
అరుదుగానైనా సరే, తలలు కూలుతున్న శబ్దం మధురంగా వినిపిస్తుంది. మలయాళ చలనచిత్ర పరిశ్రమలో మహిళలపై ప్రబలంగా జరుగుతున్న లైంగిక, ఇతర వేధింపులపై సంచలన నివేదిక విస్ఫోటనం తర్వాత మొదటి వేటు నటుడు సిద్ధిక్, నిర్మాత రంజిత్‌లపై పడింది. సిద్ధిక్‌పై లైంగికదాడి అభియోగాలు మోపారు. ఇకపోతే సీపీఎం ఎమ్మెల్యే, నటుడు ముఖేష్ అరెస్టు నుండి తప్పించుకోవడానికి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
కొందరు దీనిని మలయాళ చిత్రపరిశ్రమలో ‘మీ టూ’ ఉద్యమంగా అభి వర్ణిస్తున్నారు. కచ్చితంగా, మాలీవుడ్‌లో మహిళల పని పరిస్థితులపై జస్టిస్ కె.హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత నెలకొన్న సంఘటనలు పరిశ్రమ నియంత్రణను దాటిపోయాయి. 2019 డిసెంబరు నుండి నివేదికను తొక్కిపట్టి ఉంచిన పినరయి విజయన్ ప్రభుత్వం కూడా ఈ నివేదిక పేర్కొన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని ప్రకటించింది.
కోల్‌కతాలో ట్రెయినీ డాక్టర్ ఘోర హత్యాచారంపై చెలరేగుతున్న ఆగ్రహ జ్వాలలకు ప్రతిస్పందనగా కొచ్చిలో రణగొణధ్వనులు వినిపిస్తున్నప్పుడు మనం ఒక పెను మార్పు మలుపులో ఉన్నాము. బద్లాపూర్(మహారాష్ట్ర)లో ప్రజల ఆగ్రహం బాంబే హైకోర్టు విచారణకు దారితీసినప్పుడు, అబ్బాయిల లింగపరమైన సున్నితత్వంతో సహా కొన్ని సూచనలు చేయమని హైకోర్టు ఒక కమిటీని కోరింది.
ఇదంతా స్వాగతించదగినదే. అయితే ఇదంతా మనం ఇంతకు ముందే విన్నాం. 2018లో, భారత దేశంలో మీ టూ ఉద్యమం సమయంలో, లైంగిక దాడి ఆరోపణలు తగ్గుముఖం పట్టడంతో మనం ఒక అవకాశాన్ని కోల్పోయాము అని ఉద్యమకారులు అంటారు. ఎందుకంటే ఆరోపణలకు సంబంధించి పెద్ద్ద పేర్లు ఎన్నడూ బయటపడలేదు. దానికి తోడుగా,
లైంగిక దాడి గురించి మాట్లాడిన వారిపై క్రిమినల్ పరువు నష్టం దావాలు తీవ్ర ప్రభావం చూపాయి.
2013లో, మగవారి మనస్తత్వాలను మార్చే పనిపై గట్టిగా కృషి చేయకుండా, కఠినమైన చట్టాన్ని ఆమోదించడం ఒక్కటే సమస్యను పరిష్కరిస్తుందని భావించిన ప్పుడు మనం మళ్లీ పోరాటాన్ని కోల్పోయాము.
ఇప్పుడు మనకు మరో అవకాశం వచ్చింది. కానీ తరువాత ఏమి జరుగుతుందనేది ‘మన’పైనే ఆధార పడి ఉంటుంది. లైంగిక ఆరోపణలకు గురైన వారి సినిమాలను ప్రేక్షకుల్లోని ‘మన’వారే విమర్శనారహి తంగా ఆబగా చూస్తున్నారు. నిశ్శబ్దాన్ని బద్దలుగొట్టి నోరెత్తే వారిని ట్రోల్ చేసి బెదిరించేవారు కూడా సోషల్ మీడియాలోని ’మన’వారే. శక్తిమంతులకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసే మహిళలను చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలో ఉన్న ‘మన’వారు కష్టపెడుతున్నారు. చలనచిత్ర విడుదలకు సంబంధించి సమయానుకూలంగా పీఆర్–ఆధారిత సమాచారాన్ని అందజేసే మీడియాలోని ‘మన’వారు జర్నలిజానికి సంబంధించిన క్లిష్టమైన ప్రశ్నలు వేటినీ అడగరు.
మాట్లాడేవారు ఒంటరిగా లేరని తెలిసేలా, నిజం చెప్పే భారం మహిళలపై మాత్రమే పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ‘మన’పైనే ఉంది. అలాగే మహిళ లను లైంగికంగా వేటాడేవారిని జాతీయ చర్చల నుండి, బాక్సాఫీస్ నుండి, సాహిత్య వేడుకల నుండి మాత్రమే కాకుండా మన డ్రాయింగ్ రూముల్లో చర్చల నుండి కూడా దూరంగా ఉంచాలి.
కోల్‌కతాలోని వైద్యులకు ఆగ్రహించే హక్కు ఉంది. అయితే నిరసనలు రాజకీయ రంగు పులు ముకున్నాయి. లైంగికదాడి చేసిన వారిని నెలాఖరులోగా ఉరిశిక్ష విధించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చేసిన ప్రకటనలు పరిష్కా రాన్ని కనుగొనే లక్ష్యంతో కాకుండా, ప్రజల ఆగ్రహాన్ని చల్లబర్చడం కోసమే చేసినట్లున్నాయి.
తెగులు లేదా కుళ్లు అనేది వ్యవస్థాగతంగా ఉన్నప్పుడు, దానికి పరిష్కారం అనేది ‘ఇక్కడో రాజీనామా’, ‘అక్కడో కమిటీ ఏర్పాటు’ వంటి రూపాల్లో పాక్షికంగా, అవ్యవస్థీకృతంగా ఉండకూడదు. లైంగిక వేధింపులకు మనం ప్రత్యేకమైన, భిన్నమైన నేరాలుగా ప్రతిస్పందించడం మానేయాలి. మహిళలకు వ్యతిరేకంగా అసమానమైన శక్తి కొనసాగిస్తున్న విస్తృత దాడుల్లో భాగంగా వీటిని చూడాలి.
మనకు అసమానతలపై పోరాడే ఉద్యమం అవసరం: బహిరంగ ప్రదేశాల్లో, పార్లమెంటులో, పోలీసు స్టేషన్లలో, పని ప్రదేశాల్లో, న్యాయవ్యవస్థలో ఎక్కువ మంది మహిళలు భాగం కావలసి ఉంది. సోదరీమణులు, కుమార్తెలుగా మాత్రమే ఉండిపోకుండా, మనం సమాన పౌరులం అనే ఆలోచనను సాధారణీకరించాల్సి ఉంది. మనకు ప్రస్తుతం ఒక అవకాశం ఉంది. దానిని స్వాధీనం చేసుకోవడం మనపైనే ఉంది.
వ్యాసకర్త జెండర్ అంశాల రచయిత
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment