తిరువనంతపురం: కేరళలోని ఎన్‌సీపీ (శరద్)కి చెందిన ఏకైక ఎమ్మెల్యే థామస్ కె.థామస్ అధికార ఎల్డీఎఫ్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వజూపారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జనాధిపత్య కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆంటోనీ రాజు, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ(లెనినిస్ట్) ఎమ్మెల్యే కొవూర్ కుంజుమోన్‌లకు థామస్ ఈ ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. ఈ రెండు పార్టీలు ఎల్డీఎఫ్‌లో భాగస్వాములు.
ప్రతిగా ఈ ఎమ్మెల్యేలిద్దరూ ఎన్‌సీపీ(అజిత్)లో చేరడం, పినరయి విజయన్‌పై ఒత్తిడి తెచ్చి కేబినెట్‌లో స్థానం దక్కించుకునేందుకు పథక రచన జరిగిందని ఆరోపణలున్నాయి. జూన్ 5న థామస్ నుంచి ఈ మేరకు తమకు ప్రతిపాదన వచి్చందని మాజీ మంత్రి కూడా అయిన రాజు సీఎం విజయన్ చెవిన వేశారు. దీనిపై ఆయన కుంజుమోన్‌ను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదంటూ కొట్టిపారేశారు.
ఈ వ్యవహారం అక్టోబర్ 25న త్రిసూర్‌లో జరిగిన సీపీఎం సమావేశం సందర్భంగా బయటకు వచి్చంది. ఎల్డీఎఫ్ మిత్ర పక్షం ఎన్‌సీపీ(శరద్)వర్గం ఎమ్మెల్యే థామస్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోడానికి గల కారణాలను ఈ సమావేశంలో సీఎం విజయన్ చెప్పినట్లు కూడా తెలుస్తోంది. వాస్తవానికి థామస్ కేబినెట్‌లో అటవీ శాఖను కోరుతున్నారు. అయితే, సీఎం విజయన్, సీపీఎంతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్న మంత్రి శచీంద్రన్ ఆ శాఖను వదులుకునేందుకు ససేమిరా అంటున్నారు. అందుకే, ఒక రకంగా సీఎం విజయన్‌పై ఒత్తిడి తేవడం ద్వారా కేబినెట్‌లో చేరేందుకు థామస్ వేసిన పథకంగా భావిస్తున్నారు.
ఎన్‌సీపీ(అజిత్), బీజేపీలు మహారాష్ట్రలో మిత్రపక్షాలే కాబట్టి.. ఈ పథకమే ఫలించి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్‌సీపీ(అజిత్)లో చేరితే కేరళలో బీజేపీకి పరోక్షంగా లాభం కలిగి ఉండేది. ఏదేమైనప్పటికీ, మంత్రి వర్గంలో చేరే అవకాశాన్ని ప్రస్తుతానికి థామస్ కోల్పోయినట్లుగానే భావిస్తున్నారు. ఈ పరిణామాలపై తమకెలాంటి సంబంధం లేదని కేరళలో ఎన్‌సీపీ(అజిత్)నేత మహ్మద్ కుట్టి స్పష్టం చేశారు. ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన ఎన్‌సీపీ(శరద్)కమిటీ ఎదుట ఇటీవల థామస్ హాజరై, ముడుపుల వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కమిటీ త్వరలోనే ఎన్‌సీపీ(శరద్) జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పీసీ చాకోకు నివేదిక ఇవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment