‘‘రుషులు, సన్యాసులు ప్రబోధించిన సంప్రదాయ హిందూయిజాన్ని, హిందుత్వకు చెందిన బలిష్ఠమైన వెర్షన్ పక్కకు నెట్టేసింది. ఇది ఐసీస్, బోకో హరామ్ వంటి జిహాదిస్ట్ ఇస్లాం గ్రూపులను పోలిన ప్రామాణిక రాజకీయ రూపమే తప్ప మరొకటి కాదు’’ అని నా తాజా పుస్తకంలో రాసిన వాక్యం నా ఇంటిపైకి హిందుత్వ శక్తుల దాడి వరకు తీసుకొచ్చింది. చాలాకాలంగా హిందుత్వ శక్తులకు మనల్ని పక్కకు నెట్టేసే స్వాతంత్య్రం ఇస్తూ వచ్చాం. సత్యంపై వారికే గుత్తాధిపత్యం ఉందనే భావన కలిగించాం. ఇప్పటికైనా మనం స్పష్టమైన వైఖరిని తీసుకోవాలి. మానవత్వాన్ని తోసిపుచ్చి, రెండు ముఖ్యమైన మతాల మధ్య శాశ్వత విభజనను కోరుకుంటున్న శక్తుల నుంచి మనం అసలైన హిందూయిజాన్ని కాపాడుకోవాలి.
నా తాజా పుస్తకం ‘సన్‌రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్’ 300 పేజీలతో రూపొందింది. అయోధ్యపై తీర్పులో న్యాయపరమైన ఔచిత్యంపై నా సహ న్యాయవాదులు చాలామంది సందేహం వ్యక్తపరుస్తున్నప్పటికీ, నా ఈ పుస్తకంలో ఆ తీర్పును బలపర్చడానికే ప్రయత్నించాను. హిందూయిజం తాత్వికతను గుర్తించడమే కాకుండా ప్రశంసిస్తూ వచ్చాను. సనాతన ధర్మానికి సంబంధించిన మానవీయ కోణాలను ఎత్తి చూపాను. హిందువులు, ముస్లింల మధ్య మత సామరస్యాన్ని ప్రోత్సహించడం, విచారకరమైన గతాన్ని మూసివేసి పరస్పర భాగస్వామ్యంతో కూడిన భవిష్యత్తుకు ఒక మంచి అవకాశంగా అయోధ్య తీర్పును ఎత్తిపట్టడమే నా తాజా పుస్తకం లక్ష్యం.
విచారకరంగా, నా ఈ ప్రయత్నాన్ని జాతీయ మీడియా కానీ, అధికార పార్టీ సభ్యులు కానీ గమనించకపోగా, నా పుస్తకంలోని 6వ అధ్యాయంలో హిందూయిజానికి, హిందుత్వకు మధ్య వ్యత్యాసం గురించి పేర్కొన్న ఒక వాక్యంపై విరుచుకుపడ్డారు. అదేమిటంటే ‘రుషులు, సన్యాసులు ప్రబోధించిన సాంప్రదాయ హిందూయిజాన్ని హిందుత్వకు చెందిన బలిష్టమైన వెర్షన్ పక్కకు నెట్టేసింది. ఇది ఐసీస్, బోకో హరామ్ వంటి జిహాదిస్ట్ ఇస్లాం గ్రూపులను పోలిన రాజకీయ రూపమే.’
హిందుత్వ స్వభావాన్ని ప్రశ్నించడం, అంతకు మించి దాన్ని బోకో హరామ్, ఐసిస్‌తో పోల్చి వర్ణించడం వల్ల నా పుస్తకంపై ఇంత ఆగ్రహం ప్రదర్శించినట్లు కనిపిస్తోంది. అయితే ఈ సంస్థల మధ్య ఉన్న సామాన్య లక్షణాలను చెప్పడానికే ఆ వాక్యాన్ని వాడాను తప్ప ఇవన్నీ సమానమని నేను పేర్కొనలేదు. మతాన్ని వక్రీకరిస్తూ, మానవత్వాన్ని గాయపర్చే ఒక అపక్రమ రూపానికి ఇవి సాధారణ నమూనాలు అని మాత్రమే చెప్పానని నేను ఇచ్చిన వివరణను ఎవరూ పట్టించుకోలేదు.
నాపై ట్రోల్స్ దాడి చేస్తున్న సమయంలోనే కల్కిథామ్ వద్ద ఉన్న కల్కి మహోత్సవ్ చివరి రోజు కార్యక్రమానికి నేను ప్రత్యేక అతిథిగా వెళ్లే అదృష్టానికి నోచుకున్నాను. ఆ పీఠాధిపతి శ్రీ ఆచార్య ప్రమోద్ కృష్ణన్ ఎప్పటిలాగా నాపై కరుణ చూపారు. అలాగే ఆ రోజు కాశీపీఠం జగద్గురు శంకరాచార్య నరేంద్రానంద్ గిరీజీ సరస్వతి మహారాజ్ ఆశీర్వాదాలు కూడా అదనంగా అందుకున్నాను. మతం కానీ, కులం కానీ మనలను విడదీయలేని మానవజాతి ఐక్యత గురించి ఆయన ఆరోజు సుదీర్ఘంగా వివరించారు.
ఒక గొప్ప మతాన్ని రాజకీయంగా దుర్వినియోగపరుస్తుండటాన్ని నేను ఆమోదించడం లేదు. అందుకే కాబోలు.. శంకరాచార్య పట్ల నా ఆరాధనా భావం, సనాతన ధర్మపై నా ప్రశంస, అయోధ్య తీర్పును నేను ఎత్తిపడుతూ అందరూ సమన్వయంతో సర్దుబాటు కావాలనీ, రాముడు... ఇమామ్ ఇ హింద్ పాత్ర పోషించాలనీ నేను చెప్పిన మాటలన్నీ వృథా అయిపోయాయి. ఆసక్తికరంగా, నా సీనియర్ సహచరుడు గులామ్ నబి అజాద్ బహుశా అనుద్దేశంగానే కావచ్చు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశారు.
నా పుస్తకాన్ని ఆవిష్కరించిన కొద్ది గంటలలోపో అజాద్ స్వీయ సంతకంతో కూడిన ప్రకటన మీడియాకు పంపించారు. అది నన్ను కలవరపెట్టింది. వెంటనే కాంగ్రెస్ పార్టీలోనే నా పుస్తకంపై తీవ్రమైన చర్చ మొదలైందంటూ అజాద్ ప్రకటన ఆధారంగా మీడియా ప్రకటించేసింది. కానీ ఇక్కడ రెండు అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి. అజాద్ కూడా హిందుత్వను ఒక రాజకీయ భావజాలంగా తిరస్కరించారు.
కానీ తాను ఎందుకు తిరస్కరిస్తోందీ ఆయన చెప్పలేదు.హిందూయిజం ఒక మిశ్రమ సంస్కృతిని కలిగి ఉందనీ, కానీ హిందుత్వను బోకో హరామ్, ఐసిస్‌లతో పోల్చడం సత్యదూరమని, అతిశయోక్తితో కూడుకున్నదని అజాద్ వివరించారు. కానీ అతిశయించి చెప్పాలంటే ఏవైనా పోలికలు ఉండాలి. ఏదైనా వాస్తవం ఉనికిలో ఉన్నప్పుడే అతిశయోక్తి పుడుతుంది. కానీ ఇదే అజాద్ కొన్నేళ్ల క్రితం హిందుత్వను ఐసిస్‌తో పోల్చుతూ మాట్లాడిన వీడియోను నేను ఇప్పుడు మళ్లీ ప్రదర్శించాలనుకోలేదు.
ఈ విషయమై నాతో మాట్లాడినవారిలో చాలామంది, హిందుత్వను పాటించేవారిలో అనారోగ్యకరమైన ప్రవర్తనకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క ఉదాహరణను చూపించవలసిందిగా కోరారు. నావద్ద చాలా ఉదాహరణలు ఉన్నాయి కానీ మతాల మధ్య సమన్వయాన్ని సాధించాలనుకుంటున్న నా లక్ష్యాన్ని అది పూర్వపక్షం చేస్తుంది. పైగా నా ఇంటిపై జరిగిన దాడిని వారు ఆమోదించడం లేదు కూడా. నా పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా పి. చిదంబరం దీన్ని అద్భుతంగా తన మాటల్లో చెప్పారు.
‘జెస్సికాను ఎవరూ చంపనట్లే, బాబ్రీ మసీదును కూడా ఎవరూ కూల్చలేదు.’ బీజేపీ, భజరంగ్ దళ్, విశ్వ హిందూపరిషత్‌కి చెందిన అనేకమంది ప్రముఖులతో నేను చేసిన సంభాషణలను ఈ సందర్భంగా ఇక్కడ జోడించతగినవే. అవేమిటంటే, ‘‘పెహ్లూ ఖాన్, అఖ్లాక్ ఖాన్‌లను మన దేశంలో ఎవరూ కాళ్లూ చేతులూ విరగ్గొట్టలేదు. 2002లో నరోదా పటియా వద్ద మహిళలను, పిల్లలను ఎవరూ చంపలేదు. ఉన్నావో, హత్రాస్ వద్ద అమ్మాయిలపై ఎవరూ అత్యాచారం చేయలేదు. ముజఫర్‌నగర్‌లో ఎవరూ ఇళ్లను తగలబెట్టలేదు. ఇస్రత్ జహాన్‌ని ఎవరూ చంపేయలేదు. లకింపూర్ ఖేరీలో ఎవరూ రైతులను ట్రాక్టర్లతో తొక్కించి చంపలేదు. అలాగే, మహాత్మా గాంధీని కూడా ఎవరూ చంపలేదు.’’
నేను చర్చకు ఎప్పుడూ సుముఖమే. కానీ బయటకు సుమోటో ప్రకటనలను జారీ చేయడం రూపంలో కాకుండా ఆ చర్చలు పార్టీలో అంతర్గతంగా ఎందుకు జరపకూడదు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పష్టమైన అభిప్రాయం కలిగి ఉండటం గమనార్హం. మన ఆలోచనల్లో సైద్ధాంతిక స్పష్టత ఉండటంపై ఆయన ఆలస్యంగా అయినా దృష్టిపెట్టారు. హిందూయిజం, హిందుత్వ అనేవి పూర్తిగా భిన్నమైన విషయాలని, వీటిలో హిందుత్వ... అమాయకులను వధించే కార్యక్రమంలో ఉంటోందని రాహుల్ పేర్కొన్నారు. ఇప్పుడు ఇంకా చర్చేమిటి?
వాస్తవానికి, చాలాకాలంగా మనం హిందుత్వ శక్తులకు మనల్ని పక్కకు నెట్టేసే స్వాతంత్య్రం ఇస్తూ వచ్చాం. సత్యంపై వారికే గుత్తాధిపత్యం ఉన్నట్లుగా అభిప్రాయాన్ని మనకు మనమే కలిగిస్తూ వచ్చాం. ప్రకృతే గాయాలను మాన్పుతుందని, ప్రజా జీవితం సాధారణ స్థాయికి చేరుతుందని భావించేలా చేయడమే దీని వ్యూహం. మనం ఒక అంగుళం స్థానమిస్తే, ప్రత్యర్థి అనేక అడుగులు ఆక్రమించడానికి ప్రయత్నిస్తాడని తాజా ఉదంతం మనకు స్పష్టం చేస్తోంది.
కాబట్టి ఇకనైనా మన శ్రేయస్సు కోసమే కాకుండా మన దేశ ఉనికిని కాపాడేందుకు కూడా ఒక పెద్ద గీత గీసుకోవాలి. ఇది హిందుత్వ శక్తుల ప్రవృత్తి, స్వభావాన్ని వ్యతిరేకించడానికి కాదు, ఒక అద్భుత మతమైన హిందూయిజాన్ని కాపాడేందుకు మనల్ని మనం ఇక తీర్చిదిద్దుకోవాలి. మానవత్వాన్ని తోసిపుచ్చి, రెండు ముఖ్యమైన మతాల మధ్య శాశ్వత విభజనను కోరుకుంటున్న శక్తుల ప్రమాదం నుంచి మనం అసలైన హిందూయిజాన్ని కాపాడుకోవాలి.
ఇప్పుడు మనం స్పష్టమైన వైఖరిని తీసుకోవాలి. మితవాద శక్తులు మనల్ని బంధించి ఉంచిన శృంఖలాలను తెగ్గొట్టుకోవడం తప్ప మనం కోల్పోయేది ఏమిటి? స్వాతంత్య్రాన్ని కోల్పోవడం అనేది ఒక భౌతిక నిర్బంధం మాత్రమే కాదు. అది మన బుద్ధికి, వాక్కుకు శృంఖలాలు తగిలించడమే. హిందుత్వ ప్రచారకులు మొదట సత్యాన్ని తొక్కేస్తున్నారు, తర్వాత దాన్ని అణిచి ఉంచడానికి ప్రతి ఆయుధాన్నీ సానబెడుతున్నారు.
గాంధీతత్వం మనల్ని హింసామార్గం వైపు పోకుండా అడ్డుకుంటోంది కానీ నిష్క్రియాత్మక ప్రతిఘటన పర్యవసానాలకు మనం బలవుతున్నాం. కానీ మనం సత్యం వైపు నిలబడదాం. నైని టాల్‌లోని నా ఇంటిని తగలబెట్టినప్పుడు, ఈ చర్యకు ఎవరు పాల్పడి ఉంటారు అని నన్ను ప్రశ్నించారు. బొకో హారమ్, ఐసిస్, హిందుత్వ శక్తులు. ఎవరు దీనికి పాల్పడ్డారో విజ్ఞులే నిర్ణయించుకోవాలి.
వ్యాసకర్త సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్
(‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment