సందర్భం
పవన్ కల్యాణ్‌కు ‘మెకాలే’ తెలుసు. పద్దెనిమిదవ శతా బ్దంలో మెకాలే ఏమి చెప్పాడో కూడా తనకి తెలుసు. ఇన్ని తెలిసిన పవన్ కల్యాణ్‌కు ఇరవయ్యొకటో శతాబ్దంలో తాను ఏమి చెప్ప కూడదో తెలియకపోవడం మాత్రం విచారకరం!
నిజానికి పవన్‌కి తెలుసో లేదో గానీ, లేదా అతను ఏ అర్థంలో వాడాడో గానీ – ‘సాంస్కృతిక సామ్రాజ్య వాదం’ అనే పద ప్రయోగం మెకాలే నాటికి లేదు. 1960ల నాటిది. హెర్బర్ట్ షిల్లెర్ దాన్ని (మొదటిగా కాకపోయినా) వివరించాడు.
ఒకవేళ విదేశీ పాలకులు తమ పరిపాలనను స్థిరపరచుకోడానికి తమ భాషను, ఆచారాల్ని, సంప్ర దాయాల్ని తెచ్చి బలవంతంగా మన మీద రుద్దే ప్రయత్నాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ మాట్లాడాడు అనుకున్నా అది పూర్తిగా మెకాలేకి వర్తించక పోవచ్చు. సరే మన చర్చ మెకాలేది కాదు. వదిలేద్దాం.
మెకాలేది గతం. పవన్‌ది వర్తమానం. అతనొక బ్రిటిష్ హిస్టోరియన్. బ్రిటిష్ భాష, బ్రిటిష్ సంస్కృతి, శిక్షా స్మృతి – ఇంకా అనేక బ్రిటిష్ పరంపరల బానిస మెకాలే. బ్రిటిష్ ఉద్యోగి. బ్రిటిష్ పౌరుడు మెకాలే. కాబట్టి ఆ యూరోపియన్ సంస్కృతి గొప్పదనాన్ని మన మీద రుద్దాలని చూశాడనుకుందాము. పవన్ చెప్పినట్లు అతనిది ‘సాంస్కృతిక సామ్రాజ్యవాదమే’ అనుకొందాము. మరి ఇప్పుడు పవన్ మాట్లాడుతున్నది ఏమిటి? దీన్ని ఏమంటారు?
అన్ని మతాల, అన్ని కులాల ఓట్లతో గెలిచి,అందరి ప్రతినిధిగా ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడతానని ప్రమాణం చేసి, ఇప్పుడు ‘వారాహి’ సభలో ‘సనాతన ధర్మాన్ని కాపాడతానని, నేను ముమ్మాటికీ హిందువునేనని, దాని కోసం ప్రాణాలైనా అర్పిస్తానని’ చెప్పడం చూస్తుంటే పవన్ ఒక ‘హిందూ సాంస్కృతిక సామ్రాజ్యవాది’గా కనిపిస్తున్నారు. అంతేకాకుండా ‘అల్లాను, మహమ్మద్ ప్రవక్తను, క్రీస్తును విమర్శిస్తే ఒప్పుకుంటారా’ అంటూ ఒక హిందూ ఉగ్రవాదిగా కూడా మాట్లాడుతున్నారు.
గెలవకముందు ‘నాకు కులం లేదు, మతం లేదు; నేను దేశాన్నీ, జాతినీ ప్రేమిస్తాను’ అని చెప్పి, గెలిచాక ‘నేను హిందువుని, సనాతన ధర్మాన్ని ఆరాధి స్తాను’ అని చెప్పడం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రెండు నాల్కల ధోరణిని బయట పెడుతుంది.
‘నేను హిందువు’ని అని స్కూల్ సర్టిఫికెట్‌లో చెప్పినట్లుగా, ‘వారాహి సభ’లో కూడా చెప్పడమేనా? చేగువేరా, భగత్ సింగ్ పుస్తకాలు చదివి నేర్చుకున్నది ఇదేనా? మనం ఏదైనా చెబితే ఒక వంద మంది వింటారు. కానీ అదే పవన్ చెబితే లక్ష మంది వింటారు. అలాంటి పాపులారిటీ వున్న పవన్ ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవచ్చునా?
విశ్వనాథ సత్యనారాయణకు రామాయణం అనేది ఒక ‘కల్పవృక్షం’గా కనిపించింది. అదే రామా యణం రంగనాయకమ్మకు ‘విషవృక్షం’గా అనిపించింది. అయ్యప్పను గద్దర్ విమర్శించాడు. అయ్యప్ప పుట్టుక మీద, అతని భక్తుల దీక్ష మీద గద్దర్‌కి వున్న విమర్శ అది.
సనాతన ధర్మం మీద, రాముని మీద ఈ రోజున పవన్ కల్యాణ్ చాలా ప్రేమను కురిపిస్తున్నాడు. అది అతని హక్కు. తమిళులకు ఏ రోజునా రాముడి మీద గౌరవం లేదు. సనాతన ధర్మం మీద ప్రేమ అంత కన్నా లేదు. అలా లేకపోవడానికి వారి కారణాలు వాళ్లకి ఉన్నాయి. ద్రవిడ సంస్కృతిలో రావణాసురు డికి వున్న చోటు రాముడికి లేదు. ఆ కోణంలో సనా తన ధర్మం అనేది ఉదయనిధి స్టాలిన్‌కి ఒక వైరస్ లాగా అనిపించి వుండవచ్చు.
హిందూ దేవుళ్ళ మీద ఎలాగైతే విమర్శలు ఉన్నాయో, అలాగే క్రీస్తుని, అల్లాని, మహమ్మద్ ప్రవక్తని విమర్శించిన వాళ్ళూ ఉన్నారు. బైబిల్, ఖురాన్‌ల మీద రాసిన విమర్శలూ ఉన్నాయి. ఇదంతా ఏమీ చూడని పవన్ కల్యాణ్ అందర్నీ పట్టుకొని ‘సూడో సెక్యులరిస్టులు’ అని అంటున్నాడు.
‘సనాతన ధర్మంలో అంటరానితనం వుంది.లింగ వివక్ష వుంది. అన్యాయం వుంది. అధర్మం వుంది’ అనుకున్న వాళ్ళు హిందూ మతం నుంచి వెళ్లిపోయారు. వేరే మతాల్లో చేరిపోయారు. దానికి కొన్ని వందల ఏళ్ళ చారిత్రక సందర్భం ఉంది. పవన్ ఇలా మాట్లాడటం వెనుక కూడా ఒక చారిత్రక సందర్భం ఉంది. జగన్‌ని ఒక సీటుకు పరి మితం చేయాలనుకోవడం ఆ సందర్భం కావచ్చు. లేదా తాను సీఎం కావడం భవిష్యత్తు సందర్భం కావచ్చు.
జీవ శాస్త్రం ప్రకారం మనందరికీ ప్రాణం ఒక్కటే ఉంటుంది. ఆ ప్రాణాన్ని నిలుపుకోవడానికి చాలా అవసరాలూ, సందర్భాలూ ఉంటాయి. ప్రాణం పోవ డానికి, లేదా ఇచ్చేయడానికి మాత్రం ఒకే సందర్భం ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్‌కు మాత్రం చాలా ప్రాణాలు ఉంటాయి. అవి ఇచ్చేయడానికి కూడా చాలా సందర్భాలు ఉంటాయి.
దేశం కోసం ఒకసారి ఇచ్చేస్తారు. భారత జాతి కోసం ఇంకోసారి ఇచ్చేస్తారు. చేగువేరా కోసం, భగత్ సింగ్ కోసం లేదా వారి ఆదర్శాల కోసం మరొకసారి ఇచ్చేస్తారు. జగన్‌ని ఓడించడానికో, లేదా కూటమిని గెలిపించడానికో కూడా ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు చివరగా సనాతన ధర్మాన్ని గెలిపించడానికి ఒక హిందువుగా ప్రాణాల్ని ఇచ్చేస్తానని చెబుతున్నారు.
పవన్ కల్యాణ్‌ను ఒక హిందువుగా ఎంచి ఎవ్వరూ ఓట్లు వేయలేదు. సినిమా నటుడిగా, కాపు కులానికి చెందిన వాడిగా, కూటమిలో భాగస్థునిగా గెలిపించుకున్నారు. ఆ గెలిపించుకున్న వారంతా పవన్ గురించి ఇప్పుడు ఏమనుకోవాలి? తమను తాము హిందువుగా అనుకోని సమూహాలు ఈ దేశంలో చాలానే ఉన్నాయి.
వారంతా ఇప్పుడు పవన్ గురించి ఏమనుకోవాలి?‘పవనిజం’ అంటే ఇదేనా? అలాంటప్పుడు దీన్ని ‘హిందూయిజం’ అని కదా అనాలి? దక్షిణ భారత మద్దతు కోసం ఉత్తర భారతాన్ని విమర్శించడం,ఆంధ్రా వారి మద్దతు కోసం తెలంగాణాను విమర్శించడం, తెలంగాణా వారి మద్దతు కోసం తెలంగాణను కీర్తించడం, ఇప్పుడు మళ్ళీ ఆర్యుల్ని కీర్తించడం కోసం ద్రావిడుల్ని విమర్శించడం! ఇలాంటి అవకాశ వాద రాజకీయాల ద్వారా పవన్ సాధించగలిగింది ఏముంటుంది?
పవన్‌లో ఇప్పుడు చేగువేరా లేడు. భగత్ సింగ్ లేడు. థెరిస్సా లేరు. గద్దర్ కూడా లేడు (వీళ్లంతా నిజంగా ఉన్నారని కాదు). మోడీ మాత్రమే ఉన్నాడు!
ఎన్. వేణుగోపాల్
వ్యాసకర్త మానవ హక్కుల కార్యకర్త
మొబైల్: 98494 49012
Comments
Please login to add a commentAdd a comment