విశ్లేషణ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గుండ్రంగా వేసిన ఖాళీ తెల్లని కుర్చీల ముందు కూర్చుని, వైద్యులతో భేటీ కోసం ‘వేచి వేచి వేచి’ చూసిన చిత్రం చాలా ఆసక్తిని పుట్టించింది. ప్రత్యేకించి దాని తర్వాత ముఖ్యమంత్రి చేతులు జోడించి, నిరసన తెలుపుతున్న వైద్యు లతో చర్చించే విషయమై ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడంలో జరిగిన వైఫల్యానికి క్షమాప ణలు చెప్పడం... నాటకీయంగా ఉద్వేగభరితంగా తాను ‘రాజీ నామాకు సిద్ధంగా ఉన్నాను’ అనే ఎత్తుగడను వేయడం మరీ విశేషం.
వాస్తవానికి, ఆ క్షణమాత్రపు దృశ్యంలో ప్రదర్శితమైన ప్రహసనం ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి చేసిన ఈ వ్యాఖ్యలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. విశేషం ఏమంటే, ఇదే ప్రత్యక్ష ప్రసారం విషయంలోనే ఆ చర్చలు ప్రారంభం కావడానికి ముందే విఫలమయ్యాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలో యువ వైద్యురాలిపై జరిగిన హత్యాచారంపైనా... దాని వెంబడే చోటు చేసుకున్న తప్పుడు చర్యలు, వాటిని కప్పిపుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాల పైనా గత నెల రోజులకు పైగా ఆందోళన చేస్తున్న వైద్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రితో తమ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిందేనని ముందస్తు షరతు పెట్టారు. సుప్రీంకోర్టు ఈ కేసును ప్రత్యక్ష ప్రసారం చేయగలిగినప్పుడు, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం దానిపై విభేదించడానికి ఎటువంటి కారణం లేదని వాదిస్తూ, వారు ఈ డిమాండ్‌పై ఇప్పటికీ మొండిగా ఉన్నారు. అదే సమయంలో చర్చలను రికార్డ్ చేసి, సుప్రీంకోర్టు అను మతితో తర్వాత విడుదల చేయాలనే ప్రతిపాదనను వైద్యులు అంగీకరించలేదు.
మమతా బెనర్జీ ఈ పనిని నిరసనల ప్రారంభంలోనే ఎందుకు చేయలేదని ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. ముడిచిన చేతులు, మధురమైన స్వరం, ప్రతిష్టంభనను ఛేదించలేక పోయినందుకు క్షమాపణ చెప్పడం, వైద్యుల కోసం రెండు గంటలకు పైగా వేచి ఉండటాన్ని నొక్కి చెప్పడం... బహుశా నేరం జరిగిన కొన్ని గంటలు లేక రోజులలో ఇదే విధానం పాటించి ఉంటే, ఇంత సంక్షోభం ఏర్పడేది కాదు. ఉద్య మాలలో పుట్టి, రూపుదిద్దుకున్న ఈ రాజకీయ నాయకురాలు ఇలా సహజ ప్రవృత్తి రాహిత్యాన్ని ప్రదర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
కోల్‌కతా పోలీసు చీఫ్ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రతిపాదించినప్పటికీ రాబోయే పండుగ సీజన్ కారణంగా తాను దానిని తిరస్కరించినట్లు ఆమె వెల్లడించడం మరింత అయోమయం కలిగించింది. ఆమె ప్రకటనపై స్పందిస్తూ ఒక యువ వైద్యుడు ఇలా అన్నాడు: ‘ప్రస్తుతం పండుగల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు?’ (ప్రభుత్వం అనంతరం కోల్‌కతా నగర కమిషనర్‌ను మార్చింది.) ముఖ్యమంత్రి మమతా బెనర్జీని విమర్శించడంలో భార తీయ జనతా పార్టీ రాష్ట్రంలో అందరికంటే ముందు ఉండ వచ్చు; కానీ, మణిపుర్ విషయానికి వస్తే, అక్కడ బీజేపీ ఏ సహజ ప్రవృత్తినీ ప్రదర్శించకపోవడం గురించి ఇలాంటి ప్రశ్న లనే ఆ పార్టీ నాయకత్వంపై సంధించవలసి ఉంటుంది.
మళ్ళీ, స్పష్టంగా చెప్పాలంటే, 2023 మే నుండి హింసా త్మక జాతి ఘర్షణల్లో 200 మందికి పైగా మరణించిన మణి పుర్ రాష్ట్రానికీ, పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జి కర్ హాస్పిటల్ కేసుకూ మధ్య నేను వాచ్యార్థంగా కూడా ఎలాంటి పోలికలను చూపడం లేదు. చిన్న, పెద్ద సంక్షోభ సమయాల్లో రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తారనే దానికే ఈ సారూప్యత పరి మితం. ఇంగితజ్ఞానం చాలా అవసరమైనప్పుడే అది వారికి లేకుండా పోయినట్లు కనిపిస్తుంది.
మణిపుర్‌లో ఎన్. బీరేన్ సింగ్‌ను ముఖ్యమంత్రి స్థానం నుండి తొలగించడానికి బీజేపీ మొండిగా నిరాకరించడం ఏ రకంగానూ వివరించలేనిది. రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఆందో ళనకరంగా ఉందంటే, చాలామంది దీనిని అంతర్యుద్ధంతో పోల్చారు. అక్కడ మైతేయి, కుకీ సమాజాల మనుషులు ఒకరు ఆధిపత్యం వహించే భౌగోళిక ప్రాంతాలలోకి మరొకరు ప్రవేశించలేరు. జాతి సమూహాలను స్పష్టంగా వేరు చేసే ‘బఫర్ జోన్’ను ప్రమాదవశాత్తూ దాటిన కారణంగా సైన్యా నికి చెందిన ఒక మాజీ సైనికుడు వారం క్రితం హత్యకు గుర య్యాడు. ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చని పోయిన 11 మందిలో మహిళలు కూడా ఉన్నారు. రెండు వర్గాల ప్రజలు, రైతులు, విద్యార్థుల చేతుల్లో వేల సంఖ్యలో ఆయుధాలు ఉన్నాయి.
ప్రతి ఒక్కరికి దేశభక్తి పరీక్షలను నిర్వహించే కీ–బోర్డ్ జాతీయవాదులు, స్వల్పంగా అసమ్మతి వ్యక్తం చేసే ప్రజలను జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయడానికి వెనుకాడరు. అలాంటిది ఒక మాజీ సైనికుడు అయిన హవల్దార్ లిమ్‌ఖోలాల్ మాతే భార్య ‘నా భర్త భారతదేశం కోసం పోరాడాడు, కానీ తనను ఒక జంతువులా చంపేశారు’ అని ఏడుస్తూ చెప్పిన ప్పుడు, జాతీయవాదానికి స్వీయ నియమిత మధ్యవర్తులందరూ ఎక్కడ ఉన్నారు?
మణిపుర్‌లో రాజకీయ పార్టీలు పతనమయ్యాయి. ఈ గొడవలో ముఖ్యమంత్రి పాత్రపై విచారణ జరిపించాలని కోరిన పది మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు బీజేపీకి చెందిన వారే. హింస బయటినుంచి ఉన్నప్పుడు, ఉదాహరణకు తిరుగుబాట్లు లేదా యుద్ధ సమయంలో రాజకీయ నాయ కత్వం కొనసాగింపును నేను అర్థం చేసుకోగలను. కానీ ఇది తనపై తాను యుద్ధంలో ఉన్న రాష్ట్రం. ఇది శాంతి భద్రతల వైఫల్యం. కానీ ఇది అన్నింటికంటే, రాజకీయాల వైఫల్యం. ముఖ్యమంత్రిని తొలగించడం అనేది స్పష్టంగా సరైన పని కావడమే కాకుండా, ఘర్షణ పడుతున్న పార్టీలను చర్చల బల్ల వద్దకు తీసుకురావడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. పశ్చిమ బెంగాల్ నుండి మణిపుర్ వరకు, తప్పక చేయ వలసిన చర్యే చాలాసార్లు సరైనది అవుతుంది. కానీ అలా చేయకపోగా దాన్ని ప్రతిఘటించడమే ఇక బాగు చేయలేని పరిస్థితికి నెట్టినట్టు అవుతోంది.
బర్ఖా దత్
వ్యాసకర్త ప్రముఖ జర్నలిస్టు, రచయిత
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment