అక్కచెల్లెమ్మలకు మరింత భద్రత  | CM Jagan comments at launch of 163 disha patrolling vehicles | Sakshi
Sakshi News home page

అక్కచెల్లెమ్మలకు మరింత భద్రత 

Published Thu, Mar 24 2022 3:02 AM | Last Updated on Thu, Mar 24 2022 3:29 PM

CM Jagan comments at launch of 163 disha patrolling vehicles - Sakshi

దిశ పెట్రోలింగ్‌ వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడైనాసరే అక్క చెల్లెమ్మలకు అన్యాయం జరిగినా, వారిపై అఘాయిత్యానికి పాల్పడినా ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం ఊరుకోదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రభుత్వం గట్టి సంకేతాలను పంపిస్తోందని తెలిపారు. బుధవారం ఆయన సచివాలయం ప్రధాన గేటు వద్ద 163 దిశ పోలీస్‌ పెట్రోలింగ్‌ ఫోర్‌ వీల్‌ వాహనాలను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. బందోబస్తులో ఉండే మహిళా పోలీసుల కోసం వాష్‌ రూమ్, డ్రెస్సింగ్‌ రూమ్‌లు ఉండే 18 కార్‌ వ్యాన్స్‌ను కూడా సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ‘దిశ’ యాప్‌ రికార్డు స్థాయిలో కోటి 16 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లోని ఫోన్లలో ఉందని చెప్పారు. దాదాపు 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో అంటే దాదాపు ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్‌ అందుబాటులో ఉన్నారని తెలిపారు. వీటన్నింటితో ఒక గొప్ప విప్లవానికి, మార్పునకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

మహిళా పోలీసులకు రెస్ట్‌ రూమ్‌
► సామాన్య అక్కచెల్లెమ్మలే కాదు.. పోలీసు వృత్తిలో ఉన్న అక్కచెల్లెమ్మలకూ మంచి చేసే దిశగా అడుగులు పడ్డాయి. పోలీస్‌ స్టేషన్‌లలో ఇంతకు ముందు అక్కచెల్లెమ్మలకు ప్రత్యేకంగా రెస్ట్‌రూమ్‌ ఉండేది కాదు. ఈ రోజు ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో మహిళలకు ప్రత్యేకంగా వాష్‌రూమ్‌లు ఉండటంతో పాటు బందోబస్తుకు వెళ్లినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా వాష్‌రూమ్స్, డ్రెస్సింగ్‌ రూములు ఉండే విధంగా 18 కార్‌ వ్యాన్స్‌ను ప్రారంభిస్తున్నాం. 
► మొత్తం 30 కార్‌వ్యాన్స్‌ (రూ.5.5 కోట్లు కేటాయించారు) ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా ఇవాళ 18 వచ్చాయి. రాబోయే రోజుల్లో మరో 12 వస్తాయి. 163 దిశ పోలీస్‌ ఫోర్‌ వీల్‌ వాహనాలను (రూ.13.85 కోట్లతో కొనుగోలు చేశారు) కూడా ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే 900 దిశ ద్విచక్ర వాహనాలు వివిధ పోలీస్‌ స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయి. 
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ‘దిశ’ పోలీస్‌ పెట్రోలింగ్‌ ఫోర్‌ వీల్‌ వాహనాలు 

మూడు వేల వాహనాలకు జీపీఎస్‌
► ఇవి కాక ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న ప్రతి వాహనాన్ని అంటే దాదాపు మూడు వేల వాహనాలకు జీపీఎస్‌ ట్యాగింగ్‌తో దిశకు అనుసంధానం చేసి, వాటన్నింటినీ కూడా అందుబాటులోకి తెచ్చాం. ఏదైనా ఆపదలో ఉన్న అక్కచెల్లెమ్మలు వారి ఫోన్‌ను ఐదుసార్లు అటూ, ఇటూ ఊపితే చాలు.. 10 నిమిషాల్లో వారి వద్దకు పోలీస్‌ సోదరుడు వెళ్లి సమస్య పరిష్కరించేలా మార్పునకు శ్రీకారం చుట్టాం. 
► ఏదైనా ఘటన జరిగిన 10 నిమిషాల్లోపే పోలీసులు కచ్చితంగా అక్కడకు రావాలని నేను గట్టిగా చెప్పాను. డీఐజీ పాలరాజు, డీజీపీ రాజేంధ్రనాథ్‌ రెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఈ విషయంలో బాగా కృషి చేశారు. అందరూ కలసికట్టుగా ఆ రెస్పాన్స్‌ టైంను ఇంకా కుదించేందుకు ఈ వాహనాలను ప్రారంభిస్తున్నాం.
► దిశ యాప్‌ కోసం, పనితీరును మెరుగు పరిచేందుకు ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు మరిన్ని చేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని మనసారా కోరుకుంటున్నా.
► ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్‌ కె మోషేన్‌ రాజు, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీఐజీ పాలరాజు, దిశ స్పెషల్‌ ఆఫీసర్‌ కృతికా శుక్లా, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement