అభిప్రాయం
ఇవీ మన కొత్త చట్టాలు–9
కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ చట్టాలలో తెచ్చిన మార్పులు మంచివేనా? కొత్త చట్టాల వల్ల సమస్యలు తీరు తాయా? అనే ప్రశ్నలు న్యాయనిపుణులనే కాదు, సాధారణ పౌరులనూ వేధి స్తున్నాయి. అందుకే ఈ విషయాలపై లోతుగా పరిశోధించవలసిన అవసరం ఉంది.
భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ ఎస్‌ఎస్)లోని సెక్షన్ 187 కింద నిందితుల కస్టడీ కాలాన్ని పాత చట్టం అనుమతిస్తున్న దానికన్నా కొన్ని రెట్లు పెంచుతారు. అంటే నిందితులు ఎక్కువ కాలం కస్టడీలో ఉండాలి అని దర్యాప్తు అధికారి భావిస్తే కస్టడీ కాలం పెరుగుతుందని దీనర్థం. అంటే పోలీసులు నిందితుడి జీవితాన్ని సాధ్యమైనంత వరకు లాకప్‌కు పరిమితం చేయాలనుకుంటే చేయ వచ్చన్నమాట.
మరో సమస్య ఏమంటే ఎక్కువ కాలం పోలీసు కస్టడీ తర్వాత... కోర్టు కస్టడీ మొద లవుతుంది. కోర్టు కస్టడీ అంటే పోలీసు కస్టడీ కన్నా గొప్పది, సహించగలిగినది అనుకోవలసిన పనిలేదు. లాకప్‌లో ఉంటే పోలీసులు ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. ఆ తరువాత జైలు కస్టడీ ప్రారంభమయితే పోలీసు అధికారుల బదులు, జైలు అధికా రులు పెట్టే బాధలు కొనసాగుతాయి.
దర్యాప్తు కోసం మొదట ఒక రోజన్నా పోలీసు కస్టడీలో ఉండి తీరాల్సిందే. అయితే కచ్చితంగా దర్యాప్తు 24 గంటల్లో పూర్తవ్వదు. లెక్కబెట్టి 24 గంటలు కాగానే ఇంటికి పంపిస్తారని దీనర్థం కాదు. అబద్ధపు ఆరోపణలను భరిస్తూ, అక్రమ నిర్బంధాన్ని అనుభవిస్తూ చట్ట వ్యతిరేకంగా పోలీస్‌లు అను కున్నంత కాలం లాకప్‌లో ఉండవల్సిందే. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం దర్యాప్తు సమయం లేక లాకప్‌లో ఉండే సమయం 40 రోజులు లేదా 60 రోజులకు పెరుగుతూ ఉంటుంది.
అది గొప్ప సంస్క రణ అంటే... ఆలోచించాల్సిందే! చట్టం ప్రకారం 40 లేదా 60 రోజుల లాకప్ కస్టడీ తరువాత మరింత చట్ట వ్యతిరేక (అక్రమ) నిర్బంధం మొదలవుతుందన్న మాట. ఈ సంస్కరణ వల్ల పోలీసు అధికా రాలు విస్తారంగా పెరిగిపోయాయి. దీంతో అధికా రుల మధ్య నిందితుడు దిక్కులేని పక్షి అవుతాడు.
దాని పర్యవసానం ఏమిటంటే మేజిస్ట్రేట్‌కి బెయిల్ ఇచ్చే అధికారం తగ్గిపోయింది. పోలీసులు నింది తుణ్ణి వదిలిపెట్టడం అనేది అతడి అదృష్టం తదితర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. చట్టం ప్రకారం కస్టడీకి ఎంతో కొంత పరిమితి ఉంటుంది. కాని, పోలీసుల అక్రమ కస్టడీలపై ఏ పరిమితీ ఉండదు. నిందితుల అదృష్టం, దేవుడి దయ!
15 రోజుల కస్టడీ మంచిదా కాదా అని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో చర్చించింది. ఎట్టి పరిస్థితిలో 15 రోజులు కస్టడీ (లాకప్ లేదా జైల్ నిర్బంధం) దాట డానికి వీల్లేదని అనుపమ్ కులకర్ణీ వర్సెస్ సీబీఐ కేసుకు సంబంధించిన తీర్పులో అత్యున్నత న్యాయ స్థానం పేర్కొంది. ఇప్పుడు పార్లమెంట్‌లోని ఉభయ సభలు తెచ్చిన కొత్త నేర చట్టాలు అమలులోకి వచ్చిన తర్వాత ఈ తీర్పు ఇక ఎంతమాత్రం చెల్లనే రదు. ఇదన్నమాట సంస్కరణంటే.
పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లులను ఎవ్వరూ చదవరు, అర్థం చేసుకోరు. పార్లమెంట్ సభ్యులు ఆ యా పార్టీల విప్‌ల ఆధారంగా చట్టసభల్లో ఓటింగ్‌లో పాల్గొని ఓటేస్తారు. ఇలా క్రిమినల్ చట్టాలు చేసుకుంటూ పోతే మరి పౌర హక్కుల మాటేమిటి? రాజ్యాంగానికి ఉన్న విలువెంత?
బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 187 కింద అంత తీవ్రం కాని నేరాల పరిశోధనలో 40 రోజుల కస్టడీ సమయం ఉంటుంది. తీవ్రమైన నేరాల పరిశోధనకు 60 రోజుల సమయాన్ని ఇస్తున్నారు. 10 సంవత్స రాల జైలు శిక్ష విధించదగిన కేసులలో 40 రోజుల దర్యాప్తుకు అవకాశం ఇస్తారు. ఇంత కన్న తక్కువ శిక్షలు విధించే నేరాలకు ఇంతకు ముందు 15 రోజుల కస్టడీ ఉండేది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 167 కింద మొదటి కస్టడీ కాలం 15 రోజులతో మొదలయ్యేది.
ప్రజాహిత స్నేహపూరిత సంస్కరణలంటే ఇవేనా? ఈ ప్రభుత్వం ప్రజల ప్రేమాభిమానాలను కోరుకునేదే అయితే... జనం లాకప్పులు, కోర్టు కస్టడీ కాలాన్ని పెంచడం ఎందుకు? ఇందులో సంస్కరణ ఏముంది? వికాస్ మిశ్రా వర్సెస్ సీబీఐ కేసులో అధికారులు లాకప్ లేదా కస్టడీ నిర్బంధ సమయం పెంచాలని కోరారు. లంచం ఆరోపణలపై దర్యాప్తు కోసం ఈ కస్టడీ పొడిగింపును కోరింది సీబీఐ. అప్పడికి ఏడురోజుల కస్టడీ పూర్తయింది. నిందితులు హాస్పిటల్‌కు రావలసి వచ్చింది. ఆ తరువాత బెయి ల్‌పై విడుదల చేశారు.
సెంతల్ బాలాజీ కేసులో 15 రోజుల కస్టడీని విడి విడి భాగాలుగా మార్చుకోవచ్చు అని సుప్రీంకోర్టు వివరించింది. అప్పుడు ఈ లిటిగేషన్‌లు కొన సాగుతూ సుప్రీం కోర్టుదాకా పోవడానికి వీలవుతుంది. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో 40 నుంచి 60 రోజులు ఇచ్చే కస్టడీని మరింత దారుణంగా వాడుకుంటారనే విమర్శలు ఉన్నాయి. దీనివల్ల సుప్రీం కోర్టుదాకా లిటిగేషన్ నడుపుతూ ఉంటే 15, 40, 60 రోజులకు కస్టడీ పెంచుకోవడానికి ఉపయోగ పడుతుంది. ఇదే రాజ్యాంగ వ్యతిరేకం అని ప్రశ్నించాల్సి ఉంది.
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ
‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్
Comments
Please login to add a commentAdd a comment