KN malleswari
-
మీరు చాలా మారాలి సార్!
అంతరిక్షంలో చిక్కుకుపోయి, భూమికి చేరేమార్గం కోసం ధైర్యంగా ఎదురుచూస్తున్న సునీతా విలియమ్స్ (Sunita Williams) వంటి సాహసగత్తెల కాలంలో ఉన్నాము. అదే సమయంలో స్త్రీల మీద వివక్షలు మారకపోగా కొత్త రూపాలు తీసుకున్నాయని ఇటీవలి కొన్ని వరుస ఘటనలు నిరూపిస్తున్నాయి. ప్రాబల్య స్థానాల్లో ఉన్న కొందరు పురుషులు బహిరంగంగా, ఎటువంటి సంకోచాలూ లేకుండా స్త్రీల గురించి చేస్తున్న వ్యాఖ్యలు పితృస్వామ్య సామాజిక స్థితిని దగ్గరగా చూపిస్తున్నాయి. ఈ పురుషుల్లో సినిమా నటులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, చివరికి న్యాయ, రక్షణ వ్యవస్థలు కూడా ఉండడం వివక్ష తీవ్రతను తెలుపుతున్నది.మాట, చూపు, హావభావ కవళికల్లో పెద్దమనిషితనం ఉట్టి పడుతున్నట్లు కనిపించేలా సవాలక్ష జాగ్రత్తలు తీసుకునే ‘మెగాస్టార్’ ఈసారి దొరికిపోయారు. ఆడపిల్లలతో నిండిన తన ఇల్లు లేడీస్ హాస్టల్లా, తను వార్డెన్‌లా ఆయనకి అనిపించింది. అయిదుగురు చెల్లెళ్లకి రక్షకుడిలా తను నటించిన ‘హిట్లర్’ సినిమా నిజం అనుకున్నారు కాబోలు! అంతేకాకుండా తమ లెగసీ కొనసాగించడానికి ఈసారైనా కొడుకుని కనమని కొడుక్కి బహిరంగంగా చమత్కారపూర్వక సలహా ఇచ్చారు. పసిబిడ్డ మొహాన్ని కూడా బహిరంగపరచకుండా తమ ప్రైవసీని కాపాడుకునే అతని కొడుకూ కోడలూ – తమ ఆడపిల్లకి ఎదురైన ఈ బహిరంగ వివక్షని ఎలా తీసుకుంటారో బహుశా అది వారి కుటుంబ విషయం. కానీ అనేకమంది ఆరాధకులని పెంచి పోషించుకునే ఒక సినిమా నటుడిగా ఆయన వ్యాఖ్యలు వ్యతిరేకించవలసినవి. రేపుమాపు ‘మెగా’ అభి మానులందరూ తమ ఇంటి స్త్రీలకి వార్డెన్లగానూ, లెగసీ కోసం కొడుకుల్ని కనమని వేధించేవారిగానూ ఉండడమే ఫ్యాషన్ అనుకుంటే అది ప్రమాదం కనుక ఈ వ్యాఖ్యలని కొందరైనా ఖండిస్తున్నారు. స్త్రీలపట్ల అసభ్యంగా ప్రవర్తించడంలో సినీనటుడు బాలకృష్ణ ‘గాడ్ ఆఫ్ వల్గారిటీ’కి ప్రతీకగా మారిపోయారు. స్త్రీలను ఉద్దేశించి నర్మగర్భంగా తను ఎక్కని ఎత్తులు, దిగని లోతులు లేవని అనడం, వెంటపడే పాత్రలు చేస్తే తన ఫాన్స్ ఊరుకోరని, అమ్మాయిలు కనపడగానే ముద్దయినా పెట్టాలి, కడుపైనా చేసేయాలని కోరుకుంటారన్న అసభ్య వ్యాఖ్యలకి కోర్టుకేసులు ఎదుర్కున్నారు. ఒక నటిని పడిపోయేంతగా వేదిక మీద నెట్టడం దగ్గర్నుంచి తన చుట్టూ ఉండే స్త్రీలతో కొన్నిసార్లు ఆయన ప్రవర్తన వేధింపు పరిధిలోకి వస్తుంది. ఇటీవల విడుదలైన చిత్రంలోని ఒక పాటకు ఆయన వేసిన స్టెప్పులు దిగజారడానికి పరిధులు ఏమీ లేనంత హీనమైనవి. అది కళారంగపు టేస్ట్ అనుకుని వదిలేయనివ్వలేదు బాలకృష్ణ (Balakrishna). అదే నటితో ఒక ప్రయివేట్ పార్టీలో అవే స్టెప్పులు వేస్తూ ఆమెని ఇబ్బంది పెట్టారు. వారికి లేని బాధ మీకేమిటనే అభిమానులకి కొరత లేదు. మగనటుల పవర్, స్త్రీ నటుల అవకాశాలను ప్రభావితం చేస్తుంది కనుక వారు ఊరుకుంటారు. కానీ సమాజం కూడా ఊరుకోవాల్సిన అవసరం లేదు. బహిరంగంగానే ఇలా ఉంటే కనపడని వేధింపులు ఎన్నో ఊహించలేము. నటుడిగా దాక్కోడానికి చోటు ఉన్నట్లు రాజకీయాల్లో ఉండదు కనుక ఇట్స్ టైమ్ టు స్టాపబుల్ మిస్టర్ ఎమ్మెల్యే!భార్యతో భర్త చేసే బలవంతపు అసహజ శృంగారం నేరం కాదని ఇటీవల ఛత్తీస్‌గఢ్ హైకోర్టు (chhattisgarh high court) ఇచ్చిన తీర్పు ఇపుడు చర్చలోకి వచ్చింది. 2017లో జరిగిన ఘటన ఇది. భర్త చేసిన అసహజ లైంగికచర్యల కారణంగా భార్య అనారోగ్యానికి గురయి మరణించింది. మరణ వాంగ్మూలంలో ఆమె ఇదే చెప్పింది. కింది కోర్టు వేసిన పదేళ్ళ శిక్షని కొట్టేసి భర్తని నిర్దోషిగా తేల్చింది హైకోర్టు. మారిటల్ రేప్ గురించి ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. భార్యకి ఇష్టం లేకుండా భర్త బలవంతంగా ఆమె శరీరాన్ని తాకకూడదన్నది ఒక విలువగా, హక్కుగా సమాజానికి అలవాటు కావాల్సిన సమయంలో ఈ తీర్పు స్త్రీల లైంగిక స్థితిని కొన్ని రెట్లు వెనక్కి నెట్టేదిగా ఉంది. ఆ భర్త అసహజ లైంగిక చర్య చేయడం గురించి కొంతమంది తప్పు బడుతున్నారు. సహజమా, అసహజమా అన్నది కాదు ముఖ్యం. ఆమె సమ్మతి ముఖ్యం. స్త్రీని లైంగిక కోరికలు తీర్చే వస్తువుగా చూసే పాత ఆలోచనా విధానాన్ని అందరూ సవరించుకోవాల్సిన అవస రాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తోంది. పనిగంటల విషయంలో ఎల్ అండ్ టి ఛైర్మన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా చాలా చర్చల్లోకి వచ్చాయి. వారానికి తొంభై పనిగంటలు పనిచేయాలని సూచిస్తూ ‘ఇంట్లో మీరు మీ భార్య మొహం ఎంతసేపు చూస్తూ ఉండగలరు, మీ భార్య మీ మొహం ఎంతసేపు చూస్తూ ఉండగలదు’ అని వ్యాఖ్యానించారు. పనిగంటల భారాన్ని వ్యతిరేకిస్తూ ఇంటిపనులు, బైటిపనులు, వ్యక్తిగత, మానసిక అవసరాల గురించి చాలామంది మాట్లాడారు. అయితే తక్కువగా చర్చకు వచ్చిన విషయం ఒకటి ఉంది. అది ఈ పనిగంటల సూచన కేవలం మగ ఉద్యోగులను ఉద్దేశించినట్లుగా ఉండడం. దాని ద్వారా ఇల్లు, పిల్లలు, వృద్ధుల బాధ్యతలు మగవారి టెరిటరీ కావు, అవి కేవలం స్త్రీలకి ఉద్దేశించినవి మాత్రమేనన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లు! మగవారు తమ పూర్తికాలం ఉద్యోగంలో గడిపితే కుటుంబాల సమస్త బాధ్యతలు స్త్రీల మీద పడతాయి. ఉద్యోగం పురుష లక్షణం, ఇల్లు దిద్దుకోవడం స్త్రీ లక్షణంగా ఆ వ్యాఖ్యల అంతరార్థం స్ఫురిస్తోంది. చదవండి: ‘దంగల్’ చూడండి ‘మాస్టారు’పై నాలుగు ఘటనల్లో నాలుగు ప్రధానమైన సమస్యలు మన ముందుకు చర్చకు వచ్చాయి. ఆడశిశువుని పురిటిలోనే చంపేసిన సమాజాలు మనవి. ఆ దశ దాటి వస్తున్నాము. ఆకాశంలో సగాలకి తాము వార్డెన్లమని బాధపడటం కాకుండా– వారి పుట్టుక, ఎదుగు దల, విజయాలు సాధికారికంగా సెలెబ్రేట్ చేసుకోవడం మన వివేకంలో భాగం కావాలి. స్త్రీలకు సొంత లైంగిక వ్యక్తిత్వం ఉంటుంది. అధికారం, హోదా, పేరు ప్రఖ్యాతులతో మదించినవారు ఆ వ్యక్తిత్వం మీద దాడి చేస్తూనే ఉంటారు. చదవండి: దీపికా పదుకోన్ (బాలీవుడ్ నటి) రాయని డైరీధైర్యంగా వ్యతిరేకించే వారు పెరగాలి. న్యాయవ్యవస్థలు న్యాయసూత్రాల పరిధికి లోబడి పనిచేస్తాయి. న్యాయసూత్రాలు కాలం చెల్లినవిగా, స్త్రీలకి రక్షణ కల్పించలేనివిగా ఉన్నప్పుడు వాటిమీద పౌరసమాజం విస్తృత చర్చ చేయాలి. ఇంటిపనికి విలువ కట్టడం సరే, స్త్రీ పురుషుల మధ్య పని విభజనకి మార్గదర్శకాలు రూపొందించుకోవాలి. వీటన్నిటితో పాటు లోకం తన చూపుకి మరికాస్త స్త్రీ తత్వాన్ని అద్దుకోవాలి.కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త ప్రరవే ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com -
గెలిచిన దారులు మిగిలిన ఆకాంక్షలు
రాజ్యాంగం... దేశ పాలనావ్యవస్థకు పరమగ్రంథం. ప్రతి పౌరునికి శిరోధార్యం. బలహీనులకు వజ్రాయుధం. బలవంతులను అదుపు చేసే అంకుశం. పురుషస్వామ్య పెత్తందారీ నుంచి స్త్రీలు అడుగు ముందుకు వేయడానికి రాజ్యాంగం పరిచిన దారులు వారిని నేడు ఆత్మగౌరవంతో నిలబెట్టి స్వయం సమృద్ధి వైపు నడిపిస్తున్నాయి. సాధించింది ఎంతో. సాధించాల్సింది మరెంతో. ఆకాంక్షలను అలాగే నిలబెట్టుకుంటూ ముందుకు సాగాలని అంటున్నారు సీనియర్ రచయిత్రి.భారత రాజ్యాంగాన్ని స్త్రీల దృష్టితో చూడటానికి ఈరోజొక వజ్రోత్సవ సందర్భం. వాలుకి కొట్టుకుపోయే యాంత్రికత నుంచి బైటకి వచ్చి, దాటి వచ్చిన కాలాలను, నడుస్తున్న సమయాలను నిమ్మళంగా చూస్తున్నప్పుడు కొంత సంతోషం, మరికొంత బాధ. ఈ రోజుల్లో భర్త చనిపోతే భార్య చితిలోకి దూకనవసరం లేదు, అతి బాల్య వివాహాలు చేసుకోనవసరం లేదు, వితంతువులు రహస్య గర్భవిచ్చిత్తిలో ప్రాణాలు పోగొట్టుకోనవసరం లేదు. గడపచాటున నిలబడి మాట్లాడటం, ముట్టుగదుల్లో మగ్గడం, అవిద్య, అజ్ఞానం, మూఢనమ్మకాల నుంచి స్త్రీలు చాలావరకూ బైటపడ్డారు. రాజ్యాంగంలో స్త్రీలకి సమానహక్కులు పొందుపరచడానికి ముందుతరాల వారు చేసిన సంఘసంస్కరణ చాలావరకూ మూలకారణం. దీనికి సమానమైన చేర్పుని రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ ఆలోచనలు ఇచ్చాయి. స్త్రీలని వాహికలుగా చేసుకుని కులం, మతం వ్యాప్తి చెందుతాయని, ఈ సమాజాన్ని కొందరి చెప్పుచేతుల్లోనే ఉంచుతాయన్నది అంబేద్కర్ అవగాహన. అందుకే దళిత, కార్మికవర్గాల కోసం ఆలోచించినంతగా స్త్రీ సమానత్వం కోసం కూడా పాటుబడ్డారు. రాజ్యాంగానికి మూలాధారమైన ‘అందరికీ సమానమైన విలువ’ అనే అంబేద్కర్ ప్రతిపాదన పైకి కనిపించే సాధారణ విషయం కాదు. ఆ కాలానికే కాదు, ఇప్పటికీ మనుషులు సమానంగా లేరు. స్త్రీలు చాలా విషయాల్లో రెండవ తరగతి పౌరులుగానే ఉన్నారు. ఆ స్థితిని పోగొట్టి, స్త్రీల జీవితాల్లో విప్లవాత్మక మార్పుల కోసం అంబేద్కర్ ప్రవేశపెట్టిన ‘హిందూ కోడ్ బిల్’ ఒక సంచలనం. అంతవరకూ స్త్రీలకి సామాజిక, రాజకీయ, కుటుంబహక్కుల వంటివి లేవు. సమానత్వప్రాతిపదిక మీద రాజ్యాంగం ద్వారా వారు ఆ హక్కులను మిగతావారితో పాటు సహజంగానే పొందారు. ఉదాహరణకి రాజ్యాంగ ఏర్పాటుకి మునుపు సార్వత్రిక ఓటుహక్కు లేదు. తొంభైశాతం పైగా స్త్రీలకి ఓటువేయడం అంటే ఏమిటో తెలీదు. కానీ రాజ్యాంగం ద్వారా స్త్రీలంతా ఓటు వేయడమే కాదు, రాజకీయ పార్టీలలో చేరి, ఎన్నికలలో పాల్గొని, శాసనసభలకి చేరారు. ‘బిఎ చదివినా బియ్యంలో రాళ్లేరక తప్పుతుందా’ అన్నవారికి– ఉద్యోగాలు చేసి, ఊళ్ళేలి చూపించారు స్త్రీలు. బ్రిటిష్ పాలనకి భిన్నంగా భారత రాజ్యాంగం స్త్రీల ఉనికిని నిరూపించింది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను వాడుకుని చేసిన అనేక పోరాటాల ఫలితంగా స్త్రీలకి అనుకూలమైన కొన్ని చట్టాలు రూపొందాయి. వివాహానికి సరైన వయసుప్రాతిపదిక అయింది. అబార్షన్ హక్కులు ఉన్నాయి. విడాకులు పూర్వమంత కఠినం కావు. స్త్రీలపై సాగే గృహహింస, లైంగిక వేధింపులు, అత్యాచారాలకి కఠినశిక్షలు ఉన్నాయి. ఆస్తి, వారసత్వ హక్కుల విషయంలో కూడా ప్రగతి కనబడుతోంది. ముఖ్యంగా స్త్రీల సామాజిక, రాజకీయ భాగస్వామ్యం మెరుగుబడింది. అయితే, స్త్రీల హక్కులన్నిటికీ కాపాడగల రక్షణ వ్యవస్థలు నిష్పక్షపాతంగా లేవు. అవి మగ స్వభావాన్ని, మగ పెత్తనాన్ని తెలియక, తెలిసి ప్రదర్శిస్తాయి. దానివల్ల మొగ్గు పురుషుడి వైపు ఉండి స్త్రీ సమానత్వాన్ని సూచించే రాజ్యాంగస్ఫూర్తిని భగ్నం చేస్తాయి. అందుకే ‘అందరికీ ఒకే విలువ’ సూత్రం ఆచరణలో విఫలం అయింది. స్త్రీలు అన్ని ఉద్యోగాలకి అర్హులు. కానీ సైనికులుగా, భారీ వాహన చోదకులుగా, పెద్దపెద్ద హోదాలు కల ఉద్యోగులుగా, మంత్రులుగా, వ్యాపారవేత్తలుగా వారి ఉనికి ఎంత? ఇటీవలి అంచనాలు కార్మిక వర్గంలో, ‘బాస్’ స్థానాలలో స్త్రీల నిష్పత్తి పతనమవుతున్నదని హెచ్చరిస్తున్నాయి. ఇక కొన్ని ప్రత్యేక రంగాల్లో స్త్రీలు అడుగు పెట్టాల్సే ఉంది. సంసిద్ధత లేకపోవడం సమాజానికే కాదు, సమాజం తయారు చేసే స్త్రీలది కూడా కావొచ్చు. అందరినీ ఒక చోటికి చేర్చాలంటే వెనుకబడి ఉన్నవారిని ముందుకు చేర్చడానికి రిజర్వేషన్లు కావాలి. విద్యా ఉద్యోగ రంగాలలో స్త్రీలకి 33 శాతం రిజర్వేషన్లని అంగీకరించిన రాజ్యాంగం– చట్టసభలకి ఆ హక్కుని వర్తింపజేయలేక పోయింది. 33 శాతం రిజర్వుడ్ స్థానాల్లోనూ, జనరల్ స్థానాల్లో మరి కొందరు స్త్రీలు కలిసి చట్టసభలకి చేరి విధాన నిర్ణయాలు చేయడమన్న ఆలోచనకే రాజకీయపార్టీలు వ్యతిరేకం కనుకనే ఇంతవరకూ మహిళా రిజర్వేషన్ల బిల్లు ముందుకు పోవడం లేదు. స్త్రీల శరీరాల మీద పురుషులకి ఉండే హక్కులకి, స్త్రీల గౌరవానికి భంగకరంగా ఉన్న అడల్టరీ చట్టం ఎత్తి వేయడానికి రాజ్యాంగం ఏర్పడ్డాక కూడా దాదాపు ఏడు దశాబ్దాలు పట్టింది. తల్లికి బిడ్డల మీద ఉండాల్సిన సహజ బాధ్యతలు, హక్కుల విషయంలో కూడా చాలా వివక్ష ఇప్పటికీ ఉంది. పురుషుని ఇంటిపేరుతో స్త్రీ, ఆమె పిల్లలు గుర్తింపు పొందడం– పితృస్వామ్యం బలంగా ఉండడాన్నే సూచిస్తుంది. రాజ్యాంగంలో కూడా స్త్రీలహక్కులకి సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆచరణలో చాలా లోటుపాట్లు కూడా ఉన్నాయి. అయినాసరే స్త్రీలు తాము పోరాడి సాధించుకున్న చైతన్యాన్ని నిలుపుకోవడానికి తమ హక్కులకి రక్షణ ఉండాలని గట్టిగా అడగడానికి రాజ్యాంగమే ఆసరాగా ఉంది. దానికి తోడు మహిళాపోరాటాల సాధించుకున్న, సాధించుకోబోయే మార్పులు– ‘అందరికీ ఒకే విలువ’ సూత్రానికి స్త్రీలని మరింత దగ్గర చేస్తాయని నమ్మిక. ఈ నమ్మకాన్ని సడలనివ్వకుండా మనం ముందుకు సాగాలి.– కె.ఎన్.మల్లీశ్వరి, రచయిత -
మెస్సయ్య దాటిపోయాక...
ఆస్పత్రి ప్రారంభోత్సవానికి పెద్దాయన వచ్చాడు. ఆయన రాకముందే రంగస్థలాన్ని చాలా శ్రద్ధగా సిద్ధం చేశారు. ఎంతగానంటే రెండు గంటల ముందు నుంచే ఫొటోగ్రా ఫర్లు మండుటెండలో ఎదురు చూసేట్లు. తీరా ఆయనొచ్చాక ఎడమ వైపు ఫొటోగ్రాఫర్ల బృందాన్ని చూసి చీదరించుకున్నాడు. ఎందుకంటే అక్కడనుంచి ఫొటోలు తీస్తే ఆయన ముఖం కనపడదు. నీడలు మాత్రమే వస్తాయి. ఆగమేఘాల మీద అది కూడా సరి చేశారు. అపుడు తీరిగ్గా ‘ప్రాచీన భాష లిపిలో, లోహపు కడ్డీకి చుట్టుకున్న పాములాగా కనిపించే మతచిహ్నం’ ఉన్న శిలాఫలకానికి మొక్కి, లేచి నిలబడి హటాత్తుగా చెట్టు కూలినట్లు నేల మీద పడిపోయాడు. ఆ పడిపోవడం ఉద్దేశపూర్వకంగా చేశాడేమో అన్నట్లు చేతులు రెండూ రెండు వైపులా కచ్చితంగా పెట్టినట్లు పడి పోయాయి. ఆయన ఆస్పత్రికి ప్రణామం చేస్తున్నాడేమో, కొత్త తంతు రిహార్సల్ ఏమో అనుకున్నారు. కానీ పెద్దా యన చచ్చిపోయాడు. మెస్సయ్య దాటిపోయాడు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన పెద్దాయన అంతమై పోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది?2023లో ఆకార్ పటేల్ ఇంగ్లిష్‌లో ‘ఆఫ్టర్ మెస్సయ్య’ (after messiah) నవల రాశారు. దాన్ని తెలుగులోకి ‘నియంత అంతం’ పేరుతో ఎన్. వేణుగోపాల్ అనువాదం చేస్తే ‘మలుపు’సంస్థ ప్రచురించింది. ఈ నవల అంతా కల్పనే. కానీ వాస్తవ భ్రాంతిని కలిగించే కల్పన. ‘జరుగుతున్నది ఇదే కదా!’ అని విస్తుపరిచే సంభావ్యత ఉన్న కల్పన. నియంత పాలించే కాలంలో ఆయన వైభవ కాంతి ముందు మిగతా లోకమంతా మసకలు కమ్ముతుంది. దేశభక్తి, మత రాజకీయాలు వినా ప్రజలకి గత్యంతరం ఉండదు. అభివృద్ధికి నిర్వచనాలు మారిపోతాయి. ప్రభుత్వాలను, వ్యవస్థలను, ప్రజలను తోలుబొమ్మలు చేసి ఆడించిన సూత్రగాడి తాళ్ళు పుటుక్కున తెగి దేశమంతా సంక్షోభపు చీకట్లలో మునిగి నపుడు, ‘ఆయన తర్వాత ఎవరు?’ అన్న ప్రశ్న పుట్టిన చోట కొత్త రాజకీయాలు మొదలవుతాయి.రాజకీయ పార్టీలలో నియంతృత్వ ధోరణుల వల్ల నాయకుల మరణం తర్వాత ప్రత్యామ్నాయం అంత తొందరగా తేలదు. దానికోసం కుమ్ములాటలు దేశానికి కొత్త కాదు. నియంతకి కుడిభుజంగా ఉండే జయేష్ భాయి, మత రాజకీయాల ద్వారా నూతనశక్తిగా ఎదిగే స్వామీజీల మధ్య పదవి కోసం జరిగే పోరు భారత రాజకీయ చరిత్ర పొడుగూతా జరిగిన అక్రమాలను స్ఫురింపజేస్తుంది. రిసార్టు డ్రామాలూ, కార్పొరేట్లతో లావాదేవీలూ, తమ ప్రయోజనాలకి అనుగుణమైన వాస్తవాలను నిర్మించే మీడియాల ‘పెనవేత రాజకీయాలూ’ అన్ని వ్యవస్థలనూ ప్రభావితం చేసి చట్టాన్నీ, న్యాయాన్నీ తమకి అను గుణంగా ఎలా మలుచుకుంటాయో చదివినపుడు దేశపౌరులుగా అభద్ర తకి లోనవుతాము. రాజ్యం ఎపుడూ తన మీద ఎవరో దాడి చేయ బోతున్నారనీ, తను బలహీనమైనదనీ ఊహించుకుంటుంది. అందుకోసం తన సమస్త శక్తులతో ఆ దాడిని ముందుగానే నిర్మూలించాలని అనుకుంటుంది. స్వతహాగా క్రూరమైన బలం ఉండడం వల్ల రాజ్యస్వభావం హింసతో కూడినదనీ, ప్రభుత్వాల హృదయమూ, ఆత్మా హింసేననీ నవల మొత్తం చెబుతుంది. అంతేకాదు ‘రాజ్యం అనేది ఒక హింసాత్మక రాజకీయ జంతువు’. ఈ జంతువుని చెడ్డవారు అధిరోహించినా అది హింసే. మంచివారు అధిరోహించినా హింసేనని తెలిసినపుడు కొంత వెలుగు మన ఆలోచనల మీద ప్రసరించి ఎరుక, దిగులూ కలుగుతాయి.ఆదివాసుల హక్కుల కోసం పనిచేసే మీరా – పార్టీలో ఒక సీనియర్ నాయకుని కూతురు. అనివార్య పరిస్థితుల్లో ఆపద్ధర్మ ప్రధాని అవుతుంది. పీడిత ప్రజలకోసం పనిచేసే మంచి వ్యక్తి ప్రధాని అయినా రాజ్యస్వభావం మారదు. ఆదివాసీ హక్కులను పరిరక్షించే ఒక చిన్న చట్టం అమలు లోకి తేవడానికి మీరా, అనేక అడ్డంకులను ఎదుర్కుని, తన విలువలను పణంగా పెట్టాల్సి వచ్చినపుడు అంబేడ్కర్ గుర్తుకు వస్తారు. రాజ్యాంగం... హింస నుంచి పీడితులకు రక్షణ కల్పిస్తుందని నమ్మి, ఆ సాధనలోనూ, హిందూ కోడ్ బిల్లుని ఆమోదింపజేసే సందర్భంలోనూ అంబేడ్కర్ రాజ్యం పెట్టిన ఒత్తిడికీ, హింసకూ లోనయ్యి కూడా ఎంత గట్టిగా నిలబడ్డారో, దానికోసం ఎంత త్యాగం చేశారో, ఎంత రాజీపడ్డారో చరిత్ర చెబుతుంది.ఆ ఒక్క చట్టం కోసం ప్రత్యర్థి ముఠాలకి మీరా ప్రయోజనాలు సమకూర్చాల్సి వస్తుంది. ఆదివాసీల మేలు కోసం చట్టం చేయడానికి మీరా రాజ్య హింసకు లోబడి పని చేసిందని తెలుసు కున్న ఆదివాసీ ప్రతినిధి బృందంవారు ఆమె ప్రతిపాదనలను తిరస్కరిస్తూ ఒక మాట అంటారు. ‘పీడనకు గురయ్యాము కనుక పీడనను తిరస్కరించడం కాదు, అసలు పీడన అనేదే చెడ్డది కనుక దాన్ని మొత్తంగా తిరస్కరించాలని, ఒక పీడనను తొలగించడం కోసం మరో చోట మరో సమూహాన్ని పీడనకు గురి చేయడం భావ్యం కాదని’ చెబుతారు. చివరికి పదవి నుంచి దిగిపోయి ఆదివాసీ పోరాటాలలో భాగం కావాలని కోరుకుంటుంది మీరా.చదవండి: ప్రధాని మోదీ పేరిట గణాంక విన్యాసం.. అసలు కథ ఇదే!ఉనికిలో ఉన్న రాజ్య వ్యవస్థే హింసాత్మకం అయినపుడు, ఎంత మంచి వ్యక్తీ దాన్ని మార్చలేనపుడు, మరి ఎటువంటి పరిపాలనా ప్రత్యామ్నాయాన్ని ఈ నవల సూచించింది! బహుశా ఈ చర్చ పాఠకులలో జరగాలని రచయిత కోరుకుని ఉండొచ్చు. లేదా మీరా ఎంచుకున్న మార్గాన్ని మనకు సూచనప్రాయంగా అందించి ఉండొచ్చు. ‘ఏ రాయి అయి తేనేమి’ అన్న నిర్లిప్తత పెరిగిపోయిన వర్తమానంలో భిన్న రాజకీయ శ్రేణుల మధ్య ప్రత్యామ్నాయ రాజకీయాల మీద చర్చ జరగాలి. ‘గమ్యమే మార్గాన్ని సమర్థిస్తుంది’ అన్న సూత్రాన్ని డీ కోడ్ చేయాలి.- కె.ఎన్. మల్లీశ్వరి‘ప్రరవే’ ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com -
చేగువేరా టు సనాతని హిందూ!
‘‘సముద్రం ఒకడి కాళ్ళ ముందు కూర్చొని మొరగదు/ తుఫాన్ గొంతు ‘చిత్తం’ అనడం ఎరగదు/ పర్వతం ఎవ్వరికీ వంగి సలాం చెయ్యదు.’ పదేళ్ళ కిందట జనసేన పార్టీ విశాఖ సభలో పవన్ కల్యాణ్ తనని తాను వేలితో చూపించుకుంటూ సము ద్రంగా, తుఫాన్‌గా, పర్వతంగా అభివర్ణించుకుంటూ చెప్పిన మాటలివి. ‘చుట్టూ గాఢాంధకారం, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు’ వంటి స్థితిలో ప్రజలున్నారని, వారి ఆశలు నిలబెట్టి, వారి జీవితాల్లో వెలుగు పంచి అపర చేగువేరాగా అవతరించాలన్న పవన్ ఉద్దేశాలు జగమెరిగిన వారికి అమాయకంగా కనిపించినా ఎంతోమంది యువత అతన్ని నమ్మారు. పవన్ ఒంటిమీద పిచ్చుక వాలినా జనసేన కార్యకర్తలు బ్రహ్మాస్త్రాలు సంధించారు. సినీహీరోగా తనకున్న ఇమేజ్‌ని గుడ్ విల్‌గా పెడితే చాలదని, అంతకి మించి ఏదో చేయాలన్న తపనని వ్యక్తం చేయడానికి ఆయన పలుమార్లు ప్రగతిశీల సాహిత్యాన్ని తన ప్రచారానికి వాడుకున్నారు. ఏ ప్రాంతానికి ప్రచారానికి వెళితే అక్కడి స్థానిక రచయితలను గుర్తించి వారి రచనల్లోని ప్రజా సమస్యలను ప్రస్తావించేవారు. గుంటూరు శేషేంద్ర శర్మ, శ్రీశ్రీ కవితలు తరుచుగా చదివేవారు. ఆయా సాహిత్య అంశాలలోని అభ్యుదయం, ప్రజాపక్షపాతం, నిర్భీతి వంటివి పవన్ వ్యక్తిత్వ సుగుణాలని జనం నమ్మేలా బట్వాడా అయ్యాయి కూడా. తద్వారా మిగతా రాజకీయ నాయకులకి భిన్నమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. విప్లవకారులుగా చలామణీ అవ్వడానికి మొహం చెల్లని రాజకీయాల్లో అట్టడుగు ప్రజల కష్టాలు తీర్చగల రాబిన్ హుడ్‌నని ఆయన నమ్మే ఉండాలి. లేకపోతే అంత సులువుగా ‘జై భీమ్’ అని, అంతే సులువుగా ‘గో మాంసం, బీఫ్ తినడం తప్పయితే, అవి తినే ముందుకు వెళ్తాన’ని ఎలా అనగలరు! ఇఫ్తార్‌లో కూర్చుని గడ్డం పెంచుకుని, టోపీ పెట్టుకుని మీలో ఒకడిని అనడం, గోధ్రా, గుజరాత్ అల్లర్ల గురించి ప్రశ్నించడం, తన నాయనమ్మ దీపారాధన చేస్తే దాంతో వాళ్ళ నాన్న సిగరెట్ ముట్టించుకుని, దేవుడూ దయ్యమూ లేవు’ అనేవాడని గుర్తు చేసుకోవడం, మతపరమైన గొడవలు పెడుతున్నది ముఖ్యంగా హిందూ నాయకులని గట్టిగా చెప్పడం ద్వారా పవన్ కొన్నివర్గాల నుంచి మైలేజ్ పొందారు. ఇక ఇపుడు తరం మారకుండానే స్వరం మార్చారు పవన్ కల్యాణ్. అధికారంలోకి రాగానే వేషభాషలు మారాయి. ఇపుడు తనని తాను ‘సనాతని హిందు’గా ప్రకటించుకున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడతానని, సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేస్తానని అంటూ అన్ని మతాలకీ ఒకటే న్యాయం అని ద్వంద్వానికి గురయ్యారు. అంబేడ్కర్‌ని బాగా చదివి ఆయన భావజాలాన్ని అవగాహనలోకి తెచ్చుకున్నానని పవన్ కొన్నిసార్లు అన్నారు. అన్ని కులాలకి ఒకటే న్యాయం అని అంబే డ్కర్, ఇతర రాజ్యాంగ రూపకర్తలు అనుకోలేదు కనుక అణచివేతకి గురయ్యి శతాబ్దాలుగా ఎదుగుదల లేని కులాలకి రిజర్వేషన్లు ఇచ్చారు. అన్ని కులాలూ ఒకటి కానట్లే అన్ని మతాలు కూడా ఒకటి కావు. ఎక్కడైనా మెజారిటీ మతాలు, మైనారిటీల హక్కులకి భంగం కలిగించే సందర్భాలు ఉంటాయి కనుక సెక్యులరిస్టులు మైనారిటీ మతాల హక్కులకి అండగా నిలబడతారు. దానర్థం పవన్ విరుచుకు పడినట్లు వారు ఆ యా మతాలకి భయపడతారని, వలపక్షం చూపుతారని కాదు. తిరుపతి సభలో వారాహి డిక్లరేషన్ ఇచ్చారు. దాని సారాంశం ఏమిటో ప్రజలమైన మాకు సరిగ్గా అర్థం కావడం లేదు. డిప్యూటీ సీఎంగా లడ్డు నాణ్యత మీద రోజుల తరబడి పోరాడటం ముఖ్యమా లేక కనీస అవసరాలు తీరని పేద ప్రజకోసం ఏవైనా చేయడం ముఖ్యమా అని అడగము, మెల్లిగా తెలుగుదేశాన్ని పక్కకి జరిపి జనసేన, బీజేపీతో ఎటువంటి రాజకీయం చేయబోతోంది అని కూడా అడగము, సరేనా! కానీ జస్ట్ ఆస్కింగ్! సనాతన ధర్మం అంటే ఏమిటి? బోర్డులు గట్రా ఏర్పాటు చేసి, జాతీయ స్థాయిలో మీరు చేయబోతున్న పోరాటపు ఆనుపానులు మాకు కాస్త ముందుగానే చెప్పగలరా? వర్ణవ్యవస్థ ఇందులో భాగమా, మనుధర్మ శాస్త్రం ఏమైనా పరిపాలనకి దిక్సూచి కానుందా? స్త్రీలను ఇంట్లో కూచోమంటారా, శూద్రులు సేవకులుగా, శ్రామిక కులాలను అంట రానివారిగా నిశ్చయం చేయబోతున్నారా? ‘మతి ఎంతో గతి అంతే’ అన్నది మీకు ఇష్టమైన కొటేషన్. ఇపుడు సనాతన హిందూగా మీ ‘మతి’ ఆంధ్రప్రదేశ్ ప్రజలమైన మా ‘గతి’ని ఎలా మార్చబోతోందో తెలుసుకోవాలని జస్ట్ ఆస్కింగ్. పవన్ కల్యాణ్ గారూ! ప్రసాదాలు, ప్రమాణాలు సంబంధిత శాఖలకి వదిలిపెట్టి పదేళ్ళ పైబడిన మీ రాజకీయ ప్రయాణాన్ని సమీక్ష చేసుకోండి. మారిన వేషభాషలకి, మీరేంటో గర్జించి ఇచ్చిన ప్రకటనకి మీరే జవాబుదారీ. నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకోవడానికి మీరు సాధారణ పౌరుడు కాదు, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. మీరు సెక్యులరిస్ట్‌గా వినపడటమే కాదు కనపడటం కూడా ప్రజాస్వామిక అవసరం. ఇప్పటికీ మిమ్మల్ని నమ్ముతున్న లక్షలాది యువత కోసం నిజాయితీ మాత్రమే మీ ప్రమాణం అయితే మంచిది. మీరు ధైర్యం విసిరిన రాకెట్టో, చేగువేరా బుల్లెట్టో సనాతని హిందూనో, బీజేపీ ప్రేరిత కాబోయే ముఖ్య మంత్రో, మరొకటో ఇంకొకటో– నాలుగు రోజులైనా కాస్త ఒకచోట ఆగండి. మీరేంటో అర్థంకాక ప్రజలు అయోమయంలో ఉన్నారు. కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త ‘ప్రరవే’ ఏపీ కార్యదర్శి -
మెజారిటీ నైతికతకు సర్వజనామోదమా?
రోడ్డున పోతూ రాలిపడిన మామిడిపండ్లను ఏరుకొంటాడతను, ఉగ్గబట్టిన ప్రేమను చాటుగా తీర్చుకుంటుంది ఆమె, తమకు ఇష్టమైన మాంసాహారాన్ని ప్రీతిగా ఆరగిస్తుంది ఆ కుటుంబం. మీ దైవనినాదం నేను పలకలేను అంటాడతను. పొట్టిదుస్తులు ధరించి పబ్‌కి వెళ్లి ఒక్కతే తిరిగి వస్తుంటుంది అమ్మాయి, మా మతాన్ని ప్రచారం చేసుకుంటామంటారు వాళ్ళు. ఇంతేసి ఘోరమైన నేరాలను సహించలేని సంస్కృతి పరిరక్షకులు, నైతిక వర్తనులు సమూహంగా చేరి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు. ఎప్పటికో ఆ విషయం సెన్సేషనల్ సోకు చేసుకుని మీడియాలో సామాజిక మాధ్యమాల్లో గిరికీలు కొడుతుంది. కాస్త అలజడి, మృత సముద్రపు చివరి అలలా బద్ధకంగా ఉబికి మళ్ళీ పడుకుంటుంది. నిర్జీవ శరీరాల మీదుగా రహస్యపు ఒప్పుదల గాలి వీస్తుంది. చిన్నదైనా పెద్దదైనా ఒక నేరం జరిగిందంటే, జరిగిందన్న అనుమానం ఉంటే–తమకి తోచిన ఎంతటి శిక్షయినా విధించవచ్చుననే ‘మెజారిటీ నైతికత’ ఇపుడు సినిమాలను దాటి వాస్తవ జీవితంలోకి బలంగా చొచ్చుకు వస్తోంది. సర్వజనామోదం దిశగా దూసుకుపోతోంది. నేరము, శిక్షల విషయంలో చట్టాలకి వెలుపల వ్యక్తుల, సమూహాల జోక్యం బాగా పెరగడం ఆలోచించాల్సిన విషయం. సామాజిక, ఆర్థిక పోరాటాలకి వెన్నుబలంగా నిలవాల్సిన ‘మెజారిటీ నైతికత’ సమూహ స్వభావాన్ని వదిలిపెట్టి వ్యక్తులను విడివిడిగా నిలవేసి ఎందుకు స్కాన్ చేస్తోందో చర్చించాలి. నైతిక విలువలు, సమాజ క్షేమం ముసుగులో భౌతికదాడులు, మానసిక హింస, అసూయ, ద్వేషం, నోటి దురుసుతనం, అహంభావం, తీర్పరితనం, కుట్రస్వభావం పెచ్చుమీరిపోవడాన్ని విశ్లేషించాలి. వ్యక్తుల హక్కులకి, గౌరవప్రదమైన ఆంతరంగిక, బాహిర జీవితానికి తావులేని ఇటువంటి చోట ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో నేరస్తులుగా ముద్రలు మోస్తున్నారని గ్రహించాలి. శత్రువుని గుర్తించడంలో తడబాటు, తమకి భిన్నంగా ఉన్నదాని పట్ల అసహనం, ఏ మాత్రమూ వివరం తెలీని నేరంపట్ల తక్షణ స్పందన కొత్త ధోరణులుగా స్థిరపడుతున్నాయి. సామాజిక మాధ్యమాలు ఈ ధోరణులకి ఒకానొక ఉదాహరణ. ఎవరో ఎవరినో అన్యాపదేశంగా తిడుతూ నేరం ఆరోపిస్తూ ఒక పోస్టు పెడతారు. వెంటనే వందలమంది లాయర్ల అవతారం ఎత్తుతారు. మరి కొంతమంది తీర్పరులు. వీరంతా కలిసి విచారణ చేసి రకరకాల తీర్పులు వెలువరిస్తారు. అనుమానితులు, నిందితులు, నేరస్తుల వంటి క్రమం లేకుండానే, ఆరోపణలకి గురైన వ్యక్తి ప్రమేయం లేకుం డానే శిక్ష ఖరారు అవుతుంది. ఈ మధ్యలోనే ఒక అభ్యుదయ స్వరం వచ్చి ‘బాగా అయింది, బట్టలూడదీసి మరీ తన్నావుగా!’ అని ఎంకరేజ్ చేస్తుంది. ఇంకోచోట మరి కొందరు, ‘మీరెవరన్నా తప్పు చేశారా డొక్క చించి డోలు కడతాం, తాట తీస్తాం, తొక్క వలుస్తా’మంటూ వీరంగం వేస్తారు. తరతరాలుగా బట్టలూడదీసి తన్నబడిన వాళ్ళలోనూ తాట వలవబడిన వాళ్లలోనూ ఆధిపత్యవర్గాలు దాదాపు ఉండవని, అటువంటి ఫ్యూడల్ హింసలకి గురయ్యేది అనువుగా ఉండే బలహీనులేనన్నది గ్రహించరు. కొత్త ఆలోచనల నడక ఇప్పటికీ అంత సజావు కాదు, మాటల చుట్టూ సీసీ కెమెరాలుంటాయి. అక్షరం ప్రతీ కదలిక రికార్డ్ అవుతూ ఉంటుంది. కులం, మతం, స్త్రీల లైంగికత, దేశభక్తి లాంటి విషయాల్లో మెజారిటీ నైతికతకి భిన్నంగా మాట్లాడినవారిని మానసికంగా కుంగదీసేలా ట్రోలింగ్ మొదలవుతుంది. మరి కొన్నిసందర్భాల్లో విలువలు అతిక్రమించిన, విస్మరించిన వ్యక్తుల ఆచరణ మీద అప్రజాస్వామికంగా నైతిక ఫాసిస్టుల దాడి మొదలవుతుంది. తమ ఆలోచన, ఆచరణ మాత్రమే తిరుగులేనిదన్న అహంభావమే వైరుధ్యపూరితమైన ఇతర మానవుల జీవిత ఘర్షణల పట్ల ఏమాత్రం శ్రద్ధ పెట్టనివ్వదు. అర్థం చేసుకోనివ్వదు. ఈరోజు ప్రతివ్యక్తి చేతిలో ఒక శిక్షాస్మృతి ఉంది. వారివారి రాగద్వేషాలను, తీర్పరితనాలను, ఓపలేనితనాలను బట్టి, చంపడం, కొట్టడం, అంటుముట్లు, వెలివేతలు, పబ్లిక్ షేమింగ్ లాంటి వాటికి పిలుపునిస్తారు. క్షణాల్లో గుమిగూడిన గుంపు ఏమీ తెలీకుండానే తలొక రాయీ విసురుతుంది. మానవులలోని పురా హింసాప్రవృత్తి రెక్కలు సాచుకుని లేస్తుంది. ‘బలవంతులదే రాజ్యం’ అన్న నినాదానికి వ్యతిరేకంగా నిర్మించుకున్న ప్రజాస్వామికత, తలను లోనికి ముడుచుకుంటుంది. ‘మెజారిటీ నైతికత’ ప్రతిష్టించబోయే విలువల కోసం జరిగే హింసాకాండకి నువ్వొక సమిధ వ్రేల్చావా లేదా అన్నదే ముఖ్యం తప్ప నీకేం తెలుసని గుంపులో దూరావని అడగరెవ్వరు. చట్టాలకి బైట చేతిలోకి తీసుకునే శిక్షారూపాలన్నీ మొదట అనువర్తిత మయ్యేది ‘వల్నరబుల్’ వర్గాల మీదనే. ఈరోజు సాంస్కృతిక రంగంలో మనం శిక్షాస్మృతిని సొంతంగా నిర్మించుకుని అమలు చేస్తే రేపు మరొకరు అంతే సొంతంగా ఏవి నేరాలో నిర్వచిస్తూ పోతారు. అసలు ఎంత తప్పుకి ఎంత శిక్ష విధించాలో నిర్ణయించాల్సింది ఎవరు? జరిగిన తప్పుకీ మన నైతికదాడి మూలంగా పడిన శిక్షకీ మధ్య వెనక్కి తీసుకోలేని ఎడం ఉంటే ఇక మనం నేరస్తులం కాక మరేమిటి? ప్రజల హక్కులకి రక్షణ కల్పించే రాజ్యవ్యవస్థలని మాత్రమే నమ్ముకుని ఉండటం ఎలానూ సాధ్యం కావడం లేదు. అలాగని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి నేర విచారణలోనూ శిక్ష నిర్ధారణలోనూ పాల్గొని ఘటనకొక సొంత చట్టాన్ని తయారు చేయడమూ సరి కాదు. ఎన్ని లొసుగులతో ఉన్నప్పటికీ రాజ్యాంగం బాధితులకీ నేరస్తులకీ వారివైన హక్కులను పొందుపరిచింది. మధ్యయుగాల నేరవిచారణ, శిక్షల నిర్ధారణ నుంచి మనుషులను చైతన్యపరచేవాటిలో ‘మానవ హక్కుల’ స్పృహ ముఖ్యమైనది. కలిసివచ్చే అంశాల మీద వ్యక్తులను సమూహంలో భాగం చేయాలి తప్ప, సమూహంలో భాగంగా ఉన్న వ్యక్తులను విడి ఘటనల రీత్యా బహిష్కరించడం వల్ల సంస్కరణ, మేలు జరగదు. నేరపూరితమైన ఆధిపత్య సంస్కృతికి ఎదురుగా నిలబడాల్సింది సర్వ సమానత్వ బలంతో నిండిన ప్రజాస్వామిక సంస్కృతి మాత్రమే. వ్యక్తిలోనైనా సంస్థలోనైనా ఎక్కడైనా ఈ ప్రజాస్వామికత బాహిరమే కాదు అంతర్గతం కూడానన్నది ఆచరణలో నిరూపణ కావాలి. కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త కార్యదర్శి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక malleswari.kn2008@gmail.com -
భూమి చెప్పినా ఆకాశం నమ్మక... పదేళ్ళు!
సందర్భం ఎల్తైన కొండల వరుసలు, కుప్పబోసినట్లున్న గుబురు చెట్ల మధ్య నలభై యాభై ఇళ్ళు. పొద్దున్నే గుట్టలు మిట్టలు ఎక్కుతూ పోడు వ్యవసాయానికి వెళ్ళే గిరిజనులు. ఊరు, సంతలు, కొర్రకొత్త వంటి పండుగలు తప్ప వేగం అంటని నింపాది జీవితాలు. విశాఖ జిల్లా జి. మాడుగుల మండలం నుర్మతి గ్రామ పంచాయతీలోని వాకపల్లి, దుర్గమమైన అడవి ఒడిలో ఒదిగిన బిడ్డలాంటి ఊరు. పదేళ్ళ కిందట ఒక తెల్ల వారు జామున కూంబింగ్ పేరుతో వచ్చిన గ్రేహౌండ్ పోలీసులు సమీపంలోని పొలాల్లో పని చేసుకుంటున్న వారిని, ఇంట్లో ఉన్న బాలింతని, ఆమె తల్లిని, మొత్తం పదకొండు మంది కోదు గిరిజన మహిళలను, అత్యాచారం చేసారు. బాధితులను అనకాపల్లి, విశాఖ మధ్య తిప్పుతూ ఉద్దేశపూర్వకంగా వైద్యపరీక్షలను ఆలస్యం చేయడం లాంటి చర్యలతో సాక్ష్యాలను రూపుమాపే ప్రయత్నాలు చేసారు. ‘భూమి చెబితే ఆకాశం నమ్మదా!’ అంటూ నినదించిన వాకపల్లి అత్యాచార బాధితుల వాదనని పరిగణనలోకి తీసుకుని 2012లో హైకోర్టు నిందితులను కేసు పరిధిలోకి తీసుకువచ్చింది. మరో అయిదేళ్ళు గడిచాయి. సంచలనాత్మకమైన ఈ కేసులో ఇంతటి జాప్యాన్ని ప్రశ్నిస్తూ సత్వరం న్యాయాన్ని అందించాలని ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంతో ఈ కేసు మళ్ళీ వార్తలలోకి వచ్చింది. ఈ సందర్భంలో బాధిత మహిళల ఇప్పటి స్వరాన్ని నలుగురికీ చేరవేయాలనే తలంపుతో ప్రరవే ఏపీ శాఖ వారిని కలసి మాట్లాడింది. పదేళ్ళు గడిచాక కూడా న్యాయం దొరకని బాధితులు ఎలా ఉంటారు? గద్గద స్వరాల తడిని కాలం పీల్చేసుకుంటుంది. వేడినీటి బుగ్గల్లా ఊరే కన్నీటిని అపనమ్మకం మింగేస్తుంది. బాధితులు కొట్లాడాలి, అరవాలి, దుఃఖించాలి, ఆగ్రహపు సెగతో రగులుతూ ఉండాలి. కానీ కాలం కర్కశమైనది. ఆగ్రహాన్ని ఆర్పేసి, నిర్లిప్తతని నల్లని మసిలా పూస్తుంది. ‘‘మమ్మల్ని కోర్టు నమ్మింది కనుక మేమూ కోర్టుని నమ్ముతాము’’. సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్యల మీద వారి స్పందన ఇది. అత్యాచారం చేసిన పోలీసులను శిక్షించాలని, అప్పటివరకూ ఏ పరి హారాన్ని తీసుకోబోమని, వారికి శిక్ష పడిన తర్వాత ఇక వారి దయ అని ఒక బాధితురాలు అంది. మూడునెల్ల కిందట పోలీ సులు ఇక్కడికి వచ్చి, పిల్లల చదువులకు, ఇతర సౌకర్యాలకు సాయం చేయ డం ద్వారా న్యాయం చేస్తామని చెప్పారని, ‘అన్యాయం చేసినవాళ్ళే చాక్లెట్లు పట్టుకొచ్చి న్యాయం చేస్తామంటే ఆ న్యాయం మాకు అక్కరలేదని’ తెలుగు, కువి భాషల యాసతో నిక్కచ్చిగా చెప్పారు. అత్యాచారం జరిగి ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకుని విశాఖ నుంచి వాకపల్లికి తిరిగి వెళ్లిన మహిళలని గ్రామంలోకి రానివ్వలేదు. తప్పు కడితే తప్ప గడ్డ (ఏరు)లోకి, కులంలోకి కలుపుకోమని గ్రామపెద్దలు చెప్పారు. అత్యాచారానికి గురైన ప్రతి మహిళ ఇంటి నుంచి ఒక ఎద్దుని తప్పు కింద చెల్లించవలసి వచ్చింది. దాంతో పాటు, కోళ్ళు, కల్లువంటివి కూడా. చివరికి వారి కాపురాలు చక్కబడటానికి అయిదేళ్ల పైన సమయం పట్టింది. అడపాదడపా సంతలకి వెళ్ళినపుడు సిగ్గుతో చచ్చిపోతున్నామని, తమని ‘పోలీసుల పెళ్ళాలు’ అంటూ అవహేళన చేస్తారని ఆ సిగ్గుతోనే అనారోగ్యం పాలై ఒక బాధితురాలు చనిపోయిందని చెప్పారు. పాడేరు సెంటర్లో ఉండే గిరిజనేతర కులాలకు చెందిన కొందరు వ్యాపారులతో యథాలాపంగా మాట్లాడినపుడు, వాళ్ళ మొహాలు, వాళ్ళ అందచందాలు చూసి ఏ పోలీసైనా ఆ పని చేస్తాడా! ఏదో కుర్రోళ్ళు ఓవర్ యాక్షన్ చేసుంటారు అన్నారు. కొన్ని దశాబ్దాలుగా అత్యాచార కేసుల్లో విన్న పడికట్టు వాదన ఆ మైదాన ప్రాంతపు దళారీల నోటి వెంట కసిగా బైటకి వచ్చింది. వాకపల్లి ఘటన జరిగిన కొత్తల్లో నిజనిర్ధారణకి వెళ్ళినవాళ్లకి పది పన్నెండేళ్ళ ఒక కుర్రవాడు గుర్తుండే ఉంటాడు. నల్లగా పొట్టిగా చురుకైన చూపులతో రెండు చేతులూ కట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ తను చూసిన దృశ్యాలను నిర్భయంగా, న్యాయం కోసం తపనతో చెబుతూనే ఉండేవాడు. ఈ కేసులో అతనొక్కడే ప్రత్యక్షసాక్షి. తమ గ్రామం మహిళలకి త్వరగా న్యాయం జరగాలని కోరుకున్నాడు. చదువు కోసం గిరిజన సంక్షేమ వసతి గృహంలో చేరాడు. ఇక ఆ తర్వాత ఇంటికి రాలేదు. అందరికీ న్యాయం కోసం పోరాడాలని దళంలో చేరిపోయాడు. కలలు నెరవేరడానికి అక్కడ ఏం తపన పడ్డాడో, గత ఏడాది మల్కన్‌గిరి ఎన్కౌంటర్లో అతడిని చంపివేశారు. వాకపల్లి ఘటనకి ఏకైక ప్రత్యక్షసాక్షి వి. డానియెల్ అలియాస్ దాసురాం మరిలేడు. ఆర్నెల్లలోపు కేసు విషయం ఒక కొలిక్కి రావాలని సుప్రీం కోర్టు చెప్పినా ఇంతవరకూ కదలిక లేదు. ఇటువంటి కేసుల విషయంలో ప్రత్యేకమైన న్యాయ ప్రక్రియ ఉంటుంది. పాడేరులో స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి దానికి జడ్జి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా మహిళలనే నియమించాలి. చాలా పరిమితమైన గిరిజనుల జీవన విధానంలోకి కొత్త విషయాలు చేరినపుడు జీర్ణించుకోవడానికి వారికి చాలా సమయం పడుతుంది. కనుక వారి వ్యక్తీకరణ పద్ధతుల మీద కోర్టుకి అవగాహన కన్సర్న్ ఉండాలి. వాకపల్లి నుంచి పాడేరుకి రావడానికి వారికి అందవలసిన సదుపాయాలను జిల్లా యంత్రాంగం సమకూర్చాలి. ముఖ్యంగా పదేళ్ళ ఆలస్యాన్ని ఆర్నెల్ల గడువులో సరిదిద్దే ప్రయత్నం నిజాయితీగా చేయాలి. డా. కేఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త కార్యదర్శి, ప్రరవే (ఏపీ) ఈ–మెయిల్ :malleswari.kn2008@gmail.com -
ఏకనగర రాజ్యం మనకి ఆదర్శమా?
సింగపూర్ చిన్నదీవి. ప్రపంచంలోనే ఒకేఒక్క ఏకనగర రాజ్యం. రాజకీయంగా సామాజికంగా సాంస్కృతికంగా పొందికైన దేశం. ఆర్థికరంగంలో ఆధు నిక నమూనా. ఇటువంటి దేశాన్ని ఇతర ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకుని స్వీయముద్రతో పని చేయదలిస్తే మంచి విషయమే. కానీ స్వీయ ముద్రని వదిలి ఆంధ్రప్రదేశ్‌ని సింగపూర్‌లా మారుస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది. వాటిని ఆచరణ లోకి తెచ్చే ప్రయత్నాలు అమరావతి నిర్మాణక్రమంలో కనబడు తున్నాయి. రాజకీయ, ఆర్థిక విధానాలను భావోద్వేగాల పరిధిలో చర్చించకూడదు కానీ, ప్రజల భావోద్వేగాల విషయంలో ప్రభుత్వాలకి చిన్నచూపు ఉండకూడదు. రాజధాని నిర్మాణంలో సింగపూర్ నామస్మరణ తప్ప స్థానిక ప్రత్యేకతలను, సొంత సాంకేతికతని పరిగణనలోకి తీసుకున్నట్లు కనపడదు. సింగపూర్ తరహా నగర నిర్మాణం ఆంధ్రప్రదేశ్‌లోని ఏ నగరానికైనా సాధ్యమేనా అన్నది ఇపుడు చర్చించవలసిన విషయం. నిర్మాణమన్నది కేవలం భౌతిక స్థాయిలో చూడటం ఒక పరిమితి. దీనివల్ల సింగపూర్ ప్రజల మనోవికసనానికి, స్థిమితమైన జీవన విధానానికి తోడ్పడిన పలు అంశాలను విస్మరించి పెట్టుబడిదారీ విధానానికి అనుకూలమైన వాటిని మాత్రమే గ్రహించడం జరుగుతోంది. సింగపూర్ అభివృద్ధి కేవలం ఆర్థికవిధానాల వల్లనే జరగలేదు. అక్కడి సమస్త వ్యవస్థల పటిష్ట నిర్మాణం వల్ల జరిగింది. అందులో ముఖ్యమైనది రాజకీయవ్యవస్థ. 1959 నుంచీ ఇప్పటి వరకూ ‘పీపుల్స్ యాక్షన్ పార్టీ’ యే అధికారంలో కొనసాగుతున్నది. కమ్యూనిస్ట్ భావజాల ప్రభావం ఆ పార్టీ మూలాల్లో పాదుకుని ఉంది. ఎన్నికలలో గెలుపు కోసం ప్రజా సంక్షేమాన్ని నటించాల్సిన అవసరం ఆ రాజకీయ పార్టీలకి లేదు. అక్కడ ప్రతిపక్షం అనామకం. కానీ ప్రభుత్వానికి ప్రజల సమస్యల పట్ల పట్టింపు అధికం. అభివృద్ధిలో ప్రైవేటు సంస్థల, వ్యక్తుల భాగస్వామ్యాన్ని నిరుత్సాహపరచడానికి అధిక మొత్తంలో పన్నులు వసూలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి పరిస్థితిలేదు. ప్రైవేటువాహనాల పార్కింగ్‌కి రోజుకి నాలుగువందల రూపాయలు రుసుము వసూలు చేసే దేశం సింగపూర్. అందులో నాలుగోవంతు రేటుకి ప్రభుత్వ భూములను ఎకరాలకి ఎకరాలు ఫ్యాక్ట రీల కోసం ప్రైవేటు సంస్థలకి అప్పజెప్పే రాష్ట్రం మనది. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో కూడిన బృందం గతేడాది సింగపూర్‌లో పర్యటించినపుడు అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ చేయడంలో సీఎం చేసిన కృషిని సింగపూర్ ప్రధాని కీర్తించారు. అందులో సదుద్దేశమే ఉండొచ్చు. గ్రామీణ వ్యవస్థ, భూమితో ప్రజలకి సెంటిమెంటల్ అనుబంధం, వ్యావసాయిక నేపథ్యంలేని సింగపూర్ దేశానికి భూసేకరణ అత్యంత సులువైన విషయం కావొచ్చు కానీ భారతదేశంలో అది అత్యంత సంక్లిష్టం. రాజధాని విషయంలోనే కాక అభివృద్ధి పేరుతో జరిగే ప్రతి భూసే కరణ సందర్భాన్ని ప్రజలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆ అభివృద్ధిలో బాధితులకు, సామాన్య ప్రజలకి ఎటు వంటి ఫలితం ఉండటం లేదు కనుక. ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమంతో సహా ఏదో ఒక అంశం మీద నిరంతరం ఆందోళనలు అలజడుల నిరసన రూపా లకి ఇక్కడ అవకాశం ఎక్కువ. శాంతిభద్రతల విషయంలో సింగ పూర్ వైఖరి చాలా కఠినం. 2013లో లిటిల్ ఇండియా ప్రాంతంలో బంగ్లా వలస కూలీని చైనా జాతీయుడు బస్‌లో నుంచి తోసి వేయడం వలన అతను చనిపోయాడు. ఆ సందర్భంలో అక్కడి దక్షిణాసియా కార్మికులు ఆరు బస్సులను తగలబెట్టారు. పది మంది పోలీసులు గాయపడ్డారు. గత నలభై ఏళ్లలో సింగపూర్ ఎదుర్కొన్న అతిపెద్ద అలజడిగా ఈ ఘటన గుర్తింపు పొందింది. ప్రజలైనా, ప్రభుత్వాలైనా హింస ఆధునిక నిరసన రూపం కాదని గుర్తించడం వెనుక సమాజపు మానసిక విలువల పెరుగుదల ఉంటుంది. ఆర్ధిక అంతరాల తగ్గుదల ఉంటుంది. ప్రజలంటే ‘ఓటు’గా మాత్రమే గుర్తించే రాజకీయ పార్టీలు అటువంటి సమా నత్వ సాధనను ఆదర్శంగా తీసుకోలేవు. ఆంధ్రప్రదేశ్‌లో కులమత లింగ వివక్షలపై పోరాటాలు సాగు తూనే ఉన్నాయి. అనేక పీటముళ్లు పడిన సామాజిక అంతరాలు అభివృద్ధికి అడ్డుగా నిలిచిఉన్నాయి. వాటి పరిష్కారానికి వ్యవ స్థలో మౌలికమైన మార్పులు జరగాలి. యుక్తవయసు వచ్చిన ప్రతి యువకుడూ రెండేళ్లపాటు సింగపూర్ సైన్యంలో పనిచేయాలి. దీనివల్ల కఠిన తరమైన శ్రమకి యువత సిద్ధంకావడంతో పాటు మరో ప్రయోజనం కూడా ఉంది. యువకులు సైన్యంలో ఉండే కాలంలో యువతులు వారిని దాటుకుని విద్యా ఉద్యోగ రంగా లలో ముందుకు వెళతారు. సింగపూర్ నుంచి గ్రహించవలసిన ప్రజా ప్రయోజనకర అంశాలను పక్కనబెట్టి, సముద్రతీర ప్రేమ పండుగలు, విలాసవంతమైన విశ్రాంతి స్థలాలు, ఎత్తైన బహుళ అంతస్తుల భవనాల మాయాజాలంలో పడటం అంటే ఆకాశంలో మేఘాలను చూసి ముంతలోని నీళ్లను ఒలక బోసుకోవడం వంటిది. -కేఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త కార్యదర్శి, ప్రరవే (ఏపీ) మొబైల్: 88850 16788 -
కాన్పులదిబ్బ ఆవిష్కరణ
విశాఖ సంస్కృతి మాసపత్రిక ఆధ్వర్యంలో చింతకింది శ్రీనివాసరావు కథలసంపుటి ‘కాన్పులదిబ్బ’ ఆవిష్కరణ సభ జూలై 13న సాయంత్రం 6 గంటలకు విశాఖ పౌర గ్రంథాలయం, ద్వారకానగర్, విశాఖపట్నంలో జరగనుంది. అధ్యక్షత: కె.ఎన్.మల్లీశ్వరి. అతిథులు: కె.శివారెడ్డి, చందు సుబ్బారావు. తొలిప్రతి స్వీకర్త: పైడి వెంకట రమణమూర్తి. ర్యాలి ప్రసాద్ కవితా శతావధానం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, ఆదిత్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో, ‘మొట్టమొదటి’ వచన కవితా శతావధానం జూలై 16న ఉదయం 10 నుండీ సెమినార్ హాల్, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరంలో జరగనుంది. అవధానకర్త: ర్యాలి ప్రసాద్. ముర్రు ముత్యాలనాయుడు, కె.రమేష్, నగ్నముని, ఎండ్లూరి సుధాకర్, నల్లమిల్లి శేషారెడ్డి, తరపట్ల సత్యనారాయణ పాల్గొంటారు. అవధాన నిర్వాహకులు: వాడ్రేవు వీరలక్ష్మీదేవి, నామాడి శ్రీధర్, దాట్ల దేవదానం రాజు, సన్నిధానం నరసింహశర్మ, మాకినీడు సూర్యభాస్కర్. కొత్త పుస్తకాలు ధమ్మపదం:అనువాదం: బెందాళం క్రిష్ణారావు; పేజీలు: 274; వెల: 150; ప్రచురణ: పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ; అనువాదకుడి ఫోన్: 7306434888 ‘బుద్ధుని బోధనల సారాంశమంతా ‘‘ధమ్మపదం’’లోనే ఉందని పండితులంతా అంగీకరిస్తున్నారు. ఇది బుద్ధుని బోధనలను అత్యంత సరళ సుందరమైన శైలిలో ప్రజల మనసులను హత్తుకునే విధంగా అందిస్తుంది. భారతదేశానికి చెందిన అతి ప్రాచీన ధార్మిక గ్రంథాల్లో ‘‘ధమ్మపదం’’ అగ్రగామి’. మాక్స్ ముల్లర్ తన ‘సేక్రెడ్ బుక్స్ ఆఫ్ ది ఈస్ట్’లో భాగంగా ప్రచురించిన ధమ్మపదాన్ని ప్రామాణికంగా తీసుకుని క్రిష్ణారావు చేసిన స్వేచ్ఛానువాదం ఇది. ‘బౌద్ధసాహిత్యంతో పరిచయం లేనివారికి కూడా సుబోధకంగా ఉండాలన్న లక్ష్యంతో వచన కవితా రూపంలో’ సాగింది. ఘంటారావం మూలం: ఎర్నెస్ట్ హెమింగ్వే; అనువాదం: అమరేంద్ర; పేజీలు: 414; వెల: 290; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, గిరిప్రసాద్ భవన్, బండ్లగూడ, హైదరాబాద్-68; ఫోన్: 24224453 హెమింగ్వే ‘ఫర్ వూమ్ ద బెల్ టోల్స్’ నవలకు 1967లో వచ్చిన అనువాదపు పునర్ముద్రణ ఇది. ‘స్పెయిన్‌లో ఫాసిస్టులకూ, కమ్యూనిస్టులకూ జరిగిన సంఘర్షణ ఇందులో ఇతివృత్తం. (నాలుగు రోజులపాటు) ఒక గుహలో కొద్దిమంది స్త్రీ పురుషులతో కథ నడిచినప్పటికీ మొత్తం ఉద్యమమంతా మన కళ్లముందు కదులుతున్నట్లనిపిస్తుంది. ఫాసిస్టుల కిరాతక చర్యలతోపాటుగా, విప్లవకారుల అమానుష కృత్యాలు వర్ణించటంలో హెమింగ్వే ప్రదర్శించిన నిష్పాక్షిక నిర్లిప్త దృష్టి ఉత్తమ రచయితలకే సాధ్యమౌతుంది’. హాస్యకథలు సంకలనం: వియోగి, ఏవిఎమ్; పేజీలు: 400; వెల: 300; ప్రతులకు: ఎస్.ఆర్. బుక్‌లింక్స్, దానయ్య వీధి, మాచవరం, విజయవాడ-4. ఫోన్: 0866-2436959. ‘హాస్యానికి తక్కువమంది సాహిత్య గౌరవం కలిగిస్తున్నారు’. ‘సహజ హాస్యప్రియులైన వియోగి-ఏవియమ్’ ‘హాస్యకథలకు ప్రాణం పోయాలనే ఏకైక ధ్యేయంతో’ తెచ్చిన సంకలనం ఇది. ఇందులో 50 కథలూ, 12 కార్డు కథలూ, కార్టూన్లూ ఉన్నాయి. ‘పసందైన ఈ కథల కదంబ విందులో కార్డు కథలు కారప్పూసలా కరకరలాడుతూంటే, ఏవియమ్ వ్యంగ్యచిత్రాలు జీడిపప్పుల్లా జిహ్వను సంతృప్తి’ పరుస్తాయి.