హక్కుల తాత్వికుడు
బాలగోపాల్ కన్ను మూసి నేటికి ఐదేళ్లు
ఇటీవల హైదరాబాద్‌లో బాలగోపాల్ సంస్మరణపై మానవ హక్కుల వేదిక సద స్సు నిర్వహించింది. దాంట్లో పాల్గొన్న ఇద్ద రు వక్తలు ఆయన కార్యాచరణపై రెండు విలువైన వ్యాఖ్యలు చేశారు. హక్కుల ఉద్య మాన్ని బాలగోపాల్ ఉద్యమంలోకి రాకముం దు, వచ్చిన తర్వాత వేరువేరుగా అంచనా వేయవలసి ఉంటుందని ఢిల్లీ యూనివర్సిటీ విశ్రాంత రాజకీయ ఆచార్యులు ప్రొ॥అచన్ వనాయక్ అభిప్రాయపడ్డారు. బాలగోపాల్ హక్కుల ఉద్యమంలోకి వచ్చిన తర్వాతే దళితు లపై సామూహిక వివక్ష, దాడులు, అత్యాచార అంశాలు మానవ హక్కుల ఉల్లంఘన పరిధి లోకి తేబడ్డాయని.. చుండూరు ప్రత్యేక కోర్టు లో, తర్వాత హైకోర్టులో వాదనలు వినిపించిన దళిత న్యాయవాది శివనాగేశ్వరరావు చెప్పారు.
ఈ వ్యాఖ్యలను వివరంగా విశ్లేషించుకుంటే తప్ప హక్కుల తాత్విక ధోరణిని బాలగోపాల్ విస్తృతపరచిన వైనం అర్థం కాదు.1993లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం (ఏపీసీఎల్‌సీ) రాష్ట్ర మహాసభల్లో, సంస్థ లక్ష్య ప్రకటనలో మార్పులపై బాలగో పాల్ ప్రవేశపెట్టిన కార్యదర్శి నివే దిక, హక్కుల తాత్విక ధోరణిలో మైలురాయి. కారంచేడు మారణ కాండ నుంచి మౌలికమైన వాస్త వాన్ని మనం నేర్చుకోవాలని ఆయన సూచించారు, వ్యవస్థాగత మైన అణచివేత కేవలం భూ స్వామ్య, పెట్టుబడిదారీ ఆధిప త్యంలోనూ, వాటిని కాపాడే రాజ్య హింసలోనూ లేదనీ, పౌర సమాజం లేక సభ్య సమాజం అని పిలిచే రాజ్యేతర సామాజిక వ్యవ స్థలోనూ అది ఉందనీ స్పష్టం చేశారు. భార తీయ సమాజంలో కులం అణచివేత ప్రధాన రూపాలలో ఒకటని, అధిక భాగం మనుషు లకు, జీవన ప్రమాణాలను జీవిత అవకాశా లనూ నిరాకరించడమే కాకుండా నిండైన మనుషులుగా ఎదిగే అవకా శాన్ని కూడా కుల వ్యవస్థ ప్రజలకు లేకుండా చేసిందనే సత్యాన్ని ఆయన ప్రకటించారు.
కాని బాలగోపాల్ హక్కుల రంగంలోకి వచ్చే వరకు వ్యవ స్థీకృత ఆధిపత్యం వల్ల జరిగే హక్కుల ఉల్లంఘనపై పెద్దగా చర్చ జరగలేదు, ఆ ఉల్లంఘనలు విపులీకరించే ప్రయత్నం జరగ లేదు. వివిధ ప్రకృతి వనరుల మీద, జీవనాధారమైన ప్రకృతి సం పదపైన ప్రజలకు ఉన్న సంప్రదాయ హక్కులకు శాసన రూపం ఇవ్వడానికి హక్కుల సం ఘాలు కృషి చేయవలసిన తరుణంలోనే, రాష్ట్రం లో నూతన ఆర్థిక విధానాలు అమలు లోకి వచ్చాయి. ఇది విధ్వంసకర అభివృద్ధి అని నిర్వ చించాడు. సెజ్‌ల వల్ల, భారీ ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులయ్యే ప్రజల స్థితిని అన్యాయమైన ‘‘విస్తాపన’’గా పేర్కొన్నాడు.
మానవ హక్కుల చట్రం పరిధిని విశాలం చేసుకున్న క్రమంలో ఆయన దేశంలో, సమా జంలో ఇంత వరకు ఎవరూ స్పృశించని రం గాలను కూడా విశ్లేషించి కార్యాచరణకు పుర మాయించాడు. ప్రతి చిన్న ఆందోళనను, సంఘటనను హక్కుల కోణంలో చూడటం ప్రారంభించాడు. ‘ప్రజాతంత్ర’ పత్రికలో రాసిన 333 వ్యాసాలతోపాటు ఆయన చేసిన ఇతర రచనల్లో అతి మామూలు అంశం అయిన జేబు దొంగల నుంచి కాశ్మీర్ సమస్య వరకు, అతి చిన్న సంఘటనలో కూడా బీజరూపంలో ఉండే నైతిక విలువను హక్కుల కోణాన్ని చూపెట్టారు.
హక్కుల ఉద్యమం సమానత్వాన్ని సహజమైన భావనగా స్వీకరించి, సూత్ర ప్రాయంగా హక్కులంటేనే సమానత్వం అనే భావనతో ముందుకుపోవాలి అంటాడు. హక్కుల ఉద్యమ అవగాహనను పొరలు పొర లుగా విడదీసి అందులో రాజకీయ ఉద్యమాల అవసరాల నుంచి ప్రజాతంత్ర విలువలను వేరుచేసి చూపారు. హక్కుల ఉద్యమానికి సొం త అస్థిత్వం, అవగాహన, విశాల ప్రాపంచిక దృక్ఫథం ఉండవలసిన అవసరాన్ని స్పష్టంగా చూపెట్టి, కార్యాచరణలో ఈ అవగాహనను పరీక్షకు పెట్టి మనందరకు చూపెట్టిన హక్కుల తాత్వికుడు మానవీయ విలువల పరిమళాలను వెదజల్లిన మనిషి బాలగోపాల్.
(వ్యాసకర్త మానవ హక్కుల కార్యకర్త)
- ఎస్.జీవన్‌కుమార్