అప్పటి పెళ్లి సరదా వేడుకలు ఉన్నాయా? | Sakshi Guest Column On Hindu Marriage and Traditions | Sakshi

అప్పటి పెళ్లి సరదా వేడుకలు ఉన్నాయా?

Published Sun, Mar 19 2023 12:58 AM | Last Updated on Sun, Mar 19 2023 12:58 AM

Sakshi Guest Column On Hindu Marriage and Traditions

పెళ్లంటె ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, ఉద్వేగాలు, సరదాల సమ్మేళనం. హిందూమత ప్రకారం జరిగే పెళ్లిలో ఒకప్పుడు కనిపించిన ఆచార సంప్రదాయాలు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. భవిష్యత్తులో ఇవి పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం ఉంది.

హిందూ కుటుంబాల్లో పెళ్లిరోజుకు ఒక రోజు ముందర ‘స్నాతకం’ అనే ముఖ్య మైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెళ్ళి కుమారుడి ఇంట్లో కానీ, కల్యాణ మండపంలో కానీ లేదా విడిది (ఆడ పెళ్ళివారు ఏర్పాటుచేసిన అతిథిగృహం)లో కానీ, పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ధి కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. స్నాతకం అనే ఈ ‘సంస్కారం’, ప్రధానంగా, వరుడిని ‘బ్రహ్మచర్యం’నుండి గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో, అంగీకారంతో ‘గృహస్థాశ్రమం’ స్వీకరించడానికి సిద్ధం చేస్తున్న వేడుక. ఆ సమ యంలో గురువు చేయాల్సిన హితబోధ తైత్తిరీయోపనిషత్తులోని ‘సత్యాన్న’ అన్న ఒక శ్లోక రూపంలో ఉంటుంది. 

‘సత్యం, ధర్మం, తెలివితేటల విషయాల్లో పొరపాటు పడవద్దు’ అన్న ఆదేశం అది. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని, వారు అనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని అంటూ... ‘వరుడికి శుభం కలుగుగాక’ అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు.

స్నాతకానికి ‘సమావర్తనం’ అన్న పేరు కూడా ఉంది. సమావర్తనమంటే, తిరిగి రావడమని అర్థం. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, గురువు హిత బోధతో పాదయాత్ర చేస్తూ తిరిగి రావడాన్నే సమావర్తనం అంటారు. 

హోమ కార్యాలు నిర్వర్తించి, దండాన్ని ధరించి, గొడుగు పట్టుకొని కాశీ యాత్రకు బయలుదేరే ఘట్టం మరో ముఖ్యమైన ఆచారం. వరుడు కాశీ ప్రయాణం, బాజా భజంత్రీల మధ్య గొడుగు పట్టుకొని, చేత్తో కర్ర పుచ్చుకొని, కాళ్లకు పావుకోళ్లు ధరించి, మెడలో పసుపు బట్టను వేసుకొని, సన్యాసం స్వీకరించేందుకు కాశీకి పోతున్నానని చెప్పి బయలుదేరుతాడు.

కాశీ యాత్రా ఘట్టం స్నాతకంలో చాలా సరదాగా జరిగే కార్యక్రమం. తన శేష జీవితం ఇక కాశీలో గడపాలని భావిస్తున్నాననీ; దానికి బంధు, మిత్రుల అనుజ్ఞ కావాలనీ వరుడు కోరతాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం సరైందికాదనీ, గృహస్థాశ్రమం స్వీకరించి, ధర్మబద్ధంగా ఇంద్రియ సుఖాలను అనుభవించి, పరిపూర్ణమైన వైరాగ్యం కలిగిన తర్వాతనే భార్యా సమేతంగా వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాలనీ పురోహితుడు హితవు పలుకుతాడు. 

వధువు సోదరుడు వచ్చి ‘అయ్యా, బ్రహ్మచారిగారూ! మీ కాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసు కొని గృహస్థుగా జీవించండి’ అని చెప్పి బొట్టు పెట్టి, బెల్లం (తీపి పదార్థం) నోటికి రుచి చూపించి, నూతన వస్త్రాలను ఇచ్చి వరుడిని  వెనుకకు తీసుకొని వస్తాడు.

శాస్త్రం ప్రకారం కాబోయే బావమరిదికి వరుడు నూతన వస్త్రాలను బహుకరిస్తాడు. ఆనాటి పెళ్లిళ్లలో ఇదొక ప్రధానమైన వేడుక. చాలా కోలాహలంగా పెళ్ళికి ‘తరలి పోయే ముందర’ జరిగే సరదా కార్యక్రమం ఇది.

ఇలా స్నాతకం వ్రతాన్ని పూర్తి చేసుకొని, వరుడి బంధు, మిత్రులందరూ బయలుదేరే ముందు, మంగళ స్నానాలు చేయడం, అలంకరించుకోవడం, పల్లకీ లాంటి వాహనాలు సిద్ధం చేసుకోవడం మామూలే. శుభకార్యానికి బయలుదేరుతున్నామనీ, వెనక్కు పిలవడం, నిందించడం, దగ్గడం, తుమ్మడం లాంటివి లేకుండా ఉండాలన్న అర్థం వచ్చే మంత్రాన్ని చదువుతారు. 

పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ; స్నాతకం, అంకు రార్పణల రోజున గానీ పెళ్ళికొడుకును, పెళ్ళికూతురును (సిద్ధం) చేయడం ఒక ఆచారం. మంగళ స్నానాలతో ఆ ఉదయం కార్యక్రమం మొదలవుతుంది. వధూవరుల ఇళ్లలో, ఉదయం తెల తెలవారుతుండగానే, మంగళ వాద్యాల మధ్య ఇంటి ముందర మామిడి ఆకులతో తోరణం కట్టే కార్యక్రమం ముందుగా జరుగు తుంది.

వధువుకు, కన్యాదాత దంపతులకు, తోటి పెళ్ళి కూతు రుకు (వధువు సొంత చెల్లెలు గాని, వరుసకు చెల్లెలు గాని), తెల్లవారక ముందే, ముత్తయిదువలు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. అలానే వరుడికీ, తల్లితండ్రులకూ, తోటి పెళ్ళికొడుకుకూ (వరుడి సొంత తమ్ముడు గాని, వరుసకు తమ్ముడు గాని) కూడా జరుగుతుంది.

అంకురార్పణగా పిలిచే ఆ వేడుకకు కన్యాదాత దగ్గరి బంధు వులందరూ వస్తారు. నవధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి మొలకెత్తే విధంగా అమర్చడాన్ని ‘అంకురార్పణ’ అంటారు. అలనాటి మంగళ స్నానాలు, మామిడితోరణాలు, స్నాతకం, కాశీయాత్ర లాంటి వేడుకలు ఇంకా ఉన్నాయా? అక్కడక్కడా ఉండవచ్చునేమో!

వనం జ్వాలా నరసింహారావు 
వ్యాసకర్త తెలంగాణ సీఎం సీపీఆర్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement