పేరు ఏదైతేనేం... అంతా అణచివేతే! | Sakshi Guest Column On Maoist Leader TR Rupesh and Pinarayi Vijayan | Sakshi
Sakshi News home page

పేరు ఏదైతేనేం... అంతా అణచివేతే!

Published Thu, Mar 20 2025 5:41 AM | Last Updated on Thu, Mar 20 2025 5:41 AM

Sakshi Guest Column On Maoist Leader TR Rupesh and Pinarayi Vijayan

మావోయిస్టు నాయకుడు టి. ఆర్‌. రూపేష్, కేరళ సీఎం విజయన్‌

అభిప్రాయం

దేశంలో, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో, ఉన్న పాలన స్వభావాన్ని ఎలా నిర్వచించాలి, దాన్ని ‘ఫాసిజం’ అనాలా, ‘నయా ఫాసిజం’ అనాలా, ‘నయా ఫాసిజం లక్షణాలు’ అనాలా అని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నాయకత్వం మల్లగుల్లాలు పడుతున్నదని ప్రచార సాధనాలలో వార్తలూ, వ్యాఖ్యలూ వస్తున్నాయి. 

ఆ పార్టీకే చెందిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మాత్రం తన విధానాల ద్వారా, ఆచరణ ద్వారా, బహుశా మౌనం ద్వారా కూడా ఆ చర్చను మరొక స్థాయికి తీసుకు పోదలచుకున్నట్టున్నారు. కార్పొరేట్‌ ప్రయోజనాల పరిరక్షణ, ప్రజల సామూహిక ఆందో ళనల అణచివేత, వ్యక్తిగత ఆందోళనల పట్ల మౌనం అనే మూడు విషయాలలో ఆయన ప్రభుత్వం, ఏ పేరు పెట్టినా, కేంద్ర ప్రభుత్వం చేయదలచిన, చేస్తున్న పనులనే చేసి చూపిస్తున్నది.

కేరళలోని వియ్యూర్‌ సెంట్రల్‌ జైలులో టి. ఆర్‌. రూపేష్‌ అనే మావోయిస్టు ఖైదీ ఉన్నారు. కేరళ మావోయిస్టు పార్టీ నాయకులలో ఒకరైన ఆయనను, ఆయన సహచరి షైనా, మరొక ముగ్గురు అనుచరులతో సహా 2015 మేలో తమిళనాడులోని కోయంబత్తూరులో అరెస్టు చేశారు. అంతకు ముందువీ, ఈ పదకొండేళ్లలో పెట్టినవీ కలిసి ఆయన మీద మొత్తం 43 కేసులున్నాయి. అందులో ఒక కేసు విచారణ జరిగి, ఆయన నిర్దోషిగా తీర్పు వెలువడింది. పదమూడు కేసులు డిశ్చార్జి అయ్యాయి.

ఒక కేసులో శిక్ష పడి, శిక్షాకాలం ముగిసిపోతుండగా, విడుదల కాకుండా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం పదకొండేళ్ల కిందటి కేసు తవ్వి తీసింది. జైలు అధికారులు ఇవ్వవలసిన రెమిషన్‌ ఇవ్వకుండా ఉండిపోయారు.   

ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ మహత్కార్యమే గాని ఇప్పుడిక్కడ చర్చ అది కాదు. రూపేష్‌ జైలుకు వెళ్లక ముందే కవిగా, రచ యితగా గుర్తింపు పొందారు. అజ్ఞాతవాసంలో ఉండగానే, 2013లో వెలువడిన ఆయన మొదటి నవల ‘వసంత్తిలె పూమరంగళ్‌’ (వసంతకాలపు పూలచెట్లు) మలయాళ సాహిత్య లోకంలో విస్తృత చర్చకు దారి తీసింది. అంతకు ముందు న్యాయ శాస్త్ర పట్టభద్రుడైన రూపేష్‌ గత పదేళ్ల జైలు జీవితంలో చరిత్రలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి, తత్వశాస్త్రంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేస్తున్నారు. 

జైలు రేడియో నడుపుతున్నారు. బాడ్మింటన్‌ క్రీడా కారుడిగా పేరు తెచ్చుకున్నారు. వీటితో పాటే, జైలులో ఆయన తన రెండో నవల రాశారు. ‘బంధితారుడె ఒర్మక్కురిప్పుగళ్‌’ (ఖైదీల జ్ఞాపకాలు) అనే ఈ నవల ప్రచురణను అనుమతించమని జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 130 పేజీలు గల ఈ నవల ఇతివృత్తం ఒక కవి–రాజకీయ కార్యకర్త జైలు జీవితం. 

జైళ్ల నిర్వహణ రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశంగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నాయకత్వంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి ఒక ఖైదీకి ఉన్న ఈ రాజ్యాంగ బద్ధ హక్కును గౌరవించి అనుమతి ఇచ్చే అధికారం ఉంది. జైలులో ఉన్న ఖైదీకి తన రచనను ప్రచురించుకునే హక్కు ఉందని సుప్రీం కోర్టు ఇచ్చిన ఎన్నో తీర్పులు  చెబుతున్నాయి. 

కాని రూపేష్‌ లిఖితపూర్వక దరఖాస్తుకు వియ్యూర్‌ సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ నెల గడిచినా అధికారిక జవాబు ఇవ్వలేదు. దరఖాస్తును పై అధికారులకు పంపామని, జవాబు కోసం వేచి చూస్తున్నామని తాత్సారం చేశాడు. నవలలో జైలుకు, యూఏపీఏ, కోర్టు ప్రస్తావనలు ఉన్నాయి గనుక అనుమతి ఇవ్వబోమని నోటిమాటగా చెప్పాడు.  

తన నవల ప్రచురణకు అనుమతించకపోతే, ఎమర్జెన్సీలో క్యాలికట్‌ రీజినల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థి రాజన్‌ హత్య చేయబడిన మార్చ్‌ 2న ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభిస్తానని రూపేష్‌ అధికారులకు తెలియజేశారు. మిత్రుల సలహా మేరకు దాన్ని ఒక్కరోజు నిరాహారదీక్షగా మార్చారు. 

అప్పటికే నవల డీటీపీ ప్రతి చదివిన కె. సచ్చిదానందన్, అశోకన్‌ చారువిల్,ఎన్‌. ఇ. సుధీర్‌ వంటి మలయాళ సాహిత్య ప్రముఖులెందరో ఆ నవల కళాత్మక విలువను ప్రశంసిస్తూ, ప్రచురణను అడ్డుకోవడం లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి తగదని ప్రకటించారు. ‘సృజనాత్మకత నేరం కాదు’ అనే శీర్షికతో సామాజిక మాధ్యమాలలో, ఇతర ప్రచార సాధనాలలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్నది. ముఖ్య మంత్రికి బహిరంగ లేఖలు వెలువడుతున్నాయి.  

ఒక ఖైదీ రచన ప్రచురణను ఫాసిస్టు, నయా ఫాసిస్టు, నయా ఫాసిస్టు లక్షణాలు గల ప్రభుత్వం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే అర్థం చేసుకోవడం సులభమే. కాని ఆ పని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రభుత్వం చేయడమే ఆశ్చర్యకరం, విషాద కరం. అదే ప్రభుత్వపు మరి రెండు విధానాలు కూడా ఈ నేపథ్యంలోనే ఆసక్తికరమైనవి.  

కేరళలోని ఆశా (అక్రెడిటెడ్‌ సోషల్‌ హెల్త్‌ యాక్టివిస్ట్స్‌ – ఏఎస్‌హెచ్‌ఏ) సిబ్బందిలో అత్యధికులు ఈ సోమవారానికి ముప్పై ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నారు. రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తున్నప్పటికీ తమను ఉద్యోగులుగా కాక వాలంటీర్లుగా గుర్తించడం మానేయాలని, అధికారపక్షం ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసినట్టు గౌరవ వేతనాన్ని రూ. 7,000 నుంచి రూ. 21,000కు పెంచాలని, ఉద్యోగ విరమణానంతర సౌకర్యాలు కల్పించాలని ప్రధాన డిమాండ్లతో, మరెన్నో డిమాండ్లతో ఈ సమ్మె జరుగుతున్నది. 

అనేక రాష్ట్రాలలో ఇవే డిమాండ్ల మీద సీపీఎం కార్మిక సంఘం సీఐటీయూ ఆందోళనలు నిర్వ హిస్తున్నది. కాని కేరళలో సీఐటీయూ కాక మరొక సంఘం ఈ ఆందోళనను నిర్వహిస్తున్నందువల్లనేమో ప్రభుత్వం ఆందోళన కారులతో చర్చలకు కూడా సిద్ధపడడం లేదు.    
  
గౌతమ్‌ అదానీ కంపెనీల మీద విదేశాలలోనూ, దేశంలోనూ లెక్కలేనన్ని విమర్శలు వస్తుండగా, కేరళ ముఖ్యమంత్రి మాత్రం అదానీ మీద పొగడ్తలు కుమ్మరించడంలో దేశ ప్రధానితో పోటీ పడుతున్నారు. ఇందుకు ప్రతిఫలంగా అన్నట్టు, కొద్ది వారాల కిందనే కొచ్చిలో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన ఇన్వెస్ట్‌ కేరళ గ్లోబల్‌ సమ్మిట్‌లో కరణ్‌ అదానీ అదే స్థాయిలో నరేంద్ర మోదీ, పినరయి విజయన్‌లు ఇద్దరినీ ఒకే ఊపులో పొగడ్తల్లో ముంచెత్తాడు. ఏది ఫాసిజం? ఏది నయా ఫాసిజం? ఏవి నయా ఫాసిస్టు లక్షణాలు? ఓ మహాత్మా! ఓ మహర్షీ!

ఎన్‌. వేణుగోపాల్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement