లోక్‌పాల్‌ వర్సెస్‌ న్యాయమూర్తులు | Sakshi Guest Column On Lokpal vs Judges | Sakshi
Sakshi News home page

లోక్‌పాల్‌ వర్సెస్‌ న్యాయమూర్తులు

Published Tue, Mar 4 2025 6:15 AM | Last Updated on Tue, Mar 4 2025 6:15 AM

Sakshi Guest Column On Lokpal vs Judges

అభిప్రాయం

ఉన్నత స్థాయిలోని అవినీతిని నిరోధించడానికి ‘లోక్‌పాల్‌’ను ఏర్పాటు చేశారు. సిట్టింగ్‌ హైకోర్టు న్యాయ మూర్తులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించే అధికారం తమకు ఉందని లోక్‌పాల్‌ అభిప్రాయపడింది. దీంతో లోక్‌పాల్‌ అధికారాల పరిధి, న్యాయ మూర్తులకు లభించే రక్షణల గురించిన ప్రశ్నలు చర్చనీయాంశాలయి నాయి. అంతేకాదు, న్యాయవ్యవస్థ స్వతంత్రత మీద నీలినీడలు ఏర్పడినాయి.

2025 ఫిబ్రవరి 20న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బీఆర్‌ గవాయ్, సూర్యకాంత్, ఏఎస్‌ ఓకాలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం లోక్‌పాల్‌ జారీ చేసిన ఎంక్వైరీ ఉత్తర్వుల మీద చర్చించడానికి ప్రత్యేకంగా సమావేశమయ్యింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఎం ఖన్విల్కర్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల లోక్‌పాల్‌ బెంచ్‌... ‘హైకోర్టు న్యాయమూర్తులు లోక్‌పాల్, లోకాయుక్త చట్టం–2013’ పరిధిలోకి వస్తారని అభిప్రాయపడింది. పార్లమెంట్‌ తయారు చేసిన చట్టం ద్వారా ఏర్పాటైన హైకోర్టులలోని న్యాయ మూర్తులు కాబట్టి వారు ఈ చట్టాల పరిధిలోకి వస్తారని లోక్‌పాల్‌ బెంచ్‌ అభిప్రాయపడింది.

‘ఇది చాలా కలవరపెట్టే విషయం’ అని జస్టిస్‌ గవాయ్‌ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతకు ముందు రోజు ఈ అంశాన్ని సుప్రీంకోర్టు తనకు తానుగా స్వీకరించి విచారణ చేపట్టింది. ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలు జరుగకుండా ఉండటానికి సుప్రీంకోర్టు తన అధి కారాన్ని వినియోగించుకొని ఈ విషయంలో జోక్యం చేసుకుంది. లోక్‌పాల్‌ జారీ చేసిన ఉత్తర్వులపై స్టేని మంజూరు చేసింది.

అంతేకాదు లోక్‌పాల్‌ విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తుల పేర్లు బహిర్గతం చేయకూడదని కూడా ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులపై విచారణ చేపట్టే ముందు లోక్‌పాల్‌ 1991వ సంవత్సరంలో న్యాయమూర్తి కె. వీరాస్వామి కేసుని కూడా ఉదహ రించింది. ఉన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తిని పబ్లిక్‌ సర్వెంట్స్‌ నిర్వచనం నుండి మినహాయించలేరు. అందుకని హైకోర్టు న్యాయమూర్తుల మీద తాము విచారణని చేపట్టినామని లోక్‌పాల్‌ తన ఉత్తర్వులలో పేర్కొంది.

1991వ సంవత్సరంలో ‘కె. వీరాస్వామి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రకారం – న్యాయ మూర్తులందరూ ‘అవినీతి నిరోధక చట్టం–1988’ ప్రకారం పబ్లిక్‌ సర్వెంట్స్‌ అని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఫిర్యాదు దాఖలైనప్పుడు కేసు నమోదు చేయడానికన్నా ముందు భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలని కూడా ఆ తీర్పులో పేర్కొన్నారు.

న్యాయమూర్తులను – అవసరం లేని ప్రాసిక్యూషన్‌ నుంచి, అనవసర వేధింపుల నుండి రక్షించడానికి రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలి. ప్రధాన న్యాయమూర్తి తన ముందు ఉంచిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, ఆ విషయంలో సంతృప్తి చెందిన తరువాత సంబంధిత న్యాయ మూర్తిపై ప్రాసిక్యూషన్‌ ప్రారంభించడానికి లేదా ఎఫ్‌ఐఆర్‌ని విడుదల చేయడానికి రాష్ట్రపతికి తగు సలహాని ఇవ్వాలి. 

ఈ తీర్పుని ఆధారం చేసుకొని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, లోక్‌పాల్‌ ఖన్విల్కర్‌ నేతృత్వంలోని బెంచ్‌ న్యాయమూర్తులపై వచ్చిన ఫిర్యాదులను భారత ప్రధాన న్యాయమూర్తి పరిశీలనకి పంపింది. 2013వ చట్టంలోని సెక్షన్‌ 20(4) ప్రకారం ఫిర్యాదును పరిష్కరించడానికి అవసరమైన కాలపరిమితిని దృష్టిలో పెట్టుకొని కేసుని నాలుగు వారాల పాటు వాయిదా వేయాలని ఆదేశించింది.

హైకోర్టు న్యాయమూర్తులు లోక్‌పాల్‌ అనుకున్నట్టు చట్ట బద్ధమైన అధికారులు మాత్రమే కాదని, వాళ్ళు రాజ్యాంగ బద్దమైన న్యాయమూర్తులని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ గవాయ్, జస్టిస్‌ ఏఎస్‌ ఓకా విచారణ సందర్భంలో అన్నారు. సుప్రీంకోర్టు వెలి బుచ్చిన ఆందోళనలో భారత సొలిసి టర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, న్యాయవాది కపిల్‌ సిబాల్‌ కూడా పాలుపంచుకున్నారు. 

లోక్‌పాల్, లోకాయుక్త చట్టంలోని సెక్షన్‌ 14 పరిధిలోకి వస్తాయని లోక్‌పాల్‌ అభిప్రాయపడింది కానీ దాని యోగ్యతలను లోక్‌పాల్‌ ఇంకా పరిశీలించలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే లోక్‌పాల్‌ అభిప్రాయం తప్పని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 214(1)ను లోక్‌పాల్‌ విస్మరించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ అధికరణం ప్రకారం హైకోర్టులను ఏర్పాటు చేస్తారు.

రాజ్యాంగం కొన్ని వ్యవస్థలకు రక్షణలను కల్పించింది.అందులో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఎలక్షన్‌ కమిషనర్లు వస్తారు. వీళ్ళే కాదు హైకోర్టు న్యాయమూర్తులూ వస్తారు. లోక్‌పాల్‌ అభిప్రాయం న్యాయవ్యవస్థ స్వతంత్రతకు సవాలు విసురుతుంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత మీద నీలి నీడలు కమ్ముకుంటాయి. ఈ జోక్యం వల్ల అత్యున్నత న్యాయ వ్యవస్థ బలహీనపడుతుంది. న్యాయ వ్యవస్థలో పరోక్ష జోక్యాలు, ఒత్తిళ్లు పెరిగిపోతాయి. 

ప్రేరేపిత ఆరోపణల నుంచి రక్షణ లేకుండా పోతుంది. అయితే వారి మీద ఎలాంటి విచారణ లేకపోతే జవాబుదారీ తనం లేకుండా పోతుంది. హైకోర్టు న్యాయ మూర్తుల మీద వచ్చిన ఆరోపణలను విచారించడానికి, తగు చర్యలు తీసుకోవడానికి సరైన యంత్రాంగం లేదు. దీనివల్ల అవినీతికి స్థానం దొరికేలా ఉంటుంది. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుతం ఉన్న విధానం మెరుగు పడాల్సిన అవసరం ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం భావించింది. 

ఇటీవలి కాలంలో తమ పరిధికి మించి ఉత్తర్వులను, బెయిల్‌ షరతులను విధిస్తున్న హైకోర్టు న్యాయమూర్తులను చూస్తున్నాం. అదే విధంగా కేసు విచారణ సందర్భంలో, బయట సమావేశాల్లో రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. 

వారి పరిధి నుంచి కేసుల ఉపసంహరణ లాంటి చర్యలను కూడా సుప్రీంకోర్టు తీసుకోవడం లేదు. న్యాయవ్యవస్థ స్వతంత్రత ఎంత ముఖ్యమో... జవాబు దారీ తనం కూడా అంతే ముఖ్యం. లోక్‌పాల్‌ అభిప్రాయం సరైంది రాకపోవచ్చు. కానీ చాలా అంశాలు సుప్రీం తీర్పు ముందుకు వస్తున్నాయి. సుప్రీం కోర్టు ఏం చేస్తుందో చూడాలి మరి!

మంగారి రాజేందర్‌ 
వ్యాసకర్త తెలంగాణ స్టేట్‌ జ్యుడీషియల్‌ అకాడమీ మాజీ డైరెక్టర్, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మాజీ సభ్యుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement