
తిరువనంతపురం: కేరళలో ఇద్దరు ఐఏఎస్ అధికారులపై వేటుపండింది. క్రమశిక్షణ ఉల్లంఘన కారణంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం సోమవారం ఇద్దరు ఐఏఎస్ అధికారులు కె గోపాలకృష్ణన్, ఎన్ ప్రశాంత్‌లను సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
మత ఆధారిత ప్రభుత్వ అధికారుల వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసినందుకు ఐఏఎస్ గోపాలకృష్ణను సస్పెండ్ చేయగా, సోషల్ మీడియాలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని విమర్శించినందుకు ఐఏఎస్ ప్రశాంత్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌కు ‘‘కలెక్టర్ బ్రో’’గా సోషల్ మీడియాలో పాపులారిటీ ఉంది. అయితే.. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అధికారులను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు.. తన మొబైల్ ఫోన్‌ను గుర్తుతెలియని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారని ఐఏఎస్ అధికారి కె. గోపాల్‌కృష్ణన్ అన్నారు. తన అనుమతి లేకుండా మతపరమైన వాట్సాప్ గ్రూపులను సృష్టించారని ఐఏఎస్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఐఏఎస్ అధికారి వాదనలను పోలీసు దర్యాప్తు అధికారి తోసిపుచ్చారు. ఆయన ఫోన్ హ్యాక్ చేయబడిందని తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ పరీక్ష కోసం పరికరాన్ని సమర్పించే ముందు గోపాలకృష్ణన్ మొబైల్ ఫోన్‌ను చాలాసార్లు రీసెట్ చేసినట్లు పోలీసులు వెల్లడించినట్లు తెలిపారు.