constitutional systems
-
ఇదేనా రాజ్యాంగ స్ఫూర్తి?
కథ కొత్త మలుపులు తిరిగినట్టే, కేరళ ప్రభుత్వానికీ, ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌కూ మధ్య వరుస వివాదాల్లో కొత్త అంకం వచ్చి చేరింది. కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్. బాలగోపాల్పై తాను విశ్వాసాన్ని కోల్పోయాననీ, ఆయనపై చర్య తీసుకోవాలనీ ముఖ్యమంత్రిని గవర్నర్ కోరడం దిగ్భ్రాంతికరం. నిన్న గాక మొన్న 11 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లపై కినిసిన మహాప్రభువులకు ఇప్పుడు మంత్రి గారిపై విరక్తి కలిగింది. దానికి ఆయన కారణాలు ఆయనకున్నాయి. దేశ సమైక్యతకు భంగం కలిగేలా మంత్రి మాట్లాడారనీ, పదవీ ప్రమాణాన్ని ఉల్లంఘించారనీ, కడకు గవర్నర్‌గా తన విశ్వాసాన్ని మంత్రి కోల్పోయారనీ... ఆరిఫ్ ఆరోపణ. అధికార ఎల్డీఎఫ్ సర్కార్ సారథి పినరయ్ విజయన్ మాత్రం సదరు మంత్రిపై తనకు పూర్తి విశ్వాసం ఉందంటూ, గవర్నర్ డిమాండ్‌ను తోసిపుచ్చాల్సి వచ్చింది. గవర్నర్ చర్యను తప్పుబడుతూ అధికార, ప్రతిపక్షాలు ఒకే స్వరం వినిపిస్తున్నాయంటే ఆరిఫ్ గీత దాటేశారని అర్థమవుతోంది. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలకూ, రాజ్‌భవన్‌కూ పెరుగుతున్న దూరంపై అర్థవంతమైన చర్చ అవసరమని గుర్తుచేస్తోంది. కేరళలో తలుచుకుంటే మంత్రులను సైతం ఇంటికి పంపే అధికారం తనకు ఉందని కొద్దివారాల క్రితం రాష్ట్రపెద్ద హూంకరించారు. ఆ వివాదం సద్దుమణగక ముందే సుప్రీమ్ కోర్ట్ ఓ నియామకంలో ఇచ్చిన ఉత్తర్వును సాకుగా తీసుకొని, 11 విశ్వవిద్యాలయాల వీసీల నియామక ప్రక్రియను తప్పు పడుతూ, తప్పుకోవాల్సిందిగా ఆదేశించారు. అదీ అవాంఛనీయంగా ట్విట్టర్లో చెప్పారు. హైకోర్ట్ జోక్యంతో ఆ కథలో కొత్త దృశ్యం నవంబర్ మొదటి వారానికి వాయిదా పడిందో లేదో, ఓ విశ్వ విద్యాలయంలో ఆర్థిక మంత్రి ప్రసంగాన్ని తప్పుబడుతూ ఆరిఫ్ కొరడా తీశారు. అన్ని ప్రాంతాల వారినీ కలుపుకొనిపోతూ కేరళ విశ్వవిద్యాలయాలు ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నాయని మంత్రి గత వారం అన్నారు. విద్యార్థి నేతగా యూపీలోని విశ్వవిద్యాలయంలో చూసిన కాల్పుల ఘటనల్ని ప్రస్తావించారు. అది ఆరిఫ్‌కు సుతరామూ నచ్చినట్టు లేదు. దాంతో పరోక్షంగా పదవీచ్యుతుణ్ణి చేయమనే ప్రతిపాదన తెచ్చారనుకోవాలి. వరస చూస్తే– కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియుక్తులైన గవర్నర్, కేరళలో ప్రజలెన్నుకున్న వామపక్ష ప్రభుత్వంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారనిపిస్తుంది. అలాగని కొన్నిసార్లు ప్రజాప్రభుత్వాలు గవర్నర్ గౌరవాన్ని మరీ తేలికగా తీసుకున్న ఘటనలూ లేవనీ అనలేం. వీసీల నియామకంలో గవర్నర్ అధికారాలకు కత్తెర వేస్తూ వివాదాస్పద విద్యాబిల్లు తెచ్చినప్పటి నుంచి కేరళ సర్కార్‌కూ, ఆరిఫ్కూ మధ్య అగాధం ఏర్పడినట్టుంది. నిజానికి వీసీలు సహా వివిధ నియామకాల్లో లాంఛనపూర్వక పాత్ర పోషించాల్సిన గవర్నర్లు లక్ష్మణరేఖ దాటుతున్నా రనే ఆరోపణ తరచూ వింటున్నాం. గవర్నర్ పాత్రను మరింత పరిమితం చేసేందుకు ఆ మధ్య తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లోనూ ప్రయత్నాలు సాగడం గమనార్హం. రాజ్యాంగబద్ధమైన ఉన్నత నియామక పదవుల్లో ఉన్నవారు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కనీసం ఉన్నట్టయినా కనిపించాలి. అలాంటిది... కూర్చున్న కుర్చీని మర్చిపోయి, ఆ పదవికి కారణమైనవారి పట్ల మునుపటి ప్రభుభక్తిని ప్రదర్శించాలనుకుంటేనే సమస్య. గవర్నర్ పదవిలో రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలను మించి వ్యక్తిగత అజెండాకు తగ్గట్టు ప్రవర్తిద్దామనీ, ఆభిజాత్యం ప్రదర్శిద్దామనీ అనుకుంటే పదే పదే అగ్గి రాజుకుంటుంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ, పుదుచ్చేరి, తెలంగాణ రాష్ట్రాలు సహా ఇప్పుడు కేరళలోనూ జరుగుతోంది అదే. ఒకప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ సారథ్య ప్రభుత్వాలున్నప్పుడు పలు రాష్ట్రాల గవర్నర్లు ఇలాగే నాటి ప్రధానమంత్రుల చిత్తానుసారం వ్యవహరించేవారనే విమర్శలున్నాయి. అప్పట్లో వివిధ సందర్భాల్లో పలు రాష్ట్ర ప్రభుత్వాల రద్దు, ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధింపు ఇలాంటి ప్రభుభక్తి పరాయణత పర్యవసానమే. తెలుగునాట ప్రజాబలంతో గద్దెనెక్కిన ఎన్టీఆర్‌ను గవర్నర్ రామ్‌లాల్ పక్కకు తప్పించడం, ప్రజా ఉద్యమంతో ఎన్టీఆర్ తిరిగి పగ్గాలు చేపట్టడం, రామ్‌లాల్ కథ కంచికి చేరడం లాంటివన్నీ చరిత్రలో మర్చిపోలేని పాఠాలు. తమిళనాట గవర్నర్ చెన్నారెడ్డి వర్సెస్ సీఎం జయలలిత లాంటి కథలూ చూశాం. తాజాగా వివిధ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు కయ్యానికి కాలు దువ్వుతున్న తీరు అంతకన్నా ఒక మెట్టు పైనే ఉంది. పైకి ఇది సీఎంలకూ, గవర్నర్లకూ మధ్య కయ్యంగా కనిపించినా, అంతకన్నా లోతైన రాజకీయమే ఉంది. కేంద్ర పెద్దల ఆదేశంతో వీరిలా చేస్తున్నారో లేదో కానీ, అండ లేకుండానే ఈ దుస్సాహసాలకు దిగుతారనుకోలేం. రాష్ట్రం చేసే చట్టాలు, నియామకాలపై అభ్యంతరాలుంటే పునఃపరిశీలన కోరే అధికారం రాజ్యాంగం గవర్నర్లకిచ్చింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అంతకు మించి ఆ విచక్షణాధికారాల్ని ఉపయోగించే ప్రయత్నాలతోనే తంటా. అందుకే, కొందరు గవర్నర్ల తీరు మొత్తం ఆ వ్యవస్థకే అప్రతిష్ఠ తెస్తోంది. సమాఖ్య వ్యవస్థలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలనూ, వాటి నిర్ణయాలనూ పరి హాసం చేస్తున్న గవర్నర్ వ్యవస్థపై చర్చను ప్రేరేపిస్తోంది. ఇటు ప్రజాతీర్పుతో గద్దెనెక్కినవారు, అటు రాజ్యాంగ పదవిలో ఉన్నవారు తమ హక్కులు, బాధ్యతల్ని గుర్తెరిగి ప్రవర్తిస్తే వ్యవహారం ఇంత దూరం రాదు. మరీ ముఖ్యంగా, ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి నుంచి ఆ హుందాతనం మరింతగా ఆశిస్తాం. ఆ సంగతి ఆరిఫ్ లాంటి వారికి పదే పదే గుర్తుచేయాల్సి రావడమే విచారకరం. నిలువునా చీలిన నేటి రాజకీయ వాతావరణంలో ఈ పరిస్థితి మారుతుందా అన్నది అనుమానమే! -
ధర్మోరక్షతి రక్షితః
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. కోటానుకోట్ల యేళ్లు గడిచినా అది నిర్దేశిత కక్ష్యలోనే పరిభ్రమిస్తున్నది. కించిత్ గర్వమో, క్రోధమో, మోహమో ఆవహించి తన కక్ష్యను మార్చుకుంటే ఏమవుతుంది? రాశి చక్రం గతి తప్పుతుంది. దివారాత్రములు అంతర్ధానమవుతాయి. అండపిండ బ్రహ్మాండం అల్లకల్లోలమవుతుంది. మానవ పిపీలికం మటుమాయమవుతుంది. ఎన్ని యుగాలు గడిచినా, మరెన్ని మన్వంతరాలు కరిగిపోయినా అఖిలాండం మారలేదు. అంతరిక్షం మారలేదు. నక్షత్రాలు వాటి లక్ష్మణ రేఖల్ని దాటడం లేదు. గ్రహాలు వాటి ధర్మాన్ని మీరడం లేదు. భూలోకాన్ని ఆశ్ర యించిన ప్రకృతిశక్తులూ వాటి ధర్మాన్ని తప్పడం లేదు. నదులు పల్లానికే పారుతున్నాయి. గిరులు తరుల్ని మోస్తూనే ఉన్నాయి. ఎండావానా గాలీ వెన్నెల వాటి నియమం ప్రకారమే వచ్చి పోతున్నాయి. పులి శాకాహారం ముట్టలేదు. ఏనుగు మాంసా హారిగా మారితే రోజుకు ఎన్ని పీనుగులు కావాలో? మానవుని సాంఘిక జీవితాన్ని కట్టుబాట్లలో ఉంచడానికి రకరకాల రాజ్యవ్యవస్థలు ఉనికిలోకి వచ్చాయి. వాటన్నింటిలోకి అత్యున్నతమైనది, మానవీయమైనది, తాత్విక భూమిక కలిగినది ప్రజాస్వామ్యవ్యవస్థ. ఇక్కడ ప్రజలే ప్రభువులు. ప్రజల నుంచే అధికారం ప్రభవిస్తుంది. అందులోనూ లిఖిత రాజ్యాంగం, చెక్స్ అండ్ బ్యాలెన్స్‌లతో కూడిన పార్లమెంటరీ వ్యవస్థ మరింత శ్రేష్టమైనదని మేధావుల నిశ్చితాభిప్రాయం. అటువంటి సర్వశ్రేష్టతమ రాజ్యాంగ వ్యవస్థను మనకు ప్రసాదించిన అంబేడ్కర్ తదాది జాతియోధులు మనకు ప్రాతఃస్మరణీయులు. ప్రజలే రాజ్యాంగ నిర్మాతలని స్వయాన మన రాజ్యాంగమే ఘంటాపథంగా ప్రకటించింది. రాజ్యాంగ పీఠిక (preamble) మొట్టమొదటి వాక్యం ఈ దేశా ధికారం ఇక్కడ పుట్టిన ప్రతి పౌరుని చేతిలో ఉన్నదని సందేహాతీతంగా చాటి చెప్పింది. ‘భారత ప్రజలమైన మేము, మా దేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకుంటున్నామని’ మొదటి వాక్యం ప్రకటించింది. ఎందుకు ఈ రాజ్యాంగాన్ని భారత ప్రజలు రాసు కోవలసి వచ్చిందో కూడా తర్వాతి పంక్తుల్లో పీఠిక చెప్పింది. ‘ఈ దేశంలోని పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్నీ; ఆలోచనా, భావప్రకటన, విశ్వాసం, ఆరాధనల స్వాతంత్య్రాన్ని, అంతస్తులోనూ, అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడం కోసం; వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి ఈ రాజ్యాంగాన్ని ఆమోదించుకుంటున్నామని పీఠిక ప్రకటించింది. భారత రాజ్యాంగానికి ఈ పీఠిక ఆత్మ వంటిదని పలువురు న్యాయమూర్తులు, న్యాయశాస్త్ర కోవిదులు వివిధ సందర్భాల్లో ఉద్ఘాటించారు. చట్టసభలు చేసే శాసన నిర్మాణాలు కానీ, చేపట్టే రాజ్యాంగ సవరణలు కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని (basic structure) దెబ్బ తీయకూడదని గతంలోనే సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా ప్రకటించింది. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి దాని లక్ష్యాలకు నాలుగు వాక్యాల పీఠిక సూక్ష్మదర్శిని వంటిది. ఈ పీఠికలో పేర్కొన్నట్టు పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని చేకూర్చడానికి, ఆలోచనా భావప్రకటన విశ్వాసం ఆరాధనల స్వాతంత్య్రాన్ని సమకూర్చ డానికి, వారి వ్యక్తిత్వ గౌరవాన్ని (Dignity) ఇనుమడింప జేయ డానికి చేపట్టే ప్రతి చర్యా రాజ్యాంగ విహితమే. ఇందుకు విరు ద్ధంగా వ్యవహరించడం రాజ్యాంగ విద్రోహమవుతుంది. ఇటు చట్టసభలకూ, కార్యనిర్వాహక వర్గానికైనా, అటు న్యాయస్థానా లకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. మన రాజ్యాంగం మూడు వ్యవస్థల మధ్య అధికారాలను పంపిణీ చేసింది. రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభలతో (రాష్ట్రాల్లో గవర్నర్, అసెంబ్లీ, కౌన్సిల్) కూడిన శాసన వ్యవస్థ, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంట్ (రాష్ట్రాల్లో గవ ర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, అసెంబ్లీ)తో కూడిన కార్యనిర్వాహక వ్యవస్థ, సుప్రీంకోర్టు, రాష్ట్రాల హైకోర్టులతో కూడిన న్యాయవ్యవస్థ కలిసి భారత రాజ్యాధికార వ్యవస్థ తయా రైంది. ఇందులో ఎవరి విధులూ, అధికారాలు వాళ్లకు న్నాయి. ఎవరి పరిధిలో వాళ్లు పనిచేస్తున్నంతవరకూ మన ప్రజా స్వామ్యం ఆదర్శవంతంగా ఉన్నట్టు లెక్క. పరిధులు మీరి ప్రవ ర్తిస్తే మనుగడ ఉండదని ప్రకృతి సూత్రాలు మనకు బోధిస్తు న్నాయి. ఈ మూడు వ్యవస్థల్లో దేని ప్రత్యేకత దానిదే. రాజ్యాంగం తనకు తానే చెప్పుకున్నట్టు అది జనేచ్ఛ (general will))లోంచి జనించింది. ఐదేళ్లకోమారు జరిగే జనేచ్ఛ వెల్లడి ద్వారా పార్లమెంట్, శాసనసభలు ఏర్పడుతున్నాయి. కనుక రాజ్యాంగంతో చట్టసభలది రక్తసంబంధం. కార్యనిర్వాహక వర్గం చట్టసభల్లో భాగంగా ఉంటూ, వీటికి బాధ్యత వహిస్తూ అధికార చక్రాన్ని తిప్పుతుంది. కనుక రాజ్యాంగంతో దానిదీ రక్తసంబంధమే. న్యాయవ్యవస్థ మాత్రం జనేచ్ఛ ద్వారా ఏర్పడేది కాదు. కానీ, ప్రాథమిక జనేచ్ఛకు ప్రతిరూపమైన రాజ్యాం గానికి కాపలాదారుగా నిలబడినందు వలన దీనిది రక్షణ బంధం. జనేచ్ఛ అనే మాటను 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ రాజనీతి తత్వవేత్త రూసో ప్రయోగించాడు. పౌరుల స్వాతంత్య్రానికి, రాజ్యాధికారానికి మధ్యన వైరుధ్యం ఏమీ లేదని రూసో వాదన. ఎందుకంటే జనేచ్ఛలోంచి ఏర్పడేవే చట్టాలు. ఆ చట్టాలను అమ లుచేయడం స్వాతంత్య్రానికి భంగమెట్లా అవుతుందనేది రూసో ప్రశ్న. ఈ పద్దెనిమిదో శతాబ్దపు వ్యవహారం మనకు అప్రస్తుతమే అయినప్పటికీ, ఇందులో మనకో ముక్తాయింపు దొరుకుతుంది. అదేమిటంటే, మనకున్న మూడు రాజ్యాంగ వ్యవస్థలు సూత్ర ప్రాయంగా సమానమే అయినప్పటికీ చట్టసభలకు బాధ్యత వహించే కార్యనిర్వాహక వర్గం కొంచెం ఎక్కువ సమానం. కార్యనిర్వాహక వర్గానికి ఉన్న విస్తృతాధికారాల దృష్ట్యా భవిష్యత్తులో నిరంకుశంగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయి కనుక, అలా జరగకుండా ఉండేందుకని న్యాయ వ్యవస్థకు కొన్ని అధికారాలను రాజ్యాంగం కట్టబెట్టింది. రాజ్యాంగం నిబంధనలకు భిన్నంగా చేసే చట్టాలను కొట్టివేసే అధికారం, రాజ్యాంగానికి భాష్యం చెప్పే విశేషాధికారం న్యాయ వ్యవస్థకు ఉన్నాయి. ఈ అధికారాలను ఉపయోగించుకొని ఎన్నో ప్రజోపయోగకర తీర్పులను ఇచ్చిన ఘనత ఈ దేశ న్యాయ వ్యవస్థకు ఉన్నది. నల్లచట్టాల నుంచి ప్రజలను రక్షించడంలో, పౌరహక్కులను నిలబెట్టడంలో న్యాయవ్యవస్థ ఎన్నదగిన పాత్రను పోషించింది. ఎమర్జెన్సీ కాలం నుంచి రెండున్నర మూడు దశాబ్దాల పాటు ప్రజానుకూల ప్రగతిశీల దృక్పథంతో న్యాయవ్యవస్థ క్రియాశీల (Judicial activism) పాత్రను పోషించింది. ఇప్పుడు కూడా న్యాయవ్యవస్థలో క్రియాశీలత కని పిస్తూనే ఉన్నది. కాకపోతే, అందులో ప్రజానుకూలత, ప్రగతి శీలత ఏమేరకు ఉన్నాయనేదానిపై భిన్నాభిప్రాయాలు వెలువ డుతున్నాయి. జేఏజీ గ్రిఫిత్ అనే బ్రిటీష్ న్యాయశాస్త్ర కోవి దుడు 1977లో ‘పాలిటిక్స్ ఆఫ్ జ్యుడీషియరీ’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా న్యాయశాస్త్ర వర్గాల్లో సంచలనాన్ని రేకెత్తించింది. బ్రిటన్‌లో న్యాయవ్యవస్థ తటస్థత అనేది ఒక బ్రహ్మపదార్థమనీ, కేవలం భ్రమ మాత్రమేనని ఆయన ఆ పుస్తకంలో నిరూపించారు. అదే కాలంలో ఇండి యాలో న్యాయవ్యవస్థను క్రియాశీలం చేసిన ఆద్యుల్లో ఒకరైన జస్టిస్ కృష్ణయ్యర్ ఇదేరకమైన అభిప్రాయం కలిగి ఉండేవారు. మనదేశ న్యాయవ్యవస్థలో అత్యధికులు ధనికవర్గ పక్షపాతులని ఆయన ఆక్షేపించారు. రాజకీయ అభిప్రాయాలను కలిగి వుండటం తప్పుకాదు కానీ, వాటిని దాచిపెట్టి తాము తట స్థులమని చెప్పుకోవడమే పెద్ద తప్పని ఆయన అభిప్రాయపడే వారు. ఇదంతా ఈ దేశంలో సిద్ధాంతాల ప్రాతిపదికపై రాజకీ యాలు నడిపిన కాలం సంగతి. ఇప్పుడు రాజకీయాల్లో వ్యక్తుల ప్రాధాన్యత పెరిగింది. ఇప్పుడు కూడా అన్ని వ్యవస్థల్లో ఉన్నట్టే న్యాయవ్యవస్థలో కూడా రాజకీయాభిప్రాయాలు ఉండవచ్చు. అయితే వ్యవస్థ క్షీరనీర న్యాయాన్ని పాటించినంతవరకూ ప్రమాదం లేదు. వర్తమాన న్యాయవ్యవస్థ క్రియాశీలత (Judicial activism) గతంకంటే భిన్నమైనది. కార్యనిర్వాహక వ్యవస్థ పౌరహక్కుల మీద, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాల మీద దాడి చేయకుండా నిరోధించడం నాటి క్రియాశీలత లక్ష్యం. అదొక రక్షణాత్మక వైఖరి. ప్రస్తుత క్రియాశీలత కార్యనిర్వాహక వర్గం అధికార పరిధిల్లోకి ప్రవేశిస్తున్నదని పలువురు మేధావులు ఆక్షేపిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాలను కూడా తామే తీసు కుంటామని ఇటీవల న్యాయవ్యవస్థ పలుమార్లు ప్రకటించడం జరిగింది. కార్యనిర్వాహకవర్గం పాత్రను కూడా న్యాయవ్యవస్థ పోషించడం మొదలుపెడితే ప్రజాభిప్రాయానికి ఇక విలువే ముంటుందో, ప్రజాస్వామ్యం ఎలా మనుగడ సాగిస్తుందో చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. న్యాయంగా ఉండటం మాత్రమే కాదు న్యాయంగా ఉన్నట్టు కనిపించాలి కూడా అంటారు. వ్యవస్థల పట్ల ప్రజలు నమ్మకం కోల్పోగూడదనే అర్థంలో అలా అంటారు. ఒకే రకమైన కేసులో రెండు భిన్నమైన తీర్పులు చూడండి. టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది. పరీక్షల ద్వారా వారి మెరిట్‌ను నిర్ధా రించి చూపకపోతే భవిష్యత్‌లో ప్రతిష్టాత్మక సంస్థల్లో విద్యార్థు లకు సీట్లు లభించవన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఖరి తీసుకున్నది. కేరళ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అవలంబిం చింది. రెండు రాష్ట్రాల మీద సుప్రీంకోర్టులోనే పిటీషన్లు పడ్డాయి. ఏపీ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం పరుష వ్యాఖ్యలు చేసింది. పిల్లలెవరైనా కోవిడ్ వల్ల చనిపోతే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? అని ప్రశ్నించింది. కేరళ కేసులో అదే బెంచ్ రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో మేం జోక్యం చేసుకోలే మని అంతక్రితం చెప్పింది. విషయం ఒక్కటే. భిన్నమైన వ్యాఖ్యానాలు. ఇందులో సామాన్యులకు అర్థం కాని ధర్మ సూక్ష్మాలు, సాంకేతిక అంశాలు ఏమైనా ఉంటే ఉండవచ్చు. కానీ జనంలోకి ఏ సందేశం వెళ్లిందో గమనించాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలనే తీసుకుందాము. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు గత యేడాది మార్చిలోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మరో వారం పదిరోజులు గడిస్తే ఎన్నికలు పూర్తయ్యేవి. అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వాయిదా వేశారు. ఆయన ఎందుకలా చేశారనేది మరో పిట్టకథ. ఎన్నికల వ్యవ హారం అనేక న్యాయ మలుపులు తిరిగి ఎట్టకేలకు మొన్న ఏప్రి ల్లో జరిగాయి. ఫలితాలు ప్రకటించవలసి ఉన్నది. మళ్లీ కథ కోర్టుకెక్కింది. జరిగిన ఎన్నికలను రద్దుచేస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. పనిలో పనిగా ఈ తీర్పుతోపాటు కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని వార్తలు వచ్చాయి. వాటిపై ధర్మాసనం ముందు దాఖలుచేసిన అప్పీల్లో ఆమె అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. పౌరులకు దక్కవలసిన రాజకీయన్యాయం ఏడాదిన్నర కాలంగా త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నది. దేశ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా బలహీనవర్గాల ప్రజలకు 30 లక్షల ఇళ్లను కట్టించి ఇవ్వాలని ఆ ప్రభుత్వం సంకల్పం చెప్పుకున్నది. రాజ కీయ ప్రత్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఏడాది పైగా ఒక గొప్ప కార్యక్రమాన్ని అడ్డుకోగలిగారు. ఇప్పటికీ 3 లక్షల ఇళ్ల నిర్మాణం ఆగిపోయే వుంది. మహిళా సాధికారతను మరో అంతస్తుపైకి చేర్చే మహత్తర కార్యక్రమం ఇది. రాజ్యాంగ పీఠిక అభిలషించినట్టు వ్యక్తిగత గౌరవాన్ని (dignity ఇనుమడిం పజేసే కార్యక్రమం ఇది. రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యక్తిగత కక్షతో రగిలిపోతున్న రఘురామరాజు అనే ఆర్థిక నేరస్తుడు కేసు వేస్తే ప్రజోపయోగకరమైన అమూల్ కార్యక్రమం ఆగిపోవలసిన అవ సరం ఉన్నదా?. సదరు రఘురామరాజుకు సరస్వతి పవర్‌పై పిటిషన్ వేయడానికి ఉన్న అర్హతలేమిటి?. గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేసి ప్రభుత్వ పాలనను జనానికి చేరువ చేయడం నేరమా?. ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికి ఆ హక్కు లేదా?. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రిపై గత ప్రభుత్వం వివిధ పోలీస్ స్టేషన్లలో రాజకీయ కేసులు పెట్టింది. ఫిర్యాదుదారులు ఉపసంహరించుకోవడంతో మేజిస్ట్రేట్లు కేసులను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇటువంటి కేసులు దేశంలోని రాజకీయ నాయ కులందరిపైనా దాఖలవుతాయి. తర్వాత వాటిని ఉపసంహరిం చుకోడమూ రివాజే. గత ప్రభుత్వ పెద్దలు అనేకమందిపై ఇటు వంటి కేసులు నమోదయ్యాయి. వాటి ఉపసంహరణ కూడా జరిగింది. కానీ ప్రస్తుత సీఎంపై ఉపసంహరించిన కేసులన్నిం టినీ క్రోడీకరించి విచారణ జరుపుతామని హైకోర్టు సుమోటో ప్రకటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇవి కొన్ని ఉదా హరణలు మాత్రమే. ఎన్నికైన ప్రజా ప్రభుత్వం సాఫీగా పని చేయకుండా రాజకీయ ప్రత్యర్థులు న్యాయవ్యవస్థ భుజాలపై తుపాకీని మోపి కాల్పులు జరపడం ఎంతవరకు న్యాయం?. అదనులో వానలు కురవాలనీ, శీతాకాలం కోత పెడుతున్న ప్పుడు ఎండలు కాయాలనీ కోరుకుంటాము. ప్రకృతి మనల్ని ఎన్నడూ నిరాశపరచలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలు కూడా వాటి ధర్మాన్ని అవి నిర్వర్తించాలని కోరుకోవడం తప్పు కాదు. ధర్మాన్ని మనం కాపాడితేనే కదా... ధర్మం మనల్ని కాపాడేది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కవ్వింపు... బెదిరింపు!
రాజ్యాంగబద్ధమైన సంస్థలను స్వార్థ రాజకీయ శక్తులు కబ్జా చేస్తే ఫలితం ఎలా ఉంటుందో తేటతెల్లమైంది. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఇచ్చిన సూచనను బేఖాతరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడం కచ్చితంగా కవ్వింపు చర్యేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2018లో జరగవలసిన రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలను అప్పటి సీఎం చంద్రబాబు అభీష్టం మేరకు జరపకుండా ఎన్నికల కమి షన్ ఏడాదిపాటు కాలయాపన చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధపడినప్పుడు, నామి నేషన్ల ఘట్టం కూడా ముగిసిన తర్వాత ఇంకా రాష్ట్రంలోకి ప్రవే శించని కరోనాను సాకుగా చూపి వాయిదా వేసింది. ఇప్పుడు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ప్రజాసంక్షేమం దృష్ట్యా కొద్ది కాలం వాయిదా వేయాలన్న ప్రభుత్వ సూచనను పెడచెవిన పెట్టింది. ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న ఈ ద్వంద్వ ప్రమాణాల వెనుక ఒక రాజకీయ ఎజెండా వుందన్న నిజం ప్రజాస్వామ్యప్రియులకు ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం సలహా సంప్రదింపులతో వ్యవహరించాలన్న రాజ్యాంగ నిర్దేశకత్వాన్ని తుంగలో తొక్కి ఎన్నికల కమిష నర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ శనివారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ మాటల్లో ఉద్యోగులపట్ల బెదిరింపు ధోరణి ధ్వనించింది. ఆ తర్వాత మీడియా సందేహాలకు సమాధానం చెప్పకుండానే ఆయన నిష్క్రమించారు. స్థానిక ఎన్నికల వ్యవహారంపై కమిష నర్ మొదటినుంచీ వ్యవహరిస్తున్న తీరుపట్ల జన సామాన్యంలో అనేక ప్రశ్నలు తలెత్తాయి. వాటిని కమిషనర్ దృష్టికి మీడియా తీసుకొనిపోవడానికి ప్రయత్నించింది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం తనకు లేదని ఆ నిష్క్రమణ ద్వారా వెల్లడైంది. తన ఏకపక్ష ప్రసంగంలో స్థానిక ఎన్నికల నిర్వహణ తన రాజ్యాంగ బాధ్యతగా, ప్రజాస్వామ్య కర్తవ్యంగా ఆయన చెప్పుకున్నారు. ఈ అంశంపై మీడియా దగ్గర ప్రశ్నాస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ సంగతి ఆయనకు కూడా తెలుసు. వాటికి తన దగ్గర సమాధానం లేదని కూడా తెలుసు. అందుకే కాలికి బుద్ధి చెప్పారు. స్థానిక ఎన్నికల కాలపరిమితి 2018లోనే పూర్తయింది. ఆ సంవత్సరం జూన్‌లోనే ఎన్నికలు జరగాలి. కానీ అప్పటి ప్రభుత్వం అందుకు సిద్ధపడలేదు. ఆ తర్వాత ఏడాదిపాటు అదే ప్రభుత్వం అధికారంలో వుంది. ఇదే కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కిమ్మనలేదు. నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. రాజ్యాంగ బాధ్యత అప్పుడెందుకు గుర్తుకు రాలేదన్న ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేదు. అందుకనే ముందుగానే ‘ఇచ్చట ప్రశ్నించరాదు’ అనే నిబంధన పెట్టుకుని తన ధర్మోప న్యాసం పూర్తికాగానే వడివడిగా వెళ్లిపోయారు. ప్రస్తుత ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధపడింది. మార్చిలో ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. గణనీయమైన సంఖ్యలో ఏకగ్రీవాలు కూడా జరిగాయి. అప్పటికి రాష్ట్రంలో ఇంకా కరోనా ప్రవేశించలేదు.. రోజుకు ఒకటి రెండు కేసులు కూడా నమోదు కావడం లేదు. ఈ దశలో ఉన్నట్టుండి హఠా త్తుగా ఎక్కడినుంచో ఒక సందేశం అందినట్టుగా ఎన్నికల కమిషనర్ మీడియాను పిలిచారు. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వాయిదాకు ముందు ప్రభు త్వాధికారులతో సంప్రదింపులు జరపాలన్న రాజ్యాంగ బాధ్యత ఆ క్షణం ఆయనకు గుర్తుకు రాలేదు. కరోనా భయంతోనే ఎన్ని కలు వాయిదా వేసినప్పుడు ఆ కరోనాపై పోరాడిన ‘ఫ్రంట్ లైన్ వారియర్స్’కు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జరుగుతున్న సమ యంలోనే ఎన్నికలకు వెళ్లడం వైరుధ్యం కాదా? ఇది ద్వంద్వ ప్రవృత్తి కాదా? ఈ ప్రశ్నలకు ఆయన స్క్రిప్టులో సమాధానం లేదు. అందుచేత స్క్రిప్టు మాత్రమే చదివి విలేకరులు అభ్యంతరం చెబుతున్నా వినకుండా చకచకా వెళ్లిపోయారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సగంలో ఉండగా వాయిదా వేసి, ఇప్పుడు వాటి ఊసు లేకుండా పంచాయతీ ఎన్నికలను ప్రారంభించడం వెనుక రహస్యమేమిటో వెల్లడిచేయాలని ప్రశ్నిస్తే చెప్పలేని అసహ్యకరమైన పరిస్థితిని తప్పించుకోవాలని కావచ్చు.. ఆయన దాదాపుగా పరుగుపెట్టినట్టుగా వెళ్లిపోయారు. ‘మీరు మాత్రం విలేకరుల సమావేశానికే మాస్క్ ధరించి వచ్చి, గ్లాస్ షీల్డ్ వెన కాల కూర్చొని సకల జాగ్రత్తలతో స్క్రిప్టు చదివారే... మరి లక్ష లాదిమంది ఉద్యోగులు వారాల తరబడి కోట్లాదిమంది ఓటర్లు పాల్గొనే క్రతువులో ఎలా పాల్గొంటారని’ ప్రశ్నిస్తే ఏమని సమా ధానం చెప్పగలరాయన. అందుకే ఎవరూ ‘ప్రశ్నించగూడని’ మీడియా సమావేశంలో నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. భారతదేశ చరిత్రలో ఏ ఎన్నికల కమిషనర్ కూడా ప్రశ్నలు నిషేధించి మీడియా సమావేశం నిర్వహించిన ఘటన ఒక్కటి కూడా జరగలేదు. ప్రజాస్వామ్యానికి అండగా నిలవ వలసిన ఎన్నికల సంఘమే ప్రజలకున్న తెలుసుకునే హక్కు కాలరాయడం ఏరకంగా సమర్ధనీయమవుతుంది? ఉద్యోగులను బెదిరించే ధోరణిలో కమిషనర్ ప్రసంగం నడి చింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయని, మరి కొన్ని రాష్ట్రాల్లో ఈ సంవత్సరం జరగబోతున్నాయనీ, ఆ రాష్ట్రాల ఉద్యోగులకు లేని అభ్యంతరం మీకెందుకని నిమ్మగడ్డ ప్రశ్నిం చారు. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన మాట వాస్తవమే. ఎన్నికల ఫలితంగా మళ్లీ మా రాష్ట్రాల్లో కోవిడ్ విజృంభించిందని కేరళ, మహారాష్ట్ర మంత్రులే స్వయంగా ప్రకటించారు. అంత కంటే ముఖ్య విషయం: ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే నాటికి దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కాలేదు. వ్యాక్సి నేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం కోవిడ్‌పై పోరాడిన ‘ఫ్రంట్‌లైన్ వారియర్స్’ తొలి రెండు దశ ల్లోనే వ్యాక్సిన్ తీసుకోవలసి వుంటుంది. స్థానిక ఎన్నికల్లో క్రియా శీలక పాత్ర పోషించవలసిన లక్షలాదిమంది ఉద్యోగులు ‘ఫ్రంట్ లైన్ వారియర్స్’ కేటగిరీలోకి వస్తారు. వ్యాక్సిన్‌ను రెండు డోసు లుగా తీసుకోవాలి. ఈ రెండు డోసుల నడుమ నాలుగు వారాల వ్యవధి ఉండాలి. ఈ వ్యవధిలో వారిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తకుండా ఉండటానికి వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి. రెండో డోసు తర్వాత 60 రోజులకు వారిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందుతాయి. అంటే మొత్తం 3 నెలల షెడ్యూల్ ఈ కార్యక్రమం. ‘ఫ్రంట్‌లైన్ వారియర్స్’గా పనిచేసిన మెజారిటీ ఉద్యోగులు వ్యాక్సినేషన్ షెడ్యూల్ పీరియడ్‌లో ఉండగా ఎన్నికల విధుల్లో వేలాదిమంది జనసందోహంతో ఎలా క్రియాశీలకంగా వ్యవహ రించగలరు?. వివిధ రాష్ట్రాల్లో ఈ ఏడాది జరగబోయే ఎన్నికల తేదీలు కూడా ఫ్రంట్‌లైన్ వారియర్స్కిస్తున్న వ్యాక్సిన్ షెడ్యూల్ పూర్తయిన తర్వాతనే ఉన్నాయనే విషయం కూడా గమనంలోకి తీసుకోవాలి. కనుక ఇతర రాష్ట్రాల ఉదాహర ణలు చూపెట్టి ఉద్యోగులను బెదిరించడానికి కమిషనర్ చేసిన వాదన చెల్లదు. మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న రెండో దశలో యాభయ్యేళ్లు దాటిన వయోధికులందరికీ వ్యాక్సిన్ ఇవ్వ నున్నారు. వీరితోపాటు దీర్ఘకాలిక వ్యాధులున్న ఇతరులు కూడా వ్యాక్సిన్ తీసుకోవలసి ఉంటుంది. ఈ సెక్షన్స్ మీదనే కరోనా మహమ్మారి ఎక్కువగా తన ప్రతాపాన్ని చూపెట్టింది. వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న జనాభా ఇది. వ్యాక్సిన్ షెడ్యూల్ పూర్తయ్యేవరకు వీళ్లెవరూ ససేమిరా జనసందోహం లోకి వెళ్లరు. వీళ్లెవరూ పోటీ చేయడానికి కానీ, ప్రచారం చేయ డానికి కానీ, ఓటేయడానికి కానీ సాహసించరు. వీళ్లందరి ప్రజా స్వామిక హక్కును హరించే అధికారం మీకెవరిచ్చారు?. ఎన్ని కల కమిషన్ ప్రజాస్వామ్యానికి అండగా ఉన్నట్టా? గుది బండగా మారినట్టా? ఆలోచించవలసిన తరుణమిది. వివిధ రాజ్యాంగ సంస్థల నడుమ ఏర్పడే వివాదాల్లో సాధారణంగా న్యాయస్థానాలు ఎక్కువ జోక్యం చేసుకోకుండా సాంకేతిక అంశాల ఆధారంగా ప్రొసీజర్‌ను ఫాలో అవుతుం టాయి. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా క్రియాశీలకంగా ఉండే తీర్పులను సైతం కొన్ని సందర్భాల్లో ఇస్తుంటాయి. న్యాయ స్థానాల్లో ఇప్పటికీ వర్చువల్ పద్ధతిలోనే విచారణలు జరుగు తున్న వాస్తవికత కూడా దేశంలోని కోవిడ్ పరిస్థితికి అద్దంపడు తున్నది. కేరళలో ఒక దశలో నియంత్రణలోకి వచ్చిన కోవిడ్, స్థానిక ఎన్నికల తర్వాత ఆందోళనకరంగా విస్తరించింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో ప్రశంసనీయమైన పనితీరు కనబరి చిన కేరళ ఆరోగ్యమంత్రి శైలజా టీచర్ స్వయంగా ఈ విష యాన్ని ప్రకటించారు. మహారాష్ట్రలోను ఇదే పరిస్థితి ఎదురైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు తగ్గుముఖం పట్టిన వైరస్ వ్యాప్తి ఇప్పుడు మళ్లీ విజృంభించి రోజుకు నాలుగు వేలమంది చనిపోతున్నారు. క్షేత్రస్థాయి వాస్తవికతను సరిగ్గా అంచనా వేయ గలిగినవారు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన ప్రభుత్వో ద్యోగులు మాత్రమే. ఆ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే అన్ని రకాల సంఘాలు ముక్తకంఠంతో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొ నబోమని చెబుతున్నాయి. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఇప్పటికే ఉద్యోగులు చాలా త్యాగాలు చేశారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖే 109 మంది ప్రాణాలను బలిపెట్టింది. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలనూ ఇటువంటి విషాదమే వెన్నాడుతున్నది. అందుకే వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాతనే ఎన్నికల్లో పాల్గొం టామని వారు ఖండితంగా చెబుతున్నారు. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం వారిస్తున్నా, ఉద్యోగులు హెచ్చరి స్తున్నా, వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టాలని కేంద్రం ఆదేశాలిస్తున్నా వినకుండా ఎన్నికల కమిషన్ ఇంత మొండిగా ఎందుకు వ్యవహ రిస్తున్నది?. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత సూచనల మేరకే ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్నదని రాష్ట్రంలోని అత్య ధిక ప్రజానీకం బలంగా విశ్వసిస్తున్నది. అందుకు స్వయంగా ఆయన వ్యవహార శైలే అవకాశం కల్పించింది. ఢిల్లీలో తన లాబీ యింగ్కోసం స్వయంగా చంద్రబాబే బీజేపీలో ప్రతిష్టించిన ఆయన కోటరీ సభ్యులను హైదరాబాద్‌లోని ఒక సెవెన్‌స్టార్ హోటల్లో రహస్యంగా కలవాల్సిన అవసరం ఎన్నికల కమిషన ర్కు ఏముంటుంది? ఈ విషయం బయటకు పొక్కిన తర్వాత కూడా ఆయన ఎటువంటి వివరణ ఇవ్వకపోవడం వలన బాబుతో ఆయన బంధంపై ఉన్న అనుమానాలు బలపడ్డాయి. స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన నేపథ్యంలో గత సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రిపై చౌకబారు ఆరోపణలతో కేంద్ర హోం శాఖకు ఒక లేఖ వెళ్లింది. అందులో వాడిన భాష తెలుగుదేశం నేతల స్థాయికి తగినట్టుగా ఉండడమే కాక, ఆ పార్టీ కార్యా లయం నుంచే ఎంపిక చేసుకున్న మీడియాకు లీకయింది. ఆ లేఖపై ఎన్నికల కమిషనర్ పేరుతో సంతకం వుంది. తానే ఆ లేఖను రాసినట్టు ఆ తర్వాత ఆయన స్వయంగా ప్రకటించు కోవలసి వచ్చింది. ఇక స్థానిక సమరానికి సంబంధించి వేర్వేరు సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరు ఆయనకు తెలుగు దేశం పార్టీతో ఉన్న అనుబంధాన్ని మరింత రూఢీ చేసింది. ఆ పార్టీ అధినేత సూచన ప్రకారమే ఇప్పుడు స్థానిక ఎన్నికలకు ఆయన తహతహలాడుతున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఈ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీకి ఎందుకంత ఉత్సాహం? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టబోతున్నదా? అటువంటి భ్రమలేమీ ఆ పార్టీకి లేవు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనెలతో ఇరవై నెలల కాలం పూర్తవుతుంది. ఇందులో ఎక్కువ కాలాన్ని కరోనా కాటే సింది. అయినప్పటికీ ఆయన పరిపాలనా తీరుకు ప్రజలు హర్షా మోదాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన జాతీయస్థాయి సంస్థలు జరిపిన అన్ని సర్వేల్లోనూ ఈ విషయం స్పష్టమైంది. ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో వరసగా టాప్ ‘త్రీ’లో వైఎస్ జగన్ స్థానం సంపాదిస్తున్నారు. నిండా రెండేళ్ల పదవీ కాలం కూడా పూర్తికాకుండానే ఒక యువ ముఖ్యమంత్రి సాధిం చిన అసాధారణ ఘనత ఇది. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో పటిష్టమైన ప్రజారోగ్య వ్యవస్థ ఉన్న కేరళను కూడా అధిగమించి ఆంధ్రప్రదేశ్ జాతీయస్థాయిలో నంబర్ వన్‌గా నిలబడింది. ముఖ్యమంత్రికి లభిస్తున్న ఆదరణ, పెరుగుతున్న ఇమేజ్ చంద్ర బాబుకు దుర్భరంగా తయారయ్యాయి. అసూయా రుగ్మత ఆయన్ను దహించివేస్తున్నది. బహుశా నిద్రాహారాలకు కూడా దూరమై ఉంటారు. అందువల్లనే కాబోలు, శ్రీకాకుళం జిల్లాలో కొందరు తెలుగుదేశం నాయకులు నంది విగ్రహాన్ని దొంగిలిం చిన కేసులో చాలా విచిత్రంగా మాట్లాడారు. ‘అయితే తప్పేంటి?’ అనే డైలాగ్ ‘మావాళ్లు బ్రీఫ్డ్ మీ’ స్థాయిలో పాపు లర్ అయింది. ఈ రుగ్మత తగ్గాలంటే జగన్ ప్రభుత్వానికి ఎంతో కొంత చెడ్డపేరు తీసుకురావాలి. అందుకు మార్గమేమిటి?. ఎన్ని కల పేరుతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని భ్రష్టుపట్టిస్తే, మళ్లీ కరోనా వ్యాపించి ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్ట పలచనవుతుందనే ఒక కుత్సిత ఆలోచన. చంద్రబాబు వేసిన ఈ ఎన్నికల ఎత్తు గడకు ఇంతకుమించి మరో కారణం కనిపించడం లేదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ప్రమాదకరంగా దేశ రాజకీయాలు
ఆసిఫాబాద్ క్రైం: దేశంలో రాజకీయాలు ప్రమాదకరంగా మారాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆసిఫాబాద్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలక వర్గాలు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని, నిరసన తెలిపిన వారిని హింసిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఈ నెల 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరిగే జాతీయ మహాసభలో భవిషత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. -
సాధికారత కోసం...
మన రాజ్యాంగ వ్యవస్థ మహిళల రక్షణ కోసం కల్పించిన ముఖ్యమైన సౌకర్యాలు ఇవి. న్యాయపరంగా పోరాడాల్సిన ఈ చట్టాలతో సాధికారత సాధన జరుగుతుందా అంటే... అదొక్కటే మార్గం అని కాదు. న్యాయపోరాటం చివరి అంశమే కావచ్చు. కానీ ఇలాంటి రక్షణ వ్యవస్థ ఉందనే స్పృహ ఆమెలో భరోసాని కలిగిస్తుంది. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిలో భయానికి కారణమవుతుంది. మహిళ పట్ల గౌరవంతో ఆమెకు ఇబ్బంది కలిగించకుండా మెలిగే సంస్కారం ఉన్నప్పుడు ఇలాంటి చట్టాల అవసరం అంతగా ఉండకపోవచ్చు. అయితే అలాంటి సంస్కారం లోపించినప్పుడు ఇలాంటి చట్టాల రక్షణ గొడుగులు అవసరమే. ఈ చట్టాలన్నీ... మహిళకు సాధికారత సాధనలో వెనుకడుగు వేయాల్సిన పరిస్థితిని రానివ్వకుండా ఆమెకు తోడుగా ఉండే బాంధవ్యసాధనాలు. -
విశ్వసనీయతపైనే రాజ్యాంగ వ్యవస్థల మనుగడ
- శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల కంటే ప్రజలు న్యాయ వ్యవస్థపైనే ఎక్కువ బాధ్యత ఉంచారు - న్యాయమూర్తులకు పదవీ విరమణ వరకూ నిత్యం కఠిన పరీక్షలు తప్పవు.. - జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఉద్ఘాటన - ముగిసిన ఉభయ రాష్ట్రాల న్యాయాధికారుల సమావేశం - ఇకపై మూడేళ్లకొకసారి నిర్వహణ - స్పష్టం చేసిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే సాక్షి, హైదరాబాద్: దేశంలోని శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు కాలానుగుణంగా పరీక్షలు ఎదుర్కొంటుంటే న్యాయవ్యవస్థ మాత్రం రోజూ కఠిన పరీక్షలు ఎదుర్కొంటోందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. విశ్వసనీయతతోనే ఈ పరీక్షల్లో నెగ్గడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ విశ్వసనీయత సాయంతో న్యాయవ్యవస్థను కాపాడాలని న్యాయాధికారులకు పిలుపునిచ్చారు. రాజ్యాంగ వ్యవస్థల మనుగడ సైతం విశ్వసనీయతపైనే ఆధారపడి ఉందన్నారు. పరిస్థితులు ఏవైనా, ఎలా ఉన్నా అంతిమంగా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత న్యాయమూర్తులపైనేఉంటుందని స్పష్టం చేశారు. ఆదివారం హోటల్ మారియట్‌లో జరిగిన ఉభయ రాష్ట్రాల న్యాయాధికారుల రాష్ట్రస్థాయి సమావేశం ముగింపు కార్యక్రమానికి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. 2006లో జరిగిన న్యాయాధికారుల రాష్ట్రస్థాయి సదస్సు దశాబ్దంగా మళ్లీ జరగకపోవడం దురదృష్టకరమన్నారు. శాసన వ్యవస్థకు ప్రతి ఐదేళ్లకోసారి పరీక్ష ఉంటుందన్నారు. అందులో ప్రజాప్రతినిధులను ప్రజలు సామూహికంగా ఇంటికి పంపే అవకాశం ఉందని, న్యాయవ్యవస్థలో మాత్రం ఇలాంటి పరీక్ష ఉండదన్నారు. న్యాయమూర్తులు పదవీ విరమణ వరకు విధుల్లో ఉంటారని, అప్పటివరకు కఠిన పరీక్ష ఎదుర్కొంటూనే ఉంటారన్నారు. విడాకులు, రుణ సంబంధ, ఆస్తి పంపక వివాద కేసులను కక్షిదారులు తమ యుక్త వయస్సులో దాఖలు చేస్తుంటే.. అవి తేలే సమయానికి వారు వృద్ధాప్యంలోకి వెళుతున్నారన్నారు. ఎక్కడ లోపం ఉందో తెలుసుకోవాలని, అది వ్యవస్థాగత లోపమా? లేక మన లోపమా? అని గుర్తించాల్సినఅవసరం ఉందని చెప్పారు. అంతకుముందు జస్టిస్ బొసాలే మాట్లాడుతూ.. ఇకపై ప్రతీ మూడేళ్లకోసారి న్యాయాధికారుల సమావేశం, ఏటా జిల్లా జడ్జీలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కాగా, ఈ సమావేశంలో వివిధ అంశాలపై జరిగిన చర్చల సారాంశాన్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌కు వివరించారు. ఈ సందర్భంగా జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి మాట్లాడుతూ న్యాయమూర్తులు తమ కలంతోనే మాట్లాడుతారని, వారికి కలమే బలమన్నారు. కేరళ న్యాయవ్యవస్థలో అవినీతి ఎంతమాత్రం లేదని, ఉభయ రాష్ట్రాల్లోనూ అవినీతిరహిత న్యాయవ్యవస్థ తయారు చేయడమే మనందరి లక్ష్యం కావాలన్నారు.