మెజారిటీ నైతికతకు సర్వజనామోదమా? | Article On Moral Majority | Sakshi
Sakshi News home page

మెజారిటీ నైతికతకు సర్వజనామోదమా?

Published Tue, Nov 5 2019 12:50 AM | Last Updated on Tue, Nov 5 2019 12:51 AM

Article On Moral Majority - Sakshi

రోడ్డున పోతూ రాలిపడిన మామిడిపండ్లను ఏరుకొంటాడతను, ఉగ్గబట్టిన ప్రేమను చాటుగా తీర్చుకుంటుంది ఆమె, తమకు ఇష్టమైన మాంసాహారాన్ని ప్రీతిగా ఆరగిస్తుంది ఆ కుటుంబం. మీ దైవనినాదం నేను పలకలేను అంటాడతను. పొట్టిదుస్తులు ధరించి పబ్‌కి వెళ్లి ఒక్కతే తిరిగి వస్తుంటుంది అమ్మాయి, మా మతాన్ని ప్రచారం చేసుకుంటామంటారు వాళ్ళు. ఇంతేసి ఘోరమైన నేరాలను సహించలేని సంస్కృతి పరిరక్షకులు, నైతిక వర్తనులు సమూహంగా చేరి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు. ఎప్పటికో ఆ విషయం సెన్సేషనల్‌ సోకు చేసుకుని మీడియాలో సామాజిక మాధ్యమాల్లో గిరికీలు కొడుతుంది. కాస్త అలజడి, మృత సముద్రపు చివరి అలలా బద్ధకంగా ఉబికి మళ్ళీ పడుకుంటుంది. నిర్జీవ శరీరాల మీదుగా రహస్యపు ఒప్పుదల గాలి వీస్తుంది. చిన్నదైనా పెద్దదైనా ఒక నేరం జరిగిందంటే, జరిగిందన్న అనుమానం ఉంటే–తమకి తోచిన ఎంతటి శిక్షయినా విధించవచ్చుననే ‘మెజారిటీ నైతికత’ ఇపుడు సినిమాలను దాటి వాస్తవ జీవితంలోకి బలంగా చొచ్చుకు వస్తోంది. సర్వజనామోదం దిశగా దూసుకుపోతోంది.

నేరము, శిక్షల విషయంలో చట్టాలకి వెలుపల వ్యక్తుల, సమూహాల జోక్యం బాగా పెరగడం ఆలోచించాల్సిన విషయం. సామాజిక, ఆర్థిక పోరాటాలకి వెన్నుబలంగా నిలవాల్సిన ‘మెజారిటీ నైతికత’ సమూహ స్వభావాన్ని వదిలిపెట్టి వ్యక్తులను విడివిడిగా నిలవేసి ఎందుకు స్కాన్‌ చేస్తోందో చర్చించాలి. నైతిక విలువలు, సమాజ క్షేమం ముసుగులో భౌతికదాడులు, మానసిక హింస, అసూయ, ద్వేషం, నోటి దురుసుతనం, అహంభావం, తీర్పరితనం, కుట్రస్వభావం పెచ్చుమీరిపోవడాన్ని విశ్లేషించాలి. వ్యక్తుల హక్కులకి, గౌరవప్రదమైన ఆంతరంగిక, బాహిర జీవితానికి తావులేని ఇటువంటి చోట ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో నేరస్తులుగా ముద్రలు మోస్తున్నారని గ్రహించాలి.

శత్రువుని గుర్తించడంలో తడబాటు, తమకి భిన్నంగా ఉన్నదాని పట్ల అసహనం, ఏ మాత్రమూ వివరం తెలీని నేరంపట్ల తక్షణ స్పందన కొత్త ధోరణులుగా స్థిరపడుతున్నాయి. సామాజిక మాధ్యమాలు ఈ ధోరణులకి ఒకానొక ఉదాహరణ. ఎవరో ఎవరినో అన్యాపదేశంగా తిడుతూ నేరం ఆరోపిస్తూ ఒక పోస్టు పెడతారు. వెంటనే వందలమంది లాయర్ల అవతారం ఎత్తుతారు. మరి కొంతమంది తీర్పరులు. వీరంతా కలిసి విచారణ చేసి రకరకాల తీర్పులు వెలువరిస్తారు. అనుమానితులు, నిందితులు, నేరస్తుల వంటి క్రమం లేకుండానే, ఆరోపణలకి గురైన వ్యక్తి ప్రమేయం లేకుం డానే శిక్ష ఖరారు అవుతుంది. ఈ మధ్యలోనే ఒక అభ్యుదయ స్వరం వచ్చి ‘బాగా అయింది, బట్టలూడదీసి మరీ తన్నావుగా!’ అని ఎంకరేజ్‌ చేస్తుంది. ఇంకోచోట మరి కొందరు, ‘మీరెవరన్నా తప్పు చేశారా డొక్క చించి డోలు కడతాం, తాట తీస్తాం, తొక్క వలుస్తా’మంటూ వీరంగం వేస్తారు. తరతరాలుగా బట్టలూడదీసి తన్నబడిన వాళ్ళలోనూ తాట వలవబడిన వాళ్లలోనూ ఆధిపత్యవర్గాలు దాదాపు ఉండవని, అటువంటి ఫ్యూడల్‌ హింసలకి గురయ్యేది అనువుగా ఉండే బలహీనులేనన్నది గ్రహించరు. 

కొత్త ఆలోచనల నడక ఇప్పటికీ అంత సజావు కాదు, మాటల చుట్టూ సీసీ కెమెరాలుంటాయి. అక్షరం ప్రతీ కదలిక రికార్డ్‌ అవుతూ ఉంటుంది. కులం, మతం, స్త్రీల లైంగికత, దేశభక్తి లాంటి విషయాల్లో మెజారిటీ నైతికతకి భిన్నంగా మాట్లాడినవారిని మానసికంగా కుంగదీసేలా ట్రోలింగ్‌ మొదలవుతుంది. మరి కొన్నిసందర్భాల్లో విలువలు అతిక్రమించిన, విస్మరించిన వ్యక్తుల ఆచరణ మీద అప్రజాస్వామికంగా నైతిక ఫాసిస్టుల దాడి మొదలవుతుంది. తమ ఆలోచన, ఆచరణ మాత్రమే తిరుగులేనిదన్న అహంభావమే వైరుధ్యపూరితమైన ఇతర మానవుల జీవిత ఘర్షణల పట్ల ఏమాత్రం శ్రద్ధ పెట్టనివ్వదు. అర్థం చేసుకోనివ్వదు. 

ఈరోజు ప్రతివ్యక్తి చేతిలో ఒక శిక్షాస్మృతి ఉంది. వారివారి రాగద్వేషాలను, తీర్పరితనాలను, ఓపలేనితనాలను బట్టి, చంపడం, కొట్టడం, అంటుముట్లు, వెలివేతలు, పబ్లిక్‌ షేమింగ్‌ లాంటి వాటికి పిలుపునిస్తారు. క్షణాల్లో గుమిగూడిన గుంపు ఏమీ తెలీకుండానే తలొక రాయీ విసురుతుంది. మానవులలోని పురా హింసాప్రవృత్తి రెక్కలు సాచుకుని లేస్తుంది. ‘బలవంతులదే రాజ్యం’ అన్న నినాదానికి వ్యతిరేకంగా నిర్మించుకున్న ప్రజాస్వామికత, తలను లోనికి ముడుచుకుంటుంది. ‘మెజారిటీ నైతికత’ ప్రతిష్టించబోయే విలువల కోసం జరిగే హింసాకాండకి నువ్వొక సమిధ వ్రేల్చావా లేదా అన్నదే ముఖ్యం తప్ప నీకేం తెలుసని గుంపులో దూరావని అడగరెవ్వరు. చట్టాలకి బైట చేతిలోకి తీసుకునే శిక్షారూపాలన్నీ మొదట అనువర్తిత మయ్యేది ‘వల్నరబుల్‌’ వర్గాల మీదనే. ఈరోజు సాంస్కృతిక రంగంలో మనం శిక్షాస్మృతిని సొంతంగా నిర్మించుకుని అమలు చేస్తే రేపు మరొకరు అంతే సొంతంగా ఏవి నేరాలో నిర్వచిస్తూ పోతారు. అసలు ఎంత తప్పుకి ఎంత శిక్ష విధించాలో నిర్ణయించాల్సింది ఎవరు? జరిగిన తప్పుకీ మన నైతికదాడి మూలంగా పడిన శిక్షకీ మధ్య వెనక్కి తీసుకోలేని ఎడం ఉంటే ఇక మనం నేరస్తులం కాక మరేమిటి? 

ప్రజల హక్కులకి రక్షణ కల్పించే రాజ్యవ్యవస్థలని మాత్రమే నమ్ముకుని ఉండటం ఎలానూ సాధ్యం కావడం లేదు. అలాగని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి నేర విచారణలోనూ శిక్ష నిర్ధారణలోనూ పాల్గొని ఘటనకొక సొంత చట్టాన్ని తయారు చేయడమూ సరి కాదు. ఎన్ని లొసుగులతో ఉన్నప్పటికీ రాజ్యాంగం బాధితులకీ నేరస్తులకీ వారివైన హక్కులను పొందుపరిచింది. మధ్యయుగాల నేరవిచారణ, శిక్షల నిర్ధారణ నుంచి మనుషులను చైతన్యపరచేవాటిలో ‘మానవ హక్కుల’ స్పృహ ముఖ్యమైనది. కలిసివచ్చే అంశాల మీద వ్యక్తులను సమూహంలో భాగం చేయాలి తప్ప, సమూహంలో భాగంగా ఉన్న వ్యక్తులను విడి ఘటనల రీత్యా బహిష్కరించడం వల్ల సంస్కరణ, మేలు జరగదు. నేరపూరితమైన ఆధిపత్య సంస్కృతికి ఎదురుగా నిలబడాల్సింది సర్వ సమానత్వ బలంతో నిండిన ప్రజాస్వామిక సంస్కృతి మాత్రమే. వ్యక్తిలోనైనా సంస్థలోనైనా ఎక్కడైనా ఈ ప్రజాస్వామికత బాహిరమే కాదు అంతర్గతం కూడానన్నది ఆచరణలో నిరూపణ కావాలి.

కె.ఎన్‌. మల్లీశ్వరి
వ్యాసకర్త కార్యదర్శి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక
malleswari.kn2008@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement