
కథ కొత్త మలుపులు తిరిగినట్టే, కేరళ ప్రభుత్వానికీ, ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌కూ మధ్య వరుస వివాదాల్లో కొత్త అంకం వచ్చి చేరింది. కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్. బాలగోపాల్‌పై తాను విశ్వాసాన్ని కోల్పోయాననీ, ఆయనపై చర్య తీసుకోవాలనీ ముఖ్యమంత్రిని గవర్నర్ కోరడం దిగ్భ్రాంతికరం. నిన్న గాక మొన్న 11 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లపై కినిసిన మహాప్రభువులకు ఇప్పుడు మంత్రి గారిపై విరక్తి కలిగింది. దానికి ఆయన కారణాలు ఆయనకున్నాయి.
దేశ సమైక్యతకు భంగం కలిగేలా మంత్రి మాట్లాడారనీ, పదవీ ప్రమాణాన్ని ఉల్లంఘించారనీ, కడకు గవర్నర్‌గా తన విశ్వాసాన్ని మంత్రి కోల్పోయారనీ... ఆరిఫ్ ఆరోపణ. అధికార ఎల్డీఎఫ్ సర్కార్ సారథి పినరయ్ విజయన్ మాత్రం సదరు మంత్రిపై తనకు పూర్తి విశ్వాసం ఉందంటూ, గవర్నర్ డిమాండ్‌ను తోసిపుచ్చాల్సి వచ్చింది. గవర్నర్ చర్యను తప్పుబడుతూ అధికార, ప్రతిపక్షాలు ఒకే స్వరం వినిపిస్తున్నాయంటే ఆరిఫ్ గీత దాటేశారని అర్థమవుతోంది. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలకూ, రాజ్‌భవన్‌కూ పెరుగుతున్న దూరంపై అర్థవంతమైన చర్చ అవసరమని గుర్తుచేస్తోంది.
కేరళలో తలుచుకుంటే మంత్రులను సైతం ఇంటికి పంపే అధికారం తనకు ఉందని కొద్దివారాల క్రితం రాష్ట్రపెద్ద హూంకరించారు. ఆ వివాదం సద్దుమణగక ముందే సుప్రీమ్ కోర్ట్ ఓ నియామకంలో ఇచ్చిన ఉత్తర్వును సాకుగా తీసుకొని, 11 విశ్వవిద్యాలయాల వీసీల నియామక ప్రక్రియను తప్పు పడుతూ, తప్పుకోవాల్సిందిగా ఆదేశించారు. అదీ అవాంఛనీయంగా ట్విట్టర్‌లో చెప్పారు. హైకోర్ట్ జోక్యంతో ఆ కథలో కొత్త దృశ్యం నవంబర్ మొదటి వారానికి వాయిదా పడిందో లేదో, ఓ విశ్వ విద్యాలయంలో ఆర్థిక మంత్రి ప్రసంగాన్ని తప్పుబడుతూ ఆరిఫ్ కొరడా తీశారు.
అన్ని ప్రాంతాల వారినీ కలుపుకొనిపోతూ కేరళ విశ్వవిద్యాలయాలు ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నాయని మంత్రి గత వారం అన్నారు. విద్యార్థి నేతగా యూపీలోని విశ్వవిద్యాలయంలో చూసిన కాల్పుల ఘటనల్ని ప్రస్తావించారు. అది ఆరిఫ్‌కు సుతరామూ నచ్చినట్టు లేదు. దాంతో పరోక్షంగా పదవీచ్యుతుణ్ణి చేయమనే ప్రతిపాదన తెచ్చారనుకోవాలి. వరస చూస్తే– కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియుక్తులైన గవర్నర్, కేరళలో ప్రజలెన్నుకున్న వామపక్ష ప్రభుత్వంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారనిపిస్తుంది.
అలాగని కొన్నిసార్లు ప్రజాప్రభుత్వాలు గవర్నర్ గౌరవాన్ని మరీ తేలికగా తీసుకున్న ఘటనలూ లేవనీ అనలేం. వీసీల నియామకంలో గవర్నర్ అధికారాలకు కత్తెర వేస్తూ వివాదాస్పద విద్యాబిల్లు తెచ్చినప్పటి నుంచి కేరళ సర్కార్‌కూ, ఆరిఫ్‌కూ మధ్య అగాధం ఏర్పడినట్టుంది. నిజానికి వీసీలు సహా వివిధ నియామకాల్లో లాంఛనపూర్వక పాత్ర పోషించాల్సిన గవర్నర్లు లక్ష్మణరేఖ దాటుతున్నా రనే ఆరోపణ తరచూ వింటున్నాం. గవర్నర్ పాత్రను మరింత పరిమితం చేసేందుకు ఆ మధ్య తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లోనూ ప్రయత్నాలు సాగడం గమనార్హం.
రాజ్యాంగబద్ధమైన ఉన్నత నియామక పదవుల్లో ఉన్నవారు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కనీసం ఉన్నట్టయినా కనిపించాలి. అలాంటిది... కూర్చున్న కుర్చీని మర్చిపోయి, ఆ పదవికి కారణమైనవారి పట్ల మునుపటి ప్రభుభక్తిని ప్రదర్శించాలనుకుంటేనే సమస్య. గవర్నర్ పదవిలో రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలను మించి వ్యక్తిగత అజెండాకు తగ్గట్టు ప్రవర్తిద్దామనీ, ఆభిజాత్యం ప్రదర్శిద్దామనీ అనుకుంటే పదే పదే అగ్గి రాజుకుంటుంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ, పుదుచ్చేరి, తెలంగాణ రాష్ట్రాలు సహా ఇప్పుడు కేరళలోనూ జరుగుతోంది అదే.
ఒకప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ సారథ్య ప్రభుత్వాలున్నప్పుడు పలు రాష్ట్రాల గవర్నర్లు ఇలాగే నాటి ప్రధానమంత్రుల చిత్తానుసారం వ్యవహరించేవారనే విమర్శలున్నాయి. అప్పట్లో వివిధ సందర్భాల్లో పలు రాష్ట్ర ప్రభుత్వాల రద్దు, ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధింపు ఇలాంటి ప్రభుభక్తి పరాయణత పర్యవసానమే. తెలుగునాట ప్రజాబలంతో గద్దెనెక్కిన ఎన్టీఆర్‌ను గవర్నర్ రామ్‌లాల్ పక్కకు తప్పించడం, ప్రజా ఉద్యమంతో ఎన్టీఆర్ తిరిగి పగ్గాలు చేపట్టడం, రామ్‌లాల్ కథ కంచికి చేరడం లాంటివన్నీ చరిత్రలో మర్చిపోలేని పాఠాలు.
తమిళనాట గవర్నర్ చెన్నారెడ్డి వర్సెస్ సీఎం జయలలిత లాంటి కథలూ చూశాం. తాజాగా వివిధ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు కయ్యానికి కాలు దువ్వుతున్న తీరు అంతకన్నా ఒక మెట్టు పైనే ఉంది. పైకి ఇది సీఎంలకూ, గవర్నర్లకూ మధ్య కయ్యంగా కనిపించినా, అంతకన్నా లోతైన రాజకీయమే ఉంది. కేంద్ర పెద్దల ఆదేశంతో వీరిలా చేస్తున్నారో లేదో కానీ, అండ లేకుండానే ఈ దుస్సాహసాలకు దిగుతారనుకోలేం.
రాష్ట్రం చేసే చట్టాలు, నియామకాలపై అభ్యంతరాలుంటే పునఃపరిశీలన కోరే అధికారం రాజ్యాంగం గవర్నర్లకిచ్చింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అంతకు మించి ఆ విచక్షణాధికారాల్ని ఉపయోగించే ప్రయత్నాలతోనే తంటా. అందుకే, కొందరు గవర్నర్ల తీరు మొత్తం ఆ వ్యవస్థకే అప్రతిష్ఠ తెస్తోంది. సమాఖ్య వ్యవస్థలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలనూ, వాటి నిర్ణయాలనూ పరి హాసం చేస్తున్న గవర్నర్ వ్యవస్థపై చర్చను ప్రేరేపిస్తోంది.
ఇటు ప్రజాతీర్పుతో గద్దెనెక్కినవారు, అటు రాజ్యాంగ పదవిలో ఉన్నవారు తమ హక్కులు, బాధ్యతల్ని గుర్తెరిగి ప్రవర్తిస్తే వ్యవహారం ఇంత దూరం రాదు. మరీ ముఖ్యంగా, ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి నుంచి ఆ హుందాతనం మరింతగా ఆశిస్తాం. ఆ సంగతి ఆరిఫ్ లాంటి వారికి పదే పదే గుర్తుచేయాల్సి రావడమే విచారకరం. నిలువునా చీలిన నేటి రాజకీయ వాతావరణంలో ఈ పరిస్థితి మారుతుందా అన్నది అనుమానమే!
Comments
Please login to add a commentAdd a comment