
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె టీ వీణా విజయన్‌కు ఉహించని షాక్ తగిలింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి ఆర్థిక నేరం కేసులో ఆమెను విచారించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఒకవేళ ఈ కేసులో వీణ దోషిగా తేలితే, ఆర్నెళ్ల నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.
వివరాల ప్రకారం.. సీఎం విజయన్ కుమార్తె వీణా విజయన్ చిక్కుల్లో పడ్డారు. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కంపెనీ నుంచి వీణా విజయన్‌కు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీకి అక్రమ రీతిలో డబ్బులు బదిలీ అయినట్లు తేలింది. ఈ నేపథ్యంలో న్యాయ విచారణ చేపట్టేందుకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ఆధారంగా కేసు విచారణకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అంతకుముందే.. కొచ్చిలోని ఆర్థిక నేరాలను పరిశీలించే ప్రత్యేక కోర్టులో ఈ కేసు ఫైల్ అయ్యింది. ఈ సందర్బంగా 160 పేజీల ఛార్జ్‌షీట్ రూపొందించారు.
SFIO files chargesheet against Veena Vijayan, daughter of Kerala CM, and others in a Rs 2.7 crore CMRL payoff case.
Charges include financial fraud under Section 447 of the Companies Act. pic.twitter.com/ymiOSZFFox— HKupdate (@HKupdate) April 3, 2025
రుజువైతే పదేళ్ల జైలుశిక్ష..
సీఎంఆర్ఎల్, ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ మద్య అక్రమ రీతిలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అనుమానించారు. 2017 నుంచి 2020 మధ్య కాలంలో సీఎంఆర్ఎల్ కంపెనీ నుంచి వీణా విజయన్‌కు చెందిన కంపెనీ సుమారు 1.72 కోట్లు బదిలీ అయ్యాయి. దీంతో ఈకేసులో విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐఓ ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఎఫ్ఐఓ తన ఛార్జ్‌షీట్‌లో వీణా విజయన్‌తో పాటు సీఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శశిథర్ కార్తా, మరో 25 మంది నిందితుల పేర్లను చేర్చింది. ఒకవేళ ఈ కేసులో వీణ దోషిగా తేలితే, ఆర్నెళ్ల నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కంపెనీస్ యాక్టు ప్రకారం ఆ శిక్ష ఉంటుంది. దీంతో పాటు పెనాల్టీ విధిస్తారు.
ప్రతిపక్షాలు ఫైర్..
మరోవైపు.. ఈ పరిణామాలపై ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్బంగా సతీశన్ మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి కుమార్తె వీణా విజయన్‌ను కేసులో నిందితురాలిగా చేర్చడం చాలా తీవ్రమైన విషయం. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఛార్జ్ షీట్ ఆమెపై ఆరోపణను బలపరుస్తోంది. ముఖ్యమంత్రి కుమార్తె పదేళ్ల వరకు జైలు శిక్ష విధించదగిన నేరం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. విజయన్ ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగడం సముచితం కాదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ తన కుమార్తె విచారణను ఎదుర్కొనడాన్ని ఆయన ఎలా సమర్థించగలరు?’ అంటూ ప్రశ్నించారు.