
మన రాజ్యాంగ వ్యవస్థ మహిళల రక్షణ కోసం కల్పించిన ముఖ్యమైన సౌకర్యాలు ఇవి. న్యాయపరంగా పోరాడాల్సిన ఈ చట్టాలతో సాధికారత సాధన జరుగుతుందా అంటే... అదొక్కటే మార్గం అని కాదు. న్యాయపోరాటం చివరి అంశమే కావచ్చు. కానీ ఇలాంటి రక్షణ వ్యవస్థ ఉందనే స్పృహ ఆమెలో భరోసాని కలిగిస్తుంది.
ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిలో భయానికి కారణమవుతుంది. మహిళ పట్ల గౌరవంతో ఆమెకు ఇబ్బంది కలిగించకుండా మెలిగే సంస్కారం ఉన్నప్పుడు ఇలాంటి చట్టాల అవసరం అంతగా ఉండకపోవచ్చు. అయితే అలాంటి సంస్కారం లోపించినప్పుడు ఇలాంటి చట్టాల రక్షణ గొడుగులు అవసరమే. ఈ చట్టాలన్నీ... మహిళకు సాధికారత సాధనలో వెనుకడుగు వేయాల్సిన పరిస్థితిని రానివ్వకుండా ఆమెకు తోడుగా ఉండే బాంధవ్యసాధనాలు.