human rights
-
చిలీ మాజీ అధ్యక్షురాలికి ఇందిరా శాంతి బహుమతి
న్యూఢిల్లీ: 2024 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ప్రముఖ మానవ హక్కుల నేత, చిలీ మాజీ దేశాధ్యక్షురాలు మిచెల్ బాచెలెట్ అందుకోనున్నారు. ఇందిరా గాంధీ శాంతి బహుమతి అంతర్జాతీయ జ్యూరీ చైర్మన్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ శుక్రవారం ఈ విషయం ప్రకటించారు. ప్రపంచ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి కోసం పాటుపడే వారిని ఈ అవార్డుతో గౌరవిస్తారు. ఐరాస మహిళా విభాగం వ్యవస్థాపక డైరెక్టర్‌గా, ఐరాస మానవ హక్కుల హై కమిషనర్‌గా, చిలీ అధ్యక్షురాలిగా లింగ సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం స్వదేశంలో, అంతర్జాతీయంగా మిచెల్ ఎంతగానో కృషి చేశారని ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ పేర్కొంది. -
మాగొంతులు పిసికారు.. కళ్లకు బట్టలు కట్టి కొట్టారు
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఫార్మా కంపెనీలకు భూములివ్వకుంటే కేసులు పెడతామంటున్నారు. జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. మా జీవనాధారమైన భూముల్ని ఇవ్వలేమని తెగేసి చెబుతున్నవారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బలవంతంగా భూములు లాక్కునేందుకు కుట్ర చేస్తున్నారు. కలెక్టర్‌పై దాడి జరిగిందనే సాకుతో పోలీసులు అర్ధరాత్రి మా ఇళ్లపై దాడులు చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల్ని భయభ్రాంతులకు గురిచేశారు. మా గొంతులు పిసికి, కళ్లకు బట్టలు కట్టి కొట్టారు. మాతో అనుచితంగా ప్రవర్తించారు. పిల్లలు ఏడుస్తున్నా విన్పించుకోకుండా మా భర్తల్ని కొడుతూ తీసుకెళ్లారు. కొందర్ని జైళ్లలో వేశారు. మరికొందరు ఎక్కడ ఉన్నారో కూడా చెప్పట్లేదు. గత మూడ్రోజులుగా అన్నం తినలేదు. నిద్ర కూడా పోవడం లేదు. ఊళ్లో ఉండాలంటేనే భయమేస్తోంది. ఢిల్లీలో న్యాయం జరుగుతుందని వచ్చాం..’ అంటూ లగచర్ల బాధిత మహిళలు జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్ల ముందు కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, కోవా లక్ష్మిలతో కలిసి ఆదివారం ఢిల్లీకి వచ్చిన మహిళలు.. సోమవారం ఆయా కమిషన్లను కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్ల ఏర్పాటు పేరుతో కేవలం గిరిజనుల భూముల లాక్కుంటున్నారని వారు ఫిర్యాదు చేశారు. మూడు పంటలు పండే భూములివ్వలేమని తొమ్మిది నెలలుగా అనేక అర్జీలు ఇస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. సీఎం బంధువులకు కంపెనీలు కట్టబెట్టేందుకే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. మంచి చేస్తడని రేవంత్‌కు ఓటేసినం: కిష్టిబాయి‘మాకు మంచి చేస్తడని రేవంత్‌రెడ్డికి ఓటేసినం. కానీ మమ్మల్ని రోడ్డుమీద కూర్చునేలా చేసిండు. మేము చావనికైనా సిద్ధం కానీ గుంటెడు భూమి కూడా ఇవ్వం. మా దగ్గరికొస్తే బాగుండదు. తొమ్మిది నెలల నుంచి దీనిపై కొట్లాడుతున్నాం. ఎన్నోమార్లు కలెక్టర్‌కు లేఖలిచ్చి కాళ్ల మీద పడ్డాం. ఎంతోమందిని వేడుకున్నాం. అప్పుడు ముఖ్యమంత్రైనా, ఆయన అన్న తిరుపతిరెడ్డి అయినా రాలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి 500 మంది పోలీసోళ్లను పంపి మా గొంతుక పిసుకుతాడా?, మా ఆడోళ్ల దాడిమీద చేపిస్తవా? ఇదేనా మీ తీరు? మా కొడంగల్ ముఖ్యమంత్రివి అనుకుంటే పూర్తిగా కొడంగల్ పేరునే కరాబ్ చేశావ్. అరెస్టు అయిన మా పిల్లలను బయటకు తేవాలే. మా భూముల జోలికి రావొద్దు..’ అని గిరిజన మహిళ కిష్టిబాయి డిమాండ్ చేసింది.గిరిజనుల భూములే ఎందుకు ఇవ్వమంటున్నారు?: జ్యోతి‘ఆ భూములు మా ముత్తాతల నుంచి మాకు వచ్చాయి. అవన్నీ పట్టా భూములే. వాటిని గుంజుకుందామని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మంచిగా పండే పంట పొలాలను లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోంది. అక్కడ ఫార్మా కంపెనీ వద్దని చెబుతున్నా వినడం లేదు. చావనైనా చస్తాం కానీ భూములివ్వం. తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టర్ చెబుతున్నా రైతులపై ఎందుకు కేసులు పెడుతున్నారు? గిరిజనుల భూములే ఎందుకు ఇవ్వమని అంటున్నారు. బెదిరించి సంతకాలు తీసుకుంటున్నారు. కలెక్టర్ ఊళ్లోకి వస్తే ఇద్దరు పోలీసులు కూడా రాలేదు కానీ ముఖ్యమంత్రి అన్న తిరుపతిరెడ్డి వస్తే రెండు బస్సుల పోలీసులు ఎందుకు వచ్చారు? తిరుపతిరెడ్డి వచ్చి భూములివ్వకుంటే బాగుండదని ఆడవాళ్లని బెదిరిస్తున్నాడు. కలెక్టర్‌పై దాడి జరిగిందని చెబుతూ తాగొచ్చి ఆడపిల్లలు అని కూడా చూడకుండా తప్పుగా ప్రవర్తించారు. మహిళలను కొట్టిన, తప్పుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. జైల్లో ఉన్న నా భర్తను విపరీతంగా కొట్టారు. ఆయన్ను కొట్టిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి..’ అని తొమ్మిది నెలల గర్భిణి జ్యోతి విజ్ఞప్తి చేసింది.మూడ్రోజుల నుంచీ ఏడుస్తూనే ఉన్నాం: దేవీబాయి‘తొమ్మిది నెలల నుంచి మమ్మల్ని సతాయిస్తున్నారు. అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భూములు పోతున్నాయని మేము బాధపడుతుంటే రాత్రిళ్లు వచ్చి మా ఇంటోళ్లని, పిల్లలను పట్టుకెళ్లారు. వారెక్కడున్నారో కూడా తెలియదు. మూడ్రోజుల నుంచి తిండీతిప్పలు లేకుండా ఏడుస్తూనే ఉన్నాం. ఢిల్లీలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం..’ అని దేవీబాయి ఆశాభావం వ్యక్తం చేసింది.దాడి జరగలేదని కలెక్టర్ చెప్పినా అరెస్టులు చేశారు: సుశీల‘భూములు పోతున్నాయని తిండికూడా పోతలేదు. నిద్రపోవడం లేదు. చిన్నచిన్న భూములున్న మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారు. కలెక్టర్ స్వయంగా దాడి జరగలేదని చెప్పినా రాత్రి 12 గంటలప్పుడు కరెంట్ ఆపేసి ఇళ్లల్లోకి చొరబడి దౌర్జన్యం చేశారు. జైల్లో ఉన్న మా వాళ్లను కలవకుండా చేస్తున్నారు. మా ప్రాణాలు పోయినా సరే భూములు మాత్రం ఇవ్వం..’ అని సుశీల తెగేసి చెప్పింది. -
మానవ హక్కుల్ని కాలరాశారు: అమిత్‌షా
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మానవహక్కుల్ని నక్సల్స్ దారుణంగా ఉల్లంఘిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరోపించారు. 2026 మార్చికల్లా నక్సల్స్‌ను అంతంచేస్తామని ప్రకటించారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితిపై సమీక్ష, నక్సల్స్ ఏరివేతకు ఉమ్మడి వ్యూహం, నక్సల్స్ ప్రభావిత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, అందుకు కేంద్రం సాయం తదితర అంశాలపై సోమవారం అమిత్ షా నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య కార్యదర్శులు, డీజీపీలు, కేంద్ర మంత్రులు, కేంద్ర సాయుధ బలగాల, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ‘‘దేశంలో గిరిజనులుసహా 8 కోట్ల మంది ప్రజలకు అభివృద్ధి, కనీస సంక్షేమ అవకాశాలు దక్కకుండా నక్సల్స్ దారుణంగా మానవహక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు. అటవీ, మారుమూల ప్రాంతాలకు విద్య, ఆరోగ్యం, అనుసంధానత, బ్యాంకింగ్, పోస్టల్ సేవలు అందకుండా అడ్డుకుంటున్నారు. అభివృద్ధికి అవరోధంగా తయారయ్యారు’’ అని అమిత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘భద్రతాబలగాలు గతంలో రక్షణాత్మక ధోరణిని అవలంభించేవి. ఇప్పుడు దీటుగా సమాధానమిస్తున్నాయి. ఇటీవలికాలంలో బలగాలు ఘన విజయాలను సాధించాయి’’ అని ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ను అమిత్ షా పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ నక్సల్స్‌తో పోరాటం తుది అంకానికి చేరుకుంది. అందరి సహకారంతో 2026 మార్చికల్లా నక్సల్స్‌ను రూపుమాపుతాం. దీంతో దశాబ్దాల సమస్యకు ముగింపు పలుకుతాం. మావోయిస్టుల ప్రభావిత గిరిజన, ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందిస్తూనే మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి్దపై దృష్టి పెట్టినప్పుడు నక్సలిజాన్ని అడ్డుకోగలం. పోలీస్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర పనితీరు అద్భుతం. ఛత్తీస్‌గఢ్‌లో వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడంలో గ్రేహౌండ్స్ పైచేయి సాధించింది. 2022 ఏడాదిలో గత 30 ఏళ్లలో ఎన్నడూలేనంతగా వామపక్ష ప్రభావిత హింసకారణంగా మరణాలు వందలోపునకు దిగొచ్చాయి. ఇప్పటిదాకా ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్, వామపక్ష ప్రభావిత ప్రాంతాల నుంచి 13,000 మంది హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. ఇకనైనా నక్సల్స్ ఆయుధాలు వీడాలి’’ అని అమిత్ షా పిలుపునిచ్చారు. ఛత్తీస్‌గఢ్ విజయం స్ఫూర్తిదాయకం‘‘ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అన్ని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో కొత్త అభివృద్ధి ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను గిరిజ నులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఈఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా 237 మంది నక్సలైట్లు చనిపో యారు. 812 మంది అరెస్టయ్యారు. 723 మంది నక్సలైట్లు లొంగిపోయారు’’ అని వివరించారు. తగ్గిన హింసాత్మక ఘటనలు‘‘ఇటీవలికాలంలో నక్సల్స్ హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయి. నక్సల్స్ హింస ఘటనలు 16,463 నుంచి 7,700కి దిగొచ్చాయి. పౌరులు, భద్రతా సిబ్బంది మరణాలు 70శాతం తగ్గాయి. హింస బారినపడిన జిల్లాల సంఖ్య 96 నుంచి 16కు తగ్గింది. తమ పరిధిలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న పోలీసు స్టేషన్ల సంఖ్య 465 నుంచి 171కి తగ్గింది. ఇది కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి ప్రయత్నాల ఫలితం. నక్సలిజం రూపుమాపేందుకు తీసుకునే చర్యల పురోగతిని సీఎంలు నెలకోసారి సమీక్షించాలి. డీజీపీలు ప్రతి 15 రోజులకే సమీక్ష జరపాలి’’ అని అమిత్ సూచించారు. -
బతుకు చితికి.. గూడు చెదిరి... వలస బాట
పుట్టిన నేల.. పెరిగిన ఊరు.. ఇవే మనిషి అస్తిత్వం. కానీ యుద్ధం, హింస ప్రజలను నిరాశ్రయులను చేస్తోంది. అధికార దాహం, అహంకార ధోరణి కోట్ల మందిని సొంత నేలకే పరాయివాళ్లుగా మారుస్తోంది. గత పదేళ్లలో ప్రపంచ జనాభాలో ప్రతి 69 మందిలో ఒకరు చొప్పున ఏకంగా 12 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. వీరిలో చాలామంది తలదాచుకునేందుకు కూడా దిక్కులేక శరణార్థులుగా మారాల్సి వస్తోంది. ప్రాణాలను చేతబట్టుకుని విదేశాల బాట పట్టాల్సిన దుస్థితి దాపురిస్తోంది...! – సాక్షి, నేషనల్ డెస్క్సంఘర్షణ, హింస, మానవ హక్కుల ఉల్లంఘనల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 11.7 కోట్ల మందికి పైగా నిరాశ్రయులైనట్టు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషన్ (యూఎన్‌హెచ్‌సీఆర్) వెల్లడించింది. వీరిలో 6.83 కోట్ల మంది సంఘర్షణలు, ఇతర సంక్షోభాల కారణంగా సొంత దేశాల్లోనే ఇతర ప్రాంతాలకు చెదిరిపోయారు. దాదాపు 4.5 కోట్ల మంది పొట్ట చేత పట్టుకుని శరణార్థులుగా విదేశాలకు వలస వెళ్లారు. 2024 తొలి నాలుగు నెలల్లో ఇది మరింత పెరిగింది.పదేళ్లకోసారి రెట్టింపు.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1951లో ఐరోపాలోని శరణార్థుల హక్కులను పరిరక్షించేందుకు ఐక్యరాజ్యసమితి శరణార్థుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 1967లో శరణార్థుల కన్వెన్షన్ ఆవిర్భవించినప్పుడు 20 లక్షల మంది శరణార్థులున్నారు. ⇒ 1980 నాటికి కోటికి చేరిన శరణార్థులు ⇒ 1990 నాటికి రెండు కోట్లకు చేరిన సంఖ్య⇒ 2021 చివరి నాటికి 3 కోట్లను మించిన శరణార్థులు⇒ తాజాగా 11 కోట్లు దాటేసిన వైనం2020 నుంచి వేగంగా...⇒ 2022లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక 2023 చివరి నాటికి 60 లక్షల మంది ఉక్రేనియన్లు నిరాశ్రయులయ్యారు. వీరిలో చాలామంది దేశం విడిచి వెళ్లారు. ⇒ 2023లో సుడాన్లో సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య ఘర్షణలు శరణార్థుల సంఖ్యను 10.5 లక్షలు పెంచాయి. ⇒ ఇక ఇజ్రాయెల్ దాడులతో గాజాలో గతేడాది చివరి మూడు నెలల్లో 10.7 లక్షల మంది నిరాశ్రయులై వలస వెళ్లారు.ఎక్కడి నుంచి వస్తున్నారు?⇒ ప్రపంచవ్యాప్తంగా నమోదైన దాదాపు 4.5 కోట్ల మంది శరణార్థులలో దాదాపు మూడొంతులు (72 శాతం) ఐదు దేశాల నుంచే వచ్చారు.అఫ్గానిస్తాన్ 64 లక్షలు సిరియా 64 లక్షలు వెనెజులా 61 లక్షలు ఉక్రెయిన్ 60 లక్షలు పాలస్తీనా 60 లక్షలుఆశ్రయమిస్తున్న దేశాలు?⇒ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది శరణార్థులు తమ స మీప పొరుగు దేశాల్లోనే బతుకీడుస్తున్నారు. ⇒ ఇరాన్, పాకిస్తాన్‌లోని శరణార్థులందరూ అఫ్గాన్లే. ⇒ టర్కీలో ఎక్కువ మంది శరణార్థులు సిరియన్లు.దేశం శరణార్థులు ఇరాన్ 38 లక్షలు తుర్కియే 33 లక్షలు కొలంబియా 29 లక్షలు జర్మనీ 26 లక్షలు పాకిస్తాన్ 20 లక్షలు -
రష్యా హక్కుల నేతకు 30 నెలల జైలు
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగిన తీరును తీవ్రంగా తప్పుబడుతూ వ్యాసాలు రాసిన రష్యా మానవ హక్కుల కార్యకర్తపై అక్కడి కోర్టు కన్నెర్రజేసింది. ప్రభుత్వ చర్యను తప్పుబడుతూ ఆర్టికల్స్ రాయడం నేరమంటూ 70 ఏళ్ల ఒలెగ్ ఓర్లోవ్‌కు 30 నెలల కారాగార శిక్ష విధిస్తూ మాస్కో కోర్టు తీర్పు చెప్పింది. రాజకీయ దురుద్దేశ్యంతో పెట్టిన కేసు ఇది అని ఆయన చేసిన వాదనలను కోర్టు పట్టించుకోలేదు. ఆయనకు రెండు సంవత్సరాల 11 నెలల జైలు శిక్ష వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించగా రెండు సంవత్సరాల ఆరునెలల శిక్షను కోర్టు ఖరారుచేసింది. ఈ కేసులో గతంలోనే విచారణ ముగిసింది. అప్పుడు ఆయనకు కొంతమేర జరిమానా కట్టాలని మాత్రమే కోర్టు సూచించింది. అయితే పుతిన్ ప్రభుత్వంపై విమర్శలను సహించేది లేదని, కఠిన శిక్ష వేయాల్సిందేనని ప్రాసిక్యూషన్ ఈ కేసు పునర్విచారణను కోరి చివరకు ఇలా శిక్ష పడేలా చేసింది. గతంలో నోబెల్ శాంతి బహుమతి పురస్కారాన్ని అందుకున్న మానవహక్కుల సంస్థ ‘మెమోరియల్’కు ఓర్లోవ్ సహ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఓర్లోవ్‌ను శిక్షించడాన్ని మెమోరియల్ సంస్థ తీవ్రంగా తప్పుబట్టింది. తమ ఉద్యమం ఆగదని పేర్కొంది. -
మహ్సా అమినికి
స్ట్రాస్‌బర్గ్(ఫ్రాన్సు): గత ఏడాది ఇరాన్ పోలీస్ కస్టడీలో మృతి చెందిన కుర్దిష్–ఇరాన్ మహిళ మహ్సా అమిని(22)కి యూరోపియన్ యూనియన్ అత్యున్నత మానవ హక్కుల పురస్కారం ప్రకటించింది. మానవహక్కులు, ప్రాథమిక స్వేచ్ఛ కోసం పోరాడే వారికి సఖరోవ్ పురస్కారాన్ని యూరోపియన్ యూనియన్ ఏటా ప్రకటిస్తోంది. డిసెంబర్ 13న జరిగే కార్యక్రమంలో మహ్సా అమిని కుటుంబీకులకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. హిజాబ్ ధరించలేదనే కారణంతో మహ్సా అమినిని నైతిక విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉండగానే ఆమె గత ఏడాది సెప్టెంబర్ 16న మృతి చెందారు. ఇది ప్రభుత్వ హత్యేనంటూ దేశవ్యాప్తంగా కొన్ని నెలలపాటు తీవ్ర ఆందోళనలు కొనసాగాయి. ప్రభుత్వం వాటిని బలప్రయోగంతో అణచివేసింది. గత ఏడాది సఖరోవ్ పురస్కారాన్ని రష్యా దురాక్రమ ణను ఎదురొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్ పౌరులకు ప్రకటించారు. ఈ అవార్డును ఒకప్పటి సోవియెట్ యూనియన్ అసమ్మతి వాది ఆండ్రీ సఖరోవ్ పేరిట 1988లో నెలకొల్పారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సఖరోవ్ 1989లో మరణించారు -
Deepika Deshwal: ముచ్చటగా మూడోసారి...
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మూడుసార్లు ప్రసంగించిన తొలి భారతీయ యువతిగా లా ఆఫీసర్ దీపికా దేశ్వాల్ చరిత్ర సృష్టించింది. కాలేజీ రోజుల నుంచి సేవాపథంలో నడుస్తున్న దిల్లీకి చెందిన దీపిక ఎంతోమంది బాధితులకు అండగా నిలిచి, ఎన్నోరకాల సేవాకార్యక్రమాల్లో పాల్గొంది. నలుగురిని ఒకటి చేసి తన దారిలో నడిచేలా చేసింది... పీహెచ్డీ స్కాలర్ అయిన దీపికా దేశ్వాల్కు చదువు మాత్రమే ప్రపంచం కాదు. కాలేజీ రోజుల నుంచి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఇష్టం. కోవిడ్ కల్లోల కాలంలో సామాజిక సేవా కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొంది. పంజాబ్‌లోని మోగా జిల్లాలో ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వందలాదిమందికి సహాయం అందించింది. స్నేహితులు, బంధువులను కూడా తన సేవాకార్యక్రమాలలో భాగం చేసింది. అన్నదానం నుంచి అనుకోకుండా ఆపదలో చిక్కుకున్న వారికి సహాయం చేయడం వరకు ఎన్నో చేసింది. తన జీతం మొత్తం కరోనా బాధితుల చికిత్స కోసం విరాళంగా ఇచ్చేది. ఆమె తండ్రి కూడా తన జీతంలోని కొంతమొత్తాన్ని విరాళంగా ఇచ్చేవాడు. ఏ అవసరం ఎప్పుడు వచ్చినా ఫోన్ చేయమంటూ ఎంతోమందికి తన ఫోన్ నంబర్ ఇచ్చింది. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఫోన్ వచ్చినా పరుగులు తీసేది. బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలిచేది. సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్న 80 మంది అమ్మాయిలకు అండగా నిలిచి, నేరస్థులు అరెస్ట్ అయేలా ఉద్యమించింది. వ్యభిచార కూపంలో చిక్కుకున్న అమ్మాయిలను రక్షించి వారికి పునరావాసం ఏర్పాటయ్యేందుకు కృషి చేసింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగానికి మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది. మహిళా సాధికారత నుంచి మానవ హక్కుల వరకు ఎన్నో కార్యక్రమాలలో క్రియాశీల పాత్ర పోషించిన దీపికకు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మూడోసారి ప్రసంగించే అరుదైన అవకాశం లభించింది. గత రెండు సమావేశాల్లో ‘మానవ హక్కులు–మహిళా హక్కులు’ అంశంపై మాట్లాడి 150 దేశాలకు చెందిన ప్రతినిధుల ద్వారా ప్రశంసలు అందుకుంది. మనసున్న దీపిక ఆటల్లోనూ బంగారం అనిపించుకుంది.‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’ లో రెజ్లింగ్, జూడోలలో ఆరుసార్లు బంగారు పతకం గెలుచుకుంది. ఆత్మరక్షణకు సంబంధించి అమ్మాయిల కోసం రకరకాల వర్క్‌షాప్‌లు నిర్వహించింది. -
ఉత్తర కొరియా అరాచకాలు..వెలుగులోకి విస్తుపోయే దారుణాలు!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన నియంతృత్వ పాలనతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అదీగాక కిమ్ తన దేశ ప్రజలు, పౌరుల పట్ల కఠినంగా వ్యహరిస్తాడంటూ.. పలు వార్తలు గుప్పుమన్నాయి కూడా. వాటిలో నిజానిజాలు ఎంత అనేది అందరి మదిలో తలెత్తిన ప్రశ్న. అయితే ఇప్పుడూ అవన్నీ నిజమేనంటూ బల్లగుద్ది మరీ చెబుతోంది దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ. అందుకు సంబంధించిన వాటిని సమగ్రంగా దర్యాప్తు చేసి మరీ ఆధారాలతో సహా ఒక నివేదికను కూడా ఇచ్చింది. అందులో ఉత్తర కొరియా ఎంత ఘోరంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందో వివరించింది. అందుకోసం దక్షిణ కొరియా 2017 నుంచి 2022 మధ్యలో తమ మాతృభూమిని వదిలో వచ్చేసిన దాదాపు 500 మందికి పైగా ఉత్తర కొరియన్ల నుంచి వివరాలను సేకరించినట్లు కూడా తెలిపింది. దక్షిణ కొరియా మంత్రిత్వశాఖ ఇచ్చిన నివేదికలో.. అక్కడ పౌరుల జీవించే హక్కే ప్రమాదంలో ఉన్నట్లు తెలిపింది. పిల్లల దగ్గర నుంచి వికలాంగులు, గర్భిణీల వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా ఉరిశిక్షలు అమలు చేసినట్లు తెలిపింది. ప్రజలను బెదిరింపులకు గురి చేసి బలవంతంగా మానవ ప్రయోగాల్లోకి దించినట్లు పేర్కొంది. నర్సు చేత బలవంతంగా మరుగుజ్జుల జాబితాను తయారు చేయించి .. వారిపై మానవ ప్రయోగాలు నిర్వహించిందని తెలిపింది. ఒక ఆరు నెలల గర్భిణి స్త్రీ తన ఇంటిలో దివగంత కిమ్ ఇల్ సంగ్ చిత్రపటం ఎదుట డ్యాన్స్‌లు చేసిందన్న కారణంతో ఉరితీశారు. అలాగే దక్షిణ కొరియా మీడియాకు సంబంధించి ఏదైనా ఆన్లైన్లో షేర్‌చేసినా, అక్కడ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినా.. వారందర్నీ ఉరితీసినట్లు వెల్లడించింది. అలాగే దక్షిణ కొరియాకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ని చూస్తూ.. నల్లమందు సేవించిన ఆరుగురు యువకులను నిర్ధాక్షిణ్యంగా కాల్చి చెప్పినట్లు పేర్కొంది. మనుషులను మానవ ప్రయోగాల కోసం నిద్రమాత్రలు ఇచ్చి మరీ ఆస్పత్రికి తరలించినట్లు నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా వికలాంగులు, మరగుజ్జుగా ఉన్నవారిపై ఇష్టారాజ్యంగా మానవ ప్రయోగాలు నిర్వహించారంటూ..అక్కడ జరిగిన భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి సుమారు 450 పేజీల నివేదికను దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ సమర్పించింది. (చదవండి: మిస్టరీగా కొత్త వైరస్ వ్యాప్తి.. 24 గంటల్లో ముగ్గురు మృతి!) -
దేశభక్తి అంటే తిరంగా సెల్ఫీ కాదు!
శాసన వేదికల్లో బిల్లుల్ని కృత్రిమంగా ఆపే సంస్కృతిని కేంద్ర పాలకులు ప్రవేశపెట్టారు. అందుకే ‘ధిక్కార స్వరంతో వ్యవహరించే పాలకులున్న చోట రాజ్యాంగ చట్ట నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు జరిపించడంలో సుప్రీంకోర్టు నిజమైన రాజ్యాంగ రక్షకురాలిగా వ్యవహరించాల్సి ఉంటుంది’ అని భారత్ లా కమిషన్ అధ్యక్షుడు ఎ.పి. షా స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణా శక్తిగా ఉండవలసినవాళ్లు ఆ బాధ్యత నుంచి తప్పుకోబట్టే దేశంలో పౌర హక్కులకు రక్షణ లేకుండా పోయింది. అందుకే ‘దేశభక్తి అంటే– తిరంగా సెల్ఫీ కాదు, తరాలుగా కూలబడిన పిట్టలకు రెక్క విదిల్చే తెగువనివ్వడం!’ ఇటీవలనే గుజరాత్లో ముగిసిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి రకరకాల కార ణాలను ఊహించుకుంటున్న దశలో అను కోని చిత్రమైన ‘విశేషాలు’ వెల్లడయ్యాయి. గుజరాత్ ఎన్నికల్లో అర వింద్ కేజ్రీవాల్ ‘ఆమ్ ఆద్మీ’ పార్టీ రంగంలోకి దిగింది. బీజేపీని గెలిపించడానికే పరోక్షంగా పనిచేసిందని కొందరు ఊహిస్తే... కాదు గుజరాత్లో కూడా ‘ఆమ్ ఆద్మీ’ పార్టీ ఉనికిని చాటుకోవడం ద్వారా అఖిల భారత స్థాయిలో తన ఓటు బ్యాంకుని పెంచుకొని జాతీయ స్థాయి రాజకీయ పక్షంగా నిలబడుతుందనీ, ఇది గొప్ప పరిణామమనీ మరికొందరు భావించారు. దీనికి తోడు అటు కాంగ్రెస్ పాలనలో మాదిరే ఇటు బీజేపీ–ఆరెస్సెస్ ఉమ్మడి పాలనలో కూడా తమకు అనుకూలమైన కేంద్ర ఎన్నికల కమిషన్లను, కమిషనర్లను నియమించుకోవడం దేశ ప్రజలకు అనుభవమే! ఎందుకంటే, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ ఘడియ ఆఖరిదశ డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు ముగిసినప్పుడు 93 నియోజక వర్గాలలో 58.8 శాతం ఓటింగ్ నమోదు అయింది. కానీ ఆ ఓటింగ్ శాతాన్ని మరుసటి రోజు ఎలక్షన్ కమిషన్ 65.3 శాతంగా సవరించింది. మొదటి దశలో నమోదైన ఓటింగ్‌ను ముందు 60.11 శాతంగా చూపించి, తర్వాత దాన్ని 63.14 శాతంగా సవరించారు. అంటే, 2017 ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ కన్నా, 2022 ఎన్నికల్లో నాలుగు శాతంపైగా ఓట్లు తగ్గిపోయాయి. కేజ్రీవాల్ ‘ఆమ్ ఆద్మీ’ పార్టీ కొత్తగా గుజరాత్లో రంగంలోకి దిగినందువల్ల ప్రత్యేకించి అది బీజేపీకి పరోక్షంగా సాయపడిందీ లేదు. పైగా తన సత్తాను ఉన్నంత లోనే ‘ఆమ్ ఆద్మీ’ ఆచరణలో రుజువు చేసుకొంది కూడా! కాగా, క్రమానుగతంగా బీజేపీ–ఆరెస్సెస్ పాలకుల కనుసన్నల్లో గత ఎనిమిది తొమ్మిదేళ్లుగా దేశంలో జరిగిందని చెప్పుకొంటున్న ‘ప్రగతి’ ఫలితాలన్నీ – ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశ ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానాన్ని పూర్తిగా తారుమారు చేయడం. సంపూర్ణ ప్రైవేటీ కరణ దిశగా మరలడం. బహుశా ఈ పరిణామాల దృష్ట్యానే భారత్ లా కమిషన్ అధ్యక్షుడు, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎ.పి. షా ఇలా వ్యాఖ్యానించారు: ‘‘దేశంలో, రాష్ట్రాలలో అధికార బలం చూసు కుని వ్యవహరించే పాలక వర్గాలున్న చోట దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ మౌలిక ప్రయోజనాల సంరక్షక శక్తిగా వ్యవహరించాల్సి ఉంటుంది.’’ ఈ హెచ్చరిక ఎప్పటికీ శిరోధార్యం కావాలి. మూడు రాజధానుల నిర్మాణం ద్వారా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి అవకాశం ఉంటుందని భావించి ఆ ప్రయత్నాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను వెనక్కి కొట్టేందుకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. ‘హైకోర్టే ప్రభుత్వమైతే, ఇంక ప్రజ లెన్నుకున్న మంత్రివర్గం దేనికి? ప్రజా ప్రతినిధులెందుకు?’ అని ప్రశ్నించింది. ‘ఫలానా ప్రాంతంలోనే రాజధాని ఉండాలని ఆదేశించే అధికారం’ కోర్టులకు లేదనీ స్పష్టం చేయవలసి వచ్చింది. అంతేగాదు, కొంతమంది జడ్జీలను హైకోర్టు, సుప్రీంకోర్టులకు ప్రమోట్ చేస్తూ నూతన సుప్రీం ధర్మాసనం చేసిన (నవంబర్ 28) ప్రతిపాదనను పాలకవర్గం అమలు చేయకుండా తొక్కి పట్టినందుకు సుప్రీంకోర్టు ఆగ్రహం ప్రకటించవలసి వచ్చింది. ఇటీవల హైకోర్టు లలో నియామకానికి సుప్రీం ధర్మాసనం ప్రతిపాదించిన 20 మంది జడ్జీల పేర్లను పునఃపరిశీలించాలని బీజేపీ పాలకులు ఒత్తిడి చేయ డాన్ని సుప్రీంకోర్టు నిరసించిందని మరచిపోరాదు. అంతేగాదు, శాసన వేదికల్లో బిల్లుల్ని కృత్రిమంగా ఆపే సంస్కృతిని కూడా బీజేపీ పాలకులు ప్రవేశపెట్టారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత తొలి రాష్ట్రపతిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత, ఇవాళ్టి లాగా ఎన్నడూ తమకు అనుకూలంగా లేని బిల్లుల్ని కృత్రి మంగా తొక్కిపట్టడానికి గానీ, తాను నియమించిన గవర్నర్లు అలాంటి పనులకు పాల్పడటానికి గానీ అనుమతించలేదు. భారత లౌకిక రాజ్యాంగ నిబంధనలను తు.చ. తప్పక పాటించి తీరాలనీ, కారణాలు చూపకుండా బిల్లుల్ని తమ వద్దే పాలక వర్గాలు ఉంచుకొని సభాధికారాన్ని ధిక్కరించరాదనీ సుప్రీం మాజీ న్యాయమూర్తి, నేష నల్ లా కమిషన్ మాజీ అధ్యక్షులు జస్టిస్ జీవన్ రెడ్డి పదే పదే మొత్తుకొంటూ వచ్చారు. అంతేగాదు, చివరికి స్వతంత్ర నిర్ణయాలు చేసుకొని రాజకీయ జోక్యానికి దూరంగా నిర్ణయాలను అమలు జరపాల్సిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌లోకి కూడా పాలకులు తలదూర్చే స్థితి వచ్చింది. అందుకనే లా కమిషన్ మాజీ అధ్యక్షుడు జస్టిస్ ఎ.పి. షా అనుభవం మీద ‘ధిక్కార స్వరంతో వ్యవహరించే పాలకులున్న చోట రాజ్యాంగ చట్ట నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు జరిపించడంలో సుప్రీంకోర్టు నిజమైన రాజ్యాంగ రక్షకురాలిగా వ్యవహరించాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేయాల్సి వచ్చింది. రాజ్యాంగ పరిరక్షణా శక్తిగా ఉండవలసిన పాలకులు ఆ బాధ్యత నుంచి తప్పుకొని సొంత అజెండాలతో పాలన వెలగ బెడుతూండబట్టే దేశంలో పౌర హక్కు లకు రక్షణ లేకుండా పోయింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని పౌర హక్కులకు రాబోతున్న ప్రమాదం గురించి హెచ్చరిక చేసినా, పాలకు లకు ‘చీమ కుట్టలేదు’! జస్టిస్ వెంకటాచలయ్య, జస్టిస్ జె.ఎస్. వర్మ లాగా నేటి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నిర్ణయాలలో తన స్వతంత్ర వ్యక్తి త్వాన్ని కాపాడుకుంటూ దేశ ప్రజలకు ఆశావహమైన నిర్ణయాలతో అకుంఠితంగా ముందుకు సాగడం పాలకులకు ‘గొంతులో వెల క్కాయ పడిన’ట్టుగా ఉంది. పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణకు ఇచ్చిన హామీని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ‘మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం లేదా వీటిలో మరే వివక్షతోనూ దేశ పౌరులను వేరుచేసి చూడటం నేరం’ అని స్పష్టంగా ప్రకటించారు. అయినా కుల, మత జాడ్యాలకు కళ్లెం పడకపోవడానికి కారణం భారత పార్లమెంటులో ‘సవర్ణ హిందు వుల’ సంఖ్య పెరగడమేనని అంబేడ్కర్ వివరించారు. సుప్రసిద్ధ పార్ల మెంటేరియన్ మహావీర్ త్యాగి ఒక సందర్భంలో రాజ్యాంగ ముసా యిదా కమిటీకి ఒక సవాలు విసిరారు: ‘‘రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చిన పౌర ప్రాథమిక హక్కులలో భాగంగా, ఆ హక్కులకు విరుద్ధంగా ప్రవర్తించే ప్రభుత్వాలను పడగొట్టే హక్కును కూడా అనుమతిస్తారా, లేదా? అలాంటి హక్కును మీరు కల్పించినట్టు లేదు. ప్రభుత్వ హక్కుల్ని మాత్రమే గుర్తించడంతో సరిపోదు, అదే మోతాదులో ప్రజల హక్కుల్ని గుర్తించాలి’’ అన్నారు మహావీర్ త్యాగి! ఈ ప్రతి పాదనతో అంగీకరిస్తూ అంబేడ్కర్ ఇలా స్పష్టం చేశారు: ‘‘రాజకీయ పదవులు లేదా మరొక పద్ధతుల్లో ప్రలోభాలు సభ్యులకు కట్టబెట్టడం ద్వారా ప్రయోజనం లేదు. ఈ రకమైన ప్రలోభాలకు మొత్తం పార్ల మెంట్ సభ్యుల్ని అలవాటు చేశామంటే పార్లమెంట్ స్వతంత్ర ప్రతి పత్తే నాశనమౌతుంది. వందిమాగధులకు వత్తాసు పెరిగి సంస్థ నాశన మవుతుంది. పార్లమెంట్‌ను మరొక స్టాక్ ఎక్స్ఛేంజ్గా, బ్రోకర్ల సంస్థగా మార్చకూడదు’’ అన్నారు. బహుశా ఇలాంటి అనుభవాలను చవిచూసిన తర్వాతనే కాబోలు కవి కంచరాన భుజంగరావు ఇలా ఆక్రోశించి ఉంటారు. ‘‘అర్ధరాత్రి సంకెళ్లు తెగిన జాతికి/ సూర్యోదయం ఒక సహజ మైన ఆశ/ తెల్లవారడం ఒక అనంతమైన భరోసా/... దొరల బూట్లలో కాలు పెట్టినప్పుడే/ అభివృద్ధి నడక ఎక్కడో తప్పటడుగులు వేసింది/ కొండల్ని మేరువులుగా బలిపించి/ కూసుల్ని కురచబార్చింది/ ఇప్పుడు చూడండి/ కేవలం రెండొందల మర్రి చెట్ల (మహాకోటీశ్వర్లు) నీడ దేశాన్ని కమ్మేసింది/ ఎదుగూ బొదుగూ లేని బీదల నేల/ వాడ ల్లోకి మురికివాడల్లోకి మునగ దీసుకుంది/ నేడు పెట్టుబడి ఒక్కటే వీసా లేకుండా దేశాలు తిరిగేస్తోంది/ ఈ గడ్డమీద పెట్టుబడికి ఉన్నంత స్వేచ్ఛ/ వేరెవరికైనా ఉందంటారా?/ ఇప్పుడిక దేశభక్తి అంటే – తిరంగా సెల్ఫీ కాదు సామీ/ రెక్కల మీది వివక్ష బరువుతో/ తరాలుగా కూలబడిన పిట్టలకు/ రెక్క విదిల్చే తెగువనివ్వడం/ రెండు గుండెల వాళ్ల కపటత్వాన్ని ఎదురొడ్డి/ ఉన్న ఒక్క గుండెను స్వేచ్ఛా కాశం కోసం/ ప్రజా పతాకను చేసి ఎగరేయడం! ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు. abkprasad2006@yahoo.co.in -
వివక్ష ఉందంటే ఉలుకెందుకు?
వివక్ష సృష్టికర్తలు, వివక్ష లేదని చెప్పడమో లేక దాన్ని తక్కువ చేసి చూపడమో చేస్తూ వుంటారు. అందులో భాగంగానే బాధితుల ఆక్రందనల్ని ప్రమాదకరమైన అలవాట్లుగా చూపిస్తుంటారు. ఈ మధ్య ఒక వైపు దళితుల మీద వివక్ష వుందని చెబుతూనే మరోవైపు వివక్ష తీవ్రతనూ, పరిమాణాన్నీ పలుచన చేసి చూపించే ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. నవంబర్ 17న ‘సాక్షి’లో పి. కృష్ణమోహన్ రెడ్డి రాసిన ‘ఇక్కడి వివక్షే కనిపిస్తుందా?’ వ్యాసంలో ఈ ధోరణి కనిపిస్తుంది. ఆధారాల కంటే సొంత అవసరాలనే నిజాలుగా ప్రచారంచేసే పోస్ట్– ట్రూత్ మేధావులు పెరిగిపోయారు. ఇక్కడి వివక్షని తెలుసు కోవడానికి విదేశాల రిపోర్టులు అవసరం లేదనీ... నిజాన్ని గుర్తించే జ్ఞానం వుంటే సరిపోతుందనీ తెలుసుకోలేకపోతున్నారు. కులం కొనసాగింపు కోసం కొత్తకొత్త వాదనలు కనిపెడుతున్నారు. దళితులు ప్రతి విషయాన్నీ కుల కోణం నుంచి చూస్తున్నారని ఆందోళన చెందటం అందులో మొదటిది. తమ తప్పును కప్పిపుచ్చు కోవడానికి అన్ని కులాలు వివక్ష ఎదుర్కొంటున్నాయి అంటారు. దళితులు ఎదుర్కొనే అంటరానితనం భిన్నమైందని ఒప్పుకోరు. ‘కొన్ని సంఘటన లను చూపించి’ దేశమంతా వివక్ష ఉందనడం సరి కాదంటారు. 2021లోనే దేశంలో 50,900 దాడులు నమోదు అయినట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో చెప్పింది. ఇన్ని దాడులు చెదురు మదురు ఘటనలుగా కనిపించడం ఆశ్చర్యమే. దళితులు ఇక్కడి వివక్షనే ఎదిరించడం ‘అధర్మ’మట. ఆఫ్రికాలో అపార్తీడ్కూ, అమెరికాలో జాతి వివక్షకూ వ్యతిరేకంగా దళితులు సంఘీభావం ప్రకటించడం వీళ్ళకి కనబడదు. ఎక్కడో వివక్ష ఉంది కాబట్టి ఇక్కడ దళితులు దాన్ని అనుభవించాలంటారు! ఆస్ట్రేలియాలో ఆదివాసీలకు జరిగిన అన్యాయానికి ఆ దేశ అధినేత క్షమాపణ చెప్పాడు. అమెరికాలో నల్ల జాతీయుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హరీస్ క్షమాపణలు చెప్పారు. అలాంటి ఊరట కలిగించే మాట ఇక్కడ ఎవరైనా చెప్పగలరా? రిజర్వేషన్లు సమానత్వానికి వ్యతిరేకం అని ప్రచారం చేస్తారు. కానీ వీళ్ళకు కులం, అంటరానితనం అసమానత్వంగా కనబడవు. అమెరికాలో ‘పౌర హక్కుల చట్టం 1964’ ప్రకారం జాతి, మతం, లింగం వంటి అంశాల వల్ల ఒక వ్యక్తిని వివక్షకు గురి చేయకూడదు. ఈ చట్టం లోని ‘టైటిల్ సెవెన్’ ప్రకారం ప్రభుత్వంతో కలిసి పనిచేసే వ్యక్తులు, సంస్థలు... కాంట్రాక్టులు, వ్యాపారాల్లో అఫర్మే టివ్ యాక్షన్ ప్లాన్ అమలు చేసి తీరాలి. అంటే నల్ల జాతీయులు, లాటిన్ అమెరికన్స్, మహిళలు, మైనారిటీలు, ట్రాన్స్ జెండర్స్ వంటి వారికి తప్పకుండా ఉద్యోగావకాశాలు కల్పించాలి. నియామకాలలో డైవర్సిటీ ఇండెక్స్ పాటించి తీరాలి. ఇది రిజర్వేషన్ లాంటిదే. అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీల్లో డైవర్సిటీ ఇండెక్స్, హాలీవుడ్ సినిమాల్లో నల్ల జాతీయులు కనిపించడం వంటివి అఫర్మేటివ్ యాక్షన్‌లో భాగమే. దౌర్భాగ్యం ఏంటంటే... బతుకుదెరువు కోసం వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్న మన వాళ్ళు అక్కడ కూడా కుల వివక్షను పెంచి పోషిస్తున్నారు. అందుకే అక్కడి దళితులు నల్లజాతీయుల లాగే తమకూ రక్షణ చట్టాలు కావాలని ఉద్యమాలు చేస్తున్నారు. అకడమిక్స్‌లోనూ వివక్ష రాజ్యమేలుతోంది. దానికి వ్యతిరేకంగా పోరాడే విద్యార్థులనూ, ఉద్యోగులనూ కులవాదులుగా చిత్రించడం ‘అలవాటైన దుర్మార్గం’ కాదా? దళితులు ఇప్పుడిప్పుడే చదువుకు దగ్గర అవుతున్నారు. వాళ్లకి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు విష వలయాలుగా మారటం అన్యాయం కాదా? అంబేడ్కర్ మీద అక్కసు వెళ్లగక్కడం మరో పోకడ. గతంలో అమెరికాకి చెందిన నల్లజాతి నాయకులు ఇండియా వచ్చి గాంధీని కలిసి ఆహ్వానించారు గాని అంబేడ్కర్‌ని కలవలేదని పెద్ద రహా స్యాన్ని కనిపెట్టినట్టు ప్రచారం చేస్తున్నారు. గాంధీని పిలిచారు కాబట్టి అంబేడ్కర్ వివక్ష మీద పోరాటం చెయ్యలేదని చెప్పగలరా? గాంధీ ఒక దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపిస్తున్న నేతగా ప్రపంచాన్ని ఆకర్షించాడనే సంగతిని మరువరాదు. అంబేడ్కర్‌ను తక్కువ చేసి చూపాలనే దుగ్ధతో అనవసరమైన పోలికలు తీసుకొస్తే ఎలా? ‘అంబే డ్కర్ ఎంతో సహనంతో ఇప్పటిదాక నామీద దాడి చెయ్యకపోవడం అతని గొప్పతనమే’ అని గాంధీ స్వయంగా ‘హరిజన’ పత్రికలో ఎందుకు రాసుకున్నాడో తెలిస్తే లోతు అర్థమౌతుంది. దేశంలో చాక్లెట్ కొన్నా పన్ను కట్టాల్సిందే. ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ... మిగిలిన పౌరుల్లాగానే పన్ను కడుతున్నారు. అందులోంచే సంక్షేమ కార్యక్రమాలకూ, పారిశ్రామిక వసతుల కోసం, కార్పొరేట్ లకూ, భూమి ఉన్న రైతులకూ రాయితీలు ఇవ్వడం కోసం ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది. రాయితీల్లో తొంబై శాతం పైగా లబ్ధి దారులు పైకులాలవారే. ఈ రాయితీలతో పోల్చుకుంటే రిజర్వేషన్ల విలువ అతి స్వల్పం. దేశాన్నే ప్రైవేట్ చేతుల్లో పెడుతుంటే పట్టించు కోకుండా తరతరాలుగా అణచివేతకు గురైనవారికి ఇస్తున్న రిజర్వేషన్ల మీద దాడిచేయడం ఏమిటి? కులం పేరుతో ఎవరి పట్లయినా వివక్ష చూపడం జరిగినా, దాడి జరిగినా నైతికంగా అందరూ బాధ్యత వహించాలి. దాన్ని అందరూ గర్హించాలి. (క్లిక్ చేయండి: మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో.. !?) - ప్రొఫెసర్ శ్రీపతి రాముడు ఆచార్యులు, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇన్‌క్లూజివ్ పాలసీ, హెచ్‌సీయూ -
మానవ హక్కులకు ప్రాణధార
‘చట్టాలు పేద వర్గాలను పీల్చి పిప్పి చేస్తూంటే, ధనిక వర్గం ఆ చట్టాలతోనే పెత్తనం చలాయిస్తూంది’ అన్నాడు గోల్డ్‌స్మిత్. ఆదర్శంలో ప్రతి ఒక్కరూ వారి స్థాయితో నిమిత్తం లేకుండా తమ ఫిర్యాదును న్యాయస్థానానికి నివేదించుకోగలగాలి. అందుకే జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ధోరణు లకు అడ్డుకట్ట వేయవలసిన అవసరాన్ని సుప్రీంకోర్టు కూడా గుర్తించవలసి వచ్చింది. కానీ ‘చట్టాలు సాలెగూడుల్లాంటివి. ఆ గూట్లోకి బలహీనమైన ప్రాణి దూరితే దాని కథ ముగిసినట్టే’ అన్నాడు సోలన్. అందుకే రాజ్యాంగంలోని 32వ అధికరణానికి ఉన్న పరిమితులను సైతం దృష్టిలో ఉంచుకుని మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న న్యాయమూర్తులు ఉన్నారు. అలాంటివారిలో... జస్టిస్ యతిరాజులు ఒకరు. ‘‘ఎంతటి సాధారణ పౌరుడైనా, జీవి తంలో అతడు ఏ స్థానంలో ఉన్నా, దానితో నిమిత్తం లేకుండా న్యాయస్థానంలో తన కేసును హుందాగా వినిపించే హక్కు అతనికి ఉంది. అంతే హుందా తనంతో కోర్టు అతని వాదనను సానుభూతితో వినే మర్యాదనూ పాటించాలి. ప్రజా సమస్యలను వినడానికే న్యాయస్థానాలు ఉన్నాయి. కోర్టులో న్యాయం కోసం వచ్చే పౌరుల్ని యాచకులుగానూ, పీడకులు గానూ చూడరాదు.’’ – 1988 షీలా బర్సీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు. ‘‘తీర్పు గుడ్డిది కావచ్చుగానీ, తీర్పరి (జడ్జి) గుడ్డివాడు కాకూడదు. – సుధాంశు రంజన్, సుప్రసిద్ధ జర్నలిస్టు, ‘జస్టిస్ వర్సెస్ జ్యుడీషియరీ’ గ్రంథం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 2019 భారత రాజ్యాంగ సూత్రాలను, ‘భారత ప్రజలమైన మేము మాకుగా రూపొందించుకున్న సెక్యులర్ రాజ్యాంగాన్ని’ కంటికి రెప్పలా కాపాడుకునే హక్కు మాకు ఉందని రాజ్యాంగం పీఠికలోనే నిర్ద్వంద్వంగా ప్రకటించి ఉన్నందున అది ఎప్పటికీ అనుల్లంఘనీయ మని ప్రముఖ తెలుగు న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ జి. యతి రాజులు చాటి చెప్పారు. రాజ్యాంగ అతిక్రమణ జరిగినప్పుడు ‘రాజ్యాంగ పరిహార’ హక్కును 32వ అధికరణం ప్రసాదిస్తోంది. భాగమైన 32వ అధికరణకు ఆచరణలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ– ఆ ఇబ్బందుల ఫలితంగా పాలక వర్గాలు, అధికారులు, పోలీసుల వల్ల సామాన్య ప్రజలు ఎలాంటి కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తోందో వివరించారు. ‘‘జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ధోరణులకు’’ అడ్డుకట్ట వేయవలసిన అవసరాన్ని సుప్రీం కోర్టు ఎందుకు గుర్తించవలసి వచ్చిందో జస్టిస్ యతిరాజులు పదే పదే ప్రస్తావించవలసి వచ్చింది (‘ఆర్టికల్ 32 అండ్ ద రెమెడీ ఆఫ్ కాంపె న్సేషన్’ పేరుతో రాసిన పుస్తకంలో). అయితే, దురదృష్టవశాత్తూ, కాదుకాదు, రాజ్యాంగ ఆదేశాల ఉల్లంఘనకు పాల్పడి పౌరహక్కుల అధ్యాయానికి తూట్లు పొడవడానికి అలవాటుపడిన పాలకవర్గాలు పౌరులకు ఉపయోగపడాల్సిన అధికరణలను ఆచరణలో అమలు కాకుండా చేసే యంత్రాంగాన్ని చొప్పించాయి. ఆదేశిక సూత్రాల లక్ష్యం సంక్షేమ రాజ్య స్థాపన. అవి అమలు జరగాలంటే వాటికి చట్టబద్ధత అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని విస్మరించరాదు. కొంతమంది వ్యక్తులకు సౌకర్యాల పేరిట కల్పించిన ప్రత్యేక హక్కులను అవసరమైతే సవరించయినా సరే ఆదేశిక సూత్రాలను అమలు జరపాలని కనీసం తొమ్మిది, పది కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు చెప్పింది (1970–1987 మధ్యకాలంలో). రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రాధా న్యతను నొక్కి చెప్పడానికి జస్టిస్ యతి రాజులు ‘‘మానవ హక్కుల, ప్రాథమిక స్వేచ్ఛా స్వాతంత్య్రాల’’ రక్షణ ప్రాధాన్య తను ఉగ్గడించిన యూరోపియన్ కన్వెన్షన్ అధికరణలో పెక్కింటిని కూడా ఉదాహ రించారు. ఈ 32వ అధికరణ ఆసరాగానే పాలకులు ప్రత్యర్థులపై విధించే అక్రమ కేసుల నుంచి విడిపించే ‘హెబియస్ కార్పస్’ పిటీషన్ కూడా అమలులోకి రాగ ల్గింది! అలాంటి అధికారం ఉన్న 32వ అధిక రణను విధిగా అమలు జరిపే బాధ్యత నుంచి తప్పించి అమలు లోకి రాకుండా చేశారు. అలాంటి 32వ అధికరణ అమలు జరపడా నికున్న అడ్డంకులను ఛేదించిన జస్టిస్ యతిరాజులును న్యాయ శాస్త్రంలో ఉద్దండులైన పలువురు పాత తరం న్యాయ మూర్తులకు దీటైనవారిగా భావించవచ్చు. సుప్రసిద్ధ గోల్డ్‌స్మిత్ అన్నట్టు ‘‘చట్టాలు పేద వర్గాలను పీల్చి పిప్పి చేస్తూంటే, ధనిక వర్గం ఆ చట్టాలతోనే పెత్తనం చలాయిస్తూంది.’’ అయితే గతించిన శతాబ్దంలో ఏథెన్స్లో ధనికులకూ, పేదలకూ మధ్య దుర్భరమైన అంతరం ఏర్పడినప్పుడు రాచరిక కుటుంబీకుడైన సోలన్ రంగంలోకి దిగాడు. స్వయంగా ప్రజలకు ఆర్థిక బానిసత్వం నుంచి, అప్పుల నుంచి విముక్తి కల్పించాడు. జైళ్లపాలైన వారిని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశాడు. పేదల్ని పిండి వసూలు చేసే పన్నులకు పన్నెండు రెట్లు ఎక్కువ పన్నును ధనిక వర్గాల నుంచి రాబట్టాడు. కోర్టులను ప్రజాబాహుళ్యం అవసరాలకు అనుగుణంగా సంస్కరిం చాడు. ఏథెన్స్ నగర రక్షణలో ప్రాణాలొడ్డిన వారి పిల్లలను పైకి తెచ్చి, ప్రభుత్వ ఖర్చుపైన విద్య చెప్పించాడు. ఈ సమూల సంస్కరణలకు ధనిక వర్గాలు భీషణమైన నిరసనలకు దిగాయి. అయితే ఇలా – ఒక తరం గడిచే లోగానే సోలన్ పెను సంస్కరణలు ఏథెన్స్ను విరుచుకు పడటానికి సిద్ధంగా ఉన్న విప్లవం నుంచి రక్షించాయి. అందుకే సెయింట్ అగస్తీన్ అన్నాడు: రాజ్యాలు, రాజ్యపాలకు లంటే ఎవరనుకున్నారు? పరమ ఘరానా దోపిడీదారులు, దోపిడీవర్గ సంస్థలు అన్నాడు (ది సిటీ ఆఫ్ గాడ్)! కనుకనే, సోలన్ ‘‘పాలకు డెవరో చెప్పండి – అతను చేసే చట్టం ఎలా ఉంటుందో నేను చెప్తా’’ అన్నాడు. ‘‘ఎందుకంటే చట్టాలు సాలెగూడుల్లాంటివి. ఆ గూట్లోకి బలహీనమైన ప్రాణి (పురుగు) దూరితే దాని కథ ఇక ముగిసి నట్టే. కానీ, ఎదిరించగల శక్తి ఉన్నది దూరితే అది నిభాయిం చుకుని బయటపడగల్గుతుంది’’ అని వివరించాడు. రాజ్యాంగంలోని 32వ అధికరణకున్న పరిమితులను సహితం దృష్టిలో ఉంచుకుని జస్టిస్ యతిరాజులు అదే అధికరణ కింద కక్షి దారుల సహజహక్కుల్ని రక్షించడం, నష్టపరిహారం రాబట్టగల్గడం... మానవహక్కుల సహజ పరిరక్షణకు తనవంతు చారిత్రక బాధ్యతను నెరవేర్చడంగా భావించాలి. ఈ విషయంలో జాతీయస్థాయిలోనూ, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ పలువురు న్యాయమూర్తులు సాధించిన విజయాలకు జస్టిస్ యతిరాజులు కృషి ఏమాత్రం తీసి పోదు. నిజాయితీకి, నిర్మొహమాటానికి పేరొంది, జాతీయ స్థాయిలో అభ్యుదయకర సంస్కరణలకు చేదోడు వాదోడుగా నిలిచిన జస్టిస్ పి.ఎ.చౌదరి, హిదా యతుల్లా, కేహార్, వెంకటాచలయ్య, హెచ్.ఆర్. ఖన్నా, జె.ఎస్.వర్మ, లోకూర్, జె.ఎస్.టాగోర్, భరూచా, కురియన్, జోసఫ్, జాస్తి చలమేశ్వర్ ప్రభృతులు ప్రవేశపెట్టిన నూతన ఒరవడు లకు జస్టిస్ యతిరాజుల కృషి కొనసాగింపుగానే భావించవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, జాతీయ స్థాయిలోనూ నూతన ఒర వడిలో తీర్పులు వెలువరించిన పి.ఎ.చౌదరి, జస్టిస్ జీవన్ రెడ్డి ప్రభృ తుల కృషికి ప్రాణధారపోసి చట్టబద్ధతకు దూరంగా ఉండి పోయిన దానిని పలువురి దృష్టిని ఆకర్షించేలా చేసి ప్రజలముందు ప్రయోజ నకర అధికరణగా నిలబెట్టగలిగారు! సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానంలో ఉండ వలసిన సుప్రసిద్ధ పౌరహక్కుల వాణి అయిన ప్రశాంత్ భూషణ్ గొంతు నొక్కేసే సంప్రదాయానికి తలుపులు తెరి చిన మాజీ ప్రధాన న్యాయమూర్తుల వైఖరిని తూర్పారబట్టారు. ఇలాంటి వాతావర ణంలో – చట్టరీత్యా ఆచరణలో అమలు కాకుండా దూరంగా ఉంచేసిన 32వ అధికరణకు ఆచరణలో శాశ్వత విలువను సంతరింపజేయడంలో జస్టిస్ యతిరాజుల కృషి సదా అభినంద నీయం. అయితే, రాజ్యాం గంలో కేవలం పేరుకు మాత్రమే చేర్చి, ఆచరణలో లేకుండా దూరం చేసిన వాటికి పూర్తి చట్టబద్ధత కల్పించే వరకు ప్రజాశ్రేయస్సును కోరే న్యాయమూర్తులు విశ్రమించకుండా ఉంటే ప్రజలు సంతోషిస్తారు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
భారత్ మానవ హక్కుల రికార్డుపై.. యూఎన్ చీఫ్ సీరియస్
ముంబై: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తన మూడు రోజుల పర్యటనలో భారత్ మానవ హక్కుల రికార్డుపై విమర్శలు కురిపించారు. ఈ మేరకు ఆయన ముంబైలో ప్రసంగిస్తూ...ప్రభుత్వ విమర్శకులు, జర్నలిస్టులు, మహిళా రిపోర్ట్‌ర్లపై దాడులు అధికమైపోయాయి. మానవ హక్కుల మండలిలో ఎన్నుకోబడిన సభ్య దేశంగా భారత్‌కి ప్రపంచ మానవ హక్కులను రూపొందించడం, మైనారిటీ వర్గాల సభ్యులతో సహా అందరి హక్కులను రక్షించడం, ప్రోత్సహించడం వంటివి చేయాల్సిన బాధ్యత ఉంది. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొంది 75 ఏళ్ల భారత్‌లో సాధించిన విజయాలను గురించి కూడా ప్రశంసించారు. అలాగే భారత్‌లో వైవిధ్యం గొప్పగా ఉంటే సరిపోదని, హక్కులు రక్షింపబడాలి. అలాగే ద్వేషపూరిత ప్రసంగాలను నిర్ద్వద్వంగా ఖండించి విలువలను కాపాడుకోవాలి. మానవహక్కులను భారత న్యాయవ్యవస్థ నిరంతరం రక్షిస్తూ ఉండాలి. ఈ ప్రసంగంలో భారత్ కర్భన ఉద్గారాలు తగ్గించే విషయం గురించి కూడా ప్రస్తావించారు. పునరుత్పాదక శక్తి కోసం లక్ష్యాలను నిర్దేశిస్తున్నప్పటికీ భారత్ మాత్రం 70 శాతం బొగ్గును వినయోగిస్తోంది. భారత్ వంటి దేశాలు పర్యావరణ పరిరక్షణ చర్యలు మరిన్ని తీసుకోవాలి. ఆరవ వంతు మానవాళి అధికంగా ఉన్న భారత్ 2030 కల్లా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధిస్తుంద? లేక విచ్ఛన్న చేస్తుందా? అని ప్రశ్నించారు. (చదవండి: మానవత్వం అంటే ఇది కదా! రోడ్లపై చెత్త కాగితాలు ఏరుకుంటున్న ఆమెను..) -
యూఎన్‌లో చైనాకు వ్యతిరేకంగా ఓటుకు దూరం...వివరణ ఇచ్చిన భారత్
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో ఉయ్ఘర్ ముస్లింలపై చైనా వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఓటింగ్ నిర్వహించగా భారత్ గైర్హాజరైంది. ఐతే భారత్ తానెందుకు దూరంగా ఉందో వివరణ ఇచ్చింది. ఈ ఓటింగ్ అనేది దేశ నిర్దిష్ట తీర్మానాలకు ఎప్పటికి సహాయకారి కాదని స్పష్టం చేసింది. అలాగే జిన్జియాంగ్లోని ప్రజల మానవ హక్కులను గౌరవించాలని నొక్కి చెప్పింది. ఈ మేరకు విదేశాంగ మత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ....అన్ని మానవహక్కులను సమర్థించేందుకు భారత్ కట్టుబడి ఉంది. ఓటు అనేది దేశ నిర్దిష్ట తీర్మానాలకు సహాయకారి కాదని , భారత్ కేవలం దీర్ఘకాలికి ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహిరిస్తుంది. భారత్ ఎప్పుడు ఇలాంటి విషయాల్లో సంభాషిచేందుకు ఇష్టపడుతుంది. అంతేకాదు జిన్జియాంగ్ ఉయ్ఘర్ అటానమస్ రీజియన్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో మానవ హక్కుల ఆందోళనలను అంచనా వేయగలం. ప్రజల మానవ హక్కులు గౌరవింపబడటమే కాకుండా హామీ ఇవ్వాలి. సంబంధిత పక్షం దీన్ని పరిష్కరిస్తారని భావిస్తున్నాం. అని అన్నారు. అలాగే భారత్‌లా చైనాకు వ్యతిరేకంగా ఓటింగ్‌కు దూరంగా 11 దేశాలు ఉన్నాయి. ఈ మేరకు యూఎన్హెచ్ఆర్సీలో తీర్మానానికి అనుకూలంగా 17 మంది సభ్యులు ఓటు వేయగా చైనా, పాకిస్తాన్, నేపాల్‌తో సహ 19 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఐతే భారత్, బ్రెజిల్, మెక్సికో, ఉక్రెయిన్‌తో 11 దేశాలు గైర్హాజరయ్యారు. (చదవండి: యూకే మంత్రి వీసా వ్యాఖ్యలపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్) -
వీగర్లపై చైనా పంజా
చైనా వాయవ్యప్రాంతం షింజియాంగ్‌లో సర్కారీ దౌష్ట్యానికి లోనవుతున్న మైనారిటీ వీగర్ ముస్లింల విషయంలో ఐక్యరాజ్యసమితి పట్టనట్టు వ్యవహరిస్తున్నదని కొంతకాలంగా హక్కుల సంస్థలు చేస్తున్న ఆరోపణలకు బ్రేక్ పడింది. అక్కడ చైనా ప్రభుత్వం తీవ్ర మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న సంగతి నిజమేనని గురువారం విడుదలైన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల పరిరక్షణ సంస్థ(యూఎన్హెచ్ఆర్సీ) నివేదిక నిర్ధారించింది. ఈ నివేదిక బయటకు రాకుండా ఆపడానికి చైనా చేయని ప్రయత్నం లేదు. దీన్ని పూర్తిగా బుట్టదాఖలయ్యేలా చూడాలనీ, కనీసం నివేదిక విడుదలను దీర్ఘకాలం వాయిదాపడేలా చూడాలనీ చైనా అనేక ఎత్తులు వేసింది. ఇప్పుడిక నివేదికను ఖండించే పనిలోపడింది. 48 పేజీల యూఎన్హెచ్ఆర్సీ నివేదికకు 122 పేజీల్లో బదులిచ్చింది. ఆ ప్రాంత శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని అణచేస్తున్నాం తప్ప సాధారణ పౌరుల జోలికి పోవటం లేదన్నది దాని సారాంశం. నియంతృత్వం, అణచివేత గాల్లోంచి ఊడిపడవు. వాటికి రాజకీయ కారణాలతోపాటు ఆర్థిక, భౌగోళిక, జాతి, మత, భాషాపరమైన కారణాలు కూడా ఉంటాయి. వరమో, శాపమో వీగర్ ముస్లింలు అత్యధికంగా ఉండే షింజియాంగ్ ప్రాంతం పర్వతాలు, అడవులు, ఎడారులతో నిండి ఉంటుంది. వాటిమధ్య బతకడానికి అనువైన చోటు ఎంచుకోవడం వారికి కష్టమే. అందుకే జనా వాసప్రాంతాలు విసిరేసినట్టు ఎక్కడెక్కడో ఉంటాయి. ఇరుగుపొరుగున రష్యాతోపాటు పలు మధ్య ఆసియా దేశాలుంటాయి. అందుకే దీన్ని నియంత్రించేందుకు ప్రస్తుత చైనా పాలకులు మాత్రమే కాదు... గతంలో పాలించినవారూ ప్రయత్నించారు. ఎందుకంటే ఇక్కడ అపారమైన ప్రకృతి సంపద ఉంది. పైగా వ్యూహాత్మకంగా చూస్తే పశ్చిమ దేశాలకు సమీపంగా, వాటిపై తన ప్రభా వాన్ని పెంచుకునేందుకు వీలుగా ఈ ప్రాంతం ఉంటుంది. భౌగోళికంగా చిన్నదే అయినా షింజి యాంగ్ ఎప్పుడూ బేలగా లేదు. చరిత్రలోకి తొంగిచూస్తే అనేక రాజరిక వ్యవస్థలకు అది కొరకరాని కొయ్యగా నిలిచింది. నియంత్రించడానికి ప్రయత్నించిన ప్రభుత్వాలకు చుక్కలు చూపింది. స్వయంప్రతిపత్తి నిలుపుకోవడమే లక్ష్యంగా పోరాడింది. 1949లో చైనా విప్లవ విజయానికి కాస్త ముందు ఆ ప్రాంతం స్వయంపాలనను రుచిచూసింది కూడా. కానీ జాతుల సమస్య విషయంలో కమ్యూనిస్టులకున్న అవగాహనను గౌరవించి కావొచ్చు... తొలిసారి వారికి తలవంచింది. ఆధిపత్య హాన్ జాతి పెత్తనమే ఇక్కడా కనబడటం, 1966–76 మధ్య సాగిన సాంస్కృతిక విప్లవకాలంలో అది మరింత బాహాటం కావడంతో మళ్లీ ఆ ప్రాంతం పోరుబాట పట్టింది. పథకం ప్రకారం వేరే ప్రాంతాలనుంచి హాన్ జనాభాను ఇక్కడికి తరలించడం, క్రమేపీ వారి రాజకీయ, ఆర్థిక ప్రాబల్యం పెంచడంతో వీగర్లు రగిలిపోయారు. 90వ దశకం మొదట్లో చెదురుమదురు నిరసనలుగా మొదలైన ఉద్యమం 2009 నాటికి తిరుగుబాటుగా మారింది. హింస చెలరేగి వందలాదిమంది ప్రాణాలు కోల్పోవడంతో 2014 నాటికి అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పూర్తిస్థాయి అణచివేత చర్యలకు ఆదేశాలిచ్చారు. అప్పటినుంచీ నరకానికి ప్రతీకలుగా ఉండే నిర్బంధ శిబిరాలకు లక్షలాదిమంది వీగర్లను తరలించారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఉండే ఆ శిబిరాలు కిక్కిరిసి ఉంటున్నా యని వార్తలొస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈమధ్యవరకూ చైనా ఎవరినీ అనుమతించక పోవడంతో అనుమానాలు బలపడ్డాయి. సమితిలో కదలికలు రావడం మొదలయ్యాక శిబిరాల్లో పరిస్థితులు కొంత మారాయంటున్నారు. నిర్బంధితుల విడుదల కూడా చోటుచేసుకున్నదని కథనాలు వచ్చాయి. కానీ జరగాల్సినదాంతో పోలిస్తే ఇది చాలా స్వల్పం. ఒక దేశ ఆంతరంగిక సమస్యగానో, సంబంధం లేని వ్యవహారమనో భావించి ప్రపంచ ప్రజానీకం ఈ నియంతృత్వ ధోరణులను చూస్తూ ఊరుకుంటే అంతటా ఇలాంటి పాలకులే తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఈమధ్యే యూఎన్హెచ్ఆర్సీ హైకమిషనర్‌గా రిటైరైన మిషెల్ బాష్లెట్ చిలీలో పినోచెట్ పాలనాకాలంలో స్వయంగా నిర్బంధాన్ని అనుభవించినవారు. అందుకే ఆమె హైకమిషనర్‌గా వచ్చినప్పుడు అందరిలో ఆశలు చిగురించాయి. అందుకు తగ్గట్టు చైనా ఎంత మొండికేసినా దాన్ని ఒప్పించడానికి ఆమె ఓపిగ్గా ప్రయత్నించారు. పరిమిత సంఖ్యలోనైనా పాత్రికేయులను అక్కడి ప్రభుత్వం అనుమతించక తప్పని స్థితి ఏర్పడటం బాష్లెట్ విజయమే. కానీ ఏళ్లతరబడి నివేదిక వెలుగు చూడకపోవడం, అత్యంత అమానుషమైన ఉదంతాలు నిజమంటూనే వాటిని నరమేథంగా మాత్రం పరిగణించకపోవడం ఆమె పనితీరును ప్రశ్నార్థకం చేసింది. బక్క దేశాలపై ఆరోపణలు వచ్చినప్పుడు విరుచుకుపడే అగ్రరాజ్యాలు బలమైన దేశాలు కళ్లెదుటే దురాగ తాలకు పాల్పడుతున్నా పట్టించుకోవు. అరబ్ దేశాలు వీగర్ ముస్లింలకు ఏదో ఒరగబెడ తాయనుకోవడం దండగ. మతాన్ని కించపరిచారన్న ఆరోపణలపై తప్ప సాధారణ ముస్లింలపై జరిగే దాడుల విషయంలో అవి ఎప్పుడూ మౌనమే పాటిస్తాయి. చైనా రాక్షసత్వాన్ని నిగ్గుతేల్చడానికి మరింత లోతైన దర్యాప్తు అవసరమని నివేదిక తెలిపింది. యూఎన్హెచ్ఆర్సీ సభ్య దేశాలు అంగీకరిస్తేనే అది సాధ్యం. చైనా దీన్నెలాగైనా అడ్డుకుంటుంది. మొత్తానికి ఈ నివేదిక చైనా నేర వైఖరిని బయటపెట్టింది. ఉనికి కోసం, కనీస మానవ హక్కుల కోసం పోరాడుతున్న వీగర్ ముస్లింలకు నైతిక మద్దతునీయడం దేశదేశాల్లోని ప్రజాస్వామికవాదుల తక్షణ కర్తవ్యం. -
మహిళకు 34 ఏళ్ల జైలు శిక్ష.. ఇంతకీ ఆమె చేసిన నేరం..?
సల్మా అల్-షెహబ్ అనే 34 ఏళ్ల మహిళకు సౌదీ అరేబియా కోర్టు 34 ఏళ్ల సుదీర్ఘ కారాగార శిక్ష విధించింది. అసమ్మతివాదులను ట్విటర్లో అనుసరించడంతో పాటు వారి పోస్టులను రీట్వీట్ చేశారన్న నేరారోపణలతో కఠిన శిక్ష వేసిందని ‘గార్డియన్’ వార్తా సంస్థ వెల్లడించింది. అంతేకాదు 34 ఏళ్ల పాటు దేశం విడిచి వెళ్లకుండా ప్రయాణ నిషేధం విధించింది. సౌదీ అరేబియా మహిళ హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న సల్మాకు సుదీర్ఘ జైలు శిక్ష విధించడం పట్ల అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఆమెను విడుదల చేయాలని మానవ హక్కుల పరిరరక్షణ సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. అసలేం జరిగింది? బ్రిటన్‌లోని లీడ్స్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న సల్మా అల్-షెహబ్‌ను 2021, జనవరి 15న సౌదీ అరేబియాలో అరెస్ట్ చేశారు. సెలవులకు స్వదేశానికి వచ్చి తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆమెను నిర్బంధించారు. శాంతిభద్రతలకు విఘాతం, దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఇంటర్నెట్ను వినియోగించారన్న ఆరోపణలతో మొదట ప్రత్యేక ఉగ్రవాద కోర్టు ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. తాజాగా సోమవారం అప్పీల్ కోర్టు 34 సంవత్సరాల జైలు శిక్ష, 34 సంవత్సరాల ప్రయాణ నిషేధం విధిస్తూ తీర్పు చెప్పింది. ఓరల్, డెంటల్ మెడిసిన్‌లో నిపుణురాలైన సల్మా.. ప్రిన్సెస్ నౌరా విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు పైళ్లై, చిన్న వయసులో ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు. Report I #SaudiArabia: 34 years sentence against the women's right activist #SalmaAlShehab 🔴 Read here: https://t.co/1S7sMV0gxY pic.twitter.com/ATjTREgxJM — ESOHR (@ESOHumanRightsE) August 16, 2022 సల్మా విడుదలకు డిమాండ్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్, ది ఫ్రీడమ్ ఇనిషియేటివ్, యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్, ఏఎల్క్యుఎస్టీ ఫర్ హ్యూమన్ రైట్స్ వంటి అనేక మానవ హక్కుల సంస్థలు ఈ తీర్పును ఖండించాయి. సల్మా అల్-షెహబ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ‘సల్మాను విడిపించాలని సౌదీ అధికారులను కోరుతున్నాం. ఆమె పిల్లల సంరక్షణకు, ఆమె చదువును పూర్తి చేయడానికి వీలు కల్పించేలా విముక్తి ప్రసాదించాల’ని ది ఫ్రీడమ్ ఇనిషియేటివ్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘మహిళా హక్కుల కార్యకర్తలకు సంఘీభావంగా ట్వీట్ చేయడం నేరం కాద’ని స్పష్టం చేసింది. In the #Saudi authorities’ longest prison sentence ever for a peaceful activist, the Specialised Criminal Court of Appeal on 9 August handed down terms totalling 34 years without suspension to women’s rights campaigner Salma al-Shehab. #SaudiArabiahttps://t.co/3bRLwqioec pic.twitter.com/fYgVrATNFX — ALQST for Human Rights (@ALQST_En) August 15, 2022 సుదీర్ఘ జైలు శిక్షపై అభ్యంతరాలు సోషల్ మీడియాలో పెద్దగా ఆదరణ లేనప్పటికీ సల్మా అల్-షెహబ్కు సుదీర్ఘ కాలం జైలు శిక్ష విధించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను ట్విటర్లో 2,597 మంది అనుసరిస్తుండగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 159 మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. ‘అసమ్మతివాదులు ట్విటర్ ఖాతాలను అనుసరించడం, వారి ట్వీట్లను రీట్వీట్ చేయడం ద్వారా సమాజంలో చిచ్చు రేపడానికి, జాతీయ భద్రతను అస్థిరపరిచేందుకు కారణమయ్యారని’ ఆమెపై ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది. షియా ముస్లిం కాబట్టే ఆమెను అన్యాయంగా అరెస్ట్ చేసి, కఠిన శిక్ష విధించారని నమ్ముతున్నట్టు యునైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ పేర్కొంది. సౌదీ అరేబియాలో మహిళల హక్కుల కోసం సల్మా గళమెత్తారు. స్త్రీలపై పురుషుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను జెడ్డాలో జూలై 15న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కలిసిన కొద్ది రోజుల తర్వాత సల్మా అల్-షెహబ్కు సుదీర్ఘ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు రావడం గమనార్హం. వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమాల్ ఖషోగ్గి దారుణ హత్య కేసులో ప్రమేయంతో పాటు, అనేక మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌదీ యువరాజుతో బైడన్ భేటీ కావడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 2018లో టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని సౌదీ కౌన్సులేట్‌లో ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. (క్లిక్: ఖషోగ్గి హత్య వెనుక సౌదీ యువరాజు హస్తం) -
శ్రీలంకలో మానవ హక్కులపై ‘సంక్షోభం’ పిడుగు.. ఐక్యరాజ్య సమితి ఆందోళన
కొలంబో: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంక ప్రజలకు తక్షణం మద్దతు ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల నిపుణుల బృందం కోరింది. అంతర్జాతీయ సమాజం ముందుకు వచ్చి సాయం అందించాలని సూచించింది. శ్రీలంకలోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు మానవ హక్కుల నిపుణులు.' శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించాలి. అది కేవలం మానవతా సంస్థల నుంచే కాదు.. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ప్రైవేటు లెండర్స్, ఇతర దేశాలు ముందుకు రావాలి.' అని పేర్కొన్నారు. శ్రీలంకలో రికార్డు స్థాయిలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల పెరుగుదల, విద్యుత్తు, ఇంధన సంక్షోభం, ఆర్థిక వ్యవస్థ పతనంపై తొమ్మిది మంది నిపుణుల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంక్షోభం మానవ హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. సరైన ఆహారం, వైద్యం అందకపోవటం వల్ల తీవ్ర అనారోగ్యాలు ఎదురవుతాయని, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు సహాయం అవసరమని తెలిపింది. అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్ మిచెల్ బచెలెట్. హింసాత్మక ఘటనలు జరగటాన్ని ఖండించారు. ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించేందుకు తీసుకునే నిర్ణయాల్లో మానవ హక్కులను ప్రధానంగా చూడాలన్నారు. ప్రభుత్వం తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాల వల్లే సంక్షోభం తలెత్తిందని తెలిపారు. ఇదీ చదవండి: Sri Lanka Crisis: రోజుకు రూ.15 వేలు సంపాదిస్తున్నా.. ఏం చేసినా ఇంత డబ్బు రాదు.. అందుకే! -
ఆ తల్లులకు క్షమాపణలు చెప్పాల్సిందే : మానవహక్కుల ప్యానెల్
UK Owes Apology For Forced Adoptions: అధికారికంగా తల్లి బిడ్డలను వేరుచేసే దారుణానికి పాల్పడిన బ్రిటన్ ప్రభుత్వం సదరు బాధిత మహిళలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని మానవ హక్కుల ప్యానెల్ పేర్కొంది. ఈ మేరకు బ్రిటన్ అధికారికంగా పెళ్లికానీ తల్లుల నుంచి తమ పిల్లలను బలవంతంగా దత్తత ఇచ్చేలా చేసినందుకు గానూ వారికి క్షమాపణ చెప్పాలని స్పష్టం చేసింది. 1949, 1976 మధ్యకాలంలో ఇంగ్లండ్, వేల్స్ నుంచి దాదాపు లక్ష మందికి పైగా పిల్లలు బలవంతంగా దత్తతకు వెళ్లారని మానవ హక్కులకు సంబంధించిన పార్లమెంట్ సంయుక్త కమిటీ నివేదికలో పేర్కొంది. అత్యంత దారుణంగా తల్లి బిడ్డలను వేరు చేసే పాశవిక చర్యకు బ్రిటన్ ప్రభుత్వం పాల్పడిందని కమిటీ అధ్యక్షురాలు లేబర్ ఎంపీ హ్యారియోట్ హర్మాన్ అన్నారు. అంతేకాదు ఆ తల్లుల చేసిన ఏకైక నేరం పెళ్లి కాకుండా గర్భవతి కావడమేనని చెప్పారు. ఇది బ్రిటన్ చేసిన ఘోరమైన తప్పుగా కమిటీ పరిగణించింది. స్వయంగా ప్రభుత్వమే ఆ తల్లుల పట్ల అనుచితంగా ప్రవర్తించిందన్నారు. ఇప్పుడైనా వారికి న్యాయం జరగాలని, వారు గౌరవింపబడేలా చేసేందుకైన బ్రిటన్ క్షమాపణలు చెప్పాలని అన్నారు. గతంలో ఆస్ట్రేలియ ప్రభుత్వం, ఐర్లాండ్ ఇలానే చేశాయని, అందుకు క్షమాపణలు కూడా చెప్పాయని తెలిపారు. 1963లో ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్లలో అబార్షన్ని చట్టబద్దం చేసినప్పటికీ మహిళలు ఈ సమస్యలను ఎదుర్కోవల్సి వచ్చిందన్నారు. పెళ్లికాకుండా తల్లికావడాన్ని ఘోరంగా చూడటం వల్లే ఈ పరిస్థితి వాటిల్లందని అన్నారు. ఐతే పార్లమెంట్ సంయుక్త కమిటీ నివేదిక బాధిత వ్యక్తుల కోసం ప్రత్యేక కౌన్సెలింగ్‌ను అందించడమే కాకుండా మరియు తల్లి లేదా బిడ్డను కనుగొనడానికి ప్రయత్నిస్తున్న వారికి ప్రభుత్వం సాయం చేయాలని కోరింది. ఈ క్రమంలో ఒక బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధి స్పందిస్తూ...ఈ చారిత్రత్మక తప్పిదం వల్ల ప్రభావితమైన వారందరికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. గతాన్ని మార్చలేకపోయినప్పటికీ ఈ ఘటనలు పునరావృతం కాకుండా బలోపేతమైన చట్టాలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం. సదరు బాధిత మహిళలకు మెరుగైన సంరక్షణను అందస్తామని చెప్పారు. (చదవండి: ఈయూ ఆంక్షాల మోత...టెన్షన్లో రష్యా!) -
నరరూప రాక్షసులు: కిడ్నాప్ చేసి మానభంగం, ఆపై..
న్యూయార్క్: మానవ హక్కుల ఉల్లంఘనలో హేయనీయమైన ఘటనలు వెలుగులోకి రావడం కొత్తేం కాదు. కానీ, ప్రపంచమంతా ఉలిక్కిపడేలా దారుణాతిదారుణాలు ఆఫ్రికన్ దేశం కాంగోలో చోటుచేసుకుంటున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో బుధవారం ఓ మహిళ కథ.. అక్కడి రెబల్ గ్రూప్‌ల అరాచకాలను బయటపెట్టడంతో పాటు సభ్య దేశ్యాలను నివ్వెరపోయేలా చేసింది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో పరిస్థితులపై భద్రతా మండలిలో సాధారణ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా.. సోఫెపడి హక్కుల సంఘం అధ్యక్షురాలు, న్యాయవాది జూలియెన్నె లుసెంగె.. తూర్పు కాంగోలో తనకు తారసపడ్డ ఓ మహిళ కథను మండలికి వినిపించగా.. ఆమె ప్రసంగిస్తున్నంత సేపు అక్కడ నిశబ్ద వాతావరణం నెలకొంది. కాంగోలో ప్రభుత్వం, రెబెల్ గ్రూప్స్ మధ్య అంతర్యుద్ధం.. ఈ మే నెలలో తారాస్థాయికి చేరింది. ఆ పరిస్థితులు కాస్త తీవ్ర హింసకు దారి తీశాయి. ఈ తరుణంలో.. కోడ్‌కో అనే మిలిటెంట్ గ్రూప్ ఓ కుటుంబం నుంచి ఓ మహిళను ఎత్తుకెళ్లింది. పలుమార్లు ఆమెపై మానభంగానికి పాల్పడ్డారు ఆ గ్రూప్ సభ్యులు. ఆపై ఓ వ్యక్తిని ఆమె కళ్లెదుటే గొంతు కోసి హత్య చేశారు. ఆ శవం నుంచి పేగులు బయటకు లాగేసి.. వాటిని వండాలంటూ ఆమెకు ఆదేశించారు. రెండు కంటెయినర్ల నీళ్లు తెచ్చి.. భోజనం సిద్ధం చేయమన్నారు. ఆపై ఆమెతో మనిషి పచ్చి మాంసం బలవంతంగా తినిపించారు’ అంటూ భావోద్వేగంగా జూలియెన్నె ఆ ఘటనలను వినిపించారు. కొన్నిరోజుల తర్వాత ఆమెను విడిచిపెట్టింది ఆ గ్రూప్. కానీ, ఇంటికి వెళ్తున్న దారిలో ఆమెను మరొక మిలిటెంట్ ఎత్తుకెళ్లింది. పలుమార్లు మానభంగం చేశారు ఆ గ్రూప్‌సభ్యులు. అక్కడ ఆమెకు అలాంటి రాక్షస అనుభవమే ఎదురైంది. ఆ పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు ఆమె తన ప్రాణాలనే పణంగా పెట్టుకుంది.. అని జూలియెన్నెకు భద్రతా మండలికి వినిపించారు. ఈ ఘటనను మండలి సంయుక్తంగా ఖండించింది. ఇలాంటి ఘటనలను నిలువరించాల్సిన అవసరం ఉందని, మానవ హక్కుల్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఈ ఆరోపణలపై కోడ్‌కో మిలిటెంట్ గ్రూప్‌గానీ, ఇతర సంస్థలుగానీ స్పందించలేదు. అంతర్యుద్ధంతో కాంగో నెత్తుటి నేలను తలపిస్తున్న వేళ.. గత 20 ఏళ్లుగా ఐరాస ప్రతినిధులు కాంగోలో శాంతి స్థాపనకు ప్రయత్నిస్తున్నా అది వీలుపడడం లేదు. Disclaimer: ఇందులోని కంటెంట్ ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు.. కేవలం పరిణామాలను తెలియజేయడానికే!. -
మలేషియా సంచలన నిర్ణయం... మరణ శిక్ష రద్దు!
Death Penalty Remains Mandatory For Several Offences: మలేషియా సంచలన నిర్ణయం తీసుకుంది. హత్య, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర తీవ్రమైన నేరాలకు మలేషియా దేశంలో మరణశిక్ష తప్పనిసరి. ఐతే మలేషియా ప్రభుత్వం కొన్ని నేరాల్లో విధించే తప్పనిసరి మరణశిక్షను రద్దు చేయడానికి అంగీకరించినట్లు తెలిపింది. 2018లోనే అధికారాన్ని చేజిక్కించుకున్న సంస్కరణవాద కూటమి మరణశిక్షను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఐతే రాజకీయ ప్రత్యర్థులు, బాధితుల కుటుంబాల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా ఈ మరణశిక్ష రద్దు నిలిచిపోయింది. ప్రస్తుతం కేబినేట్ మరణ శిక్షను రద్దు చేసేందుకు సమ్మతించినట్లు న్యాయశాఖ మంత్రి వాన్ జునైది తువాంకు జాఫర్ తెలిపారు. కానీ ఈ మరణశిక్షకు ప్రత్యామ్యాయంగా ఎలాంటి శిక్షలు విధించవచ్చనే దానిపై తదుపరి అధ్యయనం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు ఈ విషయంపై నిర్ణయం అన్ని పార్టీల హక్కులను రక్షించే విధంగా ఇవ్వడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మార్పులు చేయడానికి పార్లమెంట్లో చట్టం చేయవలసి ఉంటుందన్నారు. పైగా ఇది పూర్తి స్థాయిలో అమలు కావడానికి కూడా కాస్త సమయం పడుతుందని అన్నారు. మానవ హక్కుల ఆసియా డిప్యూటీ డైరక్టర్ ఫిల్ రాబర్ట్సన్ తప్పనిసరి మరణశిక్షను తొలగిస్తామని మలేషియా బహిరంగంగా ప్రకటించడం ఒక ముఖ్యమైన ముందడుగుగా అభినందించారు. ఐతే మలేషియాలో ఇంతవరకు వరుసగా అధికాలోకి వచ్చిన ఇతర ప్రభుత్వాలు ఈ మరణశిక్షను రద్దు చేస్తాం అంటూ... మాటలకే పరిమితం చేశాయే తప్ప ఆచరణలోకి తీసుకు రావడంలో విఫమయ్యాయి. (చదవండి: తనని తాను కాల్చుకునేలోపే ఊహించని దారుణం... ఆ తర్వాత) -
‘మా అమ్మను కిడ్నాప్ చేశారు’
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలోని మానవహక్కుల మంత్రిగా పనిచేసిన తన తల్గి షిరీన్ మజారీని పోలీసులు కిడ్నాప్ చేశారని ఆమె కుమార్తె ఆరోపించింది. వాస్తవానికి ఆమె అవినీతి నిరోధక సంస్థ కస్టడీలో ఉన్నారు. కానీ ఆమె కుమార్తె ఇమాన్ జైనాబ్ మజారీ మాత్రం పోలీసులు తన తల్లిని కొట్టి తీసుకెళ్లారని ఆరోపణలు చేశారు. అయినా ఏ వ్యక్తినైన అరెస్ట్ చేసేముందు ఏ అభియోగంతో తీసుకెళ్తున్నారో చెప్పాలి కానీ తనకు అవేమీ చెప్పలేదని కేవలం తన తల్లి లామోర్ అవినీతి నిరోధక విభాగంలో ఉందని మాత్రమే తెలుసని చెప్పుకొచ్చారు. సున్నితంగా ఉండే మహిళలనే లక్ష్యంగా చేసుకుని ఈ ప్రభుత్వం తన తల్లిని కిడ్నాప్ చేసిందంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు గుప్పించారు. తన తల్లికి ఏదైన జరిగితే ఎవరిని వదలిపెట్టనంటూ విరుచుకుపడ్డారు. మరోవైపు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తన సహోద్యోగిని ఈ ఫాసిస్ట్ పాలన హింసాత్మక ధోరణితో కిడ్నాప్ చేసిందంటూ ఆరోపణలు చేశారు. తమ ఉద్యమం శాంతియుతమైనదని ఫాసిజాన్ని దిగుమతి చేసుకున్న ప్రభుత్వం దేశాన్ని గందరగోళంలోకి నెట్టాలని చూస్తోందన్నారు. ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడి ఉన్నది సరిపోదన్నట్లు ఈ ఎన్నికలను నివారించేందుకే ఈ అరాచకాలు సృష్టిస్తున్నారంటూ విమర్శించారు. (చదవండి: ఉత్తర కొరియాకు వ్యాక్సిన్ ఆఫర్ ప్రకటించిన అమెరికా...కిమ్‌ని కలుస్తానంటున్న బైడెన్) -
భారత్‌పై అమెరికా వ్యాఖ్యలు.. జై శంకర్ గట్టి కౌంటర్
వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య సాగిన చర్చల్లో మానవ హక్కుల అంశం ప్రస్తావనకు రాలేదని భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా భారత్‌పై అమెరికా చేసిన వ్యాఖ్యలపై జైశంకర్ తీవ్రంగా స్పందించారు. అమెరికా, భారత్ మధ్య జరిగిన 2+2 స్థాయి సమావేశంలో మానవ హక్కుల అంశం చర్చించాల్సిన విషయం కాదని అన్నారు. అయితే చర్చ జరిగినప్పుడల్లా వాటి గురించి మాట్లాడేందుకు తాము వెనకాడబోమని, తప్పకుండా మాట్లాడతామని స్పష్టం చేశారు. ‘ప్రతి ఒక్కరికి భారత్‌పై ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండేందుకు అర్హులు. అలాగే మాకు కూడా వారిపై అభిప్రాయాలు ఉంటాయి. అమెరికాతో సహా ఇతర దేశాల మానవ హక్కుల పరిస్థితిపై కూడా మాకు అభిప్రాయాలు ఉంటాయి. ఈ విషయంపై చర్చించాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా మా అభిప్రాయాలు చెబుతాం’ అని గట్టి కౌంటర్ ఇచ్చారు. చదవండి: ఆహారం ‘వృథా’లో టాప్ టెన్ దేశాలివే.. కాగా భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. ఇటీవలపరిస్థితులు గమనిస్తుంటే కొంతమంది పోలీసులు, అధికారులు, ప్రభుత్వాల వల్ల మానవ హక్కుల ఉల్లంఘణ పెరిగిందని వ్యాఖ్యనించారు. వీటికి ముగింపు పలికే వరకు ఈ అంశంపై నిరంతరం భారత్‌తో సంప్రదింపులు జరుపుతుంటామన్నారు. పర్యటన ముగింపు సందర్భంగా అమెరికాలో భారతీయ పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రస్తుత సమావేశంలో మానవ హక్కుల అంశం చర్చకు రాలేదని జై శంకర్ తెలిపారు. గతంలో ప్రస్తావనకు వచ్చిందని, దానిపై చర్చించి, సమాధానం కూడా చెప్పినట్లు గుర్తుచేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాజకీయ సైనిక వ్యవహారాలపై చర్చించినట్లు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలు, ఆహర భద్రత, శ్రీలంక సంక్షోభం, పాకిస్తాన్ వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు వెల్లడించారు. చదవండి: రష్యాది నరమేధమే: బైడెన్ -
మహిళా హక్కులకు పాతర
అట్లాంటా: అఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత దేశంలో మహిళల పరిస్థితి ఘోరంగా మారిందని అంతర్జాతీయ హక్కుల సంఘాలు ఆరోపించాయి. ముఖ్యంగా మహిళలు, స్వలింగ సంపర్కులు, హిజ్రాల పరిస్థితి దేశంలో దుర్భరంగా మారుతోందని హ్యూమన్‌రైట్స్ వాచ్ సంస్థ తెలిపింది. తాలిబన్లు గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు జరిగిన హక్కుల హననమే పునరావృతం అవుతోంది. వీరి పాలనలో మహిళలు రెండు రకాలుగా బాధితులవుతున్నారు. లైంగిక పరమైన దాడులు ఒక సమస్య కాగా, అలాంటి బాధితులపై సొంతవారి అకృత్యాలు రెండో సమస్యగా మారాయని హక్కుల కార్యకర్తలు వివరిస్తున్నారు. -
మానవహక్కులు–భాష్యాలు
మానవహక్కులను కొందరు రాజకీయ దృక్కోణంలోనుంచి చూస్తున్నారని...అందువల్ల దేశ ప్రతిష్ఠ దెబ్బతింటున్నదని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం చేసిన వ్యాఖ్యపై విస్తృతంగానే చర్చ నడుస్తోంది. ఒకచోట ఏ చిన్న ఘటన జరిగినా మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించే కొందరు ఆ మాదిరి ఘటనలే మరోచోట చోటుచేసుకుంటే మౌనంవహిస్తారన్నది ఆయన ఆరోపణల సారాంశం. ప్రధాని ప్రస్తావించిన అంశాలను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మరికొంత విశదీకరించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమను తాము దళిత హక్కుల చాంపియన్లుగా చెప్పుకుంటూ రాజస్థాన్‌లోనూ, కొన్ని ఇతర రాష్ట్రాలలోనూ దళితులపై సాగుతున్న అత్యా చార ఘటనల విషయంలో మాత్రం మౌనం పాటిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌కు కొత్త కావొచ్చు గానీ... మన దేశంలోనూ, వేరే దేశాల్లోనూ హక్కుల సంఘాలు ఏదో ఒక దశలో పక్షపాత ఆరోప ణలు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పౌరహక్కుల సంఘంలో చీలిక కూడా వచ్చింది. అధికార, విపక్షాల నడుమ సాగే వ్యాగుద్ధాల్లో ఇది వినబడటం తాజా పరిణామం. ఈమధ్య ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేడిలో రైతు ఉద్యమనేతలను పట్టపగలు వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన ఉదంతంపై ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఈ నెల 1, 7 తేదీల్లో రాజస్థాన్‌లో దళితులపై అత్యంత అమానుషంగా జరిగిన దాడి ఘటనలను మరుగుపరుస్తున్నదని బీజేపీ చేసిన వ్యాఖ్య కొట్టిపారేయదగ్గది కాదు. ఈ ఉదంతాల్లో కేసులు నమోదుచేశామని, నిందితు లను అరెస్టు చేశామని రాజస్థాన్ పోలీసులు చెబుతున్నా అక్కడ తరచుగా దళితులపై, మైనారిటీలపై సాగుతున్న దాడులను నిలువరించలేకపోవటం ఆ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే. ఏటా డిసెంబర్ 10న మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకోవాలని 1948లో ఐక్య రాజ్యసమితి పిలుపునిచ్చింది. దారిద్య్రం అత్యంత అమానుషమైన మానవ హక్కుల ఉల్లంఘనగా ప్రకటించింది. తర్వాత ఆ సంస్థ ఆధ్వర్యంలో అనేక మార్గదర్శకాలు రూపొందుతూ వచ్చాయి. ఈలోగా హక్కులు కాలరాసే ప్రభుత్వాల తీరుపై పలు దేశాల్లో ఉద్యమాలు బయల్దేరాయి. పాలకు లపై ఒత్తిళ్లు అధికమయ్యాయి. మన దేశంలో 60వ దశకం చివరిలో హక్కుల ఉద్యమాలు మొగ్గతొడి గాయి. దక్షిణాఫ్రికాలో జాత్యహంకార ప్రభుత్వ ఆగడాలు, బోస్నియా, రువాండా, బురుండీ, అంగోలా వంటిచోట్ల సాగిన నరమేథాలు, తూర్పు యూరప్ దేశాల్లో హక్కుల ఉల్లంఘనలు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆలోచింపజేశాయి. ఆ తర్వాతే ప్రపంచ దేశాలన్నీ వ్యవస్థాగతమైన, తటస్థమైన మానవ హక్కుల సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని 1991లో పారిస్‌లో జరిగిన మానవహక్కుల సదస్సు పిలుపునిచ్చింది. దీన్ని 1993లో ఐక్యరాజ్య సమితి కూడా ధ్రువీకరించాక అనేక దేశాల్లో మానవ హక్కుల సంఘాలు ఏర్పాటయ్యాయి. అయితే ఇవి ఆచరణలో సామాన్య ప్రజానీకానికి పెద్దగా ఉపయోగపడిన దాఖలా లేదు. వీటికి నామమాత్ర అధికారాలులిచ్చి, లాంఛనప్రాయం చేసిన ప్రభుత్వాలే ఇందుకు కారణం. ఆ సంఘాలకు చేసే నియామకాలు కూడా అసంతృప్తినే మిగులుస్తున్నాయి. మన దేశంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల పరంగా జరిగే లోటుపాట్లను వేలెత్తి చూపేందుకు, సామాన్యులకు ఊరటనిచ్చేందుకు ఏర్పాటైనా యేటా ఈ సంఘాలు ఇచ్చే నివే దికలనూ, వివిధ సందర్భాల్లో ఇవి చేసే సిఫార్సులనూ ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవడంలేదు. వాటి అమలుకు తిరిగి న్యాయ స్థానాలను ఆశ్రయించాల్సివస్తోంది. మానవ హక్కుల సంఘాలు చేసే సిఫార్సులు అమలుపరిచి తీరవలసినవా కాదా అనే అంశంపై చాన్నాళ్లుగా అయోమయం ఉంది. మానవ హక్కుల సంఘాల అధికారాలు, విచారణలు న్యాయపరమైన కార్యకలాపాలుగానే పరిగణిం చాలని, వాటికి సివిల్ కోర్టులకుండే అధికారాలుంటాయని సుప్రీంకోర్టు వేరే సందర్భంలో చెప్పినా పరిస్థితి పెద్దగా మారలేదు. మానవహక్కుల సంఘాలు చేసే సిఫార్సులకు మానవహక్కుల చట్టం సెక్షన్ 18 ఇస్తున్న భాష్యంపై ఇన్నేళ్లయినా సుప్రీంకోర్టుతోసహా దేశంలోని ఏ న్యాయస్థానమూ సంది గ్ధతకు తావులేని విధంగా తీర్పులు వెలువరించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మద్రాస్ హైకోర్టు ఫుల్ బెంచ్ ఆ పని చేసింది. సెక్షన్ 18 మానవ హక్కుల సంఘాలకు తిరుగులేని అధికారాలిస్తోందని తేల్చిచెప్పింది. ఈ చట్టం మరింత ప్రభావవంతంగా ఉండేందుకు తగిన సవరణలు అవసరమని సూచించింది. దానిపై కేంద్రం ఇంతవరకూ దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. మానవ హక్కుల సంఘం సంస్థాపక దినోత్సవంనాడు ఆ సంఘాల పటిష్టతపై చర్చ జరిగితే, వాటికి విస్తృతమైన అధికారాలు కల్పించే దిశగా చర్యలుంటే బాగుండేది. సుప్రీంకోర్టు ఆదేశిస్తే తప్ప లఖింపూర్ ఖేడి ఘటనలో ప్రధాన బాధ్యుడని ఆరోపణలొచ్చిన కేంద్ర మంత్రి కుమారుణ్ణి యూపీ పోలీసులు అరెస్టు చేయలేని దుస్థితి నెలకొన్న ప్రస్తుత వాతావరణంలో ఆ సంఘాల బలోపేతాన్ని కోరుకోవడం దురాశే కావొచ్చు. మీ ఏలుబడిలోని రాష్ట్రాల్లో ఉల్లంఘనల తీవ్రత ఎక్కువా... మా ఏలుబడి ఉన్నచోట్ల ఉల్లంఘనల తీవ్రత ఎక్కువా అని రాజకీయ పక్షాలు వాదులాడుకుంటే, సవాళ్లు విసురుకుంటే, మానవ హక్కులకు ఎవరికి వారు సొంత భాష్యాలు చెప్పుకుంటే నిజంగానే అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ మసకబారుతుంది. ముఖ్యంగా మానవహక్కుల సంఘం సంస్థాపక దినోత్సవంనాడు అలాంటి వాదనలు అప్రస్తుతం. అందుకు బదులు మానవహక్కుల పటిష్టతకు సమష్టిగా ఏం చేయాలన్న అంశంపై దృష్టి పెడితే సాధారణ పౌరులకు మేలు కలుగుతుంది. -
ఆ కల తీరుతుందా?
ప్రపంచ దేశాలపై అమెరికా పట్టు నిలుపుకోవాలంటే భారత్‌తో స్నేహసంబంధాలు కొనసాగించడం అగ్రరాజ్యానికి అత్యంత అవసరం. రక్షణ రంగంలో ఒబామా అనుసరించే విధానాలే బైడెన్ కొనసాగించనున్నారు. ఉగ్రవాదం పాక్ భూభాగంపై ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికి ఆయన ఏ మాత్రం అంగీకరిం చరు. ఉగ్రవాదం అంశంలో పాక్‌పై ఒత్తిడి గట్టిగానే కొనసాగిస్తారన్న ఆశాభావంతో భారత్ ఉంది. చైనాతో వైఖరి వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో అమెరికా, చైనా మధ్య సంబంధాలు భారత్‌కి కీలకం. ట్రంప్ భారత్‌కే మద్దత పలుకుతూ చైనాపై కస్సుబుస్సులాడుతూనే ఉన్నారు. కానీ బైడెన్ నుంచి ఆ స్థాయి మద్దతు లభించదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో ఒక దేశం నుంచి మరొక దేశానికి ముప్పు ఉండకూడదన్న వైఖరినే ఆయన పాటించే అవకాశాలున్నాయి. మానవ హక్కులు మానవ హక్కుల ఉల్లంఘన అంశంలో భారత్ పట్ల కొత్త అధ్యక్షుడి వైఖరి ఎలా ఉంటుందో ఇప్పట్నుంచి అంచనా వెయ్యలేని పరిస్థితైతే ఉంది. మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తోందంటూ పాకిస్తాన్‌పై బైడెన్ గుర్రుగానే ఉన్నారు. మరోవైపు కశ్మీర్లో 360 ఆర్టికల్ రద్దుని ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కమల మొదట్నుంచి వ్యతిరేకిస్తున్నారు. వీసా విధానం హెచ్–1బీ వీసా విధానం, ఉద్యోగాల కల్పన అంశంలో బైడెన్ విధానాలు భారత్‌కు సానుకూలంగా మారే అవకాశాలున్నాయి. అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ హెచ్–1బీ వీసాలపై కఠిన ఆంక్షలు విధించారు. అయితే బైడెన్ వాటిని సరళతరం చేస్తానని ఇప్పటికే హామీ ఇచ్చారు. అంతేకాదు చట్టవిరుద్ధంగా ఉండే వలసదారులకి అమెరికా పౌరసత్వం కల్పిస్తానని ఎన్నికల హామీ కూడా ఉంది. అదే జరిగితే 5 లక్షల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది కమలా హ్యారిస్ పాత్ర వివిధ అంశాలపై కమలకు స్పష్టమైన అభిప్రా యాలున్నాయి. అవన్నీ భారత్‌తో సంబంధాల్లో ప్రభావాన్ని చూపిస్తాయి. మరోసారి పోటీ చేయబోనని బైడెన్ చెప్పడంతో అధ్యక్షురాలయ్యే వ్యూహంతో కమలా అడుగులు వేస్తారు. ఆమె మూలాలు భారత్‌తో ముడిపడి ఉండడంతో మన దేశానికి కలిసొచ్చే అంశంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘2020 నాటికి అమెరికా, భారత్ ప్రపంచంలోనే అత్యంత సన్నిహిత దేశాలుగా అవతరించాలి. అప్పుడే ప్రపంచం హాయిగా ఉంటుంది. ఇదే నా కల — 2006లో ఓ ఇంటర్వ్యూలో బైడెన్ -
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత దేశంనుంచి తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిందని అమ్నెస్టీ ఇండియా ఆరోపించింది. 2020 సెప్టెంబర్ 10న తన బ్యాంకు ఖాతాలన్నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా స్తంభింపజేసిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. దీంతో తీవ్ర వేదన, దుఃఖం, భారమైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. ప్రభుత్వ ప్రతీకార చర్యల కారణంగానే తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని తెలిపింది. అవాస్తవాలు, ఉద్దేశపూరక ఆరోపణలపై మానవ హక్కుల సంస్థలను భారత ప్రభుత్వం మంత్ర గత్తెలా వేటాడుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. తాము దేశంలో పరిస్థితిని ఎదుర్కొంటున్నామని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా తాజాగా ఆరోపించింది. దేశంలో మానవ హక్కులు ఉల్లంఘనలపై తాము సమర్పించిన నివేదికల నేపథ్యంలో తమ సభ్యులు, బెదిరింపులు, వేధింపుల దాడిని ఎదుర్కొంటున్నారని గ్రూప్ సీనియర్ రీసెర్చ్, అడ్వకేసీ అండ్ పాలసీ డైరెక్టర్ రజత్ ఖోస్లా చెప్పారు. మానవహక్కుల ఉల్లంఘనపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమివ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేదని పేర్కొన్నారు. ప్రధానంగా ఢిల్లీ అల్లర్లు, జమ్ముకశ్మీర్ అంశాలపై మౌనం వహించిదని ఆరోపించారు. ఇలాంటి ధోరణుల మధ్య దేశంలో ఇక సేవలు అందించలేమని తెలిపింది. 70కి పైగా దేశాలలో పనిచేస్తున్నాం ఇంతకుముందు 2016 లో రష్యా మాత్రమే కార్యకలాపాలను మూసివేశాని ఖోస్లా చెప్పారు. అయితే దేశంలో తన చట్టపరమైన కేసులపై తమపోరాటం కొనసాగిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీన్ని గమనిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ -2010 (ఎఫ్సీఆర్ఏ) నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాపై 2019 నవంబర్ 5న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సంస్థ ప్రధాన కార్యాలయంపై దాడులు నిర్వహించింది. అలాగే గత ఏడాది ఈడీ ప్రత్యేక దర్యాప్తును ప్రారంభించిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ ఆరోపణలతో తాజాగా ఇండియాలో ఆమ్నెస్టీ బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడంతో తాజా పరిణామం చోటు చేసుకుంది కాగా భారతదేశంలో భావప్రకటన స్వేచ్ఛపై, అసమ్మతి గళాలపై ఒత్తిడి, దాడులపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఆమ్నెస్టీ తాజా నిర్ణయం కలకలం రేపింది. దీంతో దేశ ప్రతిష్టకు తీవ్ర భంగం ఏర్పడిందని మానవ హక్కుల కార్యకర్తలు అంటున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తీరని అవమానమని వ్యాఖ్యానిస్తున్నారు. #NEWS: Amnesty International India Halts Its Work On Upholding Human Rights In India Due To Reprisal From Government Of Indiahttps://t.co/W7IbP4CKDq — Amnesty India (@AIIndia) September 29, 2020