తారస్థాయికి పంచాయితీ | SEC Nimmagadda Ramesh Kumar Behaviour Over Press Meet Troll | Sakshi
Sakshi News home page

తారస్థాయికి పంచాయితీ

Published Sun, Jan 24 2021 3:36 AM | Last Updated on Sun, Jan 24 2021 7:04 PM

SEC Nimmagadda Ramesh Kumar Behaviour Over Press Meet Troll - Sakshi

గ్లాస్‌ షీల్డ్‌ వెనుక నుంచి మాట్లాడుతున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ

సాక్షి, అమరావతి: ‘ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెది మరోదారి’ అనే పాత సామెతను గుర్తుకు తెస్తున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌. కరోనా వ్యాక్సినేషన్‌ వేళ ఎన్నికల పంచాయితీ ఏమిటని అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగులు వాస్తవ పరిస్థితులు విడమరచి చెబుతున్నా, తన రూటే సపరేటు అంటూ మొండిగా, ఏకపక్షంగా ఎవరికో లబ్ధి చేకూర్చేలా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో నిమగ్నమైందని, ఫ్రంట్‌ లైన్‌ సిబ్బందికి టీకాలు ఇచ్చాక ఎన్నికల గురించి ఆలోచిద్దామని ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా ముందుకెళ్తుండటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. శనివారం ఆయన వ్యవహార శైలి, హడావుడి ఏమాత్రం ప్రజామోదం పొందలేదనేది సుస్పష్టమైంది. వాస్తవానికి రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వడం పూర్తయ్యాక నిరభ్యంతరంగా ఎన్నికలు నిర్వహించవచ్చని స్పష్టం చేస్తోంది. సుప్రీంకోర్టులో ఉన్న ఈ వివాదం సోమవారం విచారణకు వచ్చే వీలుంది. ఇంతలోనే నిమ్మగడ్డ నోటిఫికేషన్‌ ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబు హయాంలో నిర్వహించాల్సిన ఈ ఎన్నికలు మూడేళ్లు ఎందుకు వాయిదా వేశారు? ఎవరి లబ్ధి కోసం? అన్న విమర్శలకు నిమ్మగడ్డ వైఖరి దారి తీసింది.

కీలకమైన సమయంలో ఎందుకీ హడావిడి
రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టింది. ఉద్యోగులంతా ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు జనవరి 26న జరిగే రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా సమయం కావడంతో మరింత అప్రమత్తంగా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  ఇవేవీ పట్టనట్టుగా నిమ్మగడ్డ నోటిఫికేషన్‌ ఇచ్చేసి, ఉద్యోగులను విధుల్లో చేరమన్నట్టు ఆదేశించే ప్రయత్నం చేశారు. తాము ఎన్నికల విధులు నిర్వహించలేమన్న ఉద్యోగ సంఘాలను ఆయన హెచ్చరించేందుకూ వెనకాడలేదు. ఇంత చేసినా ఉద్యోగులు మాత్రం ప్రాణాలను పణంగా పెట్టలేమని తేల్చి చెప్పారు. ప్రజలతో మమేకమయ్యే ఉద్యోగులు ప్రజల నాడి తెలియకుండా ఈ స్థాయిలో నిర్ణయం తీసుకోరనేది స్పష్టం. 

కలెక్టర్లపైనా కన్నెర్ర 
ఉదయం నోటిఫికేషన్‌ ఇస్తూనే మధ్యాహ్నం కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ షెడ్యూల్‌ను నిమ్మగడ్డ ఖరారు చేశారు. అందరూ హాజరు కావాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌ను వాయిదా వేయాలని సీఎస్‌ కోరినా పట్టించుకోలేదు. అయితే, ఆ వీడియో కాన్ఫరెన్స్‌కు ఎవరూ హాజరు కాకపోవడాన్ని బట్టి కలెక్టర్లు, ఎస్పీలూ ఇప్పట్లో ఎన్నికలు సరికాదనే సందేశాన్ని ఎన్నికల కమిషన్‌కు చెప్పినట్టయింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన కలెక్టర్లు, ఎస్పీలు సైతం నిమ్మగడ్డ నిర్ణయం సరికాదని చెబుతున్నారంటే.. దీన్నిబట్టి అయినా ఆయన తీరు ప్రజలు మెచ్చడం లేదని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మొత్తం వ్యవహారాన్ని సాయంత్రం గవర్నర్‌కు నివేదిస్తానని చెప్పిన నిమ్మగడ్డ మారు మాట్లాడకుండా హైదరాబాద్‌కు వెళ్లడం విశేషం. గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ దొరక్కనే కాబోలు హైదరాబాద్‌కు వెళ్లిపోయారనే వ్యాఖ్యలు వినిపించాయి. ఎన్నికల విధుల్లో కీలకమైన వ్యక్తుల నుంచి వ్యతిరేకతను చూసైనా, ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎన్నికలు కోరుకోవడం లేదని గుర్తించాలని మేధావి వర్గం చెబుతోంది. 

కమిషనరా? రాజకీయ నాయకుడా?
రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ.. ఎన్నికల నోటిఫికేషన్‌ ఇస్తున్న సమయంలో మీడియా ముందు మాట్లాడిన ప్రతి మాటలో రాజకీయ కోణం కన్పించింది. ఎన్నికలపై భిన్న స్వరాలు విన్పిస్తున్నాయని,  ఉద్యోగులు విధులు నిర్వర్తించేందుకు సుముఖంగా లేరని ఆయన నోటితోనే ఒప్పుకున్నారు. కరోనా భయం వెంటాడుతోందని ఉద్యోగులు చెబుతుంటే.. నిమ్మగడ్డ మాత్రం ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నట్టు మాట్లాడారు. ఏకగ్రీవ ఎన్నికలను తప్పుబట్టడం, దీనిపై ఐజీ స్థాయి అధికారితో పర్యవేక్షణ ఉంటుందని చెప్పడం రాజకీయ నేత మాటల్లా అన్పిస్తోంది.

పంచాయతీరాజ్‌ వ్యవస్థ తీరు మెరుగు పర్చుకోవాలని ఆయనే నిర్ధారించేశారు. దాదాపు 3 లక్షల మందికి పైగా కొత్త ఓటర్లు ఆ హక్కును వినియోగించుకోలేక పోవడాన్ని ప్రస్తావిస్తూ.. దానికీ అధికారులను బాధ్యులను చేస్తానన్నారు. ఈ వ్యాఖ్యలన్నీ ఎవరిమీదో కక్షగట్టినట్టు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు హయాంలో ఎన్నికలు పెట్టలేదని ఒప్పుకున్న నిమ్మగడ్డ.. అందుకు కారణాలు చెప్పకుండానే.. ఇప్పుడు ఎన్నికలు పెట్టడం రాజ్యాంగ విధి అంటూ విరుద్ధంగా మాట్లాడారు. తాను కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ.. టీడీపీ ఆఫీసు నుంచే ఎలా లీకయిందనే విమర్శలకు బదులివ్వ లేదు. తనకు సీఎస్‌ రాసిన లేఖ మీడియాకు ఎలా వెళ్లిందని మాత్రం ప్రశ్నించారు. ఇవన్నీ ఒక రాజకీయ పార్టీ కార్యాలయం రాసిచ్చిన స్క్రిప్టుగా ఉందే తప్ప, బాధ్యతగల ఎన్నికల కమిషన్‌ స్థాయిని తలపించడం లేదనే రాజకీయ విమర్శలొస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement