దేశ చరిత్రలో 1975లో విధించిన ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం. ఆ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులను వాదించడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో రాజ్యానికి వ్యతిరేకంగా ధిక్కారస్వరం వినిపించారు న్యాయవాది కేజీ కన్నాభిరాన్. డా. బీఆర్ అంబేడ్కర్ దేశ పౌరులకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులను ప్రభుత్వాలు హననం చేస్తుంటే ప్రతిఘటించారాయన. భూమి కోసం, భుక్తి కోసం, న్యాయం కోసం ప్రజల తరపున పోరాడుతున్న వారి ఇళ్లపై దాడులు చేస్తూ రాత్రికి రాత్రే మాయం చేసి, ఎదురు కాల్పుల పేరుతో కాల్చి చంపారు. తూటాలతో, లాఠీలతో, పౌర హక్కుల పోరాటవీరుల సమూహాలపై దాడులు చేసి, భయానక వాతావరణం సృష్టించారు. ఆ నిరంకుశత్వాన్ని నిరసించి, ప్రజల పక్షాన పోరాడిన హక్కుల యోధుడు.
సింగరేణి కార్మికుల పోరాట, ఆరాటాలలో కూడా వారికి మద్దతు పలికిన కార్మిక పక్షపాతి. పౌరహక్కుల ఉద్యమనేత, అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో వకీలు, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీ సంస్థకు సహ వ్యవస్థాపకుడు. కొంతకాలం ఆ సంస్థ అధ్యక్షుడిగా కూడా కన్నాభిరాన్ పనిచేశారు. 1970 ప్రాంతంలో చట్టబద్ధ హక్కుల కోసం పోరాడుతున్నవారిపై ప్రభుత్వం తీవ్ర నిర్బంధం కొనసాగిస్తున్నపుడు న్యాయవాదులందరూ కలసి నక్సలైట్ డిఫెన్స్ క్సౌన్సిల్‌ను ఏర్పాటు చేసి, ఆ సంస్థకు ఆయనను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.
హైదరాబాద్, పార్వతీపురం కుట్ర కేసులలో డిఫెన్స్ న్యాయవాదిగా పనిచేశారు. ఎమర్జెన్సీ కాలంలో తప్పుడు కేసుల పాలైన వారి తరపున వాదించిన ఏకైక న్యాయవాది ఆయనే. పీడితులు, కార్మికులు, హక్కులు, పోరాటాలకు ఆయన ఎప్పుడూ అండగా నిలిచేవారు. పౌరుల జీవించే హక్కుల కోసం కన్నాభిరాన్ జీవితాన్ని అంకితం చేశారు. నవంబర్ 9, 1929న మదురైలో జన్మించిన ఆయన 2010 డిసెంబర్ 30న హైదరాబాద్‌లో తనువు చాలించారు.
– డా. ఎస్. బాబూరావు, సీనియర్ జర్నలిస్ట్
(డిసెంబర్ 30న కన్నాభిరాన్ వర్ధంతి)
Comments
Please login to add a commentAdd a comment