కూడా జిల్లా కాంగ్రెస్‌లో త్వరలోనే ఓ స్పష్టత రానుందని సమాచారం.