సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలోని రైతాంగానికి భరోసా కల్పించి వారిలో ధైర్యం నింపేందుకే వచ్చే నెల 6న వరంగల్‌కు రాహుల్‌గాంధీ వస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించి రైతుల్లో ధైర్యం నింపుతారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయ ఆధారిత వర్గాలకు ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నాయో వరంగల్ రైతు సంఘర్షణ సభలో వెల్లడిస్తారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ఏం చేయనుందో కూడా చెబుతారు’ అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు.
రాహుల్ సభ విజయవంతం కోసం పార్టీ నేతలందరమూ కృషి చేస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా రైతులందరూ సభకు వచ్చి రాహుల్ ఏం చెప్తారో వినాలని కోరారు. ఆదివారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రచార, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్లు మధుయాష్కీగౌడ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం. కోదండరెడ్డి మాట్లాడారు.
రైతులకు రుణమాఫీ ఏది?: భట్టి
కాంగ్రెస్‌కు పోటీగా టీఆర్‌ఎస్ రుణమాఫీ ప్రకటించినా అమలు చేయకపోవడంతో రూ. లక్ష రుణానికి వడ్డీలు పెరిగి రూ.4 లక్షలు అయ్యాయని, ఇప్పుడు ఆ రుణం తీర్చడం రైతులకు కష్టంగా మారిందని భట్టి అన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు రూ.లక్ష లోపు వడ్డీలేని రుణం, రూ. 3 లక్షల వరకు పావలా వడ్డీ, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్లు వ్యవసాయ యంత్ర పరికరాలు డ్రిప్స్, స్ప్రింకర్లతో పాటు పందిరి సాగు కోసం 100 శాతం సబ్సిడీ ఇచ్చామని గుర్తు చేశారు.
కాంగ్రెస్ హయాంలో పేదలకు వ్యవసాయం కోసం అసైన్ చేసిన భూములను టీఆర్‌ఎస్ సర్కారు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రైతులను కేసీఆర్, మోదీ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఉత్తమ్ ఆరోపించారు. కేసీఆర్ చేతకానితనంతోనే వరి రైతులు నష్టపోయారన్నారు. మూడేళ్ల క్రితమే ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా యేటా ఎరువుల ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు.
రైతులకు కూలి కూడా గిట్టట్లేదు: కోమటిరెడ్డి
సీఎం కేసీఆర్ రైతులను మోసం చేశారని, ఆయన ఇచ్చే మద్దతు ధరతో కూలి కూడా గిట్టడం లేదని కోమటిరెడ్డి చెప్పారు. రుణమాఫీ ఊసే ఎత్తకపోవడం దురదృష్టకరమన్నారు. ఓట్ల కోసం రాహుల్ వరంగల్‌కు రావట్లేదని, రైతుల కోసం వస్తున్నారని చెప్పారు. వరంగల్ సభ ఏర్పాట్ల నుంచి అన్ని అంశాలపై స్పష్టంగా ముందుకెళ్తామన్నారు.
ప్రశాంత్ కిశోర్, టీఆర్‌ఎస్ నేతల భేటీ గురించి విలేకరులు ప్రశ్నించగా పీకే గురించి పార్టీ నుంచి తమకు ఎలాంటి వివరణ అందలేదని, ఊహాగానాలపై చర్చ అవసరం లేదని, మీడియా కథనాలపై స్పందించలేమని కాంగ్రెస్ నేతలు చెప్పారు. పార్టీ అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామన్నారు.
మీడియాతో మాట్లాడుతున్న ఉత్తమ్. చిత్రంలో కోదండరెడ్డి, జగ్గారెడ్డి, భట్టి, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment