అంగన్‌వాడీల ‘చలో అసెంబ్లీ’కి పోలీసుల బ్రేక్ | police check to anganwadi chalo assembly | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల ‘చలో అసెంబ్లీ’కి పోలీసుల బ్రేక్

Published Wed, Nov 19 2014 12:06 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

police check to anganwadi chalo assembly

పరిగి: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి వెళ్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను పరిగిలో మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలను తీసుకెళ్లవద్దని ప్రైవేటు వాహనదారులు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను హెచ్చరించారు. హైదరాబాద్‌కు వెళ్లే  ప్రతీ బస్సును తనిఖీ చేసి పంపిం చారు. దీన్ని నిరసిస్తూ వారంతా హైదరాబాద్ -బీజాపూర్  రహదారిపై రాస్తారోకోకు దిగారు. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ డివిజన్ కార్యదర్శి వెంకటయ్య, అంగన్‌వాడీ సంఘం నాయకులు స్వరూప, మంజుల, సక్కుబాయి తదితరులు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.  

అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ.15వేలు, హెల్పర్లకు రూ. 10వేల వేతనం చెల్లించాలన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలను మూడో తరగతి ఉద్యోగులుగా, హెల్పర్లను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించటంతో పాటు రెగ్యులరైజ్ చేయాలన్నారు. రిటైర్‌‌డమెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. త్వరలో అంగన్‌వాడీల్లో ఖాళీలు భర్తీ చేయనున్న నేపథ్యంలో ఎంపికలో పారదర్శకత పాటించాలని వారు కోరారు. ఐసీడీఎస్‌లలో స్వచ్ఛంద, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల జోక్యం ఉండొద్దన్నారు. కార్యక్రమంలో వెంకటమ్మ, విజయలక్ష్మి, వెంకట్‌రాంలు తదితరులు పాల్గొన్నారు.

 మోత్కూర్ గేటు వద్ద 3 గంటల పాటు రాస్తారోకో
 దోమ: ‘చలో అసెంబ్లీ’కి తరలివెళ్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను మంగళవారం పరిగి- మహబూబ్‌నగర్ ప్రధాన రోడ్డుపై మండల పరిధిలోని మోత్కూర్ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కుల్కచర్ల, గండేడ్, దోమ మండలాలకు చెందిన 50మందికిపైగా అంగన్‌వాడీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుం డా తమ ఆందోళనను కొనసాగించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు నర్సమ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వం తమకు కనీస వేతనం రూ.15వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగ భద్ర త కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలన్నారు. ప్రభుత్వం స్పం దించి సమస్యలను పరిష్కరించే దాకా తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. 3 గంటలపాటు కొనసాగిన రాస్తారోకోతో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి మధ్యాహ్నం ఒంటిగంటకు ఎట్టకేలకు కార్యకర్తలు ఆందోళన విరమించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement