సమావేశంలో ఖర్గే, రాహుల్ మంతనాలు
సాక్షి, న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ఒక జట్టుగా కలిసి పనిచేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దిశానిర్దేశం చేశారు. రాబోయే మూడు నెలలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ అలుపెరుగకుండా క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు.
అధికార బీజేపీ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని చెప్పారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీలతో ఖర్గే సమావేశమయ్యారు. పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సైతం హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత, పార్టీ వ్యూహం, మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటు, భారత్ జోడో న్యాయ్ యాత్ర తదితర కీలక అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ శ్రేణులకు ఖర్గే పలు సూచనలు చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.
భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి బీజేపీ యత్నాలు..
కేంద్రంలో అధికార బీజేపీ గత పదేళ్లలో చేసిందేమీ లేదని, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందని మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌వరకు భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీని ప్రశంసించారు. దేశంలో అమలుకు నోచుకోని సాంఘిక న్యాయం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల సమస్యలు, ప్రజల ఆర్థిక పరిస్థితి, కుల గణన తదితర కీలక అంశాలను భారత్ జోడో న్యాయ్ యాత్ర ద్వారా లేవనెత్తనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ యాత్ర సామాజిక న్యాయ సమస్యలను జాతీయ స్థాయిలో చర్చకు తీసుకువస్తుందని ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు.
బీజేపీకి తగిన సమాధానం చెప్పాలి..
బీజేపీ అబద్ధాలు, మోసాలు, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఖర్గే సూచించారు. విభేదాలను పక్కనపెట్టి పని చేయాలని, అంతర్గత సమస్యలపై రచ్చకెక్కకూడదని హితవు పలికారు. బీజేపీ 10 ఏళ్లలో ఘనంగా చెప్పుకునే ఒక్క పనీ చేయలేదని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వ పథకాల పేర్లను, రూపాలను మార్చడంపైనే బీజేపీ దృష్టి పెట్టిందని ఆక్షేపించారు. ‘ఇండియా’ కూటమి తరఫున దేశవ్యాప్తంగా 8 నుంచి 10 భారీ బహిరంగ సభలు ఉమ్మడిగా నిర్వహించాలని సూచించారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర
తూర్పు నుంచి పశ్చిమ భారతదేశం వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన యాత్ర పేరు మారింది. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ అని గురువారం నామకరణం చేశారు. తొలుత భారత్ న్యాయ్ యాత్ర అని పేరుపెట్టారు. ఇప్పుడు అదనంగా జోడో అనే పదాన్ని జోడించారు. రాహుల్ దక్షిణాదిన కన్యాకుమారి నుంచి ఉత్తరాదిన కశ్మీర్ వరకు ఇప్పటికే భారత్ జోడో యాత్ర పూర్తిచేసిన సంగతి తెలిసిందే. ఇక ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం సన్నాహాలు మొదలయ్యాయి. మణిపూర్ నుంచి రాహుల్ యాత్రకు శ్రీకారం చుడతారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ముగిస్తారు. ఎక్కువగా బస్సు యాత్ర, వీలును బట్టి పాదయాత్ర ఉంటుంది. యాత్రలో పాల్గొనాల్సిందిగా విపక్ష ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలను కూడా
ఆహ్వానిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ రూట్‌మ్యాప్‌ను స్వల్పమార్పులతో ఖరారు చేశారు. మణిపూర్‌లో ప్రారంభమయ్యే యాత్ర 66 రోజులపాటు కొనసాగుతుంది. 6,713 కిలోమీటర్ల మేర బస్సుయాత్ర, పాదయాత్ర నిర్వహిస్తారు.
15 రాష్ట్రాలు, 110 జిల్లాలు, 100 లోక్‌సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా యాత్ర జరుగుతుంది. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 11 రోజులపాటు 1,074 కిలోమీటర్లు యాత్ర సాగనుంది. భారత్ జోడో యాత్ర ఒక బ్రాండ్‌గా స్థిరపడిందని, న్యాయ్ యాత్రలో సైతం జోడోను చేరిస్తే బాగుంటుందని పార్టీ నేతలంతా సూచించడంతో పేరు మార్చారు. ఇందులో న్యాయ్ అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశిక నుంచి స్వీకరించినట్లు జైరామ్ తెలిపారు.
ఇవి చదవండి: ఇండియా కూటమిలో సీట్ల పంచాయితీ.. కాంగ్రెస్ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment