
ప్రపంచ ఆర్థిక దృక్పథం నిరాశాజనకంగా ఉన్నప్పటికీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2023-24ను సమర్పించారు. ఆనంతరం ఆమె ప్రసంగిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో ఉందని, ఉజ్వల భవిష్యత్తు వైపు పయనిస్తోందన్నారు. 2014 నుంచి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పౌరులందరికీ మెరుగైన జీవన ప్రమాణాలతో పాటు గౌరవప్రదమైన జీవితాన్ని అందించాయన్నారు.
మహిళల కోసం ప్రత్యేకం
పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం వల్ల సమగ్ర అభివృద్ధిపై శ్రద్ద పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ బడ్జెట్‌లో రైతులు, యువత, మహిళలు ,వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నామన్న నిర్మలమ్మ వారి కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. స్వయం సహాయక బృందాల ద్వారా గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతను పెంచడం బడ్జెట్‌లోని ముఖ్యమైన వాటిలో ఒకటి అని చెప్పారు. యువతకు ఉపాధి లభించేలా ఉద్యోగాల వృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇక వ్యవసాయంలో ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.
మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనే కొత్త పథకాన్ని బడ్జెట్‌లో కేంద్రం ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్సిడ్ డిపాజిట్ పథకంలో ఖాతాదారులు చేసే డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్టంగా రూ.2 లక్షలు వరకు ఈ పథకంలో డిపాజిట్ చేయవచ్చు. పాక్షిక మినహాయింపులకు అవకాశం ఉంటుంది.