కేంద్ర మంత్రి ఖుర్షీద్ నోటి దురుసు!
రాజ్యాంగ సంస్థలపై దిగజారుడు వ్యాఖ్యలు
సుప్రీంకోర్టు ‘అనర్హత’ తీర్పు.. జడ్జి చేసిన చట్టమంటూ వ్యంగ్యాస్త్రం
లండన్: రాజకీయ ప్రత్యర్థులపై వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఈసారి ఏకంగా రాజ్యాంగబద్ధ సంస్థలైన ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టుపైనే విరుచుకుపడ్డారు. వాటి పాత్రను అవహేళన చేసేలా దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలే చట్టసభల ప్రతినిధులపై అనర్హత వేటువేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ఓ జడ్జి చేసిన చట్టంగా ఆయన అభివర్ణించారు. అలాగే ఎన్నికల కమిషన్ రూపొందించిన మార్గదర్శకాలను స్థూలంగా చూస్తే ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు ఏమీ చేయకూడదని లేక ఏమీ మాట్లాడకూడదనేలా ఉన్నాయని విమర్శించారు. బుధవారం లండన్‌లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్‌లో జరిగిన ‘భారత్‌లో ప్రజాస్వామ్యం ఎదుర్కొనే సవాళ్ల’పై సద స్సులో ఖుర్షీద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ముగ్గురు వ్యక్తులే నిర్ణయిస్తారా?
‘‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి పార్టీలకు గెలుపును కష్టతరం చేసింది. ఈసీ నుంచి తాజాగా అందిన సూచనలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. గెలిస్తే రోడ్లు నిర్మిస్తామని లేక మంచినీటి సౌకర్యం కల్పిస్తామని మేం మేనిఫెస్టోలో హామీ ఇవ్వకూడదట. ఒకవేళ ఇస్తే ఆ హామీ ప్రజాస్వామిక నిర్ణయాత్మక శక్తిని దెబ్బతీస్తుందట. ఈ నియమావళిబట్టి చూస్తే ఎన్నికల్లో గెలిచేందుకు మేం ఏమీ చేయకూడదని లేక ఏమీ మాట్లడకూడదన్నట్లుగా నాకు స్థూలంగా అర్థమవుతోంది. ఈ నియమావళి మేం ఎన్నికల్లో ఓడిపోయేందుకు వీలైనంత కృషి చేయాలన్నట్లుగా ఉంది. ఎన్నికల ప్రచారంలో మేం ఏం మాట్లాడాలో, ఎలాంటి పదాలు వాడాలో కూడా ఈసీలోని ముగ్గురు వ్యక్తులే నిర్ణయించేస్తున్నారు. ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఎన్నికల కమిషన్లు ఏ మేరకు జోక్యం చేసుకోవచ్చనేది అధ్యయనం చేయాల్సిన విషయమే’’ అని ఖుర్షీద్ వ్యాఖ్యానించారు.
జవాబుదారీతనంలేని బృందం
భారత్‌లో కీలక నిర్ణయాలు ఏమాత్రం జవాబుదారీతనంలేని ఓ బృందానికి బదిలీ అవుతున్నాయని ఖుర్షీద్ పరోక్షంగా సుప్రీంకోర్టు పాత్రపై విమర్శలు చేశారు. ‘‘భారత్‌లో పార్లమెంటు లేక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలపై కోర్టులే అభిప్రాయం చెబుతున్నాయి. పార్లమెంటుకు ఎవరు వెళ్లచ్చో లేక ఎవరు వెళ్లకూడదో కూడా నిర్ణయించేస్తున్నాయి. ఇది జడ్జి చేసిన చట్టం. ప్రజలు ఎన్నుకోని లేక జవాబుదారీతనం లేని బృందం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం దేశ ప్రజాస్వామ్యానికే పెను సవాల్‌గా మారుతుంది’’ అని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అధ్యక్ష వ్యవస్థ తరహా ప్రచారం సాగిస్తూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారని ఖుర్షీద్ విమర్శించారు. ఖుర్షీద్‌పై విపక్షాలు సహా అన్ని వర్గాలు విమర్శలు గుప్పించాయి. ఓటమి భయం వల్ల ఆవహించిన నిరాశలో ఖుర్షీద్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారని బీజేపీ మండిపడింది.