కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా కుదిపేసింది. ఈ ఘటనను దేశం నలుమూలల నుంచి ప్రజలు, మెడికల్ కాలేజీ విద్యార్థులు, డాక్టర్లు తీవ్రంగా ఖండించి పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఘటన జరిగిన పశ్చిమ బెంగాల్‌లో మరింత అధికంగా చిన్నాపెద్ద తేడా లేకుండా నిరసనల్లో పాల్గొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అయితే తాజాగా బెంగాల్ ప్రభుత్వం పలు ప్రభుత్వ అనుబంధ స్కూల్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా పలు స్కూల్స్ టీచర్లు, విద్యార్థులతో నిరసనలు చేపట్టాయని పేర్కొంది. పాఠశాలలో విద్యార్థులకు క్లాసులు జరగాల్సిన సమయంలో ఇలా నిరసనల్లో వారిని పాల్గొనేలా చేయటంపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
హౌరా, బంకురా, తూర్పు మిడ్నాపూర్, పశ్చిమ మిడ్నాపూర్‌లోని పలు ప్రభుత్వ అనుబంధ స్కూల్స్‌కు నోటీసులు ఇచ్చింది. అందులో హౌరాలోని బలుహతి ఉన్నత పాఠశాల, బలుహతి బాలికల ఉన్నత పాఠశాల, బంట్ర రాజలక్ష్మి బాలికల పాఠశాలు ఉన్నాయి. ‘‘ 23.08.2024న స్కూల్స్‌లో క్లాసులు జరగాల్సిన సమయంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో.. నిరసన ర్యాలీ నిర్వహించినట్లు మా దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇలా చేయటం సరికాదు.. బాలల హక్కుల ఉల్లంఘన’’ అని నోటీసుల్లో తెలిపింది.
ఇదిలా ఉండగా.. ఈ కేసులో సీబీఐ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు నిందితులకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేసిన సీబీఐ.. ఇవాళ ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment