ఆస్పత్రిలో ఎమ్మెల్యే పులివర్తి సతీమణి సుదీర్ఘ మంతనాలు
ప్రేమించ లేదన్నందుకే వేధించారన్న బాలిక తండ్రి
వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులను అడ్డుకున్న పోలీసులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం మండలానికి చెందిన మైనర్ దళిత బాలికపై జరిగిన దాడి ఘటనను నీరుగార్చేందుకు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు మొదలైనట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధ బాధిత బాలిక చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకుని దాదాపు ఐదు గంటల పాటు మంతనాలు జరపడం.. ఆమెను అనుమతించిన పోలీసులు వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నేతలను మాత్రం అడ్డుకోవడం.. బాలిక తండ్రి ఒక్క రోజులోనే మాట మార్చేలా ఒత్తిడి తేవడం.. ఆద్యంతం ప్రభుత్వం గోప్యంగా వ్యవహరిస్తుండటం దీన్ని బలపరుస్తున్నాయి.
వైద్య పరీక్షల్లో లైంగిక దాడి జరగలేదని తేలినట్లు ఎస్పీ సుబ్బరాయుడు చెప్పారు. బాలిక చెప్పిన వివరాల మేరకు అనుమానితులను విచారిస్తున్నట్లు తెలిపారు. దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత బాలిక సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి దాడి చేసిన విషయం తెలిసిందే. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను పోలీసులు అర్ధరాత్రి తొలుత పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి అనంతరం తిరుపతి మెటర్నటీ ఆసుపత్రికి తరలించారు.
బాధిత కుటుంబంతో పులివర్తి సుధ మంతనాలు
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధ మంగళవారం ఉదయం 10.20 గంటల ప్రాంతంలో తిరుపతి మెటర్నటీ ఆసుపత్రికి చేరుకుని దాదాపు ఐదు గంటల పాటు బాధిత కుటుంబంతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. సాయంత్రం 3.04 గంటలు దాటాక వెలుపలకు వచ్చి మీడియాతో మాట్లాడారు. తిరిగి మరోసారి లోపలకు వెళ్లారు. మధ్యాహ్నం 12.09 గంటల ప్రాంతంలో సుధ ఆసుపత్రి లోపల ఉన్న సమయంలో బాలిక తండ్రి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. బాలికపై దాడి జరిగింది వాస్తవమేనని, అయితే లైంగిక దాడి జరగలేదని చెప్పారు. తన కుమార్తె వారిని ప్రేమించలేదనే కారణంతో దాడి చేశారన్నారు.
వైఎస్సార్‌సీపీ, ఏఐఎస్‌ఎఫ్ ఆందోళన
బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, మాజీ మంత్రి ఆర్‌కే రోజా, తిరుపతి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్‌రెడ్డి, నూకతోటి రాజేష్, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు ఉదయమే వేర్వేరుగా తిరుపతి మెటర్నటీ ఆసుపత్రికి చేరుకోగా రోజా మినహా మిగిలిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.
ఆ తరువాత వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను మాత్రం ఆస్పత్రి లోపలకు అనుమతించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ ఎంపీ, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ధర్నా చేశారు. ఏఐఎస్‌ఎఫ్ నాయకులు కూడా ఆందోళనకు దిగారు. సీపీఐ నాయకులను సైతం అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళనకు దిగడంతో తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, భూమన అభినయ్‌ని మాత్రం అనుమతించారు.
Comments
Please login to add a commentAdd a comment