‘చట్టాలు పేద వర్గాలను పీల్చి పిప్పి చేస్తూంటే, ధనిక వర్గం ఆ చట్టాలతోనే పెత్తనం చలాయిస్తూంది’ అన్నాడు గోల్డ్‌స్మిత్. ఆదర్శంలో ప్రతి ఒక్కరూ వారి స్థాయితో నిమిత్తం లేకుండా తమ ఫిర్యాదును న్యాయస్థానానికి నివేదించుకోగలగాలి. అందుకే జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ధోరణు లకు అడ్డుకట్ట వేయవలసిన అవసరాన్ని సుప్రీంకోర్టు కూడా గుర్తించవలసి వచ్చింది.
కానీ ‘చట్టాలు సాలెగూడుల్లాంటివి. ఆ గూట్లోకి బలహీనమైన ప్రాణి దూరితే దాని కథ ముగిసినట్టే’ అన్నాడు సోలన్. అందుకే రాజ్యాంగంలోని 32వ అధికరణానికి ఉన్న పరిమితులను సైతం దృష్టిలో ఉంచుకుని మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న న్యాయమూర్తులు ఉన్నారు. అలాంటివారిలో... జస్టిస్ యతిరాజులు ఒకరు.
‘‘ఎంతటి సాధారణ పౌరుడైనా, జీవి తంలో అతడు ఏ స్థానంలో ఉన్నా, దానితో నిమిత్తం లేకుండా న్యాయస్థానంలో తన కేసును హుందాగా వినిపించే హక్కు అతనికి ఉంది. అంతే హుందా తనంతో కోర్టు అతని వాదనను సానుభూతితో వినే మర్యాదనూ పాటించాలి. ప్రజా సమస్యలను వినడానికే న్యాయస్థానాలు ఉన్నాయి. కోర్టులో న్యాయం కోసం వచ్చే పౌరుల్ని యాచకులుగానూ, పీడకులు గానూ చూడరాదు.’’
– 1988 షీలా బర్సీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు.
‘‘తీర్పు గుడ్డిది కావచ్చుగానీ, తీర్పరి (జడ్జి) గుడ్డివాడు కాకూడదు.
– సుధాంశు రంజన్, సుప్రసిద్ధ జర్నలిస్టు, ‘జస్టిస్ వర్సెస్ జ్యుడీషియరీ’ గ్రంథం, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 2019
భారత రాజ్యాంగ సూత్రాలను, ‘భారత ప్రజలమైన మేము మాకుగా రూపొందించుకున్న సెక్యులర్ రాజ్యాంగాన్ని’ కంటికి రెప్పలా కాపాడుకునే హక్కు మాకు ఉందని రాజ్యాంగం పీఠికలోనే నిర్ద్వంద్వంగా ప్రకటించి ఉన్నందున అది ఎప్పటికీ అనుల్లంఘనీయ మని ప్రముఖ తెలుగు న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ జి. యతి రాజులు చాటి చెప్పారు. రాజ్యాంగ అతిక్రమణ జరిగినప్పుడు ‘రాజ్యాంగ పరిహార’ హక్కును 32వ అధికరణం ప్రసాదిస్తోంది.
భాగమైన 32వ అధికరణకు ఆచరణలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ– ఆ ఇబ్బందుల ఫలితంగా పాలక వర్గాలు, అధికారులు, పోలీసుల వల్ల సామాన్య ప్రజలు ఎలాంటి కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తోందో వివరించారు. ‘‘జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ధోరణులకు’’ అడ్డుకట్ట వేయవలసిన అవసరాన్ని సుప్రీం కోర్టు ఎందుకు గుర్తించవలసి వచ్చిందో జస్టిస్ యతిరాజులు పదే పదే ప్రస్తావించవలసి వచ్చింది (‘ఆర్టికల్ 32 అండ్ ద రెమెడీ ఆఫ్ కాంపె న్సేషన్’ పేరుతో రాసిన పుస్తకంలో). అయితే, దురదృష్టవశాత్తూ, కాదుకాదు, రాజ్యాంగ ఆదేశాల ఉల్లంఘనకు పాల్పడి పౌరహక్కుల అధ్యాయానికి తూట్లు పొడవడానికి అలవాటుపడిన పాలకవర్గాలు పౌరులకు ఉపయోగపడాల్సిన అధికరణలను ఆచరణలో అమలు కాకుండా చేసే యంత్రాంగాన్ని చొప్పించాయి.
ఆదేశిక సూత్రాల లక్ష్యం సంక్షేమ రాజ్య స్థాపన. అవి అమలు జరగాలంటే వాటికి చట్టబద్ధత అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని విస్మరించరాదు. కొంతమంది వ్యక్తులకు సౌకర్యాల పేరిట కల్పించిన ప్రత్యేక హక్కులను అవసరమైతే సవరించయినా సరే ఆదేశిక సూత్రాలను అమలు జరపాలని కనీసం తొమ్మిది, పది కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు చెప్పింది (1970–1987 మధ్యకాలంలో). రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రాధా న్యతను నొక్కి చెప్పడానికి జస్టిస్ యతి రాజులు ‘‘మానవ హక్కుల, ప్రాథమిక స్వేచ్ఛా స్వాతంత్య్రాల’’ రక్షణ ప్రాధాన్య తను ఉగ్గడించిన యూరోపియన్ కన్వెన్షన్ అధికరణలో పెక్కింటిని కూడా ఉదాహ రించారు.
ఈ 32వ అధికరణ ఆసరాగానే పాలకులు ప్రత్యర్థులపై విధించే అక్రమ కేసుల నుంచి విడిపించే ‘హెబియస్ కార్పస్’ పిటీషన్ కూడా అమలులోకి రాగ ల్గింది! అలాంటి అధికారం ఉన్న 32వ అధిక రణను విధిగా అమలు జరిపే బాధ్యత నుంచి తప్పించి అమలు లోకి రాకుండా చేశారు. అలాంటి 32వ అధికరణ అమలు జరపడా నికున్న అడ్డంకులను ఛేదించిన జస్టిస్ యతిరాజులును న్యాయ శాస్త్రంలో ఉద్దండులైన పలువురు పాత తరం న్యాయ మూర్తులకు దీటైనవారిగా భావించవచ్చు.
సుప్రసిద్ధ గోల్డ్‌స్మిత్ అన్నట్టు ‘‘చట్టాలు పేద వర్గాలను పీల్చి పిప్పి చేస్తూంటే, ధనిక వర్గం ఆ చట్టాలతోనే పెత్తనం చలాయిస్తూంది.’’ అయితే గతించిన శతాబ్దంలో ఏథెన్స్‌లో ధనికులకూ, పేదలకూ మధ్య దుర్భరమైన అంతరం ఏర్పడినప్పుడు రాచరిక కుటుంబీకుడైన సోలన్ రంగంలోకి దిగాడు. స్వయంగా ప్రజలకు ఆర్థిక బానిసత్వం నుంచి, అప్పుల నుంచి విముక్తి కల్పించాడు. జైళ్లపాలైన వారిని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశాడు.
పేదల్ని పిండి వసూలు చేసే పన్నులకు పన్నెండు రెట్లు ఎక్కువ పన్నును ధనిక వర్గాల నుంచి రాబట్టాడు. కోర్టులను ప్రజాబాహుళ్యం అవసరాలకు అనుగుణంగా సంస్కరిం చాడు. ఏథెన్స్ నగర రక్షణలో ప్రాణాలొడ్డిన వారి పిల్లలను పైకి తెచ్చి, ప్రభుత్వ ఖర్చుపైన విద్య చెప్పించాడు. ఈ సమూల సంస్కరణలకు ధనిక వర్గాలు భీషణమైన నిరసనలకు దిగాయి. అయితే ఇలా – ఒక తరం గడిచే లోగానే సోలన్ పెను సంస్కరణలు ఏథెన్స్‌ను విరుచుకు పడటానికి సిద్ధంగా ఉన్న విప్లవం నుంచి రక్షించాయి.
అందుకే సెయింట్ అగస్తీన్ అన్నాడు: రాజ్యాలు, రాజ్యపాలకు లంటే ఎవరనుకున్నారు? పరమ ఘరానా దోపిడీదారులు, దోపిడీవర్గ సంస్థలు అన్నాడు (ది సిటీ ఆఫ్ గాడ్)! కనుకనే, సోలన్ ‘‘పాలకు డెవరో చెప్పండి – అతను చేసే చట్టం ఎలా ఉంటుందో నేను చెప్తా’’ అన్నాడు. ‘‘ఎందుకంటే చట్టాలు సాలెగూడుల్లాంటివి. ఆ గూట్లోకి బలహీనమైన ప్రాణి (పురుగు) దూరితే దాని కథ ఇక ముగిసి నట్టే. కానీ, ఎదిరించగల శక్తి ఉన్నది దూరితే అది నిభాయిం చుకుని బయటపడగల్గుతుంది’’ అని వివరించాడు.
రాజ్యాంగంలోని 32వ అధికరణకున్న పరిమితులను సహితం దృష్టిలో ఉంచుకుని జస్టిస్ యతిరాజులు అదే అధికరణ కింద కక్షి దారుల సహజహక్కుల్ని రక్షించడం, నష్టపరిహారం రాబట్టగల్గడం... మానవహక్కుల సహజ పరిరక్షణకు తనవంతు చారిత్రక బాధ్యతను నెరవేర్చడంగా భావించాలి. ఈ విషయంలో జాతీయస్థాయిలోనూ, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ పలువురు న్యాయమూర్తులు సాధించిన విజయాలకు జస్టిస్ యతిరాజులు కృషి ఏమాత్రం తీసి పోదు.
నిజాయితీకి, నిర్మొహమాటానికి పేరొంది, జాతీయ స్థాయిలో అభ్యుదయకర సంస్కరణలకు చేదోడు వాదోడుగా నిలిచిన జస్టిస్ పి.ఎ.చౌదరి, హిదా యతుల్లా, కేహార్, వెంకటాచలయ్య, హెచ్.ఆర్. ఖన్నా, జె.ఎస్.వర్మ, లోకూర్, జె.ఎస్.టాగోర్, భరూచా, కురియన్, జోసఫ్, జాస్తి చలమేశ్వర్ ప్రభృతులు ప్రవేశపెట్టిన నూతన ఒరవడు లకు జస్టిస్ యతిరాజుల కృషి కొనసాగింపుగానే భావించవచ్చు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, జాతీయ స్థాయిలోనూ నూతన ఒర వడిలో తీర్పులు వెలువరించిన పి.ఎ.చౌదరి, జస్టిస్ జీవన్ రెడ్డి ప్రభృ తుల కృషికి ప్రాణధారపోసి చట్టబద్ధతకు దూరంగా ఉండి పోయిన దానిని పలువురి దృష్టిని ఆకర్షించేలా చేసి ప్రజలముందు ప్రయోజ నకర అధికరణగా నిలబెట్టగలిగారు! సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానంలో ఉండ వలసిన సుప్రసిద్ధ పౌరహక్కుల వాణి అయిన ప్రశాంత్ భూషణ్ గొంతు నొక్కేసే సంప్రదాయానికి తలుపులు తెరి చిన మాజీ ప్రధాన న్యాయమూర్తుల వైఖరిని తూర్పారబట్టారు.
ఇలాంటి వాతావర ణంలో – చట్టరీత్యా ఆచరణలో అమలు కాకుండా దూరంగా ఉంచేసిన 32వ అధికరణకు ఆచరణలో శాశ్వత విలువను సంతరింపజేయడంలో జస్టిస్ యతిరాజుల కృషి సదా అభినంద నీయం. అయితే, రాజ్యాం గంలో కేవలం పేరుకు మాత్రమే చేర్చి, ఆచరణలో లేకుండా దూరం చేసిన వాటికి పూర్తి చట్టబద్ధత కల్పించే వరకు ప్రజాశ్రేయస్సును కోరే న్యాయమూర్తులు విశ్రమించకుండా ఉంటే ప్రజలు సంతోషిస్తారు.
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment