Womens protection
-
అక్కచెల్లెమ్మలకు మరింత భద్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడైనాసరే అక్క చెల్లెమ్మలకు అన్యాయం జరిగినా, వారిపై అఘాయిత్యానికి పాల్పడినా ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం ఊరుకోదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రభుత్వం గట్టి సంకేతాలను పంపిస్తోందని తెలిపారు. బుధవారం ఆయన సచివాలయం ప్రధాన గేటు వద్ద 163 దిశ పోలీస్ పెట్రోలింగ్ ఫోర్ వీల్ వాహనాలను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. బందోబస్తులో ఉండే మహిళా పోలీసుల కోసం వాష్ రూమ్, డ్రెస్సింగ్ రూమ్‌లు ఉండే 18 కార్ వ్యాన్స్‌ను కూడా సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ‘దిశ’ యాప్ రికార్డు స్థాయిలో కోటి 16 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లోని ఫోన్లలో ఉందని చెప్పారు. దాదాపు 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో అంటే దాదాపు ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్ అందుబాటులో ఉన్నారని తెలిపారు. వీటన్నింటితో ఒక గొప్ప విప్లవానికి, మార్పునకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. మహిళా పోలీసులకు రెస్ట్ రూమ్ ► సామాన్య అక్కచెల్లెమ్మలే కాదు.. పోలీసు వృత్తిలో ఉన్న అక్కచెల్లెమ్మలకూ మంచి చేసే దిశగా అడుగులు పడ్డాయి. పోలీస్ స్టేషన్లలో ఇంతకు ముందు అక్కచెల్లెమ్మలకు ప్రత్యేకంగా రెస్ట్రూమ్ ఉండేది కాదు. ఈ రోజు ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళలకు ప్రత్యేకంగా వాష్‌రూమ్‌లు ఉండటంతో పాటు బందోబస్తుకు వెళ్లినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా వాష్‌రూమ్స్, డ్రెస్సింగ్ రూములు ఉండే విధంగా 18 కార్ వ్యాన్స్‌ను ప్రారంభిస్తున్నాం. ► మొత్తం 30 కార్వ్యాన్స్ (రూ.5.5 కోట్లు కేటాయించారు) ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా ఇవాళ 18 వచ్చాయి. రాబోయే రోజుల్లో మరో 12 వస్తాయి. 163 దిశ పోలీస్ ఫోర్ వీల్ వాహనాలను (రూ.13.85 కోట్లతో కొనుగోలు చేశారు) కూడా ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే 900 దిశ ద్విచక్ర వాహనాలు వివిధ పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ‘దిశ’ పోలీస్ పెట్రోలింగ్ ఫోర్ వీల్ వాహనాలు మూడు వేల వాహనాలకు జీపీఎస్ ► ఇవి కాక ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి వాహనాన్ని అంటే దాదాపు మూడు వేల వాహనాలకు జీపీఎస్ ట్యాగింగ్‌తో దిశకు అనుసంధానం చేసి, వాటన్నింటినీ కూడా అందుబాటులోకి తెచ్చాం. ఏదైనా ఆపదలో ఉన్న అక్కచెల్లెమ్మలు వారి ఫోన్‌ను ఐదుసార్లు అటూ, ఇటూ ఊపితే చాలు.. 10 నిమిషాల్లో వారి వద్దకు పోలీస్ సోదరుడు వెళ్లి సమస్య పరిష్కరించేలా మార్పునకు శ్రీకారం చుట్టాం. ► ఏదైనా ఘటన జరిగిన 10 నిమిషాల్లోపే పోలీసులు కచ్చితంగా అక్కడకు రావాలని నేను గట్టిగా చెప్పాను. డీఐజీ పాలరాజు, డీజీపీ రాజేంధ్రనాథ్ రెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ విషయంలో బాగా కృషి చేశారు. అందరూ కలసికట్టుగా ఆ రెస్పాన్స్ టైంను ఇంకా కుదించేందుకు ఈ వాహనాలను ప్రారంభిస్తున్నాం. ► దిశ యాప్ కోసం, పనితీరును మెరుగు పరిచేందుకు ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు మరిన్ని చేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని మనసారా కోరుకుంటున్నా. ► ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కె మోషేన్ రాజు, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీఐజీ పాలరాజు, దిశ స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘స్పై’ కెమెరాలపై ‘స్పై’..మూడో కన్నుతో చూడొద్దు!
స్పై కెమెరాల ద్వారా జరిగే అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ‘యాంటీ రెడ్ ఐ’ పేరుతో ఐదేళ్ల క్రితం ముందుకు వచ్చారు హైదరాబాద్ వాసి వరలక్ష్మి. స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాల్లో ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తూ ‘అమ్మాయిలూ జాగ్రత్తగా ఉండండి’ అని చెబుతూ వచ్చారు. ‘‘ఈ క్రమంలోనే జనంలోకి వెళుతున్నకొద్దీ మహిళలు, పిల్లలపై జరుగుతున్న దాడులు, వేధింపులు, హింస.. ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. విషయాలు తెలుస్తున్నకొద్దీ నేరాలకు అడ్డుకట్ట వేయలేమా.. అనే ఆలోచన ఎక్కువైంది’’ అంటారు వరలక్ష్మి. ఆ దిశగానే మహిళల రక్షణ విషయంలో అనేక కోణాల్లో పరిశీలించి ‘వాయిస్ ఆఫ్ భారత్’ ను తీసుకొచ్చాను అని వివరించారు. మహిళలు, పిల్లల రక్షణ కోసం చట్టాలు కఠినతరం చేయాలంటూ నినదించే వరలక్ష్మి ‘సాక్షితో పంచుకున్న విషయాలు... ‘‘మహిళల రక్షణపై దాదాపు వందమంది సెలబ్రిటీలు, స్త్రీ, పురుషుల వాయిస్‌ను 45 రోజులు పాటు వీడియో రూపంలో రికార్డు చేశాను. వారందరూ మాట్లాడిన విషయాలో ముఖ్యమైన పాయింట్స్‌ను క్రోడీకరించారు. అడ్వకేట్ అభిప్రాయాన్ని కూడా తీసుకొని 24 ముఖ్యమైన పాయింట్ల జాబితాను తీసుకొచ్చాను. రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు అధికారులను సంప్రదించి, ఆ జాబితాను అమలు పరిచాలని కోరుతున్నాను. రోజు రోజుకూ నేరాలుపెరుగుతున్న నేపథ్యంలో మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఒక ఎజెండా ఇది. 2017లో ‘యాంటీ రెడ్ ఐ’ పేరుతో జనంలోకి వెళ్లినప్పుడు కొత్త కొత్త సమస్యలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆగస్టు 15, 2020 నుంచి పబ్లిక్ నుంచి వాయిస్ తీసుకోవడం మొదలుపెట్టాను. తెలంగాణ, ఆంధ్రాలోని అన్ని రాజకీయ పార్టీలు, పోలీసు డిపార్ట్మెంట్ నుంచి కూడా వాయిస్ తీసుకున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడానికి, నిరోధించడానికే నా ప్రయత్నం అంతా. దీంట్లో భాగంగానే మహిళలకు శిక్షణా తరగతులు, క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్స్, బాలకార్మికులకు సంబంధించినవి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ అవగాహన, ఆరోగ్య శిబిరాలు.. ఇవన్నీ ఒక దగ్గర చేర్చడానికి ‘హెవెన్ హోమ్ సొసైటీ’ పేరుతో ఎన్జీవోను ఏర్పాటు చేశాను. సీసీ కెమెరాలు, పుటేజీ ‘వాయిస్ ఆఫ్ భారత్’లో భాగంగా గ్రామణస్థాయి నుంచి నా కార్యాచరణను మొదలుపెట్టాను. అప్పుడే పిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయనేది అర్ధమైంది. ఏదైనా నేరం జరిగిన వార్త తెలిసినప్పుడు ‘అయ్యో’ అనేసి ఊరుకుంటున్నాం. కానీ, చాలా వరకు గురుకులాలు, కార్యాలయాలు, పాఠశాలల్లో... సీసీ కెమెరాల ఏర్పాటు, వాటికి సంబంధించిన పుటేజీ రికార్డులో ఉండటం అనేది ఏ మాత్రం జరగడం లేదు. ఎక్కడా రికార్డు కాకపోవడంతో నేరాలు కూడా వెలుగు చూడటం లేదు. నేరస్థులు నిర్భయంగా బయట తిరుగుతున్నారు. మిస్సింగ్ అయిన కథనాలెన్నో.. లాక్డౌన్ తర్వాత వరుస చిన్నారులు మిస్సింగ్ కథనాలు ఎక్కువగా వినవస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ దమ్మాయిగూడలో నలుగురు పిల్లలు మిస్సింగ్ న్యూస్ ప్రధానమైంది. అందులో ఒక చిన్నారిని అత్యంత దారుణంగా రేప్ చేసి, చంపారు. మరో రెండు కేసులు వెలుగులోకే రాలేదు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట రావాలంటే అన్నిచోట్లా సిసి కెమెరాల ఏర్పాట్లు పెంచాలి. సెక్షన్లు త్వరగా అమల్లో పెట్టాలి. పార్టీలతో సంబంధంలో లేకుండా మహిళల రక్షణకు సంబంధించిన విషయాలన్నీ వారి ఎజెండాలో పెట్టాలి. ప్రతి మహిళా ఆలోచించాల్సిన తరుణం ఇది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లలు, మహిళల భద్రత విషయాల పట్ల వెంటనే స్పందించి, అమలులో పెట్టాలి. అఘాయిత్యాలు చోటు చేసుకున్నాక కాదు రక్షణ గురించి ఆలోచించడం కాదు, ముందే బతికుండటానికి రక్షణ కావాలన్నదే ‘వాయిస్ ఆఫ్ భారత్’ నినాదం. మహమ్మారి టైమ్ కరోనా టైమ్‌లో బయట తిరిగే వారి సంఖ్య తగ్గింది, క్రైమ్ తగ్గింది అనుకుంటున్నారు. నిజానికి పరిస్థితి అలా లేదు. దీనికి సంబంధించిన డేటా కోసం అన్ని పోలీసు విభాగాల్లోనూ వివరాలను సేకరించాను. ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో కనీసం ఐదు కేసులు ఫైల్ అవుతున్నాయి. గృహహింస అయితే మరీ దారుణం. కరోనా కారణంగా ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవడంలో మునిగిపోయి ఈ తరహా క్రైమ్ వినడానికి, చెప్పుకోవడానికి ఎవరూ పట్టించుకోవడం లేదు. మూడో కంటితో చూడొద్దు... యాంటీ రెడ్ ఐ షాపింగ్ మాల్స్, కాంప్లెక్సులు, హోటల్ గదులు, అద్దె ఇల్లు.. ఇలా ప్రతి చోట అమ్మాయిలు, మహిళలను స్పై కామ్ ద్వారా నగ్న వీడియోలు, ఫొటోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసే నేరగాళ్లు పెరిగారు. దీనివల్ల జరిగే అనర్థాలకు అడ్డుకట్టవేసే ఉద్దేశంతోనే మూడో కన్నుతో చూడొద్దు అని ‘యాంటీ రెడ్ ఐ’ ఏర్పాటు చేశాను. దాదాపు ఐదేళ్లుగా ఈ స్పై కెమరా నేరాలకు సంబంధించి వర్క్ చేస్తున్నాను. ఎంతోమంది సాయంగా! మహిళల భద్రతకు సంబంధించిన ‘యాప్’ ను తీసుకురావాలని ప్రభుత్వాలను కోరుతూ, మహిళల రక్షణకు సంబంధించిన విషయాలను ప్రింట్ చేస్తూ వాటిని అధికారులకు అందజేస్తూ వస్తున్నాను. వేధింపులు, అఘాయిత్యాలకు గురైన బాధితులకు సాయం చేయమంటూ వేడుకోళ్లు వస్తూనే ఉంటాయి. దానికి తగినట్టుగానే అడ్డుకోవడానికి ‘చంపేస్తాం’ అంటూ ఎన్నో బెదిరింపులు వచ్చాయి. ఇలాంటప్పుడు కుటుంబం శ్రేయస్సు గురించి ఆలోచించి, విడిగా ఉంటూ ఈ పనులు చూస్తున్నాను. ఈ సంస్థ ముందుకెళ్లడానికి నా స్నేహితుల సాయమే నాకు కొండంత అండగా నిలుస్తోంది’’ అని వివరించారు వరలక్ష్మి. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: రాజేష్ రెడ్డి నోముల -
మహిళల రక్షణకు రవాణా శాఖ ప్రత్యేక యాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించేందుకు, వారికి పూర్తి భద్రత కల్పించేందుకు రవాణా శాఖ కొత్తగా యాప్ ఆధారిత ప్రాజెక్టు చేపట్టనుంది. ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు దీన్ని అమలు చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతం భాగస్వామ్యంతో ప్రాజెక్టుకు నిధులు కేటాయించనున్నాయి. కేంద్రం తన వాటా నిధులు అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కేంద్రం తన వాటాగా రూ.56 కోట్ల వరకు నిధులు కేటాయించినా చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.135 కోట్లు్ల వెచ్చించనున్నాయి. ప్రాజెక్టు అమలు ఇలా.. ► రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్‌లలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) బాక్స్‌లు అమరుస్తారు. వీటితోపాటు రవాణా శాఖ యాప్‌ను రూపొందిస్తుంది. ► మహిళలకు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైతే మొబైల్ యాప్ నుంచి వాహనం నంబర్ పంపితే వాహనం ఎక్కడుందో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) ద్వారా ఇట్టే తెలుసుకుని పట్టుకోవచ్చు. ► రాష్ట్రంలో 4.50 లక్షల ఆటోలు, లక్ష వరకు క్యాబ్‌లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ► ఈ వాహనాలకు దశల వారీగా ఐవోటీ బాక్సులు అమరుస్తారు. వీటిని రవాణా, పోలీస్ శాఖ సిబ్బంది పర్యవేక్షిస్తారు. ► ఐవోటీ బాక్సులను వాహనాల ఇంజన్ల వద్ద అమరుస్తారు. ఆ తర్వాత డ్రైవర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ కార్డులు జారీ చేస్తారు. ఈ కార్డులను ఐవోటీ బాక్సుకు స్వైప్ చేస్తేనే ఆటో స్టార్ట్ అవుతుంది. ► యాప్ వాడకం తెలియని మహిళలు ఐవోటీ బాక్స్‌కు ఉండే క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే వెంటనే కంట్రోల్ రూమ్‌కు అనుసంధానమవుతుంది. ► మహిళలకు ఇబ్బందులు ఎదురైతే ప్యానిక్ బటన్ నొక్కితే వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారమందిస్తుంది. ► పైలెట్ ప్రాజెక్టుగా తొలుత విజయవాడలో అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. ► ఇక్కడ ముందుగా 100 ఆటోల్లో ఐవోటీ బాక్సులు ఏర్పాటు చేసి త్వరలో ప్రాజెక్టు అమలు తీరుతెన్నులు పరిశీలించనున్నారు. ► అక్టోబర్‌లో సీఎం జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు ఈ యాప్‌ను ప్రారంభించనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపడతాం గతంలో అమలు చేయలేకపోయిన ఈ ప్రాజెక్టుపై మంత్రి పేర్ని నానితో ఇప్పటికే చర్చించాం. మహిళల భద్రత ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపడతాం. – పీఎస్సార్ ఆంజనేయులు, రవాణా శాఖ కమిషనర్ -
'వారిని రక్షించాలంటే కఠిన చట్టాలు రావాల్సిందే'
టెహ్రాన్ : ఇరాన్లో మహిళల రక్షణ కోసం మరిన్ని కొత్త చట్టాలు కల్పించాలంటూ ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీ పిలుపునిచ్చారు. గురువారం టెహ్రాన్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో అష్రాఫీ మృతిపై హసన్ రౌహానీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఆయన పరువు హత్యగా పేర్కొన్నారు. ఇలాంటివి చోటుచేసుకోకుండా కఠిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. హింస నుంచి మహిళలను రక్షించే బిల్లును "వేగవంతమైన అధ్యయనంగా ధృవీకరించాలంటూ' ఆదేశించారు. మహిళల రక్షణ కోసం మరిన్ని కొత్త చట్టాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కాగా ఇరాన్‌కు చెందిన 14 ఏళ్ల అమ్మాయి తండ్రి చేతిలో దారుణహత్యకు గురవడం దేశ ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది.(ఒక్కరోజే 114 మంది పోలీసులకు కరోనా) ఇరాన్‌కు చెందిన రోమినా అష్రాఫీ అనే 14 ఏళ్ల అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి నార్త్ ఇరాన్‌లోని తాలేష్ కౌంటీ ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల వ్యక్తిని కలిసింది. విషయం తెలుసుకున్న అష్రాఫీ తండ్రి రోమినాను ఇంటికి ఈడ్చుకొచ్చి కొడవలితో దారుణ హత్యకు పాల్పడ్డాడు. అష్రాఫీ దారుణ హత్యపై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మీడియా చానెళ్లు ప్రత్యేక కవరేజీ అందించాయి. దీంతో పోలీసులు రోమీనా తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. కాగా రోమినాను కలిసిన 29 ఏండ్ల వ్యక్తిపై కేసు నమోదు చేశారా లేదా అన్నది తెలియదు. మరోవైపు ఈ ఘటనను అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించింది.'మహిళలు / బాలికలపై జరుగుతున్నహింస పట్ల శిక్షలను మరింత కఠినతరం చేయాలని మేము ఇరాన్ అధికారులను, చట్టసభ సభ్యులను కోరుతున్నాము. మరణశిక్షను ఆశ్రయించకుండా, నేరం యొక్క తీవ్రతకు అనులోమానుపాతంలో జవాబుదారీతనం ఉండేలా వారు శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 301 ను సవరించాలి' అంటూ అమ్నెస్టీ గురువారం ట్విటర్లో తెలిపింది. -
ఇదీ.. నా కల
ఒక గ్రామం నుంచి మనిషి బయటకు పోవాల్సిన పనిలేకుండా అన్నీ అందుబాటులో ఉండేలా అడుగులు వేస్తున్నాం.. అలాగే అక్రమాలపై మహిళా సంరక్షణ పోలీస్ రిపోర్ట్ ఇచ్చాక దానిపై యాక్షన్ తీసుకోవడం ముఖ్యం. అప్పుడే ఊళ్లో మార్పు కనిపిస్తుంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘గ్రామం బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఒక గ్రామం ఎలా ఉంటే బావుంటుందో ఒక్కసారి ఊహిస్తే.. అది మన కళ్లముందు కనిపిస్తుంది. 72 గంటల్లో సేవలందించేలా గ్రామ సచివాలయం, స్కూలు, ఆసుపత్రి, రైతు భరోసా కేంద్రం, అంగన్వాడీ కేంద్రం, ఓ మహిళా సంరక్షణ పోలీసు.. ఇలా అన్నీ వరుసగా కనిపిస్తాయి. ఇది కేవలం ఊహగానే మిగిలి పోకుండా మన కళ్లెదుట సాక్షాత్కరింప చేయడానికి మన ప్రభుత్వం నడుం బిగించింది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. విజయనగరంలోని పోలీస్ బ్యారెక్స్‌లో సోమవారం ఆయన దిశ మహిళా పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన తన కలల గ్రామాన్ని నిజం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఒక గ్రామం నుంచి మనిషి బయటకు పోవాల్సిన పని లేకుండా అన్నీ అందుబాటులో ఉండేలా అడుగులు వేస్తున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్ ఏం చెప్పారంటే.. ఎనిమిది నెలలుగా విప్లవాత్మక కార్యక్రమాలు ‘పోలీస్ అంటే ఊర్లో కొద్దో గొప్పో భయం ఉంటుంది. అందుకే గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శి పేరును ‘మహిళ సంరక్షణ పోలీస్’గా మారుద్దామని డీజీపీకి చెప్పాను. ఈ పేరు అయితే బావుంటుంది. గ్రామ, వార్డు పరిధిలో మహిళ సంరక్షణ పోలీస్‌లు, మహిళా పోలీస్ మిత్రలు, పోలీస్ చెల్లెమ్మల భుజస్కందాలపై ఉన్న బాధ్యతను గుర్తు చేయాల్సిన పరిస్థితి. ఒక గ్రామం ఎలా ఉంటే బావుంటుందో.. అలా మార్చేందుకు మన ప్రభుత్వం గత 8 నెలల కాలంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో గ్రామం అన్నది ఏలా ఉంటుందంటే.. ప్రతి 2 వేల జనాభాకు కావాల్సిన ప్రతి సేవ అందుబాటులో ఉండేట్టు గ్రామ సచివాలయం ఉంటుంది. అన్ని సేవలూ అక్కడే లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. లంచాలు, వివక్షకు తావులేకుండా ప్రతీ సేవ నిర్ణీత గడువులోగా అందేలా చూస్తున్నాం. దిశ పోలీస్ స్టేషన్ బయట మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సీఎం వైఎస్ జగన్ గ్రూప్ ఫొటో గ్రామ సచివాలయం పక్కనే మెరుగైన వసతులతో ఒక ఇంగ్లిష్ మీడియం స్కూలు కనిపిస్తుంది. అదే గ్రామంలో ఒక అడుగు ముందుకు వేస్తే వైఎస్సార్ విలేజ్ క్లినిక్ అనే ఒక ఆసుపత్రి కనిపిస్తుంది. రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు 2,400 సబ్ సెంటర్స్ కూడా లేవు. రానున్న రోజుల్లో మొత్తం 11,158 గ్రామ సచివాలయాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ తీసుకొస్తాం. అక్కడ డీఎస్సీ చదివిన నర్సు, ఒక ఏఎన్ఎం ఉంటారు. వారు అదే ఊళ్లో ఉంటూ 24 గంటలు వైద్య సేవలు అందిస్తారు. గ్రామ సచివాలయం నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతు భరోసా కేంద్రం ఉంటుంది. అన్ని విషయాల్లో రైతులకు తోడుగా ఉంటుంది. ఈ క్రాప్ బుకింగ్, పంటలు, వాతావరణం, గిట్టుబాటు ధర, మార్కెట్‌కు సంబంధించిన సూచనలు ఇస్తారు. శిక్షణ కూడా ఉంటుంది. నాణ్యతతో కూడిన పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్,విత్తనాలు అందుబాటులో ఉంటాయి. మహిళా సంరక్షణ పోలీస్‌ది కీలక పాత్ర మహిళా సంరక్షణ పోలీస్‌లు, మహిళా పోలీస్ మిత్రాలు చురుగ్గా ఉండాలి. మీ గ్రామంలో ఎవరైనా, ఎక్కడైనా ఇల్లీగల్ లిక్కర్ అమ్ముతున్నారంటే వాళ్లకు సింహస్వప్నం కావాలి. మీరు ఒక్క మెసేజ్ కొడితే ఎస్పీ అలర్ట్ అవుతారు. పోలీసులను పంపించి క్లీన్ చేసేస్తారు. గ్రామంలో ఎలాంటి తప్పులు జరుగుతున్నా వెంటనే మీరు అలర్ట్ అయ్యి రిపోర్టు చేయాలి. మీరు చేసిన రిపోర్టు మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో పరిశీలించి రోబోయే రోజుల్లో డైరెక్ట్‌గా డీజీపీ, హోంమినిస్టర్, నేను కూడ ఇన్వాల్వ్ అవుతాం. ఎందుకంటే మీరు రిపోర్ట్ ఇచ్చాక దానిపై యాక్షన్ తీసుకోవడం అన్నది వెరీ ఇంపార్టెంట్. అప్పుడే ఊర్లో మార్పు కనిపిస్తుంది. అంగన్వాడీ సెంటర్లు మీ అధీనంలో ఉంటాయి. గ్రామంలో ఉన్న స్కూళ్లు, ఆ స్కూళ్ల వ్యవహారాలు, ఆస్కూల్లో బూత్‌రూంలు, మధ్యాహ్న భోజన పథకం నాణ్యత.. ఇలా అన్నీ కూడా గ్రామ సెక్రటేరియట్ పరిధిలోకి తీసుకొస్తున్నాం. వీటి పర్యవేక్షణలో మీరు భాగస్వాములవుతున్నారు. మీ అందరికీ ఒక అన్నలా బెస్ట్ విషెస్ చెబుతున్నా. మీ వల్ల గ్రామానికి మంచి జరగాలని, ప్రభుత్వానికి మంచి పేరు రావాలని ఆశిస్తున్నా’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. -
డయల్ 100 112
సాక్షి, అమరావతి: ఆపదలో ఉన్న మహిళలను తక్షణమే రక్షించడానికి ఏర్పాటు చేసిన డయల్ 100, డయల్ 112 టోల్ ఫ్రీ నంబర్లను ఒకే గొడుగు కిందకు తేవాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ రెండు నంబర్లకు ఇప్పటివరకు వేర్వేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఉన్నాయి. ఆపదలో ఉన్న మహిళలు ఈ రెండు నంబర్లకు ఒకేసారి ఫోన్ చేస్తే.. రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్ల పరిధిలో ఉన్న పోలీసులు అప్రమత్తమై రక్షిస్తున్నారు. అయితే.. వేర్వేరుగా ఉండటం వల్ల రెండు సెంటర్ల మధ్య సమన్వయలోపం తలెత్తుతోంది. అలా కాకుండా ఈ రెండు టోల్ ఫ్రీ నంబర్లకు కలిపి ఒకే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటే సమయం కలిసి రావడంతోపాటు సమన్వయలోపాన్ని నివారించవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం చొరవతో పోలీస్ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఈ విషయంపై మూడు రోజుల కిందట మంగళగిరిలో అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టత ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 100, 112కు ఎవరు ఫోన్ చేసినా ఒకే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వచ్చేలా చేయడంతోపాటు అందుకు అనుగుణమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించాలని ఆదేశించారు. కాగా, దిశ ఘటన జరిగాక ఈ రెండు నంబర్లకు ఫోన్ కాల్స్ బాగా పెరిగాయి. డయల్ 100 రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డయల్ 100కు నేరుగా ఫోన్ (వాయిస్ కాల్) చేసి సమస్యను వివరించాల్సి ఉంటుంది. ఈ నెంబర్‌కు రోజుకు 18 వేల నుంచి 20 వేల కాల్స్ వస్తున్నాయి. వీటిని స్వీకరించే కమాండ్ కంట్రోల్ సిబ్బంది ఆయా జిల్లాల ఎస్పీలకు సమాచారం అందిస్తారు. బాధితులకు తక్షణ సాయం అందించేలా చర్యలు చేపడతారు. డయల్ 112 కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో దేశమంతా నిర్వహిస్తున్న డయల్ 112కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు మహిళలు ఉన్న చోటు, ఫోన్ నెంబర్, చిరునామా అన్నీ నమోదవుతాయి. ఈ వివరాల ఆధారంగా కమాండ్ కంట్రోల్ సిబ్బంది తిరిగి ఫోన్ చేసి సమస్య అడిగి సమీపంలోని పోలీసులను అప్రమత్తం చేస్తారు. దీనికి రోజూ 3.50 లక్షల కాల్స్ వస్తున్నాయి. రాష్ట్రంలో శనివారం నాటికి 56,142 మంది ‘డయల్ 112 ఇండియా’ మొబైల్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నారు. వీరిలో 32 వేల మంది మహిళలే ఉండటం విశేషం. ఫోన్లో నేరుగా 112కు సందేశం పంపడంతోపాటు యాప్ ద్వారా కూడా డయల్ చేయొచ్చు. ఈ రెండూ కలిపి.. ప్రస్తుతం వాయిస్, మిస్డ్ కాల్‌తోపాటు ఐడియా నెట్వర్క్ నుంచి మాత్రమే మెసేజ్ వెళ్లే వెసులుబాటు ఉంది. రానున్న రోజుల్లో ఆపదలో ఉన్నవారు అన్ని మొబైల్ నెట్‌వర్క్‌ల నుంచి మెసేజ్ ఇచ్చే అవకాశం కల్పించనున్నారు. అలాగే మిస్డ్‌కాల్ ఇస్తే చాలు ఆటోమేటిగ్గా జీపీఆర్ఎస్ అనుసంధానంతో ట్రాకింగ్ చేసేందుకు వీలుగా వారిని త్వరగా చేరుకునే ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా టోల్ ఫ్రీ నంబర్లకు వచ్చే ఫోన్ నుంచి మొబైల్ వీడియో ఆప్షన్ ఆన్ అయ్యి సుమారు 10 సెకండ్ల వీడియో చిత్రీకరణ జరిగేలా కూడా సాంకేతికంగా అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్ల బాధితులకు తక్షణ సాయం అందించడంతోపాటు నేర స్థలంలో సాక్ష్యాలు, నేరస్తులను గుర్తుపట్టేందుకు వీలుంటుందని పోలీస్ శాఖ భావిస్తోంది. అన్ని సేవలకు ఒకే నంబర్ – డీజీపీ గౌతమ్ సవాంగ్ డయల్ 100, డయల్ 112 టోల్ ఫ్రీ నంబర్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జీపీఎస్ సిస్టమ్ అమర్చిన 1500 పోలీస్ వాహనాలు బాధితులకు తక్షణ సాయం అందిస్తున్నాయి. రెండు టోల్ ఫ్రీ నంబర్లను ఒకే గొడుగు కిందకు తెస్తే మరింత బాగా సేవలు అందించవచ్చని గుర్తించాం. 100, 112లలో దేనికి ఫోన్ చేసినా ఒకే చోటకు కాల్ వచ్చేలా చేయడంతోపాటు వాటిని సాంకేతికంగా మరింత అభివృద్ది చేస్తాం. రానున్న రోజుల్లో అన్ని సేవలకు ఒకే నంబర్ ఉండేలా దశలవారీగా చర్యలు తీసుకుంటాం. -
మహిళల రక్షణకు కట్టుబడి ఉన్నాం
సాక్షి, అమరావతి: మహిళల రక్షణ, భద్రతకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు సోమవారం మహిళా భద్రత అంశంపై స్వల్పకాలిక చర్చను ఆమె ప్రారంభించారు. మహిళల రక్షణ, కిశోర బాలికలను చైతన్యపరిచి వారికి సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. 11,158 గ్రామ మహిళా సంరక్షక కార్యదర్శులు, 3,809 వార్డు మహిళా సంరక్షక కార్యదర్శులు కలిపి మొత్తం 14,967 ఉద్యోగాలు నోటిఫై చేశామన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలను తగ్గించడానికి ‘మహిళా మిత్ర’ కమిటీలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆపదలో ఉన్న మహిళలను తక్షణమే రక్షించడం కోసం ‘సైబర్ మిత్ర ప్రత్యేక వాట్సాప్ నంబర్ 9121211100’ ఏర్పాటు చేశామన్నారు. మహిళలపై నేరాల కేసులను, జీరో ఎఫ్ఐఆర్ను వెంటనే నమోదు చేసేలా పోలీసులకు సూచనలు ఇచ్చామని చెప్పారు. మహిళలపై నేరాల కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను 13 జిల్లాల్లో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వీటికి అదనంగా పోస్కో కేసుల పరిష్కారానికి 8 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయన్నారు. 100, 112, 181 మహిళా హెల్ప్లైన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. గృహ హింస నుంచి మహిళల సంరక్షణ, మహిళా శక్తి కేంద్రాలు, సమగ్ర శిశు సంరక్షణ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. మహిళా భద్రత బిల్లుపై చర్చ జరుగుతుంటే ఏందయ్యా.. ఇది? కాగా, ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభ ఉదయం 11.43 గంటలకు మొదలైంది. మహిళా భద్రత అంశంపై స్వల్ప వ్యవధి చర్చను హోం శాఖ మంత్రి సుచరిత మొదలుపెట్టగా.. విపక్ష సభ్యులు ఉల్లి ధరలపై చర్చను చేపట్టాలని పట్టుబడుతూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ‘మహిళా భద్రత బిల్లుపై చర్చ జరుగుతుంటే ఏందయ్యా.. ఇది?’ అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ చర్చకు సిద్ధమని ప్రకటించిన తర్వాత పోడియం వద్దకు వచ్చి ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. అయినా విపక్ష సభ్యులు వినిపించుకోకుండా స్పీకర్ చైర్ వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. అధికార పక్షానికి చెందిన మహిళా సభ్యులంతా పోడియం వద్దకు చేరుకుని మహిళా భద్రత అంశంపై చర్చను అడ్డుకోవడమేంటని నినాదాలు చేశారు. ‘మహిళా వ్యతిరేకి చంద్రబాబు.. రౌడీ ప్రతిపక్షం’ అంటూ అధికార పక్ష సభ్యులు తమ సీట్ల నుంచి లేచి నిరసన తెలిపారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ షాపులో కేజీ ఉల్లి రూ.200 అని.. చిత్తశుద్ధి ఉంటే ధర తగ్గించి విక్రయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు గత ఐదేళ్ల పరిపాలనలో మహిళల్ని ఎలా వేధించారో బట్టబయలవుతుందనే భయంతో చర్చను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. -
మహిళల రక్షణకు హెల్ప్ లైన్
సాక్షి,రాజమండ్రి: మహిళల ఫిర్యాదుల స్వీకరణకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తామని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. శనివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ..ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపారు. మహిళ భద్రతపై కళాశాలలు,సోషల్ మీడియాలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. మహిళల రక్షణ కోసం పటిష్ట చర్యలు చేపట్టేందుకు మహిళా కమిషన్ ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ఎమ్మెల్యే శ్రీదేవి, ఎస్ఐ అనురాధల విషయంలో ఏం జరిగిందో పోలీసులను వివరణ కోరామని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. పోలీసుల వివరణ పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
మహిళలు ఇక అభయంగా ప్రయాణించవచ్చు..
సాక్షి, అమరావతి: మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన నిధులతో రాష్ట్ర రవాణా శాఖ రూపొందించిన ‘అభయ’ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత రవాణా శాఖ ‘అభయ యాప్’ను రూపొందించింది. ఈ మొబైల్ యాప్‌తో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ద్వారా ప్రయాణికుల్ని చేరవేసే వాహనాలు ఎక్కడెక్కడ ప్రయాణిస్తున్నాయో.. ఇట్టే తెలుసుకోవచ్చు. క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటోల్లో ప్రయాణించే మహిళలకు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారంగా పోలీస్, రవాణాశాఖలకు సమాచారం చేరవేసేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపకరిస్తుంది. వాహనాలకు ఐఓటీ బాక్సులు అమర్చాలి రాష్ట్రంలో 5.49 లక్షల వివిధ రకాల వాహనాలు ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. వీటిలో 4.50 లక్షల వరకు ఆటోలున్నాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో క్యాబ్‌ల సంఖ్య కూడా పెరిగింది. ఇప్పటి వరకు 79 వేల క్యాబ్‌లు రాష్ట్రంలో నమోదైనట్లు రవాణా శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ వాహనాలకు దశల వారీగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) బాక్సులు అమర్చాల్సి ఉంటుంది. మహిళలకు తమ ప్రయాణంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మొబైల్ యాప్ నుంచి సంబంధిత వాహనం నెంబరు పంపితే వాహనం ఎక్కడుందో జీపీఎస్ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది. రవాణా శాఖ రూపొందించిన ‘అభయ’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని రవాణా అధికారులు పేర్కొంటున్నారు. రూ. 138 కోట్ల ఖర్చు.. విశాఖపట్నం, విజయవాడల్లో లక్ష ఆటోలకు ఈ ఐఓటీ బాక్సులు అమర్చాలని రాష్ట్ర రవాణా శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం రూ.138 కోట్లు ఖర్చు చేయనుంది. ఐఓటీ బాక్సులు రవాణా శాఖే సమకూర్చనుంది. బాక్సులు అమర్చకపోతే తనిఖీలు చేపట్టి జరిమానా విధించాలని యోచిస్తోంది. -
రోకలి దండు
ధాన్యం దంచుకునే రోకలి.. పసుపుకొమ్ములను పొడిగొట్టే రోకలి..ఎండుమిర్చిని ఎర్రకారం చేసే రోకలి.. కన్నెర్ర చేస్తే?!‘ఓనకే ఒబవ్వ’ అవుతుంది. 18 వ శతాబ్దంలో హైదర్ అలీ సేనల మాడు పగలగొట్టిన ఆ రోకలిని ఇప్పుడు..ఖాకీ బ్రాండుగా మార్చుకుంది కన్నడదేశం.ఆమె పేరుతో ఓ పోలీసు దండునుతయారు చేసింది!మహిళారక్షణ కోసం రోకలిదండును పంపింది. పద్దెమినిదో శతాబ్దం.. కర్ణాటకలోని చిత్రదుర్గ ప్రాంతం. ఆ రాజ్యాన్ని మాదకారి నాయక పాలిస్తున్న కాలం (1754 – 1779). హైదర్ అలీ ఆ రాతికోటను ఆక్రమించుకోవాలని పథకం వేస్తుంటాడు. పటిష్టమైన సైనిక కాపలాను ఛేదించుకొని ఆ దుర్గాన్ని వశం చేసుకోవడం వల్లకాదెలా అనుకుంటాడు. ఆ కోటలోకి వెళ్లే దారి కోసం పరిశోధన మొదలుపెడ్తాడు. అప్పుడు కనపడుతుంది ఓ గుహ మార్గం చిత్రదుర్గానికి ఒకవైపున. ఆ గుహ ద్వారా దుర్గాన్ని చేరుకోవచ్చు. అయితే సన్నని రంధ్రం లాంటి ఆ మార్గం దగ్గర కూడా మాదకారి నాయక ఓ కాపలాదారుడిని నియమిస్తాడు. ఆ కాపలాదారు పేరు హనుమ. అన్నం పెట్టి.. నీళ్ల కోసం వచ్చింది కాపలా కాస్తున్న హనుమ ఒకరోజు మధ్యాహ్నం విపరీతంగా ఆకలివేయడంతో భోజనానికని గుహకు దగ్గర్లోనే ఉన్న ఇంటికి వెళ్లాడు. ‘‘ఆకలేస్తోంది అన్నం పెట్టు.. భోజనం ముగించుకుని త్వరగా వెళ్లాలి.. కాపలా వదిలి వచ్చాను’’ అంటూ హడావిడి పెట్టాడు భార్యను. హనుమ భార్య పేరు ఓబవ్వ. భర్త వేగిరం అర్థం చేసుకొని గబగబా భోజనం వడ్డించింది. తొందరగా తింటుండడంతో హనుమకు పొలమారింది. మంచినీళ్లు ఇద్దామని చూస్తే కుండలో నీళ్లు అడుగంటాయి. వాటినే దొప్పలో పోసి భర్త పక్కన పెట్టి.. ‘‘తింటూ ఉండు నీళ్లు తెస్తా ’’నని పదడుగుల దూరంలో ఉన్న చెరువుకి వెళ్లింది. కుండను వదిలి రోకలి ఎత్తింది ఎదురుగా ఉన్న కాలినడకన ఓ వ్యక్తి రావడం ఓబవ్వ కంటపడింది. అతని నడక, వ్యవహారం అంతా అనుమానాస్పదంగా అనిపించింది. కుండను వదిలేసి అక్కడే బండ మీదున్న రోకలిదుడ్డును తీసుకొని దారికాచింది. దగ్గరకు రాగానే రోకలి బండతో తలను బాదింది. రక్తమోడుతూ కుప్పకూలాడతను. దారి నుంచి పక్కకు లాగేసింది అతనిని. కొన్ని క్షణాలు గడిచామో లేదో అదే చిత్రమైన ప్రవర్తనతో ఇంకో వ్యక్తి రావడం చూసింది. ఆ వ్యక్తినీ అలాగే రోకలితో బాది చంపేసి పక్కకు లాగింది. రెండో మనిషి తర్వాత మూడో మనిషి.. ఆనక నాలుగో మనిషి.. ఇలా వరుసగా పదుల సంఖ్యలో వచ్చారు. నాలుగో మనిషికే వాళ్లంతా శత్రు సైన్యమని అర్థమైంది ఓబవ్వకు. ఒక్కొక్కర్నీ రోకలితో మోది చంపేసింది. తేలని మిస్టరీ నీళ్లు తెస్తానని వెళ్లిన భార్య ఇంకారాలేదేంటనే భయం, సందేహంతో చెరువు దగ్గరకు వచ్చాడు హనుమ. రక్తం ఓడుతున్న రోకలి దుడ్డుతో కనిపించిన ఆలిని చూసి హతాశుడయ్యాడు. విషయం తెలిసింది. తాను చేయలేని పని భార్య చేసింది. అయితే ఆ రోజు రాత్రే ఓబవ్వ మరణించింది. అంతమందిని చంపిన షాక్ తోనో.. హైదర్ అలీ మనుషులు చంపి ఉంటారో తేలక అది మిస్టరీగానే ఉండిపోయింది. ఆమె సాహసం చిత్రదుర్గాన్ని కొన్ని రోజుల వరకైతే రక్షించింది కాని ఆ తర్వాత ఆ కోట హైదర్ అలీకి బందీ కాక తప్పలేదు. ఓబవ్వ వీరనారిగా చరిత్రలో మిగిలిపోయింది. కన్నడనేల మీద కత్తిపట్టి యుద్ధం చేసిన అబ్బక్క రాణి, కేలడి చెన్నమ్మ, కిట్టూరు చెన్నమ్మల సరసన ఒనకే ఓబవ్వ నిలిచిపోయింది. ఒనకే అంటే కన్నడలో రోకలి దుడ్డు అని. నాటి ఓబవ్వ.. నేటికీ స్ఫూర్తి ఇది జానపద కథ కాదు.. నిజం! చరిత్రగా మారిన సత్యం. ఆమె పుట్టిన నేల పరాధీనం కాకుండా తనకు చేతనైనా పోరాటం చేసింది ఓబవ్వ. ఒంటి చేత్తో చిత్రదుర్గాన్ని రక్షించింది. ఆమె స్ఫూర్తిని కర్ణాటక పోలీసులు ఇప్పటికీ పంచుకుంటున్నారు. ఆడపిల్లల పట్ల పెరుగుతున్న నేరాలు, హింసను అరికట్టడానికి ఆమె ధైర్యాన్ని తలచుకుంటున్నారు. ‘ఓబవ్వ పడే’ పేరుతో ఓ ప్రత్యేకమైన విమెన్ పోలీస్ స్క్వాడ్‌ను తయారు చేశారు. ఈ మహిళా పోలీసులంతా అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్లు. మొత్తం 45 మంది. అందరూ 40 ఏళ్ల లోపు వాళ్లే. ఆత్మరక్షణ విద్యల్లో ఆరితేరినవాళ్లే. బహిరంగ స్థలాలైన బస్‌స్టాండులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, పార్కులు, సినిమా హాళ్ల దగ్గర వీరు నిత్యం పహారాకాస్తున్నారు. ఆడపిల్లలను ఇబ్బంది పెట్టే అల్లరి మూకల నుంచి అమ్మాయిల మీద దాడులుచేసే సైకోల దాకా అందరి తాటా తీస్తున్నారు. అంతేకాదు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి అమ్మాయిలకు ఆత్మరక్షణ మెళకువలను నేర్పిస్తున్నారు. ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో)యాక్ట్, నేరాలను అరికట్టేందుకున్న ఇతర చట్టాలు, సైబర్ క్రైమ్స్, మొబైల్ ద్వారా జరిగే వేధింపులు వంటి వాటి మీద అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో అయితే గ్రామ పంచాయత్‌లు, ఆశా వర్కర్లు, స్త్రీ శక్తి గ్రూప్స్అన్నిటితో కలిసి మహిళలను చైతన్యం చేసే పనిలో బిజీగా ఉన్నారు. పైలట్ ప్రాజెక్ట్‌గా బెంగుళూరులో ఈ యేడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన ఈ స్పెషల్ స్క్వాడ్ తక్కువ సమయంలోనే మంచి ఫలితాన్నిచ్చింది. దాంతో త్వరలోనే దీన్ని కర్నాటక అంతటా విస్తరింపచేసే ఆలోచనలో ఉందట ఆ రాష్ట్ర పోలీస్ శాఖ. నేరగాళ్లలో ఒకరకమైన భయాన్ని సృష్టించడానికి ఈ ప్రత్యేక బృందంలోని పోలీసులకు మిలటరీని పోలిన యూనిఫామ్‌ను కేటాయించినట్టు తెలిపారు చిత్రదుర్గ ఎస్పీ (సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్) శ్రీనాథ్ జోషి. మనకూ ఓ(బవ్వ) టీమ్ ఉండాలా?! మన తెలుగు నేల మీదా ఉన్నారు సాహస వనితలు.. వీరనారీమణులు బ్రిటిషర్స్‌తో పోట్లాడిన దుర్గాబాయి దేశ్‌ముఖ్, సరోజినీ నాయుడు, తెలంగాణ గడ్డమీదైతే నిజామ్కు వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మా ఉన్నారు. ఆ స్ఫూర్తిని ఇప్పుడు మన దేశంలోని మగవాళ్ల నుంచి రక్షణ కోసం ఉపయోగించుకోవడమే విషాదం. స్వాతంత్య్రం వచ్చి డెబ్బై ఒక్కయేళ్లయింది. ఆడవాళ్లు ఇంకా గడప దాటేందుకు భయపడే పరిస్థితి. స్వాతంత్య్రం దేశంలోని పురుషులకే కాదు.. మహిళలకు కూడా. దేశమంటే అందరూ! ఆ స్వేచ్ఛను.. కాపాడుకోవడానికి స్త్రీలు గౌరవం పరిరక్షించుకోవడానికి అహర్నిశల పహారా అవసరమా? మన షీటీమ్స్ కూడా.. ఓనకే ఓబవ్వ వంటి స్పెషల్ స్క్వాడ్స్లా ఉండాలా? మగవాళ్లూ ఆలోచించండి! స్వతంత్ర భారత్ అర్థం ఇదేనా? ఆలోచించండి. -
లోపాలు సరిదిద్దితేనే అఘాయిత్యాలు ఆగుతాయి
లైంగిక నేరాల బాధితులకు న్యాయం చేయలేకపోతున్నది మనం ఒక్కరం మాత్రమే కాదు. ప్రపంచమంతటా ఇదే పరిస్థితి ఉంది. అన్ని దేశాల్లోనూ బాధితులకుండే ఉమ్మడి సమస్య... ఆ నేరం జరిగిందని బయటికి చెప్పుకోలేకపోవడం. అందువల్లే అమెరికా వంటి దేశంలో కూడా వేయి నేరాలు జరుగుతుంటే సగటున 310 వెల్లడవుతాయి. ఇక శిక్షల శాతం మరింత తక్కువ. ఆ 310 మందిలో ఆరుగురికి మాత్రమే శిక్ష పడుతుంది. ప్రభుత్వాలు గట్టి సంకల్పంతో పనిచేసి భారీ మార్పులు చేస్తే ఈ స్థితి మారుతుంది. కథువా, ఉన్నావ్‌లలో జరిగిన ఉదంతాల విషయంలో ఒక సమాజంగా మనం ఎలా స్పందించాలి? ప్రపంచ దేశాల్లో లైంగిక హింస పరంగా చూస్తే ఆడవాళ్లకూ, పిల్లలకూ భారత్ అరక్షిత దేశమన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. వాస్తవం ఇది కాకపోయినా ఇది స్థిరపడింది. మనం ఎంత నిజాయితీగా ఉంటు న్నామో, ఎంత మారాల్సి ఉన్నదో విదేశీ మాధ్యమాలు చెప్పే స్థితి రాకూడదు. ఇలాంటి సిగ్గుమాలిన ఉదంతాలను మనమెందుకు నివారించలేకపోతున్నాం? ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇవి తగ్గించగలుగుతాం? కేవలం న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ మాత్రమే వీటిని నివారించలేవని ముందుగా మనం తెలుసు కోవాలి. విలువలు విచ్ఛిన్నమయ్యాయి. మహిళల్ని, అల్పసంఖ్యాకుల్ని గౌరవించే చోట పశు ప్రవృత్తికి ప్రోత్సాహం ఉండదు. మనం అలాంటిచోటే ఉంటున్నామా? నిజాయితీగా చెప్పాలంటే జవాబేమిటో అందరికీ స్పష్టంగా తెలుసు. ప్రభుత్వమే ఇలాంటి హింసను అరికట్టాలనడం మనం మన పాత్రను విస్మరించడమే అవు తుంది. ఆ అవగాహనతో ఏం చేయమని ప్రభుత్వాన్ని ఒప్పించాలో చూద్దాం. లైంగిక దాడుల్ని, అత్యాచారాలను నియంత్రించడానికి ప్రధానంగా రెండు అవసరమవుతాయి. అందులో ఒకటి చట్టం. ఇలాంటి ఉదంతాలు జరిగిన ప్రతిసారీ రేపిస్టులను ఉరి తీయాలన్న డిమాండ్ తరచూ వినిపిస్తుంటుంది. కఠినమైన శిక్ష ఉంటే ఈ తరహా నేరాల్ని నివారించవచ్చునని, నేరగాడు తన చర్య పర్యవసానా లను గ్రహించి భయపడతాడని, కనుక తప్పు చేయడానికి సాహసించడని ఈ వాదన లోని ఆంతర్యం. దీనికి అనేక ప్రతివాదాలున్నాయి. అత్యాచారానికైనా, హత్యకైనా ఒకటే శిక్ష గనుక సాక్ష్యం లేకుండా చేయడానికి బాధితురాలిని రేపిస్టు హతమారు స్తాడని దీన్ని వ్యతిరేకించేవారంటారు. దాన్ని కాసేపు పక్కన పెడదాం. రేపిస్టులకు ఉరిశిక్షే సరైందని రాజకీయ నాయకులు ఎక్కువగా చెబుతుంటారు. మీరు ఇటీవలి పత్రికలు తిరగేస్తే ఈ వాదన సమర్థుకులే అధికంగా కనిపిస్తారు. మన దేశంలో హంతకులకు మరణశిక్ష ఉంది. ఇది నివారణగా పనిచేసి హత్యలు ఆగుతున్నాయా? గణాంకాలు ఒకసారి చూద్దాం. 2016లో 136 మందికి న్యాయస్థానాలు ఉరిశిక్ష విధించాయి. కానీ ఆ సంవత్సరం దేశవ్యాప్తంగా 30,000 హత్యలు జరిగాయి. మరణశిక్షల విధింపు హంతకులను తగ్గించలేకపోయింది. మన చట్టాల్లో అప్పీళ్లకూ, రెమిషన్లకూ అవకాశం ఉంది. అందుకే ఆ ఏడాది ఎవరూ ఉరికంబం ఎక్కలేదు. మరణశిక్ష మంత్ర దండమని భావించేవారంతా దీన్ని గమనించుకోవాలి. ఇప్పుడు లైంగిక నేరాలు, అత్యాచారాలకు సంబంధించిన గణాంకాలు చూద్దాం. ఆ సంవత్సరం దేశంలో మొత్తం 38,947 అత్యాచారాలు జరిగాయి. పిల్లలపై 1,06,000 నేరాలు జరిగాయి. అత్యాచారాల సంఖ్యతో వచ్చే ఇబ్బందే మంటే 99 శాతంమంది బాధితులు వాటిపై ఫిర్యాదు చేయరు. ప్రభుత్వ డేటాయే ఈ సంగతి చెబుతోంది. అమెరికాలో ప్రతి వెయ్యి అత్యాచారాలు, లైంగిక నేరాల్లో 310(31 శాతం) మాత్రమే పోలీసుల వరకూ వస్తాయి. అందులో కేవలం ఆరు గురు దోషులకు (అంటే 1 శాతం కన్నా తక్కువ) మాత్రమే శిక్షపడుతుంది. దీనర్ధం ఏమంటే... జరుగుతున్న నేరాల విషయంలో బాధితులకు న్యాయం చేయలేక పోతున్నది మనం ఒక్కరమే కాదు. కనుక ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన, గట్టిగా పనిచేయాల్సిన సంక్లిష్ట సమస్య అని మనం గుర్తించాలి. ఇందులో అనేకానేక అంశాలున్నాయి. అందులో కొన్ని సామాజికమైనవి, మరికొన్ని ప్రభుత్వం సరి దిద్దాల్సినవి. మన దేశంలోనూ, ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ లైంగిక నేరాల బాధితులకుండే ఉమ్మడి సమస్య– అది బాగా వ్యక్తిగతమైన నేరం. తమకు అలా జరిగిందని ఎవరితోనైనా చెప్పుకోవడం అంత సులభం కాదు. ఇక మన దేశానికే ప్రత్యేకమైన సామాజిక అంశాలు కోకొల్లలు. అందులో మన సమాజంలో మహిళల కుండే స్థానం, వారిపట్ల వ్యవహరించే తీరు ప్రధానమైనది. రెండోది– కుటుంబ పరువు, ప్రతిష్టలు మొత్తం వారి శరీరాల్లో ఉన్నాయనుకునే విశ్వాసం. మహిళపై దాడి జరిగితే అది ‘కోల్పోయినట్టే’నని మన భావన. పర్యవసానంగా తనకు జరి గిన అన్యాయాన్ని పోలీస్‌స్టేషన్‌లోని అపరిచితులకు చెప్పడం సంగతలా ఉంచి చివరకు తన కుటుంబానికి కూడా ఏ మహిళా వెల్లడించలేదు. పోలీసులు చేయగలిగింది ఒకటుంది–అది చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం. చట్టం ప్రకారం బాధితులెవరైనా తమకు నచ్చిన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. నేరం జరిగిన ప్రాంతంలోని స్టేషన్లో మాత్రమే ఫిర్యాదు చేయనవసరం లేదు. రెండు–బాధితురాలు తాను ఎంపిక చేసుకున్న భాషలో తన వాంగ్మూలాన్ని ఇవ్వొచ్చు. ఇది చాలా కష్టమైన సమస్య. ఎందుకంటే చాలా పోలీ స్స్టేషన్లలో ఇంగ్లిష్ కూడా సరిగా మాట్లాడలేనివారే ఉంటారు. వారు ఎఫ్ఐఆర్ను స్థానిక భాషలోనే రికార్డు చేస్తామంటారు. మూడు–బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా అధికారి మాత్రమే రికార్డు చేయాలి. ఇది జరగడం లేదు. తగినంతమంది మహిళా కానిస్టేబుళ్లు లేదా మహిళా పోలీసు అధికారులు లేకపోవడం ఇందుకు కారణం. ‘కనీస ప్రభుత్వం–గరిష్ట పాలన’ వంటి నినాదాలు అర్ధం లేనివి. ఎందు కంటే మనకున్న పోలీసులు, డాక్టర్లు, నర్సుల సంఖ్య ప్రపంచంలోని మరే ఇతర దేశాల తలసరి సగటు కన్నా చాలా తక్కువ. లైంగిక నేరాలను అరికట్టాలంటే మన సమాజంలో, మహిళలపట్ల వ్యవహరించే తీరులో భారీ మార్పులు తీసుకురావా లని వాస్తవాంశాలు చెబుతున్నాయి. లైంగిక హింసకు సంబంధించిన చట్టాల్లోని అంశాలను దేశంలోని పోలీస్స్టేషన్లన్నీ సక్రమంగా పాటించేలా చూడాలి. ఇది చాలా కష్టసాధ్యమైనదే. కానీ అలా చేయగలిగితే–కనీసం ఇతర ప్రపంచ దేశాలతో సమానంగా ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుంది. ఫిర్యాదులు పెరిగాక వాటిపై సరైన దర్యాప్తు జరిగేలా చూడాలి. అందుకు వనరులు అవసరం. ఇప్పుడున్న పోలీసుల సంఖ్యతో, ఈ బడ్జెట్‌తో అది సాధ్యపడదు. అది చేస్తే శిక్షల సూచీ పెరుగుతుంది. ఇదంతా చాలా కష్టం. మన రాజకీయ నాయకుల్లో చాలామందికి ఈ సంగతి తెలుసు. కనుక ‘రేపిస్టులకు ఉరిశిక్ష వేయాలి’ అని వారు సులభంగా అంటుం టారు. హంతకులకు మరణశిక్ష విధిస్తున్నా హత్యలపై వాటి ప్రభావం లేదన్న వాస్తవం వారిని కలతపెట్టదు. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ఆకార్ పటేల్ -
సాధికారత కోసం...
మన రాజ్యాంగ వ్యవస్థ మహిళల రక్షణ కోసం కల్పించిన ముఖ్యమైన సౌకర్యాలు ఇవి. న్యాయపరంగా పోరాడాల్సిన ఈ చట్టాలతో సాధికారత సాధన జరుగుతుందా అంటే... అదొక్కటే మార్గం అని కాదు. న్యాయపోరాటం చివరి అంశమే కావచ్చు. కానీ ఇలాంటి రక్షణ వ్యవస్థ ఉందనే స్పృహ ఆమెలో భరోసాని కలిగిస్తుంది. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిలో భయానికి కారణమవుతుంది. మహిళ పట్ల గౌరవంతో ఆమెకు ఇబ్బంది కలిగించకుండా మెలిగే సంస్కారం ఉన్నప్పుడు ఇలాంటి చట్టాల అవసరం అంతగా ఉండకపోవచ్చు. అయితే అలాంటి సంస్కారం లోపించినప్పుడు ఇలాంటి చట్టాల రక్షణ గొడుగులు అవసరమే. ఈ చట్టాలన్నీ... మహిళకు సాధికారత సాధనలో వెనుకడుగు వేయాల్సిన పరిస్థితిని రానివ్వకుండా ఆమెకు తోడుగా ఉండే బాంధవ్యసాధనాలు. -
ఆకతాయిలపై కఠిన చర్యలకు కొత్త చట్టం
ప్రతిపాదనలను కేంద్రానికి పంపాం: డీజీపీ హైదరాబాద్: మహిళలను వేధించే ఆకతాయిలు, పోకిరీలపై మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. ఇందుకు ‘యాంటీ ఈవ్ టీజింగ్ యాక్ట్’పేరుతో మరింత కఠినమైన చట్టాన్ని రూపొందించి కేంద్రం ఆమోదానికి పంపినట్లు తెలిపారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని తాజ్‌డెక్కన్ హోటల్లో ‘బీ బోల్డ్ ఫర్ ఛేంజ్’పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత చట్టాల వల్ల పెద్దగా ఉపయోగం లేదని, స్వల్ప ఫైన్ చెల్లించి ఈవ్‌టీజర్లు తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. తాము కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో కనీసం 10 వేల నుంచి 15 వేల అపరాధ రుసుము, జైలు శిక్ష ప్రతిపాదించినట్లు తెలిపారు. మహిళల రక్షణ, వారి హక్కులు కాపాడేందుకు పలు చట్టాలు అమలు అవుతున్నాయని, వాటిపై చదువుకున్నవారికి కూడా సరైన అవగాహన లేకపోవడం విచారకరమని అదనపు పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా అన్నారు. మొత్తం పోలీసుల్లో మహిళలు 5 శాతం కంటే తక్కువగా ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. వరకట్న వ్యతిరేక చట్టాలను కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్న మాట వాస్తవమే అని డీజీపీ అన్నారు. కార్యక్రమంలో సంస్థ చైర్పర్సన్ కామినీ షరాఫ్ తదితరులు పాల్గొన్నారు. -
మూడేళ్ల దాకా ఆ ప్రసక్తే లేదు!
పెళ్లి ప్రసక్తి మరో మూడేళ్ల వరకూ కచ్చితంగా ఉండదంటున్నారు నటి వరలక్ష్మీశరత్‌కుమార్. పోడాపోడి చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ మధ్య తారైతప్పట్టై చిత్రంతో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. పాశ్చాత్య సంగీతంలో మంచి ప్రావీణ్యం కలిగిన వరలక్ష్మి పేరిప్పుడు కోలీవుడ్‌లో మారు మోగుతోంది. ఆ మధ్య విశాల్‌తో చెట్టాపట్టాల్, త్వరలో పెళ్లి, లేదు ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు అంటూ రకరకాల ప్రచారాలకు కేంద్రబిదువుగా మారిన నటి వరలక్ష్మీశరత్‌కుమార్.ఇలాంటి వదంతుల మధ్య నటిగా తన వృత్తిలో బిజీగా ఉన్న వరలక్ష్మి ఇటీవల మహిళల రక్షణ కోసం నడుంబించారు.అందుకు సేవ్ శక్తి అనే సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ విధి విధానాలు, సినిమా, వ్యక్తిగత అంశాల గురించి వరలక్ష్మీశరత్‌కుమార్‌తో చిట్‌చాట్.. సేవ్ శక్తి సంస్థను ప్రారంభించాలన్న అనూహ్య నిర్ణయానికి కారణం? మహిళలపై హింసాత్మక సంఘటనలనేవి మొదటి నుంచి జరుగుతూనే ఉన్నాయి.అయితే ఇటీవల మరీ మితిమీరిపోతున్నాయని చెప్పవచ్చు. ఇంతకు ముందు నేరస్తులెవరన్నది గుర్తించగలిగేవారం.ఇప్పుడు ఎవరిలో మృగత్వం ఉందో తెలియనంతగా ఉన్నత స్థాయిలో ఉన్న వారే దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.ఈ తరం అమ్మాయిలు అరకొర దుస్తులు ధరించడం కారణం గానే అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఒక వర్గం పురుషులు చేస్తున్న ఆరోపణలు.అయితే మూడేళ్ల చిన్నారి ఎలాంటి దుస్తులు ధరించిందని పాపపుణ్యాలు కూడా చూడకుండా మృగాల్లా ప్రవర్తిస్తున్నారు? ఇలాంటి ఆటవిక మృగాలనుంచి మహిళలు తమను తాము రక్షించుకునే విధంగా అవగాహన కలించాలన్న ఒక లక్ష్యంతో ప్రారంభించిన సంస్థ సేవ్ శక్తి. ఇలాంటి సమాజక సేవకు ప్రత్యక్షంగా నడుంబిగించారు.వ్యక్తిగతంగా సమస్యలను ఎదర్కోవలసి వస్తుందేమో? ఎలాంటి సమస్యలు తలెత్తవనే భావిస్తున్నాను. ఒకవేళ అలాంటివి ఎదరైనా ఫేస్ చేయడానికి నేను సిద్ధమే. స్త్రీ అనే నా జాతికి జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను. చిత్రాలను ఎక్కువగా చేయడం లేదే? నేను అవకాశాలను వెతుక్కుంటూ ఎప్పుడూ వెళ్లను.వచ్చిన అవకాశాల్లో నాకు బాగున్నాయనిపించిన పాత్రలనే ఎంచుకుని నటిస్తున్నాను. తారైతప్పట్టై చిత్రం తరువాత చాలా అవకాశాలు వచ్చాయి.అందులో చాలా మంది దర్శకులు తారాతప్పట్టై చిత్రంలోని సూరావళి పాత్రలా అంటూ చెప్పడం మొదలెట్టారు. సూరావళిలా ఒక సారే నటించగలం. ప్రస్తుతం విక్రం వేద, సత్య, నిపుణన్, అమ్మాయి చిత్రాల్లో నటిస్తున్నాను. వీటితో పాటు రెండు మలయాళ చిత్రాలు అంగీకరించాను. మీ వ్యక్తిగతం కూడా చర్చనీయాంశంగా మారింది.పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు? నటి అన్నాక ఇలాంటి చర్చనీయాంశాలు సాధారణమే. అలాంటి వాటిని సీరియస్‌గా తీసుకోను. ఇక పెళ్లి అంటారా,మరో మూడేళ్ల వరకూ ఆ ప్రసక్తే లేదు. -
కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ కరువు
మాజీ మంత్రులు డీకే అరుణ, సబిత హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాలనలో మహిళలకు రక్షణ కరువైందని మాజీ మంత్రులు డి.కె.అరుణ, సబితాఇంద్రారెడ్డి అన్నారు. నిర్భయచట్టం అమలులో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన యామిని, శ్రీలేఖ తల్లిదండ్రులు హైమావతి, కృష్ణారెడ్డిలను గురువారం హైదరాబాద్ హస్తినాపురంలో పరామర్శించారు. అమ్మాయిలను కిరాతకంగా హతమార్చి వారం గడచినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దురదృష్టకరమన్నారు. మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించకుండా మహిళలను కేసీఆర్ అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హంతకుడ్ని పట్టుకోవడంలో విఫలమైన హోంమంత్రిని బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు.