కవ్వింపు... బెదిరింపు! | Vardelli Murali Guest Column On Constitutional Institutions | Sakshi
Sakshi News home page

కవ్వింపు... బెదిరింపు!

Published Sun, Jan 24 2021 1:40 AM | Last Updated on Sun, Jan 24 2021 4:36 AM

Vardelli Murali Guest Column On Constitutional Institutions - Sakshi

రాజ్యాంగబద్ధమైన సంస్థలను స్వార్థ రాజకీయ శక్తులు కబ్జా చేస్తే ఫలితం ఎలా ఉంటుందో తేటతెల్లమైంది. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఇచ్చిన సూచనను బేఖాతరు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేయడం కచ్చితంగా కవ్వింపు చర్యేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2018లో జరగవలసిన రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలను అప్పటి సీఎం చంద్రబాబు అభీష్టం మేరకు జరపకుండా ఎన్నికల కమి షన్‌ ఏడాదిపాటు కాలయాపన చేసింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధపడినప్పుడు, నామి నేషన్ల ఘట్టం కూడా ముగిసిన తర్వాత ఇంకా రాష్ట్రంలోకి ప్రవే శించని కరోనాను సాకుగా చూపి వాయిదా వేసింది. ఇప్పుడు కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ప్రజాసంక్షేమం దృష్ట్యా కొద్ది కాలం వాయిదా వేయాలన్న ప్రభుత్వ సూచనను పెడచెవిన పెట్టింది. ఎన్నికల కమిషన్‌ అనుసరిస్తున్న ఈ ద్వంద్వ ప్రమాణాల వెనుక ఒక రాజకీయ ఎజెండా వుందన్న నిజం ప్రజాస్వామ్యప్రియులకు ఆందోళన కలిగిస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వం సలహా సంప్రదింపులతో వ్యవహరించాలన్న రాజ్యాంగ నిర్దేశకత్వాన్ని తుంగలో తొక్కి ఎన్నికల కమిష నర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ శనివారం నాడు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ మాటల్లో ఉద్యోగులపట్ల బెదిరింపు ధోరణి ధ్వనించింది. ఆ తర్వాత మీడియా సందేహాలకు సమాధానం చెప్పకుండానే ఆయన నిష్క్రమించారు. స్థానిక ఎన్నికల వ్యవహారంపై కమిష నర్‌ మొదటినుంచీ వ్యవహరిస్తున్న తీరుపట్ల జన సామాన్యంలో అనేక ప్రశ్నలు తలెత్తాయి. వాటిని కమిషనర్‌ దృష్టికి మీడియా తీసుకొనిపోవడానికి ప్రయత్నించింది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం తనకు లేదని ఆ నిష్క్రమణ ద్వారా వెల్లడైంది. తన ఏకపక్ష ప్రసంగంలో స్థానిక ఎన్నికల నిర్వహణ తన రాజ్యాంగ బాధ్యతగా, ప్రజాస్వామ్య కర్తవ్యంగా ఆయన చెప్పుకున్నారు. ఈ అంశంపై మీడియా దగ్గర ప్రశ్నాస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ సంగతి ఆయనకు కూడా తెలుసు. వాటికి తన దగ్గర సమాధానం లేదని కూడా తెలుసు. అందుకే కాలికి బుద్ధి చెప్పారు.

స్థానిక ఎన్నికల కాలపరిమితి 2018లోనే పూర్తయింది. ఆ సంవత్సరం జూన్‌లోనే ఎన్నికలు జరగాలి. కానీ అప్పటి ప్రభుత్వం అందుకు సిద్ధపడలేదు. ఆ తర్వాత ఏడాదిపాటు అదే ప్రభుత్వం అధికారంలో వుంది. ఇదే కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కిమ్మనలేదు. నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. రాజ్యాంగ బాధ్యత అప్పుడెందుకు గుర్తుకు రాలేదన్న ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేదు. అందుకనే ముందుగానే ‘ఇచ్చట ప్రశ్నించరాదు’ అనే నిబంధన పెట్టుకుని తన ధర్మోప న్యాసం పూర్తికాగానే వడివడిగా వెళ్లిపోయారు.

ప్రస్తుత ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధపడింది. మార్చిలో ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీలకు నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. గణనీయమైన సంఖ్యలో ఏకగ్రీవాలు కూడా జరిగాయి. అప్పటికి రాష్ట్రంలో ఇంకా కరోనా ప్రవేశించలేదు.. రోజుకు ఒకటి రెండు కేసులు కూడా నమోదు కావడం లేదు. ఈ దశలో ఉన్నట్టుండి హఠా త్తుగా ఎక్కడినుంచో ఒక సందేశం అందినట్టుగా ఎన్నికల కమిషనర్‌ మీడియాను పిలిచారు. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వాయిదాకు ముందు ప్రభు త్వాధికారులతో సంప్రదింపులు జరపాలన్న రాజ్యాంగ బాధ్యత ఆ క్షణం ఆయనకు గుర్తుకు రాలేదు. కరోనా భయంతోనే ఎన్ని కలు వాయిదా వేసినప్పుడు ఆ కరోనాపై పోరాడిన ‘ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌’కు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ జరుగుతున్న సమ యంలోనే ఎన్నికలకు వెళ్లడం వైరుధ్యం కాదా? ఇది ద్వంద్వ ప్రవృత్తి కాదా? ఈ ప్రశ్నలకు ఆయన స్క్రిప్టులో సమాధానం లేదు. అందుచేత స్క్రిప్టు మాత్రమే చదివి విలేకరులు అభ్యంతరం చెబుతున్నా వినకుండా చకచకా వెళ్లిపోయారు.

ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలు సగంలో ఉండగా వాయిదా వేసి, ఇప్పుడు వాటి ఊసు లేకుండా పంచాయతీ ఎన్నికలను ప్రారంభించడం వెనుక రహస్యమేమిటో వెల్లడిచేయాలని ప్రశ్నిస్తే చెప్పలేని అసహ్యకరమైన పరిస్థితిని తప్పించుకోవాలని కావచ్చు.. ఆయన దాదాపుగా పరుగుపెట్టినట్టుగా వెళ్లిపోయారు. ‘మీరు మాత్రం విలేకరుల సమావేశానికే మాస్క్‌ ధరించి వచ్చి, గ్లాస్‌ షీల్డ్‌ వెన కాల కూర్చొని సకల జాగ్రత్తలతో స్క్రిప్టు చదివారే... మరి లక్ష లాదిమంది ఉద్యోగులు వారాల తరబడి కోట్లాదిమంది ఓటర్లు పాల్గొనే క్రతువులో ఎలా పాల్గొంటారని’ ప్రశ్నిస్తే ఏమని సమా ధానం చెప్పగలరాయన. అందుకే ఎవరూ ‘ప్రశ్నించగూడని’ మీడియా సమావేశంలో నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. భారతదేశ చరిత్రలో ఏ ఎన్నికల కమిషనర్‌ కూడా ప్రశ్నలు నిషేధించి మీడియా సమావేశం నిర్వహించిన ఘటన ఒక్కటి కూడా జరగలేదు. ప్రజాస్వామ్యానికి అండగా నిలవ వలసిన ఎన్నికల సంఘమే ప్రజలకున్న తెలుసుకునే హక్కు కాలరాయడం ఏరకంగా సమర్ధనీయమవుతుంది?

ఉద్యోగులను బెదిరించే ధోరణిలో కమిషనర్‌ ప్రసంగం నడి చింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయని, మరి కొన్ని రాష్ట్రాల్లో ఈ సంవత్సరం జరగబోతున్నాయనీ, ఆ రాష్ట్రాల ఉద్యోగులకు లేని అభ్యంతరం మీకెందుకని నిమ్మగడ్డ ప్రశ్నిం చారు. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన మాట వాస్తవమే. ఎన్నికల ఫలితంగా మళ్లీ మా రాష్ట్రాల్లో కోవిడ్‌ విజృంభించిందని కేరళ, మహారాష్ట్ర మంత్రులే స్వయంగా ప్రకటించారు. అంత కంటే ముఖ్య విషయం: ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే నాటికి దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభం కాలేదు. వ్యాక్సి నేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం కోవిడ్‌పై పోరాడిన ‘ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌’ తొలి రెండు దశ ల్లోనే వ్యాక్సిన్‌ తీసుకోవలసి వుంటుంది.

స్థానిక ఎన్నికల్లో క్రియా శీలక పాత్ర పోషించవలసిన లక్షలాదిమంది ఉద్యోగులు ‘ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌’ కేటగిరీలోకి వస్తారు. వ్యాక్సిన్‌ను రెండు డోసు లుగా తీసుకోవాలి. ఈ రెండు డోసుల నడుమ నాలుగు వారాల వ్యవధి ఉండాలి. ఈ వ్యవధిలో వారిలో ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ తలెత్తకుండా ఉండటానికి వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి. రెండో డోసు తర్వాత 60 రోజులకు వారిలో యాంటీబాడీస్‌ అభివృద్ధి చెందుతాయి. అంటే మొత్తం 3 నెలల షెడ్యూల్‌ ఈ కార్యక్రమం. ‘ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌’గా పనిచేసిన మెజారిటీ ఉద్యోగులు వ్యాక్సినేషన్‌ షెడ్యూల్‌ పీరియడ్‌లో ఉండగా ఎన్నికల విధుల్లో వేలాదిమంది జనసందోహంతో ఎలా క్రియాశీలకంగా వ్యవహ రించగలరు?. వివిధ రాష్ట్రాల్లో ఈ ఏడాది జరగబోయే ఎన్నికల తేదీలు కూడా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కిస్తున్న వ్యాక్సిన్‌ షెడ్యూల్‌ పూర్తయిన తర్వాతనే ఉన్నాయనే విషయం కూడా గమనంలోకి తీసుకోవాలి. కనుక ఇతర రాష్ట్రాల ఉదాహర ణలు చూపెట్టి ఉద్యోగులను బెదిరించడానికి కమిషనర్‌ చేసిన వాదన చెల్లదు.

మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న రెండో దశలో యాభయ్యేళ్లు దాటిన వయోధికులందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వ నున్నారు. వీరితోపాటు దీర్ఘకాలిక వ్యాధులున్న ఇతరులు కూడా వ్యాక్సిన్‌ తీసుకోవలసి ఉంటుంది. ఈ సెక్షన్స్‌ మీదనే కరోనా మహమ్మారి ఎక్కువగా తన ప్రతాపాన్ని చూపెట్టింది. వ్యాక్సిన్‌ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న జనాభా ఇది. వ్యాక్సిన్‌ షెడ్యూల్‌ పూర్తయ్యేవరకు వీళ్లెవరూ ససేమిరా జనసందోహం లోకి వెళ్లరు. వీళ్లెవరూ పోటీ చేయడానికి కానీ, ప్రచారం చేయ డానికి కానీ, ఓటేయడానికి కానీ సాహసించరు. వీళ్లందరి ప్రజా స్వామిక హక్కును హరించే అధికారం మీకెవరిచ్చారు?. ఎన్ని కల కమిషన్‌ ప్రజాస్వామ్యానికి అండగా ఉన్నట్టా? గుది బండగా మారినట్టా? ఆలోచించవలసిన తరుణమిది.

వివిధ రాజ్యాంగ సంస్థల నడుమ ఏర్పడే వివాదాల్లో సాధారణంగా న్యాయస్థానాలు ఎక్కువ జోక్యం చేసుకోకుండా సాంకేతిక అంశాల ఆధారంగా ప్రొసీజర్‌ను ఫాలో అవుతుం టాయి. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా క్రియాశీలకంగా ఉండే తీర్పులను సైతం కొన్ని సందర్భాల్లో ఇస్తుంటాయి. న్యాయ స్థానాల్లో ఇప్పటికీ వర్చువల్‌ పద్ధతిలోనే విచారణలు జరుగు తున్న వాస్తవికత కూడా దేశంలోని కోవిడ్‌ పరిస్థితికి అద్దంపడు తున్నది. కేరళలో ఒక  దశలో నియంత్రణలోకి వచ్చిన కోవిడ్, స్థానిక ఎన్నికల తర్వాత ఆందోళనకరంగా విస్తరించింది. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో ప్రశంసనీయమైన పనితీరు కనబరి చిన కేరళ ఆరోగ్యమంత్రి శైలజా టీచర్‌ స్వయంగా ఈ విష యాన్ని ప్రకటించారు. మహారాష్ట్రలోను ఇదే పరిస్థితి ఎదురైంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు తగ్గుముఖం పట్టిన వైరస్‌ వ్యాప్తి ఇప్పుడు మళ్లీ విజృంభించి రోజుకు నాలుగు వేలమంది చనిపోతున్నారు. క్షేత్రస్థాయి వాస్తవికతను సరిగ్గా అంచనా వేయ గలిగినవారు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన ప్రభుత్వో ద్యోగులు మాత్రమే. ఆ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే అన్ని రకాల సంఘాలు ముక్తకంఠంతో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొ నబోమని చెబుతున్నాయి. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా ఇప్పటికే ఉద్యోగులు చాలా త్యాగాలు చేశారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖే 109 మంది ప్రాణాలను బలిపెట్టింది. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలనూ ఇటువంటి విషాదమే వెన్నాడుతున్నది. అందుకే వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాతనే ఎన్నికల్లో పాల్గొం టామని వారు ఖండితంగా చెబుతున్నారు.

ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం వారిస్తున్నా, ఉద్యోగులు హెచ్చరి స్తున్నా, వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టాలని కేంద్రం ఆదేశాలిస్తున్నా వినకుండా ఎన్నికల కమిషన్‌ ఇంత మొండిగా ఎందుకు వ్యవహ రిస్తున్నది?. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత సూచనల మేరకే ఎన్నికల కమిషన్‌ వ్యవహరిస్తున్నదని రాష్ట్రంలోని అత్య ధిక ప్రజానీకం బలంగా విశ్వసిస్తున్నది. అందుకు స్వయంగా ఆయన వ్యవహార శైలే అవకాశం కల్పించింది. ఢిల్లీలో తన లాబీ యింగ్‌కోసం స్వయంగా చంద్రబాబే బీజేపీలో ప్రతిష్టించిన ఆయన కోటరీ సభ్యులను హైదరాబాద్‌లోని ఒక సెవెన్‌స్టార్‌ హోటల్‌లో రహస్యంగా కలవాల్సిన అవసరం ఎన్నికల కమిషన ర్‌కు ఏముంటుంది? ఈ విషయం బయటకు పొక్కిన తర్వాత కూడా ఆయన ఎటువంటి వివరణ ఇవ్వకపోవడం వలన బాబుతో ఆయన బంధంపై ఉన్న అనుమానాలు బలపడ్డాయి.

స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన నేపథ్యంలో గత సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రిపై చౌకబారు ఆరోపణలతో కేంద్ర హోం శాఖకు ఒక లేఖ వెళ్లింది. అందులో వాడిన భాష తెలుగుదేశం నేతల స్థాయికి తగినట్టుగా ఉండడమే కాక, ఆ పార్టీ కార్యా లయం నుంచే ఎంపిక చేసుకున్న మీడియాకు లీకయింది. ఆ లేఖపై ఎన్నికల కమిషనర్‌ పేరుతో సంతకం వుంది. తానే ఆ లేఖను రాసినట్టు ఆ తర్వాత ఆయన స్వయంగా ప్రకటించు కోవలసి వచ్చింది. ఇక స్థానిక సమరానికి సంబంధించి వేర్వేరు సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరు ఆయనకు తెలుగు దేశం పార్టీతో ఉన్న అనుబంధాన్ని మరింత రూఢీ చేసింది. ఆ పార్టీ అధినేత సూచన ప్రకారమే ఇప్పుడు స్థానిక ఎన్నికలకు ఆయన తహతహలాడుతున్నారని  ప్రజలు భావిస్తున్నారు.

ఈ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీకి ఎందుకంత ఉత్సాహం? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టబోతున్నదా? అటువంటి భ్రమలేమీ ఆ పార్టీకి లేవు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనెలతో ఇరవై నెలల కాలం పూర్తవుతుంది. ఇందులో ఎక్కువ కాలాన్ని కరోనా కాటే సింది. అయినప్పటికీ ఆయన పరిపాలనా తీరుకు ప్రజలు హర్షా మోదాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన జాతీయస్థాయి సంస్థలు జరిపిన అన్ని సర్వేల్లోనూ ఈ విషయం స్పష్టమైంది. ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో వరసగా టాప్‌ ‘త్రీ’లో వైఎస్‌ జగన్‌ స్థానం సంపాదిస్తున్నారు. నిండా రెండేళ్ల పదవీ కాలం కూడా పూర్తికాకుండానే ఒక యువ ముఖ్యమంత్రి సాధిం చిన అసాధారణ ఘనత ఇది.

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో పటిష్టమైన ప్రజారోగ్య వ్యవస్థ ఉన్న కేరళను కూడా అధిగమించి ఆంధ్రప్రదేశ్‌ జాతీయస్థాయిలో నంబర్‌ వన్‌గా నిలబడింది. ముఖ్యమంత్రికి లభిస్తున్న ఆదరణ, పెరుగుతున్న ఇమేజ్‌ చంద్ర బాబుకు దుర్భరంగా తయారయ్యాయి. అసూయా రుగ్మత ఆయన్ను దహించివేస్తున్నది. బహుశా నిద్రాహారాలకు కూడా దూరమై ఉంటారు. అందువల్లనే కాబోలు, శ్రీకాకుళం జిల్లాలో కొందరు తెలుగుదేశం నాయకులు నంది విగ్రహాన్ని దొంగిలిం చిన కేసులో చాలా విచిత్రంగా మాట్లాడారు. ‘అయితే తప్పేంటి?’ అనే డైలాగ్‌ ‘మావాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ’ స్థాయిలో పాపు లర్‌ అయింది. ఈ రుగ్మత తగ్గాలంటే జగన్‌ ప్రభుత్వానికి ఎంతో కొంత చెడ్డపేరు తీసుకురావాలి. అందుకు మార్గమేమిటి?. ఎన్ని కల పేరుతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని భ్రష్టుపట్టిస్తే, మళ్లీ కరోనా వ్యాపించి ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్ట పలచనవుతుందనే ఒక కుత్సిత ఆలోచన. చంద్రబాబు వేసిన ఈ ఎన్నికల ఎత్తు గడకు ఇంతకుమించి మరో కారణం కనిపించడం లేదు.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement