- పౌర, ప్రజాస్వామిక, మానవ హక్కులకు భరోసా కల్పించాలి
- ‘చలో అసెంబ్లీ’కి అనుమతినివ్వాలి
- మానవ హక్కుల వేదిక డిమాండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పౌర, ప్రజాస్వామిక, మానవ హక్కుల అమలుకు ప్రభుత్వం భరోసానివ్వాలని, రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును గౌరవించాలని మానవ హక్కుల వేదిక ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక నిర్వహించనున్న చలో అసెంబ్లీ కార్యక్రమానికి ప్రభుత్వం మద్దతునివ్వాలని కోరింది.
చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేసే చర్యల్లో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులకు పాల్పడడాన్ని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.జీవన్‌కుమార్, ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ తీవ్రంగా ఖండించారు. అరెస్టులను వెంటనే నిలిపివేయాలని కోరారు. అరెస్టుల పర్వం నిరంకుశమైన పాలనను తలపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధానపరమైన నిర్ణయంగా కొనసాగిన ఎన్‌కౌంటర్ హత్యలను విడనాడాలని, రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణానికి, చట్టబద్ధమైన పాలనకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరారు.
ఈ మేరకు గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న పోలీస్ ఎన్‌కౌంటర్లు, నిర్బంధం వల్ల ప్రజలు అనేక కష్టాలను, బాధలను అనుభవించారని కోట్లాది మంది ప్రజల ఆకాంక్షల మేరకు ఆవిర్భవించిన తెలంగాణ రాష్ర్టంలో శాంతియుతమైన, ప్రజాస్వామిక వాతావరణం ఉండేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు మానవ హక్కుల వేదిక రాసిన లేఖలో పలు అంశాలివీ..
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమం సందర్భంగా వెలువడిన ప్రజల ఆకాంక్షల్లో ఉమ్మడి రాష్ర్టంలో కొనసాగిన అణచివేత, నిర్బంధం, ఎన్‌కౌంటర్లు లేని స్వేచ్ఛాయుతమైన వాతావరణం నెలకొనాలని వ్యక్తమైంది. రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన పాలన కొనసాగాలని ప్రజలు ఆకాంక్షించారు. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
- ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎన్‌కౌంటర్లను ఒక విధానంగా కొనసాగించాయి. చంద్రబాబునాయుడు హయాంలోనే 1,448 మంది ఎన్‌కౌంటర్‌ల పేరిట హతమయ్యారు. ఎన్‌కౌంటర్ హత్యలకు పాల్పడిన పోలీసు అధికారులకు సీనియారిటీతో నిమిత్తం లేకుండా పదోన్నతులు, డబ్బు రూపేణా పారితోషికం అందజేయడం వంటి విధానాలు అమలు చేశారు.
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన మూడు ఎన్‌కౌంటర్లలో ఇప్పటి వరకు 8 మంది మరణించారు. పోలీసు లాకప్పుల్లో ఒక దళిత మహిళసహా 6 అనుమానాస్పద లాకప్పు మరణాలు సంభవించాయి.
- ఎన్‌కౌంటర్ హత్యలు తెలంగాణలో ఉండవనే పాలనాపరమైన విధానాన్ని నిర్ధిష్టంగా ప్రకటించాలి.
పోలీసు ఎన్‌కౌంటర్లను విడనాడాలి
Published Wed, Sep 30 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 AM
Advertisement
Advertisement