సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గత 15 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రామ దీపికల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలు దేరుతున్న గ్రామ దీపికలను జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నారు.
ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నెలకు ఐదువేల రూపాయల వేతనం ఇవ్వాలని, ఆహారభద్రత కార్డులు, పెన్షన్‌ల రద్దును విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌కు బయలుదేరిన గ్రామ దీపికలను జిల్లా పోలీసులు పలుచోట్ల అరెస్టు చేశారు. ప్రధానంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పోలీసులు నిఘా పెంచారు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌కు వెళ్లే రహదారుల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ వెళ్తున్న సీఐటీయూ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జిల్లాలోని మణుగూరు, అశ్వారావుపేట, కొత్తగూడెం, మధిర ప్రాంతాల్లో పలువురు గ్రామ దీపికలను అరెస్టు చేసినట్లు తెలిసింది.
గ్రామ దీపికలను అడ్డుకోవడం సరికాదు
శాంతియుతంగా నిరసన తెలిపేందుకు హైదరాబాద్ వెళ్తున్న గ్రామ దీపికలను పోలీసులు అడ్డుకోవడం సరికాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వర్లు అన్నారు. 15 నెలలుగా వేతనాలు అందక గ్రామ దీపికలు ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అనుకోవడం తప్పా అని ప్రశ్నించారు. గ్రామ దీపికలను అడ్డుకోవడం, అరెస్టు చేయడం అప్రజాస్వామక చర్య అని ఖండించారు.
గ్రామదీపికల అరెస్టులు..
Published Sat, Nov 22 2014 3:17 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement