తూర్పు తీరం
‘‘సముద్రం ఒకడి కాళ్ళ ముందు కూర్చొని మొరగదు/ తుఫాన్ గొంతు ‘చిత్తం’ అనడం ఎరగదు/ పర్వతం ఎవ్వరికీ వంగి సలాం చెయ్యదు.’ పదేళ్ళ కిందట జనసేన పార్టీ విశాఖ సభలో పవన్ కల్యాణ్ తనని తాను వేలితో చూపించుకుంటూ సము ద్రంగా, తుఫాన్‌గా, పర్వతంగా అభివర్ణించుకుంటూ చెప్పిన మాటలివి. ‘చుట్టూ గాఢాంధకారం, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు’ వంటి స్థితిలో ప్రజలున్నారని, వారి ఆశలు నిలబెట్టి, వారి జీవితాల్లో వెలుగు పంచి అపర చేగువేరాగా అవతరించాలన్న పవన్ ఉద్దేశాలు జగమెరిగిన వారికి అమాయకంగా కనిపించినా ఎంతోమంది యువత అతన్ని నమ్మారు. పవన్ ఒంటిమీద పిచ్చుక వాలినా జనసేన కార్యకర్తలు బ్రహ్మాస్త్రాలు సంధించారు.
సినీహీరోగా తనకున్న ఇమేజ్‌ని గుడ్ విల్‌గా పెడితే చాలదని, అంతకి మించి ఏదో చేయాలన్న తపనని వ్యక్తం చేయడానికి ఆయన పలుమార్లు ప్రగతిశీల సాహిత్యాన్ని తన ప్రచారానికి వాడుకున్నారు. ఏ ప్రాంతానికి ప్రచారానికి వెళితే అక్కడి స్థానిక రచయితలను గుర్తించి వారి రచనల్లోని ప్రజా సమస్యలను ప్రస్తావించేవారు.
గుంటూరు శేషేంద్ర శర్మ, శ్రీశ్రీ కవితలు తరుచుగా చదివేవారు. ఆయా సాహిత్య అంశాలలోని అభ్యుదయం, ప్రజాపక్షపాతం, నిర్భీతి వంటివి పవన్ వ్యక్తిత్వ సుగుణాలని జనం నమ్మేలా బట్వాడా అయ్యాయి కూడా. తద్వారా మిగతా రాజకీయ నాయకులకి భిన్నమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు.
విప్లవకారులుగా చలామణీ అవ్వడానికి మొహం చెల్లని రాజకీయాల్లో అట్టడుగు ప్రజల కష్టాలు తీర్చగల రాబిన్ హుడ్‌నని ఆయన నమ్మే ఉండాలి. లేకపోతే అంత సులువుగా ‘జై భీమ్’ అని, అంతే సులువుగా ‘గో మాంసం, బీఫ్ తినడం తప్పయితే, అవి తినే ముందుకు వెళ్తాన’ని ఎలా అనగలరు! ఇఫ్తార్‌లో కూర్చుని గడ్డం పెంచుకుని, టోపీ పెట్టుకుని మీలో ఒకడిని అనడం, గోధ్రా, గుజరాత్ అల్లర్ల గురించి ప్రశ్నించడం, తన నాయనమ్మ దీపారాధన చేస్తే దాంతో వాళ్ళ నాన్న సిగరెట్ ముట్టించుకుని, దేవుడూ దయ్యమూ లేవు’ అనేవాడని గుర్తు చేసుకోవడం, మతపరమైన గొడవలు పెడుతున్నది ముఖ్యంగా హిందూ నాయకులని గట్టిగా చెప్పడం ద్వారా పవన్ కొన్నివర్గాల నుంచి మైలేజ్ పొందారు.
ఇక ఇపుడు తరం మారకుండానే స్వరం మార్చారు పవన్ కల్యాణ్. అధికారంలోకి రాగానే వేషభాషలు మారాయి. ఇపుడు తనని తాను ‘సనాతని హిందు’గా ప్రకటించుకున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడతానని, సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేస్తానని అంటూ అన్ని మతాలకీ ఒకటే న్యాయం అని ద్వంద్వానికి గురయ్యారు.
అంబేడ్కర్‌ని బాగా చదివి ఆయన భావజాలాన్ని అవగాహనలోకి తెచ్చుకున్నానని పవన్ కొన్నిసార్లు అన్నారు. అన్ని కులాలకి ఒకటే న్యాయం అని అంబే డ్కర్, ఇతర రాజ్యాంగ రూపకర్తలు అనుకోలేదు కనుక అణచివేతకి గురయ్యి శతాబ్దాలుగా ఎదుగుదల లేని కులాలకి రిజర్వేషన్లు ఇచ్చారు. అన్ని కులాలూ ఒకటి కానట్లే అన్ని మతాలు కూడా ఒకటి కావు. ఎక్కడైనా మెజారిటీ మతాలు, మైనారిటీల హక్కులకి భంగం కలిగించే సందర్భాలు ఉంటాయి కనుక సెక్యులరిస్టులు మైనారిటీ మతాల హక్కులకి అండగా నిలబడతారు. దానర్థం పవన్ విరుచుకు పడినట్లు వారు ఆ యా మతాలకి భయపడతారని, వలపక్షం చూపుతారని కాదు.
తిరుపతి సభలో వారాహి డిక్లరేషన్ ఇచ్చారు. దాని సారాంశం ఏమిటో ప్రజలమైన మాకు సరిగ్గా అర్థం కావడం లేదు. డిప్యూటీ సీఎంగా లడ్డు నాణ్యత మీద రోజుల తరబడి పోరాడటం ముఖ్యమా లేక కనీస అవసరాలు తీరని పేద ప్రజకోసం ఏవైనా చేయడం ముఖ్యమా అని అడగము, మెల్లిగా తెలుగుదేశాన్ని పక్కకి జరిపి జనసేన, బీజేపీతో ఎటువంటి రాజకీయం చేయబోతోంది అని కూడా అడగము, సరేనా! కానీ జస్ట్ ఆస్కింగ్! సనాతన ధర్మం అంటే ఏమిటి? బోర్డులు గట్రా ఏర్పాటు చేసి, జాతీయ స్థాయిలో మీరు చేయబోతున్న పోరాటపు ఆనుపానులు మాకు కాస్త ముందుగానే చెప్పగలరా? వర్ణవ్యవస్థ ఇందులో భాగమా, మనుధర్మ శాస్త్రం ఏమైనా పరిపాలనకి దిక్సూచి కానుందా? స్త్రీలను ఇంట్లో కూచోమంటారా, శూద్రులు సేవకులుగా, శ్రామిక కులాలను అంట రానివారిగా నిశ్చయం చేయబోతున్నారా? ‘మతి ఎంతో గతి అంతే’ అన్నది మీకు ఇష్టమైన కొటేషన్. ఇపుడు సనాతన హిందూగా మీ ‘మతి’ ఆంధ్రప్రదేశ్ ప్రజలమైన మా ‘గతి’ని ఎలా మార్చబోతోందో తెలుసుకోవాలని జస్ట్ ఆస్కింగ్.
పవన్ కల్యాణ్ గారూ! ప్రసాదాలు, ప్రమాణాలు సంబంధిత శాఖలకి వదిలిపెట్టి పదేళ్ళ పైబడిన మీ రాజకీయ ప్రయాణాన్ని సమీక్ష చేసుకోండి. మారిన వేషభాషలకి, మీరేంటో గర్జించి ఇచ్చిన ప్రకటనకి మీరే జవాబుదారీ. నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకోవడానికి మీరు సాధారణ పౌరుడు కాదు, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. మీరు సెక్యులరిస్ట్‌గా వినపడటమే కాదు కనపడటం కూడా ప్రజాస్వామిక అవసరం.
ఇప్పటికీ మిమ్మల్ని నమ్ముతున్న లక్షలాది యువత కోసం నిజాయితీ మాత్రమే మీ ప్రమాణం అయితే మంచిది. మీరు ధైర్యం విసిరిన రాకెట్టో, చేగువేరా బుల్లెట్టో సనాతని హిందూనో, బీజేపీ ప్రేరిత కాబోయే ముఖ్య మంత్రో, మరొకటో ఇంకొకటో– నాలుగు రోజులైనా కాస్త ఒకచోట ఆగండి. మీరేంటో అర్థంకాక ప్రజలు అయోమయంలో ఉన్నారు.
కె.ఎన్. మల్లీశ్వరి
వ్యాసకర్త ‘ప్రరవే’ ఏపీ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment