అసాధారణ మేధస్సు, నిరంతర అధ్యయనం, విస్తృత విషయ పరిజ్ఞానం, వాగ్ధాటి, రచనా కౌశలం, ఆత్మీయత, ఆచరణశీలత, నిబద్ధత, నిమగ్నత, కార్యదీక్ష, అంకితభావం, మానవీయతా సుగుణం వంటి లక్షణాలన్నింటినీ తనలో మూర్తీభవింపజేసుకున్న అపురూప మేధావి బాలగోపాల్. కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా తలెత్తిన హక్కుల ఉల్లంఘనలపై ఆయన ఉద్యమించారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హక్కుల ఉద్యమాలకు ఆయన దశ–దిశని నిర్దేశించి వెన్నుదన్నుగా నిలిచారు.
బాలగోపాల్ మధ్య తరగతి పండిత కుటుంబంలో 1952, జూన్ 10 నాడు నాగమణి, పార్థనాథశర్మ దంపతులకు జన్మించారు. అయినా ఆయన నిరంతరం పేద, దళిత, గిరిజన, మైనారిటీ, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. ఆయన గణితశాస్త్ర విద్యార్థి అయినా... చరిత్ర, తత్వశాస్త్రం, అర్థశాస్త్రాలను విస్తృతంగా అధ్యయనం చేసి సమాజ పోకడలను సునిశితంగా పరిశీలించారు. రాజ్యాంగంలో హక్కుల అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నా నిరంకుశ ప్రభుత్వాల అణచివేత విధానాల వల్ల పౌరులు ఆయా హక్కులు పొందలేకపోవడాన్ని చూసి చలించిపోయారు.
బాలగోపాల్ వరంగల్‌లోని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎమ్మెస్సీ అప్లైడ్ మాథ్స్‌ని అభ్యసించి అక్కడే డాక్టరేట్ చేస్తున్న క్రమంలో రాడికల్ విద్యార్థి సంఘం కార్యకలాపాలను చూస్తూ వాటికి ప్రభావితులయ్యారు. కమ్యూనిస్టులు వాస్తవాన్ని అతిశయం చేసి చెప్తారని మొదట్లో నమ్మిన బాలగోపాల్... కమ్యూనిస్టులు తమ విశ్వాసాల కోసం ప్రాణాలు పణంగా పెట్టడాన్ని గమనించి ముఖ్యంగా విప్లవ కమ్యూనిస్టుల పట్ల తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నారు. రాడికల్ విద్యార్థి సంఘం నాయకులు సూరపనేని జనార్ధన్ ఎన్‌కౌంటర్, జన్ను చిన్నాలు హత్యా సంఘటనల తర్వాత ప్రజల కోసం ఒక క్రియాశీల కార్యకర్తగా పనిచేయాలని బాలగోపాల్ బలంగా నిర్ణయించుకొని 1981లో ‘ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం’లో చేరారు.
వరంగల్ రాజకీయ పరిస్థితులు లెక్కల మేధావిగా ఉన్న బాలగోపాల్‌ని హక్కుల కార్యకర్తగా తీర్చిదిద్దాయి. 1983లో ఖమ్మంలో జరిగిన పౌర హక్కుల సంఘం రాష్ట్ర రెండవ మహాసభలో ఆయన ఆ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో తాను చేస్తున్న గణితశాస్త్ర అధ్యాపక ఉద్యోగం ఉద్యమాలకు అడ్డు రావడంతో ఆ ఉద్యోగాన్ని సైతం తృణీకరించి పూర్తికాలపు హక్కుల కార్యకర్తగా మారారు. బాలగోపాల్ పౌర హక్కుల సంఘంలో గుణాత్మక మార్పులు తీసుకువచ్చి హక్కుల ఉద్యమంలో నూతన ఒరవడితో ఉద్యమించారు. కానీ కాల క్రమంలో తానే తీర్చిదిద్దిన పౌర హక్కుల సంఘం నుండి ఆయన వైదొలిగి 1998, అక్టోబర్ 11 నాడు ‘మానవ హక్కుల వేదిక’ను స్థాపించారు.
బాలగోపాల్ పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్న సమయంలో బెంగళూర్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న వివేకానంద న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ డిగ్రీని అభ్యసించారు. 1997లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా తన పేరుని నమోదు చేయించుకున్నారు. ఆయన న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించక పూర్వమే చట్టాలు, న్యాయశాస్త్రంలో ఉన్న ఆనుపానులు, తర్కాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోవడం వల్ల... పెద్దగా సీనియర్ న్యాయవాదుల అవసరం రాలేదు. కాని చట్టం పని విధానంలో ముందుకు వెళ్తున్నప్పుడు ప్రొసీజర్ విధానంలో ఆయన సీనియర్ న్యాయవాది కేజీ కన్నాభిరాన్ దగ్గర సలహాలు తీసుకొని ఆ ప్రకారం ముందుకు సాగారు.
బాలగోపాల్ ప్రధానంగా హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులలో బాధితుల పక్షం నిలబడి చట్ట ఫలితాలను వారికి అందించారు. దళితులు, గిరిజనులు, కార్మికులు, ఉద్యోగులు, భూవివాదాలకు సంబంధించిన అన్ని కేసులను ఆయన వాదించారు. అలాగే లేబర్ కోర్ట్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటిటివ్ ట్రిబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటిటివ్ ట్రిబ్యునల్, లేబర్ కమిషన్ ఆఫీసుల కేసులను కూడా ఆయన వాదించారు. నక్సలైట్లకు సంబంధించి అనేక హెబియస్ కార్పస్ పిటిషన్లను వేసి సబంధిత వ్యక్తులను కోర్టులకు హాజరుపరిచేలా నిరంతర కృషి చేశారు.
చుండూరు హత్యాకాండ కేసులో బాలగోపాల్ బాధిత దళితులకు అండగా నిలబడి హైకోర్టులో అత్యున్నత వాదనలు వినిపించి దళిత హక్కులకు బాసటగా నడిచారు. అదేవిధంగా ‘షెడ్యూల్డ్ ట్రైబల్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్’ని అమలు చేయడం కోసం గిరిజనులు చేసిన పోరాటానికి ఆయన బాసటగా నిలిచారు. కోర్టులో ఆ చట్టాన్ని గెలిపించడంలో అసామాన్యమైన కృషి చేశారు. ఈ చట్టం ద్వారా గిరిజనులకు 2009లో భూములు పంచబడ్డాయి.
బాలగోపాల్ చేపట్టిన ముఖ్యమైన కేసులలో అత్యంత ముఖ్యమైన కేసు ఎన్‌కౌంటర్‌ల కేసు. ‘పోలీసులకు ప్రాణం తీసే హక్కు లేదనీ, పోలీసులు ఎన్‌కౌంటర్‌ల నుండి తప్పించుకోవడానికి వీలు లేదనీ, పోలీసులపై కూడా హత్యాచారం కింద కేసులు పెట్టవచ్చ’నీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఆయన బలమైన వాదనలు వినిపించి ‘పోలీసులపై కూడా న్యాయ విచారణని జరిపించాలి’ అనే తీర్పుని తీసుకురాగలిగారు. ఆ తీర్పు రావడం వెనకాల బాలగోపాల్ 30 ఏళ్ల నిర్విరామ కృషి ఉంది. అనేక హక్కుల సంఘాలు మిళితమైన ఈ కేసులో బాలగోపాల్‌తో పాటు కేజీ కన్నాభిరాన్, బొజ్జా తారకం తదితరులు తమ వాదనలు వినిపించారు. (క్లిక్ చేయండి: వికేంద్రీకరణతోనే సమన్యాయం)
హక్కుల నిరాదరణకు గురైనప్పుడు ప్రజలు చైతన్యంతో గొంతెత్తి ప్రశ్నిస్తే హక్కులు అమలు కాబడుతాయని బాలగోపాల్ విశ్వసించారు. ప్రజా హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న ఆయన 2009, అక్టోబర్ 8 నాడు తుది శ్వాస విడిచినా ‘చెరగని హక్కుల స్ఫూర్తి’గా వెలుగొందుతున్నారు. (క్లిక్ చేయండి: మంచి అడుగే... మార్పులు అవసరం)
- జె.జె.సి.పి. బాబూరావు
పరిశోధక విద్యార్థి
(అక్టోబర్ 8న కె.బాలగోపాల్ వర్ధంతి)
Comments
Please login to add a commentAdd a comment