అభిప్రాయం
కేరళతో మొదలుపెట్టి కోల్‌కతా దాకా... దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై దాష్టీ కపు వార్తలే. ఇవన్నీ దేశంలో మహిళల స్థితిని ఎత్తిచూపుతున్నాయి. అదే సమయంలో రాజకీయాల నిర్లిప్తత, వ్యవస్థల వైఫల్యమూ కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి.
మలయాళ చిత్ర పరిశ్రమ చీకటి కోణాలు కాస్తా హేమ కమిటీ రిపోర్టుతో బట్టబయలయ్యాయి. నటులు, దర్శకులు, సినీ రంగంలోని అన్ని వర్గాల ప్రతినిధులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వార్తలను చూస్తే, ‘అయ్యో’ అనిపి స్తోంది. అధ్వాన్నమైన విషయం ఇంకోటి ఉంది. మహిళకు సమానత్వం, మర్యాద, స్వేచ్ఛ, భద్రత అన్న సిద్ధాంతాన్ని నమ్మిన ఒక్క రాజకీయ పార్టీ లేకపోవడం! ఇదే విషయం మిత్రుడైన ఓ రాజకీయ నేతతో చెబితే... ‘‘మహిళలపై దౌర్జన్యం విషయాల్లో వాళ్లు, వీళ్లు అని ఏమీ లేదు.
సొంత ప్రయోజనాలే వారికి పరమావధి’’ అని సమాధానమిచ్చాడు. నిత్యంకించపరిచే వ్యాఖ్యలు వింటూండే మహిళ రాజకీయ నేతలు కూడా పార్టీ అగ్రనేతల హుకుంలకు కట్టుబడ్డారేమో తెలియదు కానీ... గట్టిగా మాట్లాడతారని ఆశించినవాళ్లు కూడా నోళ్లు మెదపలేని స్థితిలో ఉన్నారు. బాధితు లకు రక్షణగా ఉండటం కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని అనిపించిందేమో వారికి!
కోల్‌కతా ‘అభయ’కు న్యాయం దక్కుతుందని నాకైతే అనిపించడం లేదు. ఇలా చెప్పేందుకూ నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ కేసులో అక్కడి ఘోరకలి సమగ్రంగా ప్రపంచానికి తెలుస్తుందన్న నమ్మకమూ సన్న గిల్లుతోంది. కాలేజీ అధికారులు బాధితురాలి తల్లిదండ్రులకు చేసిన మూడు ఫోన్ కాల్స్ వివరాలు మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. దీన్నిబట్టే ఈ కేసు వివరాలపై గోప్యత ఎంతన్నది స్పష్టమైంది.
ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా సందీప్ ఘోష్ చలాయించిన అధికారాన్ని అర్థం చేసుకుంటే.. ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఈయన వేధింపులు తట్టుకోలేక ఇద్దరు కాలేజీ ఇంటర్న్‌లు ఆత్మ హత్య చేసుకుందామని అనుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. కాలేజీ మాజీ అధికారి అఖ్తర్ అలీ ఆరోపణల ప్రకారం సందీప్ ఘోష్ మృత దేహాలతో వ్యాపారం చేసేవాడు. అవయవాల రాకెట్‌నూ నడిపేవాడు. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. ఒక వ్యక్తిని కాపాడేందుకు ఇన్ని పనులు ఎందుకు చేస్తున్నారు? సందీప్ ఘోష్ తరఫున వాదించేందుకు ప్రభుత్వం న్యాయ వాదిని నియమించడం ఏమిటి?
ఈ ఘటనను రాజకీయంగా వాడుకోలేదా? అందరూ వాడుకున్నారు. రాళ్లు రువ్వడంతో దేబాశీష్ చక్రవర్తి లాంటి పోలీసు కనుచూపు కోల్పోయే పరిస్థితి వచ్చింది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటా మాటా నడుస్తోంది. ఇందు కేనేమో... ఆందోళన చేస్తున్న వైద్యులు ఈ రెండు పార్టీల వారు ఎవరూ తమ పరిసరాల్లో లేకుండా జాగ్రత్త పడ్డారు.
‘అభయ’లాంటి ఘటన జరిగిన తరువాత చేసిన వ్యాఖ్యలు తప్పేనని తృణమూల్ పార్టీ హుందాగా తమ తప్పు ఒప్పుకుని ఉండాల్సింది. కొద్ది రోజులపాటు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి... ఆ తరువాత ఒక్క పళంగా విరుచుకుపడింది. ఒకరి ద్దరు పార్టీ ప్రతినిధులు నోటికి ఏదొస్తే అది మాట్లా డేశారు. ఈ క్రమంలోనే ఓ ఎంపీని నా కార్యక్రమం నుంచి వెళ్లిపొమ్మని అడగాల్సి వచ్చింది. ముప్ఫై ఏళ్ల నా వృత్తి జీవితంలో నేను ఇలా ఎన్నడూ చేయలేదు.
పశ్చిమ బెంగాల్ ఘటనకు బాధ్యత టీఎంసీదైతే... హేమ కమిటీ నివేదిక పుణ్యమా అని కేరళ సినీ రంగం లేవనెత్తుతున్న ప్రశ్నలకు అక్కడి లెఫ్ట్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జస్టిస్ కె.హేమ కమిటీ తన నివేదికను సిద్ధం చేసేందుకు ఏకంగా ఐదేళ్ల సమయం పట్టింది. ఈ నివేదిక బయటపడటంతో చాలామంది మహిళా ఆర్టిస్టులు ఇప్పుడు పోలీసులకూ, టాస్క్‌ఫోర్స్‌కూ ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు.
ఈ మలయాళ ‘మీ టూ’ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న నటీమణులు రేవతి, పార్వతి చెప్పిన దాని ప్రకారం... ఈ కేసులో అటు రాజకీయ నేతలు, ఇటు సినిమా శక్తులు వాస్తవాలను తొక్కి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు వర్గాలూ కలిసిపోయే అవకాశమూ లేకపోలేదని వాళ్లు అంటున్నారు. హేమా కమిటీ నివేదికలోని 11 పేరాలను ప్రభుత్వం ఎందుకు తొలగించిందో ఇప్పటివరకూ ఎలాంటి వివరణ లేదు.
గుజరాత్ ప్రభుత్వ పుణ్యమా అని బిల్కిస్ బానో రేపిస్టులు మెడలో పూలదండలతో జైల్లోంచి బయట కొచ్చారు. అభయ విషయంలో మమత ప్రభుత్వం మితిమీరిన అహంకారంతో వ్యవహరించింది. 2012 నాటి నిర్భయ ఘటనలో కాంగ్రెస్‌వాళ్లూ నానా చెత్తా మాట్లాడారు. ఇవన్నీ మనకు చెబుతున్నది ఏమిటి? రాజకీయ నేతలు పట్టించుకోవాలంటే, మహిళలు ఒక ఓటుబ్యాంకుగా సంఘటితం కావాలి.
బర్ఖా దత్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment