Human Rights Forum
-
ఆదివాసీల ఆరోగ్యంపై చర్యలు తీసుకోండి
ఏజెన్సీ ఏరియాలపై రాష్ట్రపతికి హ్యూమన్ రైట్స్ ఫోరం లేఖ సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీలకు కనీస ఆరోగ్య రక్షణ కూడా లేదని హ్యూమన్ రైట్స్ ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, ఖమ్మంలోని భద్రాచలం, విశాఖలోని ఏజెన్సీల్లో మలేరియా, రక్తహీనత, ఇతరత్రా తీవ్రమైన వ్యాధులు ప్రజలను హరింపజేస్తున్నాయని ఫోరం ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసినట్టు ఆ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు జీవన్ కుమార్, భుజంగరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉట్నూర్‌లోని బీముగూడలో 16 కుటుంబాలు అంతుచిక్కని చర్మ వ్యాధులతో 6 నెలలుగా బాధపడుతున్నా యని, ఏపీలోని సీతంపేట్ ఏజెన్సీలో ఆదివాసీలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని లేఖలో తెలిపారు. ఇలాంటి పరిస్థితుల వల్ల 1999లో 5 వేల మంది, 2005, 2010ల్లో 2,500 మంది చొప్పున మృత్యువాతపడ్డారని పేర్కొన్నారు. -
‘కర్కశత్వం’పై కదలిక
♦ జిల్లా మానవ హక్కుల వేదిక కన్వీన ర్ రాకతో కదిలిన అధికార గణం ♦ ఘటన జరిగి వారం గడుస్తున్నా పట్టించుకోని అధికారులు ♦ అధికారుల తీరుపై మండిపడ్డ జయశ్రీ ♦ పిల్లలను జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖకు తరలించేందుకు చర్యలు లక్కిరెడ్డిపల్లె : జిల్లా మానవ హక్కుల వేదిక కన్వీనర్ రాకతో ఎట్టకేలకు అధికారుల్లో కదలిక వచ్చింది. మండలంలోని రాయచోటి -వేంపల్లె మార్గంలో ప్రజాచైతన్య సేవాసంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమంలో అటెండర్ సంపూర్ణమ్మ రూ.450 నగదు పోయిందంటూ అనాథ పిల్లల చేతుల్లో కర్పూరం వెలిగించి ప్రమాణం చేయించిన ఘటనపై సాక్షిలో కథనం ప్రచురితమైంది. నాలుగు రోజులు గడుస్తున్నా అధికారుల్లో చలనం రాకపోవడంతో సోమవారం జిల్లా మానవ హక్కుల వేదిక కన్వీనర్ జయశ్రీ రాకతో అధికార బృందం కట్టకట్టుకొని ప్రజా చైతన్య సేవా సంఘం అనాథాశ్రమానికి పరుగులు పెట్టారు. పిల్లలు పాఠశాలకు వెళ్లారని తెలిసి బాధిత విద్యార్థులైన నాగార్జున, నాగరాజు, నాగమల్లేష్లను పిలిపించి జరిగిన విషయంపై ఆరా తీశారు. ఆ విద్యార్థులు తమను కర్పూరం వెలిగించి కాల్చిందని చెబుతుంటే ఒళ్లు గగుర్పాటుకు గురై వెంటనే మండల విద్యాధికారి, తహసీల్దార్, ఎంపీడీఓ, సీడీపీఓ, సీఐ, ఎస్ఐలతో పాటు జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ చైర్ పర్సన్‌తో ఫోన్లో సంప్రదించారు. వెంటనే అనాథ పిల్లలకు మంచి సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్ర మానవహక్కుల వేదికకు నివేదిస్తానని చెప్పడంతో అధికారులందరూ అరగంటలోపే లక్కిరెడ్డిపల్లెకు వాలిపోయారు. అడిగితే కొడతారు అధికారులు పిల్లలను పిలిపించి ఏం జరిగిందని అడగ్గా అక్కడ జరుగుతున్న తంతును వారికి వివరించారు. వారానికి ఒక్కరోజే స్నానం అని, అది కూడా బట్టలు ఉతికే సబ్బుతో స్నానం చేసుకొనే వారమని పేర్కొన్నారు. స్నానపు గదులు, మరుగుదొడ్లు ఉన్నా తమను మాత్రం రోడ్డుకు అటువైపు వున్న చేతిపంపు వద్దకు తీసుకువెళ్లేవారని వారు చెప్పుకొచ్చారు. ఉదయం గంజి తాగి పాఠశాలకు వచ్చే వారమని చెప్పడంతో అధికారులు కంగుతిన్నారు. పాఠశాలలో నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగులు ఇస్తే అటెండర్ అన్నీ లాక్కునేదని వారు వాపోయారు. వెంటనే సీజ్ చేయాలి : జయశ్రీ అనంతరం అన్ని శాఖల అధికారులతో కలిసి అనాథాశ్రమాన్ని తనిఖీ చేయగా చెత్తా చెదారంతో కూడిన గదులు, దుర్వాసన వస్తుండంతో వెంటనే సీజ్ చేయాలని జిల్లా మానవ హక్కుల వేదిక కన్వీనర్ జయశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనాథ పిల్లల కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తుంటే ప్రైవేటు వ్యక్తులు కొంత మంది ప్రభుత్వ ఖాజానాకు గండి కొడుతున్నారని, అన్నీ తెలిసి కూడా అధికారులు నిమ్మకుండి పోవడంతో ప్రభుత్వ లక్ష్యాలు నీరుగారిపోతున్నాయని ఆమె వాపోయారు వెంటనే అటెండెర్ సంపూర్ణమ్మతో పాటు చైర్మన్ చెన్నారెడ్డిలపై కేసు నమోదు చేసి అనాథాశ్రమాన్ని సీజ్ చేయాలని ఆమె సూచించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రొటెక్షన్ అధికారి సునీత తన సిబ్బందికి తెలియజేసి అనాథ పిల్లలను మెరుగైన సౌకర్యాలు ఉన్న చోటకి తరలిస్తామని చెప్పడంతో ఆ పిల్లలు ఆనందం వ్యక్తం చేశారు. తహసీల్దార్ శ్రీరాములు నాయక్, సూపరింటెండెంట్ హైదర్ వల్లీ, సీడీపీఓ క వితాదేవి, ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తం రెడ్డి, మానవ హక్కుల వేదిక సంఘం నాయకులు సుబ్బన్న, వీఆర్లోలు నరేంద్రారెడ్డి, గంగాధర్, అన్వర్ బాషా, ఉపాధ్యాయులు శిద్దేశ్వరుడు, శ్రీనివాసులు, దామోదర్‌రెడ్డి, రఘురామయ్య పాల్గొన్నారు. -
దామరచర్లలో హెచ్ఆర్ఎఫ్ ధర్నా
నల్లగొండ జిల్లా దామచర్ల మండలం వీర్లపాలెం వద్ద తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన భారీ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రాష్ట్ర మానవ హక్కుల వేదిక ప్రచారం ప్రారంభించింది. విద్యుత్ ప్రాజెక్టు వల్ల కలిగే అనర్థాల గురించి ప్రభావిత గ్రామాల్లోని ప్రజలకు వేదిక నాయకులు వివరిస్తున్నారు. థర్మల్‌కు ప్రత్యామ్నాయంగా సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జీవన్‌కుమార్, ప్రధాన కార్యదర్శి కృష్ణ, కార్యదర్శి మోహన్ జిల్లా నాయకులు, పర్యావరణ వేత్త బాబూరావు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు ఎన్కౌంటర్లను విడనాడాలి
- పౌర, ప్రజాస్వామిక, మానవ హక్కులకు భరోసా కల్పించాలి - ‘చలో అసెంబ్లీ’కి అనుమతినివ్వాలి - మానవ హక్కుల వేదిక డిమాండ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పౌర, ప్రజాస్వామిక, మానవ హక్కుల అమలుకు ప్రభుత్వం భరోసానివ్వాలని, రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును గౌరవించాలని మానవ హక్కుల వేదిక ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక నిర్వహించనున్న చలో అసెంబ్లీ కార్యక్రమానికి ప్రభుత్వం మద్దతునివ్వాలని కోరింది. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేసే చర్యల్లో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులకు పాల్పడడాన్ని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.జీవన్‌కుమార్, ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ తీవ్రంగా ఖండించారు. అరెస్టులను వెంటనే నిలిపివేయాలని కోరారు. అరెస్టుల పర్వం నిరంకుశమైన పాలనను తలపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధానపరమైన నిర్ణయంగా కొనసాగిన ఎన్కౌంటర్ హత్యలను విడనాడాలని, రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణానికి, చట్టబద్ధమైన పాలనకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరారు. ఈ మేరకు గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న పోలీస్ ఎన్కౌంటర్లు, నిర్బంధం వల్ల ప్రజలు అనేక కష్టాలను, బాధలను అనుభవించారని కోట్లాది మంది ప్రజల ఆకాంక్షల మేరకు ఆవిర్భవించిన తెలంగాణ రాష్ర్టంలో శాంతియుతమైన, ప్రజాస్వామిక వాతావరణం ఉండేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు మానవ హక్కుల వేదిక రాసిన లేఖలో పలు అంశాలివీ.. - ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమం సందర్భంగా వెలువడిన ప్రజల ఆకాంక్షల్లో ఉమ్మడి రాష్ర్టంలో కొనసాగిన అణచివేత, నిర్బంధం, ఎన్కౌంటర్లు లేని స్వేచ్ఛాయుతమైన వాతావరణం నెలకొనాలని వ్యక్తమైంది. రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన పాలన కొనసాగాలని ప్రజలు ఆకాంక్షించారు. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. - ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎన్కౌంటర్లను ఒక విధానంగా కొనసాగించాయి. చంద్రబాబునాయుడు హయాంలోనే 1,448 మంది ఎన్కౌంటర్ల పేరిట హతమయ్యారు. ఎన్కౌంటర్ హత్యలకు పాల్పడిన పోలీసు అధికారులకు సీనియారిటీతో నిమిత్తం లేకుండా పదోన్నతులు, డబ్బు రూపేణా పారితోషికం అందజేయడం వంటి విధానాలు అమలు చేశారు. - తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన మూడు ఎన్కౌంటర్లలో ఇప్పటి వరకు 8 మంది మరణించారు. పోలీసు లాకప్పుల్లో ఒక దళిత మహిళసహా 6 అనుమానాస్పద లాకప్పు మరణాలు సంభవించాయి. - ఎన్కౌంటర్ హత్యలు తెలంగాణలో ఉండవనే పాలనాపరమైన విధానాన్ని నిర్ధిష్టంగా ప్రకటించాలి. -
‘ఎన్కౌంటర్లు’ లేని తెలంగాణ కావాలి!
అభ్యర్ధన ప్రజల ఆకాంక్షల్లోంచి ఉద్భ వించిన హక్కుల అంశంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఆందోళనను మా ‘‘మానవ హక్కుల వేదిక’’ (హెచ్ఆర్ఎఫ్) బలపరి చింది. ప్రజలతో గొంతు కలిపి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి హక్కుల భాషలో మాట్లాడింది. తెలంగాణ ఉద్యమంపై అమలైన నిర్బంధాన్ని ఎప్పటిక ప్పుడు నిజనిర్ధారణ చేసి ఎలుగెత్తి ఖండించింది. ఆ ఉద్యమం సందర్భంగా వెలువడ్డ ప్రజల ఆకాంక్షల్లో... నక్సలైట్ల అణచివేత కోసం ప్రభుత్వాలు విధానపరంగా ఎంచుకునే పద్ధతుల వల్ల జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన అంశం విస్పష్టంగా వ్యక్తమైంది. నిర్భయం గా, స్వేచ్ఛగా ప్రజలు తమ ప్రాథమిక, పౌర హక్కులను అనుభవించే పరిస్థితులు రాబోయే తెలంగాణ రాష్ట్రంలో నెలకొనాలని ప్రజలు గాఢంగా కాంక్షించారు. ఉద్యమ నాయకులు కూడా అటువంటి వాతావరణం ఏర్పడా ల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అందుకు భరోసా ఇస్తూ మాట్లాడారు. కానీ గతంలో ఉన్న పరిస్థితులే కొన సాగడం, నక్సలైట్లను అణచివేయడానికి ఎన్కౌంటర్ల పద్ధతిని కొనసాగించడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుం ది. ప్రజల ఆకాంక్షలను, మా సంస్థ అభిప్రాయాలను తెలుపుతూ ఈ విషయంపై నిర్దిష్టమైన నిర్ణయాన్ని తీసు కోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ లేఖ రాస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘ఎన్కౌంటర్’ హత్యలు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగా జరి గాయి. బ్రహ్మానందరెడ్డి, వెంగళరావులు సీఎంలుగా ఉన్న పదకొండేళ్లలో 350 మంది నక్సలైట్ కార్యకర్త లను ఎన్కౌంటర్లలో కాల్చివేశారు. 1979-80లో చెన్నా రెడ్డి గారు సీఎంగా ఉండగా ఎన్కౌంటర్లు వద్దని ఆదేశిం చడంతో ఆగిపోయాయి. ఆ తర్వాత అంజయ్య, భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కరరెడ్డి కాలంలో పెద్దగా ఎన్కౌంటర్లు జరగలేదు. ఎన్కౌంటర్లు అసలే ఉండొద్దన్న ఎన్టీఆర్ సీఎంగా ఉండగా కొన్ని మాత్రమే జరిగాయి. 1989లో చెన్నారెడ్డి రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎన్ కౌంటర్లు కూడదనటంతో జరగలేదు. 1992-94 మధ్య సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ఎన్కౌంటర్లు చేయడా నికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో 340 మందిని కాల్చి వేశారు. రెండోసారి ఎన్టీఆర్ తొమ్మిది నెలల పాలన తర్వాత ముఖ్యమంత్రయిన చంద్రబాబు నాయుడు ఎన్ కౌంటర్లను విధానపరంగా పూర్తిగా సమర్థించాడు. ఆయ న పాలించిన 8 సంవత్సరాల 8 నెలల్లో 1,448 మందిని ఎన్కౌంటర్ల పేరుతో కాల్చేశారు. ఈ హత్యాకాండ స్పష్ట మైన ప్రభుత్వ ఆదేశాల మేరకే జరిగింది. ఎన్కౌంటర్ హత్యలు చేసిన పోలీసు అధికార్లకు ప్రమోషన్లు, డబ్బు రూపేణా పారితోషికం ఇచ్చారు. దీంతో పోలీసులు ప్రైవేట్ గ్యాంగులకు ఆయుధాలిచ్చి హక్కుల సంఘం కార్యకర్తలపైన, ప్రజాసంఘాల కార్యకర్తలపైన, వామ పక్ష సానుభూతిపరులపైన దాడులే కాదు, హత్యలు కూడా చేయించారు. ఇవన్నీ పూర్తి చట్టవిరుద్ధంగా, ఒక పాలనా విధానంలో భాగంగా జరిగాయి. ప్రజల హక్కుల, ఆకాంక్షల నేపథ్యంలో ఏర్పడ్డ నూతన తెలంగాణ రాష్ట్రం దాన్ని పాలించే ప్రభుత్వం చట్టబద్ధ పాలనకు, జవాబుదారీ తనానికి కట్టుబడి ఉం డాలని హక్కుల సంఘంగా మేము కాంక్షిస్తున్నాం. చట్ట బద్ధ పాలన ద్వారా మాత్రమే ప్రభుత్వానికి ప్రజలను పాలించే నైతిక సాధికారత లభిస్తుందని మా ప్రగాఢ విశ్వాసం. గత ప్రభుత్వాలు నక్సలైట్ ఉద్యమాన్ని శాంతి భద్రతల సమస్యగానే పరిగణించి నక్సలైట్ కార్య కర్తలను, సానుభూతిపరులను భౌతికంగా నిర్మూ లించడాన్ని ఒక పాలనా విధానంగా అమలు పరచాయి. గత 45 ఏళ్లుగా హక్కుల ఉద్యమం నక్సలైట్ ఉద్యమాన్ని ఒక రాజకీయ ఉద్యమంగానే భావిస్తోంది, అదే ప్రభు త్వాలకూ చెబుతోంది. నక్సలైట్ పార్టీలు హింసకు పాల్ప డినప్పటికీ దానిని రాజకీయ ఉద్యమంగానే చూడాలని ప్రభుత్వాలకి స్పష్టం చేస్తూ వస్తోంది. నక్సలైట్ పార్టీల హింసను చూస్తూ ఊరుకోవాలన్నది మా వైఖరి కాదు. పోలీసులు విధిగా స్పందించాలి. అయితే పోలీసులు చేపట్టే చర్యలేవైనా రాజ్యాంగం నిర్దేశించిన చట్టపరిధిలో ఉండాలి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన మూడు ఎన్ కౌంటర్లలో 8 మంది (రంగారెడ్డి జిల్లాలో పారిపోతు న్నాడన్న నెపంతో నేర చరిత్ర కలిగిన ఒక దొంగ, ఆలేరు ఎన్కౌంటర్లో గొలుసులతో వ్యాన్‌లోని సీట్లకు కట్టేసిన ఐదుగురు ముస్లిం యువకులు, వరంగల్ ఏటూరు నాగారం అడవుల్లో ఒక మహిళ సహా ఇద్దరు మావో యిస్టు కార్యకర్తలు) మరణించారు. పోలీసు లాకప్పుల్లో 6 (ఒక దళిత మహిళ సహా) అనుమానాస్పద మరణాలు జరిగాయి. జాతీయ మానవ హక్కుల సంఘం, రాష్ట్ర హైకోర్టు నిర్దేశించిన సూచనల మేరకు ఎన్కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపై సెక్షన్ 302 ప్రకారం కేసులు పెట్టి, స్వతంత్ర నేర పరిశోధన విభాగం చేత విచారణ సాగిం చడాన్ని ఈ ప్రభుత్వం కూడా చేయడం లేదు. కొత్త రాష్ట్రంలో నక్సలైట్లను అణచివేసే విషయంలో పాత విధానాలే కొనసాగించడం పట్ల హక్కుల సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. ప్రభుత్వం చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉండాలని పౌర, మానవ హక్కులకు భరోసా కల్పిం చాలని మేం కోరుకుంటున్నాం. పైన వివరించిన నేప థ్యం వెలుగులో తెలంగాణ రాష్ట్రంలో ‘‘ఎన్కౌంటర్ హత్యల ప్రక్రియ’’ఉండదనే పాలనాపరమైన విధానాన్ని నిర్దిష్టంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. - వి.ఎస్.కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎన్.జీవన్‌కుమార్, అధ్యక్షులు, మానవ హక్కుల వేదిక -
హక్కుల తాత్వికుడు
బాలగోపాల్ కన్ను మూసి నేటికి ఐదేళ్లు ఇటీవల హైదరాబాద్‌లో బాలగోపాల్ సంస్మరణపై మానవ హక్కుల వేదిక సద స్సు నిర్వహించింది. దాంట్లో పాల్గొన్న ఇద్ద రు వక్తలు ఆయన కార్యాచరణపై రెండు విలువైన వ్యాఖ్యలు చేశారు. హక్కుల ఉద్య మాన్ని బాలగోపాల్ ఉద్యమంలోకి రాకముం దు, వచ్చిన తర్వాత వేరువేరుగా అంచనా వేయవలసి ఉంటుందని ఢిల్లీ యూనివర్సిటీ విశ్రాంత రాజకీయ ఆచార్యులు ప్రొ॥అచన్ వనాయక్ అభిప్రాయపడ్డారు. బాలగోపాల్ హక్కుల ఉద్యమంలోకి వచ్చిన తర్వాతే దళితు లపై సామూహిక వివక్ష, దాడులు, అత్యాచార అంశాలు మానవ హక్కుల ఉల్లంఘన పరిధి లోకి తేబడ్డాయని.. చుండూరు ప్రత్యేక కోర్టు లో, తర్వాత హైకోర్టులో వాదనలు వినిపించిన దళిత న్యాయవాది శివనాగేశ్వరరావు చెప్పారు. ఈ వ్యాఖ్యలను వివరంగా విశ్లేషించుకుంటే తప్ప హక్కుల తాత్విక ధోరణిని బాలగోపాల్ విస్తృతపరచిన వైనం అర్థం కాదు.1993లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం (ఏపీసీఎల్సీ) రాష్ట్ర మహాసభల్లో, సంస్థ లక్ష్య ప్రకటనలో మార్పులపై బాలగో పాల్ ప్రవేశపెట్టిన కార్యదర్శి నివే దిక, హక్కుల తాత్విక ధోరణిలో మైలురాయి. కారంచేడు మారణ కాండ నుంచి మౌలికమైన వాస్త వాన్ని మనం నేర్చుకోవాలని ఆయన సూచించారు, వ్యవస్థాగత మైన అణచివేత కేవలం భూ స్వామ్య, పెట్టుబడిదారీ ఆధిప త్యంలోనూ, వాటిని కాపాడే రాజ్య హింసలోనూ లేదనీ, పౌర సమాజం లేక సభ్య సమాజం అని పిలిచే రాజ్యేతర సామాజిక వ్యవ స్థలోనూ అది ఉందనీ స్పష్టం చేశారు. భార తీయ సమాజంలో కులం అణచివేత ప్రధాన రూపాలలో ఒకటని, అధిక భాగం మనుషు లకు, జీవన ప్రమాణాలను జీవిత అవకాశా లనూ నిరాకరించడమే కాకుండా నిండైన మనుషులుగా ఎదిగే అవకా శాన్ని కూడా కుల వ్యవస్థ ప్రజలకు లేకుండా చేసిందనే సత్యాన్ని ఆయన ప్రకటించారు. కాని బాలగోపాల్ హక్కుల రంగంలోకి వచ్చే వరకు వ్యవ స్థీకృత ఆధిపత్యం వల్ల జరిగే హక్కుల ఉల్లంఘనపై పెద్దగా చర్చ జరగలేదు, ఆ ఉల్లంఘనలు విపులీకరించే ప్రయత్నం జరగ లేదు. వివిధ ప్రకృతి వనరుల మీద, జీవనాధారమైన ప్రకృతి సం పదపైన ప్రజలకు ఉన్న సంప్రదాయ హక్కులకు శాసన రూపం ఇవ్వడానికి హక్కుల సం ఘాలు కృషి చేయవలసిన తరుణంలోనే, రాష్ట్రం లో నూతన ఆర్థిక విధానాలు అమలు లోకి వచ్చాయి. ఇది విధ్వంసకర అభివృద్ధి అని నిర్వ చించాడు. సెజ్‌ల వల్ల, భారీ ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులయ్యే ప్రజల స్థితిని అన్యాయమైన ‘‘విస్తాపన’’గా పేర్కొన్నాడు. మానవ హక్కుల చట్రం పరిధిని విశాలం చేసుకున్న క్రమంలో ఆయన దేశంలో, సమా జంలో ఇంత వరకు ఎవరూ స్పృశించని రం గాలను కూడా విశ్లేషించి కార్యాచరణకు పుర మాయించాడు. ప్రతి చిన్న ఆందోళనను, సంఘటనను హక్కుల కోణంలో చూడటం ప్రారంభించాడు. ‘ప్రజాతంత్ర’ పత్రికలో రాసిన 333 వ్యాసాలతోపాటు ఆయన చేసిన ఇతర రచనల్లో అతి మామూలు అంశం అయిన జేబు దొంగల నుంచి కాశ్మీర్ సమస్య వరకు, అతి చిన్న సంఘటనలో కూడా బీజరూపంలో ఉండే నైతిక విలువను హక్కుల కోణాన్ని చూపెట్టారు. హక్కుల ఉద్యమం సమానత్వాన్ని సహజమైన భావనగా స్వీకరించి, సూత్ర ప్రాయంగా హక్కులంటేనే సమానత్వం అనే భావనతో ముందుకుపోవాలి అంటాడు. హక్కుల ఉద్యమ అవగాహనను పొరలు పొర లుగా విడదీసి అందులో రాజకీయ ఉద్యమాల అవసరాల నుంచి ప్రజాతంత్ర విలువలను వేరుచేసి చూపారు. హక్కుల ఉద్యమానికి సొం త అస్థిత్వం, అవగాహన, విశాల ప్రాపంచిక దృక్ఫథం ఉండవలసిన అవసరాన్ని స్పష్టంగా చూపెట్టి, కార్యాచరణలో ఈ అవగాహనను పరీక్షకు పెట్టి మనందరకు చూపెట్టిన హక్కుల తాత్వికుడు మానవీయ విలువల పరిమళాలను వెదజల్లిన మనిషి బాలగోపాల్. (వ్యాసకర్త మానవ హక్కుల కార్యకర్త) - ఎస్.జీవన్‌కుమార్ -
హిందుత్వ రాజకీయాలతో లౌకికవాదానికి విఘాతం
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ముస్లింల పట్ల తరతరాలుగా కొనసాగుతున్న వివక్షకు తోడు.. హిందుత్వ రాజకీయాలతో లౌకిక వాదానికి విఘాతం కలిగే అవకాశముం దని ప్రముఖ జర్నలిస్టు, రచయిత ఏఎం.ఎజ్దానీ(డానీ) అన్నారు. మానవహక్కుల నేత దివంగత డాక్టర్ బాలగోపాల్ రాసిన ‘ముస్లింల ఐడెంటిటీ-హిందుత్వ రాజకీయా లు’ పుస్తక పరిచయ సభ హన్మకొండలోని ఆర్ట్స కళాశాల సెమినార్ హాల్లో ఆదివారం జరిగింది. మానవ హక్కుల వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సభలో డానీ ముఖ్యవక్తగా మాట్లాడుతూ ప్రపంచానికి సమానత్వాన్ని చాటిచెప్పిన ఇస్లాం మతాన్ని ఆదరించాల్సింది పోయి హిందుత్వం పేరుతో రాజకీయాలు చేస్తున్న వారు ముస్లింలను అసాంఘిక శక్తులుగా పేర్కొనడం బాధాకరమన్నారు. బీజేపీ ప్రచారం చేస్తున్నట్లు గుజరాత్లో అంతగా అభివృద్ధి జరగలేదన్నారు. ఇక్కడ చంద్రబాబు సీఎంగాఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశానని చెప్పినా.. ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఏమిటో గుర్తించాలన్నారు. బీజేపీ వైఖరి సిగ్గుచేటు 2002 సంవత్సరంలో నరేంద్రమోడీ సీఎంగా ఉన్నప్పుడే గోద్రా ఘటన జరిగినా ఆయననే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం గర్హనీయమని మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి వీఎస్.కృష్ణ అన్నారు. ప్రముఖ కవి, రచయిత సిరాజుద్దీన్ మాట్లాడుతూ తీవ్రవాదులందరూ ముస్లింలు కాదని, ఈ విషయాన్ని గుర్తించి ముస్లింలు అన్ని రంగాల్లో ఎదిగేలా ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. సమావేశంలో దళితరత్న బొమ్మల కట్టయ్య, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షురాలు కందాల శోభారాణి, జిల్లా ప్రధా న కార్యదర్శి బాదావత్ రాజు, బాధ్యులు డాక్టర్ సాదు రాజేష్, పాలకుర్తి సత్యం, వెంకటనారాయణ, బండి కోటి, యాదగిరి, దాడబోయిన రంజిత, బీరం రాము, ప్రకాష్, రవీందర్, సాహితి పాల్గొన్నారు. ఈ సదస్సులో తొలుత ‘ముస్లింల ఐడెంటిటీ-హిందుత్వ రాజకీయాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.