మీరు చాలా మారాలి సార్‌! | Sakshi Guest Column On Chiranjeevi and Balakrishna Comments About Women | Sakshi
Sakshi News home page

మీరు చాలా మారాలి సార్‌!

Published Mon, Feb 17 2025 4:12 AM | Last Updated on Mon, Feb 17 2025 1:51 PM

Sakshi Guest Column On Chiranjeevi and Balakrishna Comments About Women

భిన్న సినిమా ప్రమోషన్స్‌లో నటులు చిరంజీవి, బాలకృష్ణ

తూర్పు తీరం

అంతరిక్షంలో చిక్కుకుపోయి, భూమికి చేరేమార్గం కోసం ధైర్యంగా ఎదురుచూస్తున్న సునీతా విలియమ్స్‌ (Sunita Williams) వంటి సాహసగత్తెల కాలంలో ఉన్నాము. అదే సమయంలో స్త్రీల మీద వివక్షలు మారకపోగా కొత్త రూపాలు తీసుకున్నాయని ఇటీవలి కొన్ని వరుస ఘటనలు నిరూపిస్తున్నాయి. ప్రాబల్య స్థానాల్లో ఉన్న కొందరు పురుషులు బహిరంగంగా, ఎటువంటి సంకోచాలూ లేకుండా స్త్రీల గురించి చేస్తున్న వ్యాఖ్యలు పితృస్వామ్య సామాజిక స్థితిని దగ్గరగా చూపిస్తున్నాయి. ఈ పురుషుల్లో సినిమా నటులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, చివరికి న్యాయ, రక్షణ వ్యవస్థలు కూడా ఉండడం వివక్ష తీవ్రతను తెలుపుతున్నది.

మాట, చూపు, హావభావ కవళికల్లో పెద్దమనిషితనం ఉట్టి పడుతున్నట్లు కనిపించేలా సవాలక్ష జాగ్రత్తలు తీసుకునే ‘మెగాస్టార్‌’ ఈసారి దొరికిపోయారు. ఆడపిల్లలతో నిండిన తన ఇల్లు లేడీస్‌ హాస్టల్లా, తను వార్డెన్‌లా ఆయనకి అనిపించింది. అయిదుగురు చెల్లెళ్లకి రక్షకుడిలా తను నటించిన ‘హిట్లర్‌’ సినిమా నిజం అనుకున్నారు కాబోలు! అంతేకాకుండా తమ లెగసీ కొనసాగించడానికి ఈసారైనా కొడుకుని కనమని కొడుక్కి బహిరంగంగా చమత్కారపూర్వక సలహా ఇచ్చారు. 

పసిబిడ్డ మొహాన్ని కూడా బహిరంగపరచకుండా తమ ప్రైవసీని కాపాడుకునే అతని కొడుకూ కోడలూ – తమ ఆడపిల్లకి ఎదురైన ఈ బహిరంగ వివక్షని ఎలా తీసుకుంటారో బహుశా అది వారి కుటుంబ విషయం.  కానీ అనేకమంది ఆరాధకులని పెంచి పోషించుకునే ఒక సినిమా నటుడిగా ఆయన వ్యాఖ్యలు వ్యతిరేకించవలసినవి. రేపుమాపు ‘మెగా’ అభి మానులందరూ తమ ఇంటి స్త్రీలకి వార్డెన్లగానూ, లెగసీ కోసం కొడుకుల్ని కనమని వేధించేవారిగానూ ఉండడమే ఫ్యాషన్‌ అనుకుంటే అది ప్రమాదం కనుక ఈ వ్యాఖ్యలని కొందరైనా ఖండిస్తున్నారు. 

స్త్రీలపట్ల అసభ్యంగా ప్రవర్తించడంలో సినీనటుడు బాలకృష్ణ ‘గాడ్‌ ఆఫ్‌ వల్గారిటీ’కి ప్రతీకగా మారిపోయారు. స్త్రీలను ఉద్దేశించి నర్మగర్భంగా తను ఎక్కని ఎత్తులు, దిగని లోతులు లేవని అనడం, వెంటపడే పాత్రలు చేస్తే తన ఫాన్స్‌ ఊరుకోరని, అమ్మాయిలు కనపడగానే ముద్దయినా పెట్టాలి, కడుపైనా చేసేయాలని కోరుకుంటారన్న అసభ్య వ్యాఖ్యలకి కోర్టుకేసులు ఎదుర్కున్నారు. ఒక నటిని పడిపోయేంతగా వేదిక మీద నెట్టడం దగ్గర్నుంచి తన చుట్టూ ఉండే స్త్రీలతో కొన్నిసార్లు ఆయన ప్రవర్తన వేధింపు పరిధిలోకి వస్తుంది. 

ఇటీవల విడుదలైన చిత్రంలోని ఒక పాటకు ఆయన వేసిన స్టెప్పులు దిగజారడానికి పరిధులు ఏమీ లేనంత హీనమైనవి. అది కళారంగపు టేస్ట్‌ అనుకుని వదిలేయనివ్వలేదు బాలకృష్ణ (Balakrishna). అదే నటితో ఒక ప్రయివేట్‌ పార్టీలో అవే స్టెప్పులు వేస్తూ ఆమెని ఇబ్బంది పెట్టారు. వారికి లేని బాధ మీకేమిటనే అభిమానులకి కొరత లేదు. 

మగనటుల పవర్, స్త్రీ నటుల అవకాశాలను ప్రభావితం చేస్తుంది కనుక వారు ఊరుకుంటారు. కానీ సమాజం కూడా ఊరుకోవాల్సిన అవసరం లేదు. బహిరంగంగానే ఇలా ఉంటే కనపడని వేధింపులు ఎన్నో ఊహించలేము. నటుడిగా దాక్కోడానికి చోటు ఉన్నట్లు రాజకీయాల్లో ఉండదు కనుక ఇట్స్‌ టైమ్‌ టు స్టాపబుల్‌ మిస్టర్‌ ఎమ్మెల్యే!

భార్యతో భర్త చేసే బలవంతపు అసహజ శృంగారం నేరం కాదని ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు (chhattisgarh high court) ఇచ్చిన తీర్పు ఇపుడు చర్చలోకి వచ్చింది. 2017లో జరిగిన ఘటన ఇది. భర్త చేసిన అసహజ లైంగికచర్యల కారణంగా భార్య అనారోగ్యానికి గురయి మరణించింది. మరణ వాంగ్మూలంలో ఆమె ఇదే చెప్పింది. కింది కోర్టు వేసిన పదేళ్ళ శిక్షని కొట్టేసి భర్తని నిర్దోషిగా తేల్చింది హైకోర్టు. మారిటల్‌ రేప్‌ గురించి ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. 

భార్యకి ఇష్టం లేకుండా భర్త బలవంతంగా ఆమె శరీరాన్ని తాకకూడదన్నది ఒక విలువగా, హక్కుగా సమాజానికి అలవాటు కావాల్సిన సమయంలో ఈ తీర్పు స్త్రీల లైంగిక స్థితిని కొన్ని రెట్లు వెనక్కి నెట్టేదిగా ఉంది. ఆ భర్త అసహజ లైంగిక చర్య చేయడం గురించి కొంతమంది తప్పు బడుతున్నారు. సహజమా, అసహజమా అన్నది కాదు ముఖ్యం. ఆమె సమ్మతి ముఖ్యం. స్త్రీని లైంగిక కోరికలు తీర్చే వస్తువుగా చూసే పాత ఆలోచనా విధానాన్ని అందరూ సవరించుకోవాల్సిన అవస రాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తోంది. 

పనిగంటల విషయంలో ఎల్‌ అండ్‌ టి ఛైర్మన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా చాలా చర్చల్లోకి వచ్చాయి. వారానికి తొంభై పనిగంటలు పనిచేయాలని సూచిస్తూ ‘ఇంట్లో మీరు మీ భార్య మొహం ఎంతసేపు చూస్తూ ఉండగలరు, మీ భార్య మీ మొహం ఎంతసేపు చూస్తూ ఉండగలదు’ అని వ్యాఖ్యానించారు. పనిగంటల భారాన్ని వ్యతిరేకిస్తూ ఇంటిపనులు, బైటిపనులు, వ్యక్తిగత, మానసిక అవసరాల గురించి చాలామంది మాట్లాడారు. అయితే తక్కువగా చర్చకు వచ్చిన విషయం ఒకటి ఉంది. 

అది ఈ పనిగంటల సూచన కేవలం మగ ఉద్యోగులను ఉద్దేశించినట్లుగా ఉండడం. దాని ద్వారా ఇల్లు, పిల్లలు, వృద్ధుల బాధ్యతలు మగవారి టెరిటరీ కావు, అవి కేవలం స్త్రీలకి ఉద్దేశించినవి మాత్రమేనన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లు! మగవారు తమ పూర్తికాలం ఉద్యోగంలో గడిపితే కుటుంబాల సమస్త బాధ్యతలు స్త్రీల మీద పడతాయి. ఉద్యోగం పురుష లక్షణం, ఇల్లు దిద్దుకోవడం స్త్రీ లక్షణంగా ఆ వ్యాఖ్యల అంతరార్థం స్ఫురిస్తోంది. 

చ‌ద‌వండి: ‘దంగల్‌’ చూడండి ‘మాస్టారు’

పై నాలుగు ఘటనల్లో నాలుగు ప్రధానమైన సమస్యలు మన ముందుకు చర్చకు వచ్చాయి. ఆడశిశువుని పురిటిలోనే చంపేసిన సమాజాలు మనవి. ఆ దశ దాటి వస్తున్నాము. ఆకాశంలో సగాలకి తాము వార్డెన్లమని బాధపడటం కాకుండా– వారి పుట్టుక, ఎదుగు దల, విజయాలు సాధికారికంగా సెలెబ్రేట్‌ చేసుకోవడం మన వివేకంలో భాగం కావాలి. స్త్రీలకు సొంత లైంగిక వ్యక్తిత్వం ఉంటుంది. అధికారం, హోదా, పేరు ప్రఖ్యాతులతో మదించినవారు ఆ వ్యక్తిత్వం మీద దాడి చేస్తూనే ఉంటారు. 

చ‌ద‌వండి: దీపికా పదుకోన్‌ (బాలీవుడ్‌ నటి) రాయని డైరీ

ధైర్యంగా వ్యతిరేకించే వారు పెరగాలి. న్యాయవ్యవస్థలు న్యాయసూత్రాల పరిధికి లోబడి పనిచేస్తాయి. న్యాయసూత్రాలు కాలం చెల్లినవిగా, స్త్రీలకి రక్షణ కల్పించలేనివిగా ఉన్నప్పుడు వాటిమీద పౌరసమాజం విస్తృత చర్చ చేయాలి. ఇంటిపనికి విలువ కట్టడం సరే, స్త్రీ పురుషుల మధ్య పని విభజనకి మార్గదర్శకాలు రూపొందించుకోవాలి. వీటన్నిటితో పాటు లోకం తన చూపుకి మరికాస్త స్త్రీ తత్వాన్ని అద్దుకోవాలి.


కె.ఎన్‌. మల్లీశ్వరి 
వ్యాసకర్త ప్రరవే ఏపీ కార్యదర్శి
malleswari.kn2008@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement