Chalo Assembly program
-
పోలీసు ఎన్కౌంటర్లను విడనాడాలి
- పౌర, ప్రజాస్వామిక, మానవ హక్కులకు భరోసా కల్పించాలి - ‘చలో అసెంబ్లీ’కి అనుమతినివ్వాలి - మానవ హక్కుల వేదిక డిమాండ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పౌర, ప్రజాస్వామిక, మానవ హక్కుల అమలుకు ప్రభుత్వం భరోసానివ్వాలని, రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును గౌరవించాలని మానవ హక్కుల వేదిక ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక నిర్వహించనున్న చలో అసెంబ్లీ కార్యక్రమానికి ప్రభుత్వం మద్దతునివ్వాలని కోరింది. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేసే చర్యల్లో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులకు పాల్పడడాన్ని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.జీవన్‌కుమార్, ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ తీవ్రంగా ఖండించారు. అరెస్టులను వెంటనే నిలిపివేయాలని కోరారు. అరెస్టుల పర్వం నిరంకుశమైన పాలనను తలపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధానపరమైన నిర్ణయంగా కొనసాగిన ఎన్కౌంటర్ హత్యలను విడనాడాలని, రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణానికి, చట్టబద్ధమైన పాలనకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరారు. ఈ మేరకు గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న పోలీస్ ఎన్కౌంటర్లు, నిర్బంధం వల్ల ప్రజలు అనేక కష్టాలను, బాధలను అనుభవించారని కోట్లాది మంది ప్రజల ఆకాంక్షల మేరకు ఆవిర్భవించిన తెలంగాణ రాష్ర్టంలో శాంతియుతమైన, ప్రజాస్వామిక వాతావరణం ఉండేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు మానవ హక్కుల వేదిక రాసిన లేఖలో పలు అంశాలివీ.. - ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమం సందర్భంగా వెలువడిన ప్రజల ఆకాంక్షల్లో ఉమ్మడి రాష్ర్టంలో కొనసాగిన అణచివేత, నిర్బంధం, ఎన్కౌంటర్లు లేని స్వేచ్ఛాయుతమైన వాతావరణం నెలకొనాలని వ్యక్తమైంది. రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన పాలన కొనసాగాలని ప్రజలు ఆకాంక్షించారు. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. - ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎన్కౌంటర్లను ఒక విధానంగా కొనసాగించాయి. చంద్రబాబునాయుడు హయాంలోనే 1,448 మంది ఎన్కౌంటర్ల పేరిట హతమయ్యారు. ఎన్కౌంటర్ హత్యలకు పాల్పడిన పోలీసు అధికారులకు సీనియారిటీతో నిమిత్తం లేకుండా పదోన్నతులు, డబ్బు రూపేణా పారితోషికం అందజేయడం వంటి విధానాలు అమలు చేశారు. - తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన మూడు ఎన్కౌంటర్లలో ఇప్పటి వరకు 8 మంది మరణించారు. పోలీసు లాకప్పుల్లో ఒక దళిత మహిళసహా 6 అనుమానాస్పద లాకప్పు మరణాలు సంభవించాయి. - ఎన్కౌంటర్ హత్యలు తెలంగాణలో ఉండవనే పాలనాపరమైన విధానాన్ని నిర్ధిష్టంగా ప్రకటించాలి. -
గ్రామదీపికల అరెస్టులు..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గత 15 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రామ దీపికల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలు దేరుతున్న గ్రామ దీపికలను జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నెలకు ఐదువేల రూపాయల వేతనం ఇవ్వాలని, ఆహారభద్రత కార్డులు, పెన్షన్ల రద్దును విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌కు బయలుదేరిన గ్రామ దీపికలను జిల్లా పోలీసులు పలుచోట్ల అరెస్టు చేశారు. ప్రధానంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పోలీసులు నిఘా పెంచారు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు వెళ్లే రహదారుల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ వెళ్తున్న సీఐటీయూ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జిల్లాలోని మణుగూరు, అశ్వారావుపేట, కొత్తగూడెం, మధిర ప్రాంతాల్లో పలువురు గ్రామ దీపికలను అరెస్టు చేసినట్లు తెలిసింది. గ్రామ దీపికలను అడ్డుకోవడం సరికాదు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు హైదరాబాద్ వెళ్తున్న గ్రామ దీపికలను పోలీసులు అడ్డుకోవడం సరికాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వర్లు అన్నారు. 15 నెలలుగా వేతనాలు అందక గ్రామ దీపికలు ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అనుకోవడం తప్పా అని ప్రశ్నించారు. గ్రామ దీపికలను అడ్డుకోవడం, అరెస్టు చేయడం అప్రజాస్వామక చర్య అని ఖండించారు. -
అంగన్వాడీల ‘చలో అసెంబ్లీ’కి పోలీసుల బ్రేక్
పరిగి: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పరిగిలో మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలను తీసుకెళ్లవద్దని ప్రైవేటు వాహనదారులు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను హెచ్చరించారు. హైదరాబాద్‌కు వెళ్లే ప్రతీ బస్సును తనిఖీ చేసి పంపిం చారు. దీన్ని నిరసిస్తూ వారంతా హైదరాబాద్ -బీజాపూర్ రహదారిపై రాస్తారోకోకు దిగారు. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ డివిజన్ కార్యదర్శి వెంకటయ్య, అంగన్వాడీ సంఘం నాయకులు స్వరూప, మంజుల, సక్కుబాయి తదితరులు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.15వేలు, హెల్పర్లకు రూ. 10వేల వేతనం చెల్లించాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలను మూడో తరగతి ఉద్యోగులుగా, హెల్పర్లను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించటంతో పాటు రెగ్యులరైజ్ చేయాలన్నారు. రిటైర్‌డమెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. త్వరలో అంగన్వాడీల్లో ఖాళీలు భర్తీ చేయనున్న నేపథ్యంలో ఎంపికలో పారదర్శకత పాటించాలని వారు కోరారు. ఐసీడీఎస్‌లలో స్వచ్ఛంద, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల జోక్యం ఉండొద్దన్నారు. కార్యక్రమంలో వెంకటమ్మ, విజయలక్ష్మి, వెంకట్రాంలు తదితరులు పాల్గొన్నారు. మోత్కూర్ గేటు వద్ద 3 గంటల పాటు రాస్తారోకో దోమ: ‘చలో అసెంబ్లీ’కి తరలివెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను మంగళవారం పరిగి- మహబూబ్‌నగర్ ప్రధాన రోడ్డుపై మండల పరిధిలోని మోత్కూర్ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కుల్కచర్ల, గండేడ్, దోమ మండలాలకు చెందిన 50మందికిపైగా అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుం డా తమ ఆందోళనను కొనసాగించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు నర్సమ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వం తమకు కనీస వేతనం రూ.15వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్ర త కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలన్నారు. ప్రభుత్వం స్పం దించి సమస్యలను పరిష్కరించే దాకా తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. 3 గంటలపాటు కొనసాగిన రాస్తారోకోతో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి మధ్యాహ్నం ఒంటిగంటకు ఎట్టకేలకు కార్యకర్తలు ఆందోళన విరమించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.