
మొరాదాబాద్/న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ రామునితో పోలుస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ పొగడ్తలతో ముంచెత్తారు. కాంగ్రెస్ కార్యకర్తలను భరతునితో పోల్చారు. మొరాదాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘మేం చలికి గజగజ వణుకుతుంటే రాహుల్ కేవలం టీషర్టు ధరించి జోడో యాత్ర కొనసాగిస్తున్నారు. ఆయన నిజంగా సూపర్‌మ్యాన్. తదేక లక్ష్యం కోసం తపస్సు చేస్తున్న యోగి’’ అన్నారు. ‘‘రాముడి పాదుకలు చాలా దూరం వెళ్లాయి. వాటిని భరతుడు (కాంగ్రెస్ కార్యకర్తలు) ఉత్తరప్రదేశ్ అంతటికీ చేరవేస్తారు’ అన్నారు.
మనోభావాలు దెబ్బతీశారు: బీజేపీ
ఖుర్షీద్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ‘‘వేలకోట్ల నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో బెయిల్ మీద బయటికొచ్చిన రాహుల్‌ను రాముడితో పోల్చడం దారుణం. దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు కాంగ్రెస్ కుటుంబం క్షమాపణ చెప్పాల్సిందే. కాంగ్రెస్ నేతలు కుటుంబ ఆరాధనకు అంకితమై అది దైవభక్తి, దేశభక్తి కంటే మించినదనే భ్రమల్లో బతుకుతున్నారు’’ అని బీజేపీ అధికార ప్రతినిధులు గౌరవ్ భాటియా, షెహజాద్ పూనావాలా అన్నారు.